మహాను’బాపు’డు

(బాపుగారి జన్మదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం)

ఒక మంచి రచన చదువుతున్నప్పుడు మన మనసులో ఆ రచనలోని రూపాలు మెదలుతాయి. ఆ మనోహర రూపాల సౌందర్యాన్ని నయనానందకరంగా చూపే కుంచె పేరే బాపు. బాపు గీసే బొమ్మలు మాట్లాడతాయి…. సిగ్గుపడతాయి… నవ్విస్తాయి… ఎక్కిరిస్తాయి కూడా. బాపు ముఖచిత్రం వేస్తే ఆ రచనకు… ఆ పుస్తకానికి వెయ్యి వోల్టుల కాంతి వస్తుంది… విలువ అతిశయిస్తుంది… బంగారానికి తావి అబ్బినట్లవుతుంది. బాపు రేఖాచిత్రాలు గీస్తాడు… వంకర టింకరగా. అవన్నీ కార్ట్యూనులై సమ్మోహన పరుస్తాయి… సంగీతం వినిపిస్తాయి. సైలెంటుగా నవ్వుతాడు… బిగ్గరగా నవ్విస్తాడు బాపు. ఒకసారి ఓ పుస్తకానికి శ్రీవెంకటేశ్వరస్వామి పాదాలు వేశాడు. గ్రంధకర్త కాస్త చనువు తీసుకుని ‘అయ్యా స్వామి వారి కాలి వ్రేళ్లు కాస్త ఉబ్బెత్తుగా వున్నాయి’ అంటూ తల గోక్కున్నాడు. ‘దానిదేముండీ… బూట్లు తొడుగుదాంలే’ అన్నాడు బాపు కూల్‌గా. అవతల నుంచి మాట లేదు! దటీజ్‌ బాపు. అందమైన అమ్మాయికి మారుపేరు ‘బాపు బొమ్మ’. బాపు రమణతో కలిసి సృష్టించిన బుడుగు, సీగానపెసూనాంబ, రెండుజెళ్ళ సీత, అప్పుల అప్పారావు, గిరీశం, లావుపాటి పెళ్ళాం-బొచ్చుకుక్క లాంటి బుజ్జి మొగుడూ… వీరంతా గుర్తుకు వస్తే మనసు ఎంతగా నవ్వుకుంటుందో!! ఆరుద్ర అందుకే అన్నారు… ‘కొంటె బొమ్మల బాపు, కొన్ని తరముల సేపు, గుండె ఊయల లూపు, ఓ కూనలమ్మా’ అని. సృష్టిలో తీయనిది స్నేహమే అంటే స్నేహం మధురమైనదని అర్థం…అంతేకాని ‘తీయలేకపోయినదని’మాత్రం కాదని భాష్యం చెప్పిన ముళ్ళపూడి వెంకట రమణ ఆయన చెలికాడు. బాపు-రమణలవి అవిభాజ్య శరీరాలు. ఒకరిది లేఖాచిత్రమైతే, మరొకరిది రేఖాచిత్రం. రెండూ కలిస్తే మనోహర చిత్రం… అదే చలనచిత్రం. ఆ బాపు అనే సత్తిరాజు లక్ష్మీనారాయణ జయంతి సందర్భంగా బాపు జ్ఞాపకాలు కొన్ని.

హై నూన్‌ స్పూర్తితో…

యాభయ్యో దశకంలో బాపు రమణతో కలిసి రోజూ సినిమాలు చూసేవారు. సినిమా అయ్యాక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాళ్లకి పని చెప్పేవారు. అలా మైళ్ల కొద్దీ నడుస్తూ ఇల్లు చేరేలోగా ఆ సినిమాల్లో ఎన్ని తప్పులునాయో వెదికేవాళ్ళు. ‘మనమే సినిమా తీస్తే’ అనే ఆలోచనలు వచ్చేవి. ఆ ఆలోచనలకు కథలల్లి, బొమ్మలతో స్కీన్ర్‌ ప్లే రాసేవాళ్ళు. 1952లో ‘హై నూన్‌’ అనే ఇంగ్లీష్‌ సినిమా వచ్చింది. గ్యారీ కూపర్, థామస్‌ మిచెల్‌ నటించిన ఆ చిత్రానికి నాలుగు ఆస్కార్‌ బహుమతులు, నాలుగు గోల్డన్‌ గ్లోబ్‌ బహుమతులు లభించాయి. ఆ సినిమా ప్రభావంతో రమణ 1959 ప్రాంతంలో ఆంధ్రపత్రికలో ‘సాక్షి’ అనే కథను రాశారు. ‘హై నూన్‌’ సినిమాలో కౌబాయ్‌ పాత్రను బల్లకట్టు కిష్టప్పగా మార్చి ఆ కథనే మరికొన్ని మార్పులతో సినిమాగా తీస్తే బాగుంటుందని ప్రయత్నాలు మొదలెట్టారు. స్టార్‌ వాల్యూ జోలికి పోకుండా కథనే సూపర్‌ స్టార్‌ చేస్తూ, కధనంలో మాత్రం వేగం ఉండేలా పూర్తిగా అవుట్‌ డోర్‌లో సినిమా నిర్మిస్తే మంచి ప్రయోగమవుతుందని పకడ్బందీగా స్క్రిప్టు తయారుచేశారు. అంతకుముందే నవయుగ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావుతో వీరికి పరిచయం ఉండడంతో అతణ్ణి కలిసి ఒక లఘు బడ్జెట్‌ సినిమా తీయాలని, అందుకు ఆర్ధిక సహకారం అందించాలని కోరారు. కృష్ణ, విజయనిర్మల, జగ్గారావు, విజయలలిత, రాజబాబు, రామన్న పంతులు ప్రధాన తారాగణమని, మహదేవన్‌ సంగీత దర్శకుడని, రెండులక్షలు పెట్టుబడి పెడితే యాభైవేలు తమవంతుగా వేసుకొని సినిమా తీస్తామని శ్రీనివాసరావుకు చెప్పారు. నవయుగ సంస్థకు అక్కినేని, దుక్కిపాటి బాగా సన్నిహితులు. బాపు, రమణలకు అక్కినేని ప్రియమిత్రులు. అయినా వారి సిఫారసుతో రాకుండా, కథ మీద నమ్మకంతో రావడం శ్రీనివాసరావుకు నచ్చి పెట్టుబడి పెట్టేందుకు ఒప్పుకున్నారు. కొంచెం పారితోషికం ఎక్కువైనా, శ్రీనివాసరావు సలహా మీద సెల్వరాజ్‌ను ఛాయాగ్రాహకునిగా తీసుకునేందుకు అంగీకారం కుదిరింది. పాతికరోజుల్లో ఒకటే షెడ్యూలుతో పూర్తి అవుట్‌ డోర్‌లో సినిమా నిర్మాణం పూర్తి చేస్తామంటే శ్రీనివాసరావుకు నమ్మశక్యంలేదు. కానీ వీరు కృష్ణార్జునులు కదా…వారికి సాధ్యంకానిదంటూ వుండదు. సమాజంలో వేళ్లూనిన అరాచకాలను, అన్యాయాలను అణచివేసే నేపథ్యంతో గ్రామీణ వాతావరణంలో సినిమా నిర్మాణం చేపట్టాలని ‘సాక్షి’ సినిమా కోసం ప్రణాళికా రచన చేసి పాతిక రోజుల్లో తొలి కాపీ తీసుకొచ్చి తమ సత్తాను చాటారు. అలా ‘సాక్షి’నామ సంవత్సరానికి బాపు రమణలు బాటలు వేశారు. అలా గంటన్నరలో జరిగే ఒక కథను సినిమాగా తీస్తే ఎలావుంటుందో తెలుగు ప్రేక్షకులకి చూపాలని బాపు చేసిన ప్రయోగమే ‘సాక్షి’. కోనసీమ పల్లెల్లో కనిపించే పచ్చని పైర్లు, కాలవ, బల్లకట్టు రేవు, గట్టుమీద మర్రిచెట్టు, గట్టుపక్క చిన్నరోడ్డు, రోడ్డుకు కోసెడు దూరంలో చిన్న పల్లెటూరు, అందులో గుడి, గుడి పక్కన చావిడి … ఇవే బాపు సెట్టింగులు. పూర్తి అవుట్‌ డోర్‌ లో నిర్మించిన ఈ సినిమాని పంతొమ్మిది రోజుల్లో పూర్తిచేసారంటే నమ్మగలమా! అదీ బాపు పనితనం, రమణ నిర్వహణా సామర్ధ్యం. ఈ సినిమా షూటింగు సౌలభ్యం కోసం ఏకంగా ఒక కాలనీనే ఆ వూర్లో ఏర్పాటు చెయ్యడం విశేషం. ముహూర్త షాటలో ‘అమ్మకడుపు చల్లగా’ పాటను చిత్రీకరించారు. కేవలం మూడుగంటల్లోనే ఈ పాటను కంపోజ్‌ చేసి తీయటం బాపు పనితనానికి సాక్ష్యం. ఎందుకంటే బాపుకి సినిమా నిర్మాణంలో పూర్వానుభవం లేదు. టైటిల్‌ మ్యూజిక్‌ కేవలం డప్పులు, చెంబుల సవ్వడితో కంపోజ్‌ చేయించి సినిమాకి వాడటం సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా తాష్కెంట్‌ ఫిలిం ఫెస్టివల్‌కు కూడా వెళ్ళింది. కేవలం రెండు లక్షల వ్యయంతోనే సినిమా నిర్మాణం పూర్తిచేసిన ఘనత కూడా బాపు-రమణలది.

Bapu illustrator for Vamsi story

టూ ఎర్లీ .. టూ లేట్‌ ‘పిచిక’లు

1967లో సిల్వియా కోస్కినా, డేవిడ్‌ మెక్కల్లం నటించిన అమెరికన్‌ కామెడీ సినిమా ‘త్రీ బైట్స్‌ ఆఫ్‌ ఎన్‌ ఆపిల్‌’ చూసి, బాపు తక్కువ బడ్జెట్‌ తో అవుట్‌ డోర్‌ లో సినిమా తీద్దామని రమణను కథ అల్లమంటే, సినిమా ఆడదని రమణ చెప్పారు. అయినా బాపు మాట తోసేయ్యలేక ‘బంగారు పిచిక’ కు రూపం యిచ్చారు. తొలుత ‘స్వయంవరం’ అనే పేరుపెట్టి పబ్లిసిటీ కూడా ఇచ్చారు. కోనసీమలో కాకుండా హైదరాబాదు చుట్టుపక్కల గండిపేట గెస్టుహౌసు, షాపూర్వాడి రాజమహలు, వికారాబాదు రోడ్డు లోకేషన్లలో షూటింగు చేశారు. ఇందులో వరహాలరాజు వేషానికి అప్పట్లో బాలుని మొదట అనుకున్నా చివరకు చంద్రమోహన్‌కు ఆ పాత్ర దక్కింది. కానీ, సినిమా జనానికి ఎక్కలేదు. ఆరుద్ర రాసిన చక్కని పాటలకు మహదేవన్‌ అద్భుతమైన వరసలు కట్టినా సినిమాను గట్టెక్కించలేక పోయింది. ప్రేక్షకులు ‘టూ ఎర్లీ’ అన్నారు. ‘సరేలే’ అనుకొని పాతికేళ్ళు ఆగి, ఈ సారి రమణ ప్రోద్బలంతో అదే సినిమాని ‘పెళ్లికొడుకు’ పేరుతో నరేష్‌ని హీరోగా పెట్టి మరలా తీశారు. అక్కడా తుస్సుమంది. జనం ‘టూ లేట్‌’ అన్నారు. మరో ‘టూ ఎర్లీ’ సినిమా 1973లో వచ్చిన ‘అందాలరాముడు’. డబ్బే ప్రధానంగా నమ్మే ధనవంతుడికి, ఆప్యాయతలకు కట్టుబడే మధ్యతరగతి కుటుంబాలకీ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో సాగే ఈ సినిమా నిర్మాణమంతా గోదావరి నదిమీద, ఇసుక తిన్నెలమీద, ప్రకృతి అందాల సాక్షిగా నిర్మితమైంది. ‘పలుకే బంగారమాయెరా అందాలరామా’ అనే రామదాసు కీర్తనను మంగళంపల్లి చేత పాడించి టైటిల్‌ మ్యూజిక్‌గా అమర్చారు. అక్కినేని, నాగభూషణం వంటి హేమాహేమీలు నటించిన ఈ సినిమా ‘టూ ఎర్లీ’ అవటంతో బోల్తా కొట్టింది. బాపు తన సినిమా మీద తనే జోకు వేసుకుంటూ, ‘తెలిసినవారికీ, చూసినవారికీ అంచనాలు తలకిందులు చేసిన అందాల రాముడు’ అనే కార్టూను కూడా వదిలారు. అయితే, సెకండ్‌ రన్‌లో ఈ సినిమా అంచనాలకు మించి ఆడి, బి-క్లాసు సెంటర్లలో కూడా మంచి కలక్షన్లను వసూలు చేసింది. ఈ రెండు సినిమాల నిర్మాణంలో బాపు ప్రతిభ లేదని కాదు, వాటిని ఆదరించే ప్రేక్షకులకు ‘వినోదం’ సెన్సు కొరవడిందని చెప్పడమే దీని అంతరార్థం.

యస్, ఇది బాపు సినిమా..

1969లో బాపు-రమణలు భారీ తారాగణంతో ‘బుద్ధిమంతుడు’ సినిమా తీశారు. 1952లో జూలియన్‌-డు-వీవియర్‌ దర్శకత్వంలో ఫెర్నాన్డేల్, జినో సెర్వి నటించగా నిర్మించిన ‘ది లిటిల్‌ వరల్డ్‌ ఆఫ్‌ డాన్‌ కేమిల్లో’ అనే ఇటాలియన్‌ సినిమా ఆధారంగా రమణ మలిచిన కథ ఈ సినిమాకు ఆధారం. ఒకరకంగా ఇది చారిత్రాత్మక రోమన్‌ కేథలిక్‌ మతాధికారి డాన్‌ కేమిల్లో వలోటా యదార్ధ గాథ. రమణ మలిచిన కథలో సద్బాహ్మ్రణ వంశంలో పుట్టిన ఇద్దరు అన్నదమ్ములలో పెద్దవాడు వేణుగోపాల స్వామి ఆలయ పూజారి, పరమ ఆస్తికుడు. తమ్ముడు ఆధునిక భావాలతో మానవసేవే మాధవ సేవగా భావించే నాస్తికుడు. కథ చాలా బాగా కుదిరింది. అది విన్నాక అక్కినేని రెండు పాత్రల్నీ తనే వేస్తానన్నారు. ఇందులో పూజారి పాత్ర విప్రనారాయణను తలపించేదిలా వుంటుంది. అక్కినేని నటిస్తున్నారని తెలిసి రమణకి భానుమతి కబురంపింది. కథ విని మైమరచి తనుకూడా అందులో నటిస్తానంది. నిజానికి తమ్ముని పాత్రకే హీరోయిన్, పూజారి పాత్రకు హీరోయిన్‌ లేదు. విజయనిర్మలను అక్కినేనికి జంటగా అనుకున్నారు బాపు-రమణలిద్దరూ. అదే విషయాన్ని భానుమతికి చెబితే, ఏదో ఒక చిన్న వేషమైనా ఇమ్మంది. అందులో గుమ్మడి నటించిన స్కూళ్ల ఇనస్పెక్టర్‌ వేషాన్ని ఆఫర్‌ చేశారు రమణ. సినేరియో త్వరగా రాసుకు రమ్మంది. మూడ్రోజుల తరువాత భానుమతి భర్త ఇంటినుంచి కబురొచ్చింది రమణకు. ‘ఈ సినిమాలో పాటలెన్ని’ అని అడిగింది భానుమతి. ‘ఎనిమిది’ అని చెప్పారు రమణ. అందులో తనకెన్నని అడిగితే, ‘నిల’్ అని సమాధానమిచ్చారు రమణ. ‘కనీసం స్కూలు పిల్లని ఉత్సాహపరుస్తూ పాడేలా ఒక పాటైనా పెట్టండి’ అని భానుమతి అడిగింది. ‘అంతా ఫిక్సయిపోయింది, కుదరద’ని రమణ చెప్పారు. ఆ మాటకు భానుమతి కోపంతో ఊగిపోతూ ‘షూటింగు చెయ్యకుండానే అంతా ఫిక్సయి పోయిందా, ఇదేమన్నా కె.వి. రెడ్డిగారి సినిమానా’ అంటూ దెప్పిపొడిచింది. అందుకు సమాధానంగా ‘ఇది బాపు గారి సినిమా’ అని కూల్‌గా చెప్పి బయటికొచ్చేశారు. ఈ ఒక్క సంఘటన చాలు బాపు గొప్పతనం చెప్పడానికి. సినిమా షూటింగు మళ్ళీ పులిదిండి గ్రామ పరిసరాల్లోనే జరిపారు. ‘సాక్షి’ సినిమా కోసం చేసినట్లే సకల సదుపాయాలతో కాటేజీలు నిర్మించారు. హీరో, హీరోయిన్ల దగ్గర నుంచి లైట్‌ బాయ్‌ దాకా ఒకేరకం భోజనాలు వడ్డించేవారు. కాటేజీ ముంగిట ముగ్గులు వేయిస్తే అవి ఆశ్రమ కళను సంతరించుకునేవి. షూటింగు జరిగినన్ని రోజులూ ఆ వూరిలో ప్రతి ఇల్లు కల్లాపి, ముగ్గులు, గొబ్బెమ్మలు, గుమ్మడి పూలతో ముస్తాబయ్యేది. ఈ సినిమా ఇండోర్‌ సీన్లు సారథి స్టూడియోలో, క్లైమాక్స్‌ సీను, లాంగ్‌ షాట్లు ర్యాలీ జగన్మోహినీ కేశవస్వామి కోవెల ప్రాంగణంలో తీసారు. ‘బుద్ధిమంతుడు’ సూపర్‌ హిట్‌ గా నిలిచి బాపుకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరవాత వరసగా ‘బాలరాజు’, ‘సంపూర్ణ రామాయణం’, ‘అందాలరాముడు’, ‘ముత్యాలముగ్గు’ సినిమాలు తీసి రమణ నిర్మాతగా, బాపు దర్శకునిగా స్థిరపడి పోయారు. ‘బాలరాజు కథ బాగా ఆడింది. నిడమర్తి పద్మాక్షి నిర్మాతగా, శోభన్‌ బాబు రాముడుగా బాపు మలచిన ‘సంపూర్ణ రామాయణం’ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆరోజుల్లో కలర్‌ ఫిలిం ఇంపోర్ట్‌ చేసుకునేందుకు ఆంక్షలు ఉండేవి. ప్రసాద్‌ లేబరేటరీ వారి సహకారంతో సినిమా కలర్‌ లో నిర్మాణం పూర్తిచేసుకుంది. తమిళం, హిందీ భాషల్లో డబ్బింగు చేసి విడుదల చేస్తే అక్కడా లాభాలే. ఎందుకంటే అది ఒక కావ్యంలా బాపు చేతిలో నలిగిన అమూల్య పౌరాణికాభరణం.

Beautiful portraits

గూటి పడవలో వున్నది…

1974లో బాపు-రమణలు ‘ముత్యాలముగ్గు’అనే కమనీయ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాకు నటరత్న ఎన్టీ రామారావు ఇచ్చిన కితాబే పెద్ద గీటురాయి. బాపు ‘ముత్యాలముగ్గు’ సినిమాను ఎన్టీఆర్‌కి చూపించారు. పులకిత వదనంతో ఎన్టీఆర్‌ ‘బ్రదర్‌! మీ సినిమా మా శోభనం రోజులను గుర్తుచేసింది. పెరట్లో వెన్నెల నీడలో మల్లెపందిరి కింద కొత్తగా పెళ్ళైన జంట. విరిగిన ఇటుకగోడల మధ్య, తెల్లటి పక్కమీద శోభనం… వాహ్‌! అద్భుతం. అర్ధరాత్రి పెళ్లి ముహూర్తాలలో తరచూ కనిపించే తేనీరు సేవనం, పేకాటలు, కొబ్బరిచిప్పల్లో సిగరెట్‌ నుసి దులపటాలు సహజత్వానికి దగ్గరగా వున్నాయి. బాలవర్ధిరాజు మాయల ఫకీరు గుహలో దూరినట్లు క్లైమాక్స్‌ బాగుంది’ అంటూ బాపు-రమణలను మెచ్చుకున్నారు. ‘షోలే’ సినిమాలో గబ్బర్‌ సింగు డైలాగులతో ఆ రోజుల్లో రికార్డులు విడుదలై జనంలోకి దూసుకెళితే, ‘ముత్యాలముగ్గు’లో రావు గోపాలరావు డైలాగులతో విడుదలైన రికార్డులు కూడా మోతమోగించేసాయి. ఈ సినిమా నిర్మాణంలో బాపుకి బాలారిష్టాలు తప్పలేదు. సారథి స్టూడియోలో విలన్‌ సెట్టింగ్‌ వేశాక, రేపు షూటింగు అనగా స్టూడియో వాళ్ళు ఫ్లోర్‌ ఇవ్వటానికి నిరాకరించారు. వెంటనే దగ్గరలో వున్న రాక్‌ కాజిల్‌లో షూటింగు జరిపారు. ‘జేబుదొంగ’ సినిమాలో ముళ్లపూడికి పరిచయమైన రావు గోపాలరావును విలన్‌గా ఎంపిక చేసారు. కెమెరా పనితనం కోసం ఇషాన్‌ ఆర్యని, మ్యాన్డలిన్‌ బిట్ల కోసం సజ్జాద్‌ హుసేన్‌లను ముంబాయి నుంచి రప్పించి వారి సేవలను వినియోగించుకున్నారు. ఒక కోతిపిల్లను ప్రవేశపెట్టి, దాన్నే ఆంజనేయ స్వామిలా కనిపింపజేసారు. మాడా వెంకటేశ్వరరావుకు ఈ సినిమాతోనే గుర్తింపు వచ్చింది. కొత్తనటి సంగీత పెద్ద కళ్లను ఇషాన్‌ ఆర్య ఎంత గొప్పగా ఎక్స్పోజ్‌ చేసాడో సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో ఇషాన్‌ ఆర్య చూపిన ప్రతిభకు జాతీయ బహుమతి లభించింది. ఒక్క ఆంజనేయస్వామికి తప్ప ఇతర నటీనటులకు పెద్దగా మేకప్‌ కూడా వుండదు. శ్రీధర్‌ కట్టు, బొట్టు అచ్చం బాపు రేఖా చిత్రంలాగే వుంటుంది. ఆ రోజుల్లో సినిమా టికెట్‌ ధర రూపాయకులోపే వున్నా, 24 వారాల్లోనే ఈ సినిమా రెండు కోట్లకు పైగా వసూలు చేసింది. సంవత్సరంపాటు ఆడి రికార్డు నెలకొల్పింది. జాతీయ అవార్డు కోసం పరిశీలనకు నిలిచినా, మన ఆంధ్రదేశపు సభ్యుడే అడ్డంపడి రానీకుండా చెయ్యడం ఈ సినిమాకు మరో కోణం. బాపు గొప్పగా మలిచిన ‘ముత్యాలముగ్గు’ ఉతమ ప్రాంతీయ చిత్ర బహుమతితో సరిపెట్టుకోవాల్సి రావడం మన దురదృష్టం.

తెరమీద రంగుల కలబోత

కుంచేతోనే కాదు సెల్యులాయిడ్‌ మీదకూడా రంగులు ముంచి అందాలను ఆవిష్కరింపజేసిన బాపు సంచిలో ఎన్ని ఆణిముత్యాలున్నాయో లెక్క పెట్టడం అసాధ్యం. 1976లో పింజల సుబ్బారావు బాపుతో తీసిన ‘సీతాకల్యాణం’ ఓ కళాఖండం, ఒక గొప్ప సంగీత రూపకం. రవికాంత్‌ నగాయిచ్‌ చేత గంగావతరణం చిత్రీకరణ చేసిన విధానం ఆశ్చర్యం.. అద్భుతం. లండన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శనకు నోచుకుంది. 1976లోనే మరొక కళాఖండం ప్రదర్శనకు నోచుకుంది. అదే సూర్యనారాయణ రాజు నిర్మించిన ‘భక్త కన్నప్ప’. షూటింగు సింహభాగం పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం పరిసరాల్లో జరిపారు. 30 అడుగుల ఎత్తు అమ్మవారి విగ్రహాన్ని మద్రాసు నుంచి వేలుస్వామిని పిలిపించి ఎరేనా సెట్‌లో ప్రతిష్టించారు. ఎదురుగా కోయదొర స్థావరాన్ని కట్టించారు. వాణిశ్రీకి బాపుతో పని చెయ్యడం మొదటిసారి. కిరాతార్జునీయ చిత్రీకరణ, వేటూరి కలం బలానికి పదునుపెట్టింది. భారత కథను సోషలైజ్‌ చేసి జయకృష్ణ నిర్మాతగా బాపు నిర్మించిన ‘మనవూరి పాండవులు’ మరో కొత్త కోణాన్ని చూపించింది. కృష్ణంరాజు పాత్ర గొప్పగా అమరింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నిర్మించిన ఈ సినిమాలో ప్రేమగీతాల వంటి మసాలాలు లేకపోయినా బాగా ఆడింది. అంతేకాదు చిరంజీవి, భానుచందర్‌ వంటి వర్ధమాన నటుల ఎదుగుదలకు సోపానమైంది. ఇక ‘గోరంత దీపం’ విషయానికొస్తే, వాణిశ్రీ మేకప్‌ లేకుండా నటించటం బాపు గొప్పతనం. బాపుకి గజల్స్‌ అంటే ఇష్టం. నిముషం లోపు వ్యవధి వుండే కవితల్ని గజల్స్‌గా మలిచి పి.బి.శ్రీనివాస్‌ తియ్యని గొంతులో వినిపింపజేసిన ఘనత కూడా బాపూదే. రాజమండ్రి పరిసరాల్లోనే తీసిన మరో చిత్రం ‘తూర్పు వెళ్ళే రైలు’లో బాలు చేత సంగీత దర్శకత్వం నిర్వహింపజేసారు. పాటలన్నీ అద్భుతంగా వుంటాయి. మధ్యలో మరికొన్ని బాపు సినిమాలు వచ్చినా, ‘పెళ్లిపుస్తకం’ సినిమా వచ్చి బాపు పనితనాన్ని మరోసారి ఎలుగెత్తి చూపింది. అందులో ఆరుద్ర రాసిన ‘శ్రీరస్తు శుభమస్తు’ పాట వినిపించని పెళ్లి పందిరి ఉంటుందంటే సందేహమే! విజయావారి ‘మిస్సమ్మ’ సినిమా కథను తిరగేసిరాసిన సినిమా ‘పెళ్లి పుస్తకం’. 1991లో బాపు ‘మిస్టర్‌ పెళ్లాం’ తీశారు. దీనికి ఉత్తమ చిత్రంగా నంది బహుమతి వచ్చింది. పిల్లల కోసం వీడియో పాఠాలు రూపొందించారు ఇద్దరూ. అందుకే బాపును గురించి రాయాలంటే రమణ గురించి చెప్పాల్సి వుంటుంది. రమణ గురించి రాయాలంటే బాపు ప్రస్తావన లేకుండా అది అసమగ్ర రచన అవుతుంది.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap