ఆంధ్రుల శిల్పకళకు పుట్టిల్లు “దుర్గి”

కళ్లను కట్టిపడేసే చాతుర్యం, సృష్టికి ప్రతిసృష్టి అనిపించే జీవకళ –
మొత్తంగా ఆంధ్రుల శిల్పకళా నైపుణ్యానికి ప్రతీక…

‘దుర్గి శిల్పాలు’. కంప్యూటర్ యుగంలో కూడా సంప్రదాయ కళను నమ్ముకున్న గ్రామం…
గుంటూరు జిల్లాలోని దుర్గి. దుర్గి శిల్పాలు ఇటీవలే కేంద్ర ప్రభుత్వ భౌగోళిక గుర్తింపు (జీఐ)ను సాధించాయి.

నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన సందర్భంగా… అతిథులకు సాదరంగా స్వాగతం పలికాయి దుర్గి శిల్పాలు. కృష్ణా, పుష్కరాలప్పుడు… కూడళ్లలో కొలువుదీరిన కృష్ణవేణమ్మ విగ్రహాలూ దుర్గి నుంచే వచ్చాయి. కార్పొరేట్ కార్యాలయాలకూ, సాంస్కృతిక కేంద్రాలకూ అందాన్నీ హుందాత నాన్నీ ఇస్తోంది కూడా దుర్గి శిల్పాలే! రాజులు పోయినా, రాజ్యాలు కూలినా ఆనాటి శిల్పకళను మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు దుర్గి కళాకారులు. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న దుర్గి… గుంటూరు జిల్లాలోని ఓ మండల కేంద్రం. ఆ గ్రామంలో అడుగుపెడితే చరిత్రలోకి తొంగిచూసినట్టే ఉంటుంది. ఎటు చూసినా శిల్పాలే, వందల మంది కళాకారులు ఉలితో శిలకు ప్రాణంపోస్తూ కనిపిస్తారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏడు ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపును ఇచ్చింది. అందులో దుర్గి శిల్పం కూడా ఉంది. అంటే… ఎన్ని శిల్పకళా రీతులైనా ఉండవచ్చు. దుర్గి శిల్పానికున్న ప్రాముఖ్యత అది! బంగినపల్లి మామిడి పండ్లు, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణలు.. అలానే దుర్గి శిల్పాలూ! పల్నాడు ప్రాంతంలో దొరికే ఓరకమైన రాతితో మాత్రమే ఈ శిల్పాల్ని చెక్కుతారు. ఆ ప్రత్యేకతే దుర్గికి జాగ్రఫికల్ ఇండికేషన్ (geographical indication (GI)  ట్యాగ్ ను సంపాదించి పెట్టింది.

అంతర్జాతీయంగా…
దుర్గి శిల్పాలు దేశాలు దాటి పోతుంటాయి. అరంగుళం నుంచి ఆరడుగుల వరకూ ఏ శిల్పాన్ని అయినా అలవోకగా చెక్కడంలో ఇక్కడి కళాకారులు సిద్ధహస్తులు. దుర్గి శిల్ప కళాప్రియుల యాత్రాస్థలి కూడా. ఏటా ఎంతో మంది దేశ, విదేశీ పర్యాటకులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. ప్రభుత్వ సహకారంతో ఏర్పాటైన… నాగార్జున శిల్పకళా శిక్షణ కేంద్రంతోపాటు శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాల ఉంది. శ్రీ వేణుగోపాలస్వామి, దుర్గాదేవి శిల్ప కళాశాల వంటి శిల్ప తయారీ కేంద్రాలూ ఉన్నాయి. ఈ కేంద్రాల్లో వందలాది శిల్పులు నిరంతరం కళాఖండాలకు ప్రాణంపోస్తూ ఉంటారు. కోరిన శిల్పాన్ని, మాటిచ్చిన సమ యానికి చెక్కి ఇవ్వగల సమర్థులు వీరు. దుర్గి శిల్పుల చేతిలో ప్రాణం పోసుకున్న రాతి విగ్ర హాల్లో దేవతామూర్తులే కాదు…. వయ్యారపు పల్లెపడుచులూ, బిడ్డకు పాలిస్తున్న తల్లులూ, హొయలుపోతున్న సుందరాంగులూ ఉంటారు. చిన్నచిన్న శిల్పాలను బహుమతుల రూపంలో ఇచ్చేందుకు చాలామంది ఇష్టపడతారు. ఇక్క పెద్ద శిల్పాలు ఇళ్లు, ఆఫీసులు, పార్కులు, సమావేశ మందిరాలూ… ఇలా వివిధ ప్రదేశాల అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.

ఆనాటి చరిత్ర…
దుర్గి శిల్ప సంపద ఈనాటిది కాదు. క్రీస్తుశకం 12వ శతాబ్దంలోనే ఆ కళకు బీజం పడింది. ఆచార్య నాగార్జునుడు పెందోట వాసేనంటారు. ఓ ఐతిహ్యం ప్రకారం… పెందోట నుంచి కొంతమంది చేయి తిరిగిన శిల్పులు ద్వారకాపురికి వలస వెళ్లారు. ప్రకృతి వైపరీత్యమో, శత్రువుల దాడులో… కారణం ఏమైనా, పన్నెండో శతాబ్దంలో ద్వారకాపురి నాశనమైంది. వందలమంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు ఎలాగోలా బయ టపడ్డారు. అంతా కలిసి ఓ చిన్న గ్రామాన్ని నిర్మించుకున్నారు. శత్రువుల నుంచీ ప్రకృతి బీభత్సం నుంచీ కాపాడమని అమ్మవా రిని ప్రార్థిస్తూ.. దుర్గాదేవి విగ్రహాన్ని చెక్కి ప్రతిష్టించారు. తమ గ్రామానికి దుర్గి అని పేరుపెట్టుకున్నారు. ఇదంతా యధార్ధమే అనడానికి సాక్ష్యంలా… దుర్గిలో పురాతనమైన దుర్గాదేవి ఆలయం ఉంది. పదిహేనో శతాబ్దం నాటికి దుర్గిలో 300 మంది శిల్పులు ఉండేవారని అంచనా. క్రీ.శ.1127 లో నాగేశ్వర, ఓంకారేశ్వర, 1140 లో వీరభద్ర, 1160 లో వేణు గోపాలస్వామి వార్ల ఆలయాల్ని స్థానిక శిల్పులే నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. మాచర్లలోని చెన్నకేశవ, వీరభ ద్రాలయాలకూ, అమరావతి, నాగార్జున కొండలలోని బౌద్ధ స్థూపాలకు దుర్గి కళాకారులే ప్రాణంపోసినట్టు ఓ కథనం.

అప్పట్లో ఆరుగురే…
కాలం మారింది. పరిస్థితులు మారి పోయాయి. చాలామంది శిల్పులకు సంప్రదాయమైన శిల్పకళ కడుపునింపదని అర్థమైపో యింది. దీంతో మరో ఉపాధి వెతుక్కున్నారు. ఓ వెలుగు వెలిగిన దుర్గి శిల్పకళ అంతరించ సాగింది. ఆ విషయం పాలకుల దృష్టికి కూడా వచ్చింది. గాలిలో దీపంలా రెపరెపలాడుతున్న దుర్గి శిల్పకళను రక్షించేందుకు 1962లో రాష్ట్రప్రభుత్వం నడుంబిగించింది. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో దుర్గిలో శిల్పకళా శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పింది. ఈ కేంద్రంలో మొదటి రెండేళ్లలో చేరింది ఆరుగురు మాత్రమే. ఆ ఆరుగురూ విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నారు. శిల్పులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో శిక్షణ కేంద్రంలో చేరుతున్నవారి సంఖ్యా పెరిగింది. ఇప్పటిదాకా కొన్ని వందలమంది ఆ నీడలో నైపుణ్యం సాధించారు. ఇతర జిల్లాల్లో శిల్ప కళాక్షేత్రా లను నెలకొల్పి కళాభివృద్ధికి తోడ్పడుతున్నారు. శిల్పులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ‘నాగార్జున స్టోన్ కార్వింగ్ వర్కర్స్ కో-ఆపరేటివ్ ఇండస్ట్రియల్ సొసైటీ’ ఆవిర్భ వించింది. 1963లో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ శిల్ప కళాకారుల సాముదాయక సదుపాయ కేంద్రాన్ని నిర్మించింది. విద్యార్థుల భత్యాన్ని కూడా పెంచింది. దివంగత ఎన్టీఆర్ కూడా దుర్గి శిల్పాలకు అభిమానే. శిల్ప కళాకేంద్రాన్ని స్వయంగా సందర్శించారు కూడా.

–కళాసాగర్ యల్లపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap