డా. జి.వి. పూర్ణచంద్ గారిది వైద్యం లోనే కాకుండా సాహిత్యపరంగా, భాషాపరంగా అందె వేసిన చెయ్యి, తెలుగు భాషా ప్రేమికునిగా ‘తెలుగేప్రాచీనం’ రచించారు. హిందీ, ఇంగ్లీషులలో కూడా ఈ గ్రంథం అనువాదం ఐయింది. వీరు, వైద్యానికీ సాహిత్యానికీ సంబంధించి అనేక వందల గ్రంథాలు రచించారు. ఒకప్పుడు మినీ కవితా ఉద్యమాన్ని రావి రంగారావుతో కలిసి భుజాల కెత్తుకున్నారు. అమలిన శృంగారం వీరి మొదటి రచన.సప్తసింధు వీరి ప్రసిద్ధ ఐతిహాసిక నవల. ‘ముక్కాలు’ పేరుతో రెండు కవితా సంపుటాలు రచించారు. ఇవి అనేక భాషల్లోకి అనువాదం అయ్యాయి.
వీటన్నిటికీ మించి మంచి కాలమిస్టు. ఎవరైనా ఒకకాలంలో ఒక కాలం మాత్రమే రచిస్తారు. డాక్టరు గారు మాత్రం ఒకేసారి నాలుగైదు పత్రికలలో కాలంలు నిర్వహిస్తున్నారు. వీరు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో రాస్తున్న’తినరా మైమరచి’ అశేష పాఠకులను అలరిస్తున్నది. సాహిత్యం, వైద్యం భాష, చరిత్ర వీటన్నింటిని సృశిస్తూ రాయడం పూర్ణచందు గారి ప్రత్యేకత. డాక్టరుగారు రచయిత మాత్రమేకాదు. చురుకైన సాహితీ కార్యకర్త. కృష్ణాజిల్లా రచయితల సంఘంకార్య దర్శిగా ఐదు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నిరంతర అధ్యయనశీలి, నిరంతర రచనాశీలి అయిన డాక్టరు గారిని ఇప్పుడు కలుసుకొందాం. గవర్నరు పేటలో ఉన్న సుశ్రుత ఆసుపత్రికి వెళ్లి వారి ఇతర వివరాలను తెలుసుకుందాం. రండి….
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
ఆమధ్య ఒక స్కూల్లో విద్యార్థులు తెలుగులో మాటలాడారని స్కూలు యాజమాన్యం, ఆ పిల్లల్ని ఎండలో నిలబెట్టి శిక్షించింది. అప్పట్లో ఈ విషయం వార్తా పత్రికల్లో కూడా వచ్చింది. మీరు ఆ స్కూలుకు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడివచ్చారు. తెలుగు పిల్లలు తెలుగులో మాట్లాడితే నేరమా?
ఇలాంటి సంఘటనలు ఒకచోట కాదు, రాష్ట్రం అంతా జరిగాయి. కార్పోరేట్ స్కూళ్లవాళ్లు భాషోద్యమాన్ని మదర్ టంగ్ మానియా అనేవాళ్లు. రాజశేఖరరెడ్డిగారి ప్రభుత్వ కాలంలో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటం వలన దీని మీద చట్టం చేశారు. ఇంగ్లీషు స్కూళ్లలో తెలుగులో మాట్లాట్టం నేరం అనటం కొంత తగ్గింది. ఇప్పుడు అసలు తెలుగే లేదు. ఇంక మాట్లాడేదీ లేదు.
మొన్ననే తమిళనాడు వెళ్ళాను. ఎక్కడా తమిళం తప్ప మరొక భాష కన్పడలేదు. మనకు తెలుగు అక్షరాలు కనిపించటమే అపురూపం. ఈ పరిస్థితి మారదంటారా?
ఆదినుండీ మనకు తెలుగు భాషాభిమానం తక్కువ, పరభాషా వ్యామోహం ఎక్కువ. ఒకప్పుడు ప్రాకృతం పాళీ విషయంలో, ఆ తరువాత సంస్కృతం విషయంలో, ఇప్పుడు ఆంగ్లం విషయంలో వ్యామోహం ప్రదర్శిస్తూనే ఉన్నారు. తెలుగంటే మండిపడే సంస్కృతం అభిమానులు, ఆంగ్లాభిమానులూ చాలా మంది ఉన్నారు, మనలో మార్పు లేకుండా ప్రభుత్వాలు తెలుగు భాషకు ఏదో చెయ్యాలని ఎంత కోరినా ఫలితం ఉండదు. తెలుగు కోసం పనిచేస్తే ఓట్లు పడవనే భయం అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉంది. ప్రజల గుండె తలుపులు తట్టి, భాషాభిమానం కలిగించటం ద్వారా మాత్రమే ప్రభుత్వాలను భాషవైపు మళ్ళించటం సాధ్యం అవుతుంది.
సంఘంలో ఏ కాలంలోనైనా వైద్యుడికి ప్రాధాన్యం ఉంది. అప్పిచ్చువాడు, వైద్యుడు లేని ఊళ్లో ఉండవదన్నారు. ఒక వైద్య రచయితగా మీ సేవల గురించి వివరించండి.
వృత్తిపరంగా తన వద్దకొచ్చే రోగుల హితం కోరుతూ వైద్యుడు వైద్యం చేస్తాడు. కానీ, ఒక రచయిత వైద్యుడైతే మొత్తం సమాజ హితం కోరుతూ పనిచేస్తాడు. నేను వైద్యవిద్యలో చేరటానికన్నా ముందే ప్రసిద్ది ఉన్న రచయితని. వైద్యవిద్యార్థి దశలోనే సౌజన్య, జయశ్రీ, వారధి పత్రికల్లో కాలమ్స్ నిర్వహించాను. నా మొదటిపుస్తకం ‘అమలినశృంగారం’ అచ్చయ్యేనాటికి విద్యార్థినే! ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, విశాలాంధ్ర. వండర్ వరల్డ్, ఆదివారం, మయూరి, తెలుగు వెలుగు, ఆంధ్రప్రదేశ్, నది… ఇలా పలు దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికల్లో వందలాది వ్యాసాలు వ్రాశాను. భక్తి, భక్తినివేదన, కనకదుర్గప్రభ, సప్తగిరి లాంటి భక్తి పత్రికల్లో కూడా ఆరోగ్యం ఆహారం లాంటి అంశాలమీద కాలమ్స్ వ్రాశాను. వ్రాస్తూనే ఉన్నాను. నా వ్యాసాలన్నీ 2000కు పైగానే ఉంటాయి. 50 యేళ్ళుగా రాస్తూనే ఉన్నాను. 140 పుస్తకాలు అచ్చయ్యాయి. “ఫలానా సమస్య ఉంది. ఈ కూర తినవచ్చా?”అని నన్ను ఫోన్లో అడిగి తినే పాఠకులున్నారు. వేల సంఖ్యలో పాఠక అనుచరుల్ని సంపాదించుకున్న అదృష్టం నాది.
ఒక వారపత్రికకు కాలమ్ వ్రాయటమే కష్టం. చూస్తుండగానే వారం తిరిగొచ్చేస్తుంది. మీరు అనేక పత్రికల్లో ఒకేసారి కాలమ్స్ ఎలా రాయగలుగుతున్నారు?
* ముఖ్యంగా దినపత్రికలో శీర్షిక నిర్వహించటం కత్తిమీద సామే! అందునా నేను ఆయుర్వేదం, ఆధునిక వైద్యశాస్త్రం, భాషాశాస్త్రం, ప్రాచీనచరిత్ర, వృక్షశాస్త్రం, ప్రాచీన తెలుగు సంస్కృత సాహిత్యాల సమన్వయంగా రాయాల్సిన అంశాలనే ఎంచుకున్నాను. అవలీలగా రాసి పంపించేగలవి కావవి. ఆంధ్రజ్యోతిలో నేను గత 150 వారాలుగా రాస్తున్న ‘తినరా! మైమరచి!!” శీర్షిక ఇందు కుదాహరణ. ఒకేసారి పలు పత్రికలవారు మనకి వ్రాసేందుకు అవకాశం ఇచ్చినప్పుడు రచయిత కష్టపడైనా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిరంతరం చదవటం, దీక్షగా ప్రతీరోజూ రాయటం ఒక అలవాటుగా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. మనదైన గ్రంథాలయం, ప్రశాంతంగా కూర్చుని రాసుకోగలిగే నిరుపహతి స్థలం (personel chamber) మనకంటూ ఉండాలి.
సప్తసింధు చారిత్రక నవల మీకు పేరు తెచ్చిపెట్టింది. దాని నేపథ్యం ఏమిటీ?
* 1980ల్లో మార్క్సిస్టు తత్త్వవేత్త, చరిత్రకారుడు ఏటుకూరి బలరామమూర్తిగారు నన్ను చరిత్రవైపు మళ్ళించిన తొలిగురువు. పౌరాణిక పాత్రలకు చారిత్రక ఆధారాల అన్వేషణ చేయాలనే ఆలోచనని నాకు ఆయనే కలిగించారు. బాబిలోనియా త్రవ్వకాల్లో దొరికిన పురావస్తు ఆధారాల్లో మన రాముడు, విశ్వామిత్రుడు, సగరుడు సహా సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజుల చరిత్రలకు అనేక ఆధారాలు అక్కడ దొరికాయి. ఎల్ ఎ వాడెల్ అనే పరిశోధకుడు సుమేరియా, బాబిలోనియా నాగరికతలకు చెందిన జాతులు భారతదేశం లోకి వస్తూ తమ కథల్ని కూడా తెచ్చారని రామాయణాది ఇతిహాసాల్లోనూ పురాణాల్లోనూ ఈ కథలు కనిపిస్తాయని నిరూపించాడు. ఈ ఆధారాలతో ఋగ్వేదరచనా కాలం నేపథ్యంగా సగరుడి కథని సప్తసింధు నవలగా మలిచాను. అహల్యంగా(దున్నబడని) ఉన్నభూమిని దున్ని రాతిని నాతిని చేసిన కథని వ్యవసాయ ఆరంభ దశకి వర్తింపచేశాను. 1990ల్లో ఈ నవల వచ్చింది.
‘తెలుగే ప్రాచీనం’ లాంటి భాషా చారిత్రక గ్రంథాన్ని వ్రాయటానికి మీ భాషాభిమానమే కారణమా? ఏదైనా ప్రత్యేక కారణం ఉన్నదా?
* కేంద్రప్రభుత్వం 2004లో తమిళానికి ప్రాచీనతా హోదా ఇవ్వటానికి సిద్ధపడ్డప్పుడు మన భాషల సంగతేమిటనే ప్రశ్నతలెత్తింది. ఆ రోజుల్లో ‘నడుస్తున్న చరిత్ర’లో తెలుగు మూలాలపైన ధారావాహికగా వ్యాసాలు రాస్తున్నాను. అధికారభాషాసంఘం చైర్మన్ శ్రీ ఎ.బి.కె. ప్రసాద్ మన భాష ప్రాచీనత పైన పుస్తకం రాయమని, తాను ప్రచురిస్తానని ప్రోత్సహించారు. అలా వెలువడింది తెలుగే ప్రాచీనం. హిందీ అకాడెమీ పక్షాన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు డా. వెన్నా వల్లభరావుతో దాన్ని హిందీలోకి అనువదింపచేసి డిల్లీలో సంబంధిత అధికారులకు పంచారు. మనకు ప్రాచీనత హోదా రావటానికి ఆపుస్తకం తోడ్పడింది. జన్మ ధన్యత నొందిన విషయాల్లో ఇదొకటి.
పరిశోధనాత్మక వ్యాసాలు ఎక్కువగా వ్రాసిన మీరు కవిత్వం పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరచలేదు. కారణం…?
* అందరి లాగానే నేనూ కవిత్వం, కథలతోనే రచనా వ్యాసంగం ప్రారంభించాను. కానీ, ఆదినుంచీ పత్రికల్లో వ్యాసాలు రాయటానికే అవకాశాలు ఎక్కువ వచ్చాయి. దాంతో వ్యాసరచన నా అభిమాన పాత్రం అయ్యింది. అలాగని కవిత్వాన్ని వదల్లేదు. ‘కాంతిస్వప్న’ దీర్ఘకవితా సంపుటి 1985లో తెచ్చాను. మద్యపానానికి వ్యతిరేకంగా ‘నిజం నిజం లయనిజం మాట’ అనే ఒక చిన్న కవితా సంపుటి వచ్చింది. కవిత్వంలో సామాన్యుడికి అర్థం అయ్యేలా సైన్సు విషయాలు చెప్పవచ్చని ఆ పుస్తకం వ్రాశాను. వెలుగు రాగాలు కవితా సంపుటి కూడా వెలువడింది. ఆంద్రజ్యోతి 2004 ఎన్నికల సమయంలో రోజుకొక కవిత 100కి పైగానే రాశాను. మూడు పాదాలతో శీర్షిక ప్రధాన పాత్ర వహించేలా ‘ముక్కాలు’ కవితా సంపుటాలు రెండు వెలువరించాను. అవి ఆంగ్లం, సంస్కృతం, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లోక్కూడా అనువాదం అయ్యాయి. సామాన్యుణ్ణి చేరటానికి వ్యాసరచన, మేథావుల్ని చేరటానికి కవిత్వ రచన నాకు ఎక్కువ ఉపయోగపడ్డాయి! వచనాన్నీ కవితలా అందంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను. నా రచనలకు పాఠకులెక్కువ అందుకే!
ఒకప్పుడు రావి రంగారావుగారూ మీరూ మినీకవితా ఉద్యమ ప్రచారకులు. కవిత్వానికి బొమ్మలు వేసి ప్రదర్శనలను మీరు నిర్వహించేవారు. ఆ ఉద్యమం గురించి వివరించండి:
* కవులు ఉద్యమించి రాస్తున్నారు కాబట్టి దాన్ని మినీకవితా ఉద్యమం అంటున్నామనీ, మౌలికంగా ఇది వచనాకవితా రూపభేదమేనని ఆ రోజుల్లో స్పష్టం చేశాం. రావి రంగారావు నేనూ విస్తృతంగా ప్రచారం చేశాం. మినీకవితా ప్రదర్శనల్ని స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ ఏర్పాటు చేస్తూ నేను దేశం అంతా తిరిగాను. యువకులు బాగా ఆకర్షితులై కవులుగా మారారు. వాళ్లలో చాలా మంది ప్రసిద్ధులయ్యారు కూడా! ఆ రోజుల్లో నా బొమ్మలు, నేను వేసిన ముఖచిత్రాలు మంచి పేరు తెచ్చాయి. యువరచయిత లెందర్నో ప్రేరేపించి వారి రచనలు పుస్తకంగా తెచ్చేలా ప్రోత్సహించే వాణ్ణి. మీ తొలి రచన “సూర్యుడు తప్పిపోయాడు” అలా వచ్చిందే కదా!
మన ఆహార చరిత్రని మీరు ఆంధ్రజ్యోతి “తినరా మైమరచి” కాలమ్ లో క్రోడీకరిస్తున్నారు. సామాన్య పాఠకులక్కూడా ఉత్సాహం కలిగేలా సాహిత్యపరమైన శాస్త్రపరమైన విషాయాలెన్నో చెప్తున్నారు. ఇన్ని విషాయాలెలా రాయగలుగుతున్నారు?
* మన ఆహార చరిత్ర పైన 2003 ఆంధ్రభూమిలో అలనాటి ఆహారాలు అనే కాలమ్ ఓ ఏడాదిపాటు రాశాను. అప్పట్నించీ 20 యేళ్లుగా ఇదే అంశం పైన నేను వివిధ పత్రికల్లో రచనలుచేస్తూనే ఉన్నాను. దాదాపు 12 పుస్తకాలు వెలువరించాను కూడా! ఈ 20 యేళ్ళ అధ్యయనం అంతా ఇప్పుడు ‘తినరా మైమరచి’లో మీరు చదవగలుగుతున్నారు.
తెలుగు వారికి ఆహార చరిత్రపైన పుస్తకం లేదు. ఎవ్వరూ పట్టించుకోని అంశం ఇది. శ్రీనాథుడు కొన్ని ఆహార పదార్థాల గురించి వర్ణిస్తే ఆయన్ని భోజన ప్రియుడుగా ఎకసెక్కం ఆడారే తప్ప అలనాటి ఆహారాలకు అవి గొప్ప ఆకరాలన్న సంగతి మన విమర్శకులు పట్టించుకోలేదు. కనీసం ఆనాటి పేర్లను గుర్తించే ప్రయత్నం చెయ్యలేదు. అంగారపూలు అంటే ఒక భక్ష్యవిశేషం అన్నారే గానీ అదేమిటో తెలుసుకోలేదు. అందువలన ఈ నాటి మన ఆహారపు అలవాట్లకు ఒక గైడెన్స్ లేకుండా పోయింది. కనీసం, అలాకాదు ఇలా అని కూడా చెప్పే పరిస్థితి లేదు. చపాతీ, పుల్కా, బర్గర్లను ఆరోగ్యదాయకంగా అలనాటి తెలుగు ప్రజలు తినగలిగారు. మనం వాటిని నార్దిండియన్ ఫుడ్స్ లేదా మొగాలాయీల వంటకా లంటున్నాం. చరిత్ర తెలుసుకోని జాతి చరిత్ర హీనమై పోతుంది.
తెలుగువారి సమగ్ర ఆహార చరిత్ర తయారు చేయాలన్నదే నా లక్ష్యం. ఆహార మాండలికాలను కూడా ఒకచోటకు చేర్చాలి. విశ్వవిద్యాలయాల పరిధిలో దీనిపైన జరగవలసిన కృషి చాలా ఉంది.
సాహిత్య, వైద్య రంగాల్లో రచనలు చేస్తూనే కొన్ని ఏళ్లుగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తూ వస్తున్నారు. నిరంతర కార్యశీలురుగా, సృజనశీలురుగా ఉంటున్నారు. రహస్యం చెప్తారా?
* రహస్యం అంటూ ఏమీ లేదు. మనకంటూ లక్ష్యం, దానిపట్ల నిబద్ధత ఉండాలి. మనకి మనమే డ్యూటీ వేసుకుని పనిచెయ్యాలి.
తెలుగు భాషోద్యమం ప్రారంభించాక మాకు మేమే బాధ్యత వహించాలని నిర్ణయించుకున్నాం. వ్యయప్రయాసల్ని తట్టుకుని పనిచేశాం. బుద్ధప్రసాద్ గారు మార్గదర్శిగా, గుత్తికొండ సుబ్బారావుగారూ, నేనూ గత 50 యేళ్లుగా నిరంతరంగా చేస్తూ వస్తోన్న సాహితీ సేవకు భాషోద్యమం తోడయ్యింది. 5 పర్యాయాలు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, జాతీయ తెలుగు రచయితల మహాసభలు, భాష, సంస్కృతులకు సంబంధించి అనేక సదస్సులు, తెలుగు పసిడి, వజ్రభారతి, తెలుగు వ్యాసమండలి, తెలుగు మణిదీపాలు, కృష్ణాజిల్లా సర్వస్వం లాంటి బృహద్గ్రంథాలు ప్రచురించాము. ఇవన్నీ అనితర సాధ్యం అన్నట్టే చేశాము. ఇన్నింటినీ చేస్తున్నా నా రాతపోతలకు అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్త పడ్తున్నాను.
చాలామంది మీ సమకాలికులు కలం సన్యాసం చేశారు. ఐనా మీ కలానికి విశ్రాంతి లేదు. కారణం ఏమిటీ?
* మొదట రాయని భాస్కరుల గురించి మాట్లాడదాం. లతగారెప్పుడూ అనేది-రాయనివాళ్లు భాస్కరులెలా అవుతారని! రాయక పోవటానికి ముఖ్య కారణం రాసిందాన్ని ప్రచురించే వ్యవస్థ బలంగా లేకపోవటం. రాసి ఏం చేసుకోవాలని చాలా మంది అడిగారు. ఎంత రాసినా తగిన గుర్తింపు రాలేదనేవారు ఇంకొంత మంది. వయసు పెద్దదయ్యాక కుటుంబ సహకారం లేకపోవటం మూడో కారణం.
ఫలితంతో నిమిత్తం లేకుండా మన డ్యూటీ మనల్ని చెయ్యమన్నాడు గీతాకారుడు. ఆఖరి క్షణం వరకూ రాత ఆగకూడదని, రాస్తూనే పోవాలని కోరుకోవాలి. రాసుకోవటానికి ఇంట్లో పరిస్థితులు అనుకూలించకపోతే గుళ్ళోనో, పార్కులోనో, కాఫీ హోటల్లోనో ప్రశాంతంగా కూర్చుని అయినా రాయాలే గాని రాత ఆపకూడదు. రాత మన తలరాతను తప్పక మారుస్తుంది. అన్ని ఇతర పనులూ మాని రాతపని చేయాలనేది నా నినాదం, నా విధానం కూడా!
మీరు రాసే విధానం ఎలా ఉంటుంది? అందుకు మీరు అనుసరించే విధానం ఏమిటి?
* 2007 నుండీ నేను కలమూ కాయితమూ వాడటం మానేశాను. నోట్సు రాసుకున్నా, రచన చేసినా కంప్యూటర్లోనే అంతా! ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానాన్ని సద్వినియోగపరచుకున్న అతికొద్దిమందిలో నేను ఒకణ్ణి. ఇవ్వాళ ఒకటి రాయకపోతే రేపు రెండు రాయల్సి వస్తుందన్నంత వత్తిడి కల్పించుకుని రాయటం నాకిష్టం. నాలుగైదు అంశాలు ఎదురుగా పెట్టుకుని అన్నింటినీ ఒకేసారి పూర్తి చేయటం నా అలవాటు. ఒక రచన చేయటానికి 2-3 గంటల సమయం పడితే, దాన్ని ఎడిట్ చేసుకోవటానికి ఒక పూటంతా పడ్తుంది. వ్యర్థపదాలు ఏరేయటం, పది పదాలతో రాసిన వాక్యాన్ని 4-5 పదాలకు కుదించటం ఎడిటింగులో నేను చేసే పని. రెండు A4 లంత matter రాసి, ఒక A4కి కుదిస్తాను. కంప్యూటర్లో దిద్దిన ప్రతీ అక్షరం fair copy అవుతుంది. ఎక్కువ సమాచారాన్ని తక్కువ పదాల్తో చెప్పగలుగుతాం. కాలమ్ రాసేందుకు పత్రికల్లో పరిమితమైన చోటే కేటాయిస్తారు. అందులో సరిపడేలా ఎంత సబ్జెక్టయినా రాయాలి. జాగ్రత్తగా ఎడిట్ చేసుకుంటే క్లుప్తత, బిగువు, వేగం ఆ రచనకు సమకూరుతాయి. ఎడిటింగ్ అంటే రాసింది దిద్దుకుంటూ, ఇంకా మంచి పదాలు ఎంచుకుంటూ, పదేపదే ఎత్తిరాయటం. అది రచనను సానపడ్తుంది. తూకంగా రాయటం సాధ్యమౌతుంది.
యువరచయితలకు మీరిచ్చే సందేశం ఏమిటీ?
-తొలిరోజుల్లో కుందుర్తి, విహారిగారి లాంటి గురువులు దొరికారు. వాళ్లు డూ నాట్స్(Don’ts) నేర్పారు. సమకాలీన సాహిత్యాన్ని చదివి డూస్(Dos) నేర్చుకున్నాను. గత 75 యేళ్ల మన సాహిత్యాన్ని తీసుకుంటే ప్రాచీన సాహిత్యం మీద పట్టు ఉన్న వారి రచనలే నేటికి ఆరాధనీయాలుగా ఉన్నాయి. రచయితకు అధ్యయనం అవసరం. వంద పేజీలు చదివి ఒక్క పేజీ రాయగలవారే మంచి రచయితలు. రాసింది రాసినట్టు వాట్సాపుల్లో పెట్టే అలవాటు రచయితని ఎదగనివ్వదు. సహృదయులైన సీనియర్లతో పరిచయాలు పెంచుకుని తమ రచనలు చదివి వినిపించి, సూచనలు తీసుకుని ఒకటికి నాలుగు సార్లు మెరుగు పరచుకొని ప్రచురణకు పంపాలి. ఇతరులకు చదివి వినిపించేప్పుడు మన తప్పులు మనకు తెలుస్తాయి. మనకంటూ ప్రధమ శ్రోతలుండాలి, వారు పరిణతిగలవారై ఉండాలి. కసరత్తు చేయకుండా రచన బలపడదు.
ఇంటర్వ్యూ: మందరపు హైమావతి (9441062732)
డా. పూర్ణచంద్ గారు ఇంత వివరంగా చెప్పినా.. అన్నేసి పత్రికలకు అంత గొప్పగా ఆయన కాలమ్స్ రాయగలగటం ఇంకా ఆశ్చర్యమే!
జయహో.. డాక్టర్ గారూ..
Thank you sir
బహుముఖ ప్రజ్ఞాశాలి పూర్ణ చందు గారితో మీ సంభాషణ ద్వారా.. వర్ధమాన రచయితలు నేర్చుకోదగిన అంశాలు వెలుగు చూశాయి. ఇద్దరికీ అభినందనలు
Good after noon
హైమావతి గారు మీ పలకరింపు ఫీచర్ చాలా బావుంది. ఎందరో సాహితీ, సామాజిక వేత్తలను పరిచయం చేస్తున్నారు. ఎడిటర్ గారికి, మీకు ధన్యవాదాలు…
మంచి విషయాలు వ్రాసారు. ఇంటర్వ్యూ ఆసక్తికరం గా ఉన్నది.
ఇంటర్వ్యూ ఆసక్తి కారంగా సాగింది.మంచి విషయాలు గురించి సవివరంగా వ్రాసారు.
Thank you Annapoorna garu
హైమా , పూర్ణచందు గారి గురించి తెలియని ఎన్నో విషయాలు రాబట్టావు! వారు నిరంతర అధ్యయన శీలి అన్న సత్యం స్పష్టమయింది.. ! రాసేవాళ్ళు నిరుత్సాహపడడం గురించి వారు చెప్పిన సంగతులు అక్షరసత్యాలు !
పూర్ణచందు గారికీ, నీకు అభినందనలు ..!