పండితుల నుంచి పామరుల వరకు ఆబాల గోపాలన్ని అలరించే అందరి వాణి ఆకాశవాణి, దానికి ఉన్న అనేక ప్రత్యేకతల్లో ఒకటి “శ్రవ్య నాటకం” నాటకంలోని అన్ని అంశాలు ప్రదర్శన యోగ్యంగా ఉండవు, అలాంటి వాటిని ప్రదర్శనకు అనుకూలం చేయడంలోనే దర్శకుడి ప్రతిభ వుంటుంది. శబ్ద నాటకానికి సంభాషణలే శిఖరాయమానంగా ఉంటాయి, ఒక చూపులో ఒక కదలికలో, ఒక అంగ విన్యాసంలో, రంగస్థలం మీద నటుడు ప్రదర్శించే హావభావాలన్నీ శ్రవ్య నాటకంలో నటుడి వాచకాభినయం ద్వారానే వ్యక్తం చేయాల్సి ఉంటుంది. అందుకే శ్రవ్య నాటకాలలోని సంభాషణలు రచయిత శక్తికి గీటురాళ్లు అంటారు.
ఈ శ్రవ్యనాటక రచనకు పాశ్చాత్యులే మార్గదర్శకులు. “మార్కోని” శాస్త్రవేత్త కృషి వల్ల అంది వచ్చిన సామాన్యుడి వినోద సాధనం “రేడియో” వల్లే నాటక రచనల్లో వినూత్న ప్రయోగ ప్రక్రియ అయిన ‘శ్రవ్య నాటకం’కు ఆధారం ఏర్పడింది, రేడియో లేకుండా శ్రవ్య నాటకాలను ఊహించలేం. ఇవి పాశ్చాత్యుల ప్రభావంతో వచ్చిన, మన తెలుగు రచయితల నైపుణ్యంతో నూటికి నూరు శాతం అచ్చమైన తెలుగుదనం రంగరించబడింది.
ప్రముఖ రచయిత ముద్దుకృష్ణ రాసిన ‘అనార్కలి’ నాటకం 01 జూన్ 1938న ఆకాశవాణి మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమై “తొలి తెలుగు శ్రవ్య నాటకం”గా చరిత్రకెక్కింది దీనిలో అక్బర్గా అయ్యగారి వీరభద్రరావు, సలీంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి, అనార్కలిగా రేడియో భానుమతిగా ప్రసిద్ధి పొందిన పసుమర్తి భానుమతిగా త్రాభినయం చేశారు. ఈ శ్రవ్యరూపకాలు శబ్ద సంగీత ప్రధానమైనవిగా రచించబడతాయి. నండూరి రామ్మోహన్ రావు రాసిన సంగీత నాటకం 1947 నవంబర్ 5న ఆకాశవాణి మద్రాసు కేంద్రం. నుంచి ప్రసారమైంది, ఆయన తొలితరం తెలుగు శ్రవ్యనాటక రచయితల్లో ఒకరు. తెలుగు శ్రవ్య నాటక రచనల్లో సుమారు వెయ్యి నాటకాలు రాసి అగ్రశ్రేణిలో నిలిచిన వింజమూరి శివరామారావు, కేవలం శ్రవ్య నాటకాలే వ్రాసి కొత్త కొత్త ప్రయోగాలు చేసిన కొడవటిగంటి కుటుంబరావులతోపాటు ఉత్తమోత్తమ ఆకాశవాణి నాటకాలు వ్రాసిన అలనాటి రచయితలు గో.రా. శాస్త్రి జరుక్ శాస్త్రి, అమరేంద్ర, దాశరధి, శ్రీ వాత్సవ, బుచ్చిబాబు, తదితరులను చెప్పవచ్చు.
తెలుగు శ్రవ్యనాటకానికి విజయవాడ, హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాలు చేసిన కృషి ఆదర్శనీయం. ఆ స్ఫూర్తితో కడప విశాఖపట్నం కేంద్రాలు సైతం శబ్ద నాటకాల ప్రసారానికి నడుంబిగించాయి, అనంతర కాలంలో వచ్చిన స్థానిక ఆకాశవాణి నిలయాలైన కొత్తగూడెం, వరంగల్ కేంద్రాలు తమ తమ ప్రయత్నాలు చేసాయి.
కాగా తెలుగు శబ్ద నాటక ప్రసారంలో అగ్రభాగాన నిలి చేది మాత్రం ఆకాశవాణి విజయవాడ కేంద్రమే! అక్కడ 36 సంవత్సరాల పాటు ఆకాశవాణి సేవలో తరించిన బహు ముఖ ప్రజ్ఞాశాలి సంగీత సాహిత్య సవ్యసాచి నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు” అక్కడి శ్రవ్య నాటక విభాగాన్ని తీర్చిదిద్దారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారం చేసిన శ్రవ్య నాటకాలలో పాండవ ఉద్యోగ విజయాలు, గయోపాఖ్యానం, శ్రీకృష్ణ తులాభారం, రోషనార, ప్రతాప రుద్రీయం, వరవిక్రయం, మాభూమి, పల్లెపడుచు ప్రధానంగా చెప్పవచ్చు. అదేవిధంగా హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం కూడా తెలుగు సవ్య నాటకాల నిర్మాణంలో విశేషమైన కృషి చేసింది 1950-60 సంవత్సరాల మధ్య కాలంలో మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ మాండలికంలో అనేక శ్రవ్య నాటకాలు రాసి బహుళ ప్రాచుర్యం పొందారు.
గంట నిడివిగల నాటకంతో పాటు అరగంట, పావు గంట, కాల వ్యవధితో ఉండే నాటికలు వారంవారం ప్రసారం అయ్యే ధారవాహిక నాటకాలు, కార్మికులు, స్త్రీల కార్యక్రమాల్లో సందర్భోచితమైన నాటికలు పిల్లల కార్యక్రమాల్లో సైతం నాటికలు ప్రసారం చేసే ఘనత ఆకాశవాణికే సొంతం.
శ్రవ్యనాటక రచనలో ప్రధాన పాత్ర రచయితదే! శ్రవ్య నాటక రచన అనుకున్నంత సులభం కాదు నటుడి పూర్తి హావభావాలను కేవలం సంభాషణల ద్వారానే దృశ్య మానం చేయాల్సిన సాహస ప్రక్రియ, అలాగే ప్రకృతి దృశ్యాలను సైతం పాత్రల సంభాషణ సాయంతో ఆవిష్కరించాలి. కథ ఆసాంతం సంభాషణల ద్వారానే కొనసాగించాలి. అలా గేశ్రవ్య రూప సంభాషణలు సరళంగా చిన్నవిగా చమత్కారంతో ఉండి సంభాషణకు సంభాషణకు మధ్య అనుసంధానంతో గొలుసు కట్టు రీతిలో ఉండాలి. శ్రవ్య నాటకం అంటే కళ్ళు మూసుకుని చూసే నాటకం అని విశ్లేషకుల వివరణ. శ్రవీనాటకం రచనలు ప్రారంభంలోనే ఆసక్తి కలిగించాలి.
ఏది ఏమైనా తెలుగు నాటక రంగ సాహిత్యంలోనే తలమానికంగా నిలిచేశబ్ద నాటక సాహిత్యం ఒక ప్రత్యేకతను కలిగి ఉంది, కనుక నేటి వర్తమాన రచయితలంతా ఈ సాహిత్య వికాసం కోసం మరింతకృషి చేయాలి అని ఆశిద్దాం, ఆధునిక సామాజిక మాధ్యమాల హోరుగాలి ఎలా ఉన్నా శబ్ద నాటక స్థానం
సదా పదిలం.
–డా. అమ్మిన శ్రీనివాసరాజు
77298 83223