‘చిత్రలేఖనం’తో సృజనకు పునాది

రాజమహేంద్రిలో చిత్రలేఖనం పోటీలకు అపూర్వ స్పందన
వివిధ పాఠశాలల నుంచి తరలొచ్చిన వందలాది విద్యార్థులు

దామెర్ల రామారావు, సపాద శత జయంతి (125వ) ని పురస్కరించుకుని గోదావరి బాలోత్సవం, మారేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ, గోదావరి జిల్లాల కార్టూనిస్ట్స్ సంఘం, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్,విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం, దానవాయిపేట మున్సిపల్ హైస్కూలులో చిత్రలేఖనం పోటీలు ఆదివారం (10-12-23)న జరిగాయి. దీనికి అపూర్వ స్పందన లభించింది. వివిధ పాఠశాలల నుంచి 900 మందికి పైగా విద్యార్ధులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతకు పునాది చిత్రలేఖనం అన్ని పలువురు వక్తలు అన్నారు.
మధ్యాహ్నం 2 గంట నుంచి 4 గంటల వరకూ చిత్రలేఖనం పోటీలు జరిగాయి. అనంతరం మెజీషియన్ శ్రీరాములు ఆధ్వర్యంలో మ్యాజిక్ షో నిర్వహించారు. తరువాత బహుమతి ప్రదానోత్సవ సభను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. సుమారు 5 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమం విజ్ఞానం, వినోదం, వికాసం మేళవింపుతో ఉత్సాహభరితంగా సాగింది. చిత్రలేఖనం పోటీలలో పాల్గొని చిన్నారులు గీసిన చిత్రాలు అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ నిర్వహకులు ప్రశంసాపత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభకు గోదావరి బాలోత్సవం -అధ్యక్షులు విఎస్ఎస్ కృష్ణకుమార్ అధ్యక్షత వహించారు. తొలుత దామెర్ల రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిత్రకళారంగంలో దామెర్ల రామారావు ప్రత్యేకతను ఈ సందర్భంగా కృష్ణకుమార్ గుర్తు చేశారు. జెవివి పూర్వ రాష్ట్ర అధ్యక్షులు చల్లా రవికుమార్ మాట్లాడుతూ దామెర్ల రామారావు గీసిన చిత్రాలు ఇప్పటికీ సజీవం అని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు లభించిన గుర్తింపును మరోసారి గుర్తు చేశారు. చిన్నారుల ఆసక్తిని గమనించి చిత్రలేఖనం పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించిన తల్లిదండ్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్య అంటే కేవలం ర్యాంకులు, మార్కులకే పరిమితం కాకూడదని చిన్నారుల ఆసక్తిని గుర్తించి ఆ దిశగా ప్రోత్సహిస్తే ఆయా రంగాల్లో వారి సృజనతో నూతన ఆవిష్కరణలు చేస్తారన్నారు.

జాషువా సాంస్కృతిక కేంద్రం కార్యదర్శి గుండు నారాయణరావు మాట్లాడుతూ చిత్రలేఖనం క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రతను నేర్పుతుందన్నారు. పాటలు, చిత్రలేఖనం, పుస్తక పఠనం వంటి అలవాట్లు చిన్నారులలో విజ్ఞానాన్ని, వికాసాన్ని నింపుతాయని తెలిపారు. జనవరి 2024లో రాజమహేంద్రవరంలో జగరబోయే బాలోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. దామెర్ల రామారావు. మనవడు కెప్టెన్ డెన్నిస్ డామెర్ల మాట్లాడుతూ సాధారణ విద్యార్ధి స్థాయి నుంచి తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నవయసులోనే కెప్టెన్ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. చిత్రలేఖనం పోటీల్లో పెద్దసంఖ్యలో చిన్నారులను ప్రోత్సహించిన తల్లిదండ్రులందరికీ అభినందనలు తెలిపారు. ప్రముఖ ఆర్టిస్ట్ సునిల్ కుమార్ మాట్లాడుతూ గోదావరి బాలోత్సవం మార్పునకు నాంది పలికిందన్నారు. సృజనాత్మకతకు చిత్రలేఖనం పునాది అని వివరించారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ డామెర్ల డెన్నిసు నిర్వాహకులు సత్కరించారు. ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ తరపున సునీల్ కుమార్, కళాసాగర్, గోదావరి జిల్లాల కార్టూనిస్టుల సంఘం తరపున కార్టూనిస్టు శేఖర్. జాషువ సాంస్కృతిక కేంద్రం తరపున జి.నారాయణరావు, మారేటి రాజాజ్ ఆర్ట్ అకాడమీ తరపున మారేటి రవి, గోదావరి బాలోత్సవం బృందం పి. తులసి, రవికాంత్, పిఎస్ఎన్. రాజు, సాయిబాబు, అద్దంకి రాజాయోనా, పట్నాయక్ విజేతలకు బహుమతులు అందజేశారు.

కార్యక్రమాన్ని తమ వ్యాఖ్యానంతో స్పూర్తి శ్రీనివాస్, తులసి ఆధ్యంతం ఉత్సాహాంగా, ఉల్లాసంగా నడిపించారు. చిత్రలేఖనం పోటీలకు న్యాయనిర్ణేతలుగా కళాసాగర్, సునీల్ కుమార్, కార్టూనిస్ట్ శేఖర్ వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap