కళ సమాజహితంగా ఉండాలి – చిదంబరం

ఒక దృశ్య చిత్రీకరణలో కవికి చిత్రకారుని కి కావలసింది వర్ణాలే. అవి అక్షరాలు కావచ్చు లేదా రంగులు కావచ్చు. పది పేజీలలో కవి చెప్పిన విషయాన్ని- ఒక్క బొమ్మలో చూపించగల చిత్రకారుడు కవి కన్నా నేర్పరి అనడం సముచితం. మన తెలుగు పత్రికారంగంలో బాపు, వడ్డాది పాపయ్య, చంద్ర, బాలి లాంటి చిత్రకారులకు మంచి గుర్తింపు వచ్చింది.. గత మూడు దశాబ్దాలుగా అటు ప్రింట్ మీడియాలోనూ, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ తన సేవలందించిన చిత్రకారుడు చిదంబరం. కథలకు, కాల్పనిక సాహిత్యానికే కాకుండా రామాయణ, భారతాలకు చక్కని దృశ్యరూపం ఇవ్వగల దిట్ట చిదంబరం. వీరి కళా రంగ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

బందరు – ఈ పేరు చెబితే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు ఆంధ్ర జాతీయ కళాశాల, అడవి బాపిరాజు, గుర్రం మల్లయ్య లాంటి చిత్రకారులు. అలాంటి చారిత్రిక సాంస్కృతిక ప్రదేశమైన మచిలీపట్నం లో 1954 ఫిబ్రవరి 4న సీతా మహాలక్ష్మి, రామలింగ శాస్త్రి దంపతులకు జన్మించారు చిదంబరం. వీరి పూర్తి పేరు పావులూరి చిదంబరేశ్వర రావు. బాల్యం నుండి బొమ్మలు గీసే అలవాటు సహజసిద్ధంగానే అలవడింది వీరికి. బడిలో పలక మీద వినాయకుడి బొమ్మ ను క్షణాల్లో చిత్రించి స్నేహితులను ఆశ్చర్యపరిచే వారు.అవనిగడ్డ జిల్లా పరిషత్ హై స్కూల్ లో చదువుకునే రోజుల్లో డ్రాయింగ్ టీచర్ నాగినేని వెంకట రామయ్య గారి ప్రోత్సాహంతో స్కూల్ లో జరిగే చిత్రకళా ప్రదర్శనలో పాల్గొంటూ తనలోని కళకు మెరుగులు పరుచుకుంటూ వచ్చారు. అవనిగడ్డ లైబ్రరీ లో చందమామ పత్రికలో వపా, చిత్ర, శంకర్ల బొమ్మల స్ఫూర్తితో వాటిని అనుకరిస్తూ బొమ్మలు గీసేవారు చిదంబరం. చిత్రకారులు వానపాముల సత్యనారాయణ గారు, గీతా స్టూడియో శర్మ గారు, సుబ్బారావు గార్ల తైల వర్ణ చిత్రాలు, నీటి రంగుల చిత్రాలు చూసిన తర్వాత ‘నేను కూడా చిత్రకారుడు కావాలి’ అన్న తపన పెరిగింది వీరిలో. “ఎప్పుడూ బొమ్మలు గీస్తున్న చిదంబరం గారిని చూసిన తల్లిదండ్రులు ఎందుకురా ఇవి కూడు పెడతాయా ? బాగా చదువుకో మంచి ఉద్యోగం వస్తుందని తిట్టేవారు.”  అయినా బొమ్మలు గీయడం మానలేదు చిదంబరం గారు. హైస్కూల్ చదువు ముగించుకుని బందరు హిందూ కాలేజీలో బి.ఎస్సీ డిగ్రీ 1973 లో అందుకున్నారు.

ఉన్నత చదువులకు వెళ్లే ఆలోచనకు స్వస్తి పలికి తనలోని చిత్రకారుని మేల్కొలిపి అవనిగడ్డలో సైన్ బోర్డులు వ్రాసే ఆర్టిస్టులతో వారిలా సైన్ బోర్డులు రావడమే గొప్ప అనే ఆలోచన నుండి బయటకు వచ్చి, మద్రాస్ అయ్యర్ గ్రేడ్ ఫ్హ్రీ హ్యాండ్ అవుట్ లైన్ మరియు మోడల్ డ్రాయింగ్ పరీక్షలు రాసి సర్టిఫికెట్ సంపాదించారు.

డ్రాయింగ్ టీచర్ కావాలనే ప్రయత్నంలో విజయవాడ కెనడె హై స్కూల్ లో డ్రాయింగ్ మాస్టర్ గా కెరీర్ ను ప్రారంభించారు. చిత్రకారుడు కావాలన్న ఆయన తపనను డ్రాయింగ్ టీచర్ ఉద్యోగం పూరించ లేదు..! అనుకున్నారేమో మూడేళ్లకే ఉద్యోగానికి స్వస్తి పలికి, 1985 లో ఆంధ్రజ్యోతి పబ్లికేషన్ లో ఆర్టిస్ట్ గా చేరి 99 వరకు (మూత పడే వరకు) పనిచేసి మరల 2004 నుండి 2007 వరకు అక్కడే ఇలస్ట్రేషన్స్, కామిక్స్, కార్టూన్స్ గీసి  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అటు తర్వాత 2007 సం. నుండి 2014 వరకు టీవీ9 సంస్థలు “సంస్కృతి ” టీవీ1 చానల్స్ లో సీనియర్ ఆర్టిస్ట్ గా పనిచేసి, అవసరార్థం యానిమేషన్ కూడా నేర్చుకున్నారు. వేమన పద్యాలకు వీరు గీసిన చిత్రాలకు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో స్థానం కల్పించారు.

వీరి మొదటి బృంద చిత్రకళా ప్రదర్శన 1988 లో చిత్రకళా సంషద్  ఆధ్వర్యంలో మచిలీపట్నం టౌన్ హాల్ లో జరిగింది. ఆ తర్వాత గుంటూరు పాండవులు నిర్వహించిన గ్రూప్ లో కూడా వీరి చిత్రాలు ప్రదర్శించారు.  ఇవి కాకుండా హైదరాబాద్, బెంగళూరు, గోవా, రాజస్థాన్, విజయవాడ తదితర ప్రాంతాల్లో బృంద చిత్రకళా ప్రదర్శనలో పాల్గొనడమే కాకుండా వివిధ కళా సంస్థలు నిర్వహించిన అనేక వర్క్ షాపుల్లో పాల్గొని తన లోని కళా ప్రతిభను కాన్వాస్ పై ఆవిష్కరించారు.

ప్రస్తుతం విజయవాడలో నివసిస్తున్న వీరు మైసూర్  ఓపెన్ యూనివర్సిటీ నుంచి 2014లో బి.ఎఫ్.ఏ. డిగ్రీ ని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయి, 55 ఏళ్ళ వయసులో కూడా తనకున్న తృష్ణను చాటుకున్నారు. కొన్ని వేల ఇలస్ట్రేషన్లు, కార్టూన్లు, కామిక్స్, వందలకొద్దీ వాటర్ ఆయిల్ కలర్ చిత్రాలు వేసినప్పటికీ ఇంకా ఈ రంగంలో కృషి చేయాలనే ఆకాంక్షతో నిత్య కళా సాధన చేస్తున్నారు చిదంబరం గారు.

వీరు చిత్రాల్లో రేఖావిన్యాసం సుమనోహరంగా ఉంటుంది. అలాగే వర్ణాలను లయాత్మకంగా ఉపయోగిస్తారు. రాముడు బొమ్మ గీసిన, కృష్ణుని గీసిన, పర్యావరణ చిత్రాన్ని గీసిన గ్రామీణ రైతు కుటుంబాన్ని చిత్రించిన ప్రతి చిత్రంలోనూ తనదైన శైలి మనకు కనపడుతుంది.

ప్రకృతి నుంచి ప్రేరణ పొంది, తన ఊహలకు రూపం కల్పించిన చిత్రాలకు ఆదరణ ఎప్పటికీ ఉంటుందని, అవి సమాజ హితంగా ఉండి అందరిని అలరించాలన్న అభిలాషతో తన కళాయానాన్ని కొనసాగిస్తున్నారు చిత్రకారులు చిదంబరం.

-కళాసాగర్

2 thoughts on “కళ సమాజహితంగా ఉండాలి – చిదంబరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap