ఎల్లాసుబ్బారావు గారి “సువర్ణ తూలిక”

(అక్టోబర్ 2 న ఎల్లాసుబ్బారావు గారి వ్యక్తి గత చిత్రకళా ప్రదర్శన విజయవాడ కల్చరల్ సెంటర్ లో జరుగుతున్న సందర్భంగా)

రాజమహేంద్రవరం నందలి దామెర్ల రామారావు స్కూల్ నుండి వచ్చిన వందలాది చిత్రకారులలో శ్రీ ఎల్లా సుబ్బారావు గారిని ఒక ప్రత్యేక మైన కళాకారుడిగా చెప్పవచ్చు.. కారణం ఆయన ఎంచుకున్నవిషయం వ్యక్తం చేసే విధానం రచనా శైలిలో వుందని చెప్పవచ్చు.

దేశంలో ప్రతి స్కూలుకీ ఒక శైలి ఉన్నట్లే దామెర్ల రామారావు మరణానంతరం ఆయన స్మారకార్ధం రాజమండ్రి లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చిత్రకళాశాలకు కూడా ఒక ప్రత్యేక శైలి వుంది.అది ప్రాక్ పశ్చిమ శైలుల మేళవింపుతో స్వయంగా దామెర్ల రామారావు సృష్టించిన గొప్ప శైలి.ఆ శైలినే రాజమండ్రి చిత్రకళాశాలలో గురువులు శిష్యులకు భోదించడం జరిగింది. వరదాగారి వరకు నూటికి నూరుశాతం ఈ విధానం కచ్చితంగా పాటించగా ఆ తర్వాత వొచ్చిన రాజాజీ గారు ఆ కళాశాల శైలితో పాటు చిత్రకళారంగంలో నాడు నడుస్తున్న బిన్న విభిన్న శైలులతోను ,ఆధునిక చిత్రకళా రీతుల్లోను కుడా ఎన్నో ప్రయోగాలతో చిత్రాలు రచించన వ్యక్తి. ఆచార్య రాజాజీ గారి నుండి వందలాది శిష్యులు చిత్రకళా పాటాలు నేర్చుకున్నప్పటికినీ గురువు యొక్క మరో ఆధునిక పార్శ్వాన్ని పట్టుకున్న ఘనత మాత్రం శ్రీ ఎల్లా సుబ్బరావు గారికే దక్కుతుంది.

దామెర్ల చిత్రకళాశాల శైలికి రేఖ ప్రధానం. సుబ్బారావు గారు కూడా రేఖాధారంగా సాగే ఆ స్కూల్ నుండే రావడం వలన వీరు మొదట్లో చిత్రించిన,సింబల్ అఫ్, లైఫ్ కార్తీక పౌర్ణమి తదితర ఎన్నో చిత్రాలలో కొంత ఆ ప్రభావం కనిపిస్తుంది, కాని ఆ తరువాత కాలంలో ఆ సాంప్రదాయాన్ని అధిగమించి రేఖాధారమైన ఆ శైలి నుండి వర్నాధర శైలికి మారి తనదైన ప్రత్యేఖ శైలిని సృష్టించుకున్న సృజనకారుడుగా ఆయన మారారు. వీరి చిత్రాల్లో రంగులు ప్రధానం, రూపం ప్రధానం.,భావం ప్రధానం.వేగం ప్రధానం,అలాగని రేఖలు అప్రధానం అనలేము గాని రంగులలో సంలీనమైన రేఖ తన ఉనికిని కోల్పోయి పూర్తిగా వర్ణాదారంగానే వీరి చిత్రాలు మనకు కనిపిస్తాయి. ఇటీవల ఆయన వేస్తున్న అర్ధనారీస్వర్, ఆర్ఫన్స్, చలి, శిక్షణ,స్వేచ్చకోసం, ఎట్ వర్క్,దుర్గ, దాహం,దిగేమ్ తదితర చిత్రాలు ఆయనలోని వర్ణ విన్యాసానికే కాదు నవ్యరచనా రీతికి కూడా ప్రతీకలుగా నిలుస్తాయి.

సాధారణంగా అర్ధనారీస్వరుడు రూపాన్ని ఏ చిత్రకారుడు చిత్రించినా ఒకే రూపంలో సగ బాగం శివరూపంగా మిగిలిన సగ బాగం శక్తీ రూపంగా చిత్రించడం ఇంతవరకు మనం చూసాము. కాని ఆయన ఇటీవల వేసిన అర్ధనారీస్వరుడు చిత్రంలో శివరూపం మరియు శక్తి రూపం రెండింటిని నఖ శిఖ పర్యంతం పూర్తిగా ఇరుమూర్తుల యొక్క నాలుగు చేతులు ఇరువురియొక్క రెండేసి కాళ్ళు అలాగే వారి వారి వాహనాలైన పులి నందులతో సహా ఏక చిత్రంగా కనిపించేలా నవ్యరీతిలో ప్రయోగాత్మకంగా చిత్రించిన అర్ధనారీస్వరుని చిత్రం నిజంగా అద్భుతంగా వుంటుంది.అలాగే ద్రోణాచార్యుడు తన శిష్యులైన పాండవులకు విద్య నేర్పుతున్నదృశ్యాన్ని సాంప్రదాయ శైలిలోనే ఎవరైనా ఊహించు కుంటారు.ఒక పౌరాణిక గట్టానికి చెందిన ఆ దృశ్యాన్ని నిజానికి ఎవరైనా అలాగే చిత్రిస్తారు కుడా, కాని “శిక్షణ“ అనే పేరుతో సుబ్బారావు గారు చిత్రించిన అదే ఘట్టానికి చెందిన ఆయన చిత్రంలో అసలు మనము ఊహించని నవ్యత్వం కనిపిస్తుంది.

అలాగే శీతల వర్ణాలయిన ఊదా మరియు నలుపు రంగుల్లో వేసిన ముసుగు వేసుకున్న ఇరువురి ముసలి బామల చిత్రాలకు నేపధ్యంలో కాన్వాస్ అంతా శీతల వర్ణాలకు పూర్తి వైరుధ్యమయిన ఉష్ట్నవర్ణాలతో సృష్టించిన దగదగా మెరిసిపోయే ఎరుపు పసుపుల వర్ణ జ్వాలలు ఆ చిత్రంలో చలికి వణుకుతున్న ముసలి బామలకే గాక మనకు కూడా వేడి పుట్టించేలా చేస్తారు“చలి” అన్న చిత్రంలో . అలాగే ఇంకా,దాహం,ఉద్యమం, చలి, శ్రామికులు,అనాదలు, క్రీడా తదితర ఎన్నో విషయాలపై వేసిన ఏ చిత్రమైన ఏ విషయమైనప్పటికి చిత్రరచనా రీతిలో తనదైన నవ్యరీతిని సుబ్బారావు గారి చిత్రాల్లో మనము చూస్తాము. ఇంకా అజరామరమైన బేలూరు హళిబేడు శిల్పాలలో కొన్నింటికి వీరు పెన్సిల్తో తో చిత్రించిన అనుక్రుతులు ఎంతో గొప్పగా వుంటాయి.

చక్కని రూప చిత్రాలు కూడా వీరు చిత్రించగలరు. తాను పని చేసే పాటశాలనందలి ఎందరో విద్యార్ధులు ఉపాద్యాయుల రూపచిత్రాలు వారింట్లో మనకు దర్సనమిస్తాయి. విషయ సంభందమై వీరు వేసెడి చిత్రాలలో కూడా రుపాలుంటాయి కానీ ఆ రూపం స్తితిశీలకంగా కాకుండా గతిశీలకంగావుంటుంది. వీరి చిత్రాలలోని మూర్తులరూపాలు నిస్తేజ బరితంగా కాకుండా వుత్తేజబరితంగా వుంటాయి. చలన హీనంగా కాకుండా చలన శీలంగా మనకు కనిపిస్తాయి. రంగులతో ఆయన రూపాల్లో సృష్టించిన చైతన్యయుక్తమైన ఆవేగం వీక్షకుడి మదిలో ఒక విదమైన ఉత్తేజాన్ని కలిగిస్థాయి.

దాదాపు అర్ధ శతాబ్దపు తన చిత్ర కళా జీవితంలో వృత్తి పరంగా ఎన్ని ఆటు పోట్లు ఎదురైనప్పటికి కళను విస్మరించ కుండా ఎన్నో చిత్రకళ కార్యక్రమాలలో పాల్గొంటూ మరెన్నో అవార్డులు సాదిన్చుకుంటూ ముందుకు సాగడం గొప్ప విషయం. తన గురువు రాజాజీ పేరు మీదుగా ఆర్ట్ స్కూల్ స్థాపించి అవుత్సాహిక విద్యార్దులకు చిత్ర కళను నేర్పిస్తూ నేడు ఏడు పదుల వయసులో కూడా నిరంతరం చిత్రకళా సేవ చేస్తూ ఆదర్శనీయమైన జీవితాన్ని కొనసాగించడం ఇంకా గొప్ప విషయం.తన ఇన్నేళ్ళ కళాయానానికి గుర్తుగా “సువర్ణ తూలిక “ పేరుతో తన కృషిని నేడు ఒక గ్రంధ రూపంలోకి వారి అల్లుడు ప్రముఖ చిత్రకారుడు మరియు కవి అయిన ఆత్మకూరు రామకృష్ణగారు తీసుకురావడం ముదావహం .అంతేగాకా తన గురువర్యులైన ఆచార్య రాజాజీ గారి జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీన ఈ గొప్ప కార్యక్రమాన్ని మరియు తన వ్యక్తి గత చిత్రకళా ప్రదర్శనను కల్చరల్ సెంటర్ విజయవాడ నందు చెయ్యడం హర్షించదగిన విషయం.శ్రీ యల్లా సుబ్బారావు గారి ఈ వేడుక, ప్రదర్శన విజయవంతం కావాలని 64కళలు .కాం కోరుకుంటుంది.
వెంటపల్లి సత్యనారాయణ(9491378313)

1 thought on “ఎల్లాసుబ్బారావు గారి “సువర్ణ తూలిక”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap