కళ అనేది ఒక గొప్పవరం.. ఆ వరం కొందరికి సహజసిద్దంగా వస్తుంది మరొకరికి సాధనపై సిద్దిస్తుంది. సహజంగా వచ్చినంతమాత్రాన ప్రతీ వ్యక్తి కళాకారుడిగా మారలేడు. దానికి తగిన కృషి చేసినప్పుడు మాత్రమే కళాకారుడిగా గుర్తింప బడతాడు. అందుకు కాలం కూడా కలిసి రావాలి. తక్కువకాలం లో చేసిన కృషి ద్వారా ఎక్కువ పేరు గడించినవారు కొందరైతే, ఎక్కువకాలంలో చేసిన కృషి ద్వారా తక్కువ పేరుగడించిన వారు మరికొందరు, అసలూ యే పేరు సాదించకుండానే కాలాన్ని గడిపెసేవారు ఇంకొందరు. తెలంగాణలో సుదీర్గ కాలం చిత్రకళలో అసమానమైన కృషి చేసి ఎందరో భావిచిత్రకారులను తయారుచేసిఅందరికి ఆదర్శంగా నిలిచిన గొప్ప చిత్రకళా ఋషి కొండపల్లి శేషగిరిరావు గారు, నేడు (27-01-2024)వారి జయంతిని పురష్కరించుకుని వారితో గల నా జ్ఞాపకాలు ఈ వ్యాసరూపంలో మిత్రులకోసం 2011 లో అనుకుంటాను. నేను 64 కళలు.కాం అనే అంతర్జాల పత్రికకు ఆర్టికల్ రాసే క్రమమంలో నా మిత్రులు మంచెం గారు, బీర శ్రీనివాస్ రాజా రాంబాబు, అన్వేష్ తదితరులతో కలిసి కొండపల్లి శేషగిరిరావు గారిని దర్శించడం జరిగింది. అప్పటికి వారి వయస్సు 87 ఏళ్ళు. పట్టు దోవతి లాల్చీ దరించి మేలిమి బంగారు చాయలో దొండపండులా మెరిసిపోతున్న ఆయనను తొలిసారిగా చూసినప్పుడు నిజంగానే ఒక గొప్ప అనుభూతి కలిగింది మాఅందరికి. 90వ పడికి చేరుకున్న ముదిమి వయసులో సైతం నిలువెత్తు నిండు విగ్రహంలా హుందాతనంతో హిమగిరి శిఖరంలా కనిపించిన ఆయన రూపాన్ని చూడగానే మాతలలన్ని అప్రయత్నంగానే ఆయన పాదాల వైపు వంగి నమస్కరించాయి.
ఒక మనిషి తనకు తెలియకుండా అప్రయత్నంగా ఎందుకు అలా చేస్తాడు అంటే అది ఎదుటవున్న వ్యక్తియొక్క విద్వత్తు,వ్యక్తిత్వం అలా చెయిస్తుందేమో. బహుసా ఆరోజు మా ఎదురుగా కూర్చున్న ఆ వ్యక్తి లోని గొప్పవిద్వత్తే మాకు తెలియకుండా ఆయనకు శిరసు వంచేలా చేసిందని చెప్పవచ్చు. ఏమిటి ఆ విద్వత్తు అని మనం అని ఆలోచన చేయనవసరం లేకండానే వారి పక్కనే గోడకు అలంకరించి వున్నఒక పెద్ద తైలవర్ణ చిత్రం మమ్మల్ని చూపు మరల్చకుండా చేసింది. వనవాసానికి యేగుతున్న రామలక్ష్మణ సీతాదేవిలను నదిని దాటిస్తున్న గుహుడి చిత్రమది. ఆ మరో ప్రక్కనే తామర పుష్పాల కొలనులో కలువలు సేకరిస్తున్న లచ్చి చిత్రం.ఆపై బయట గోడపైనే డైరెక్ట్ గా తైల వర్ణాల్లో చిత్రించిన గోదాదేవి చిత్రం. ఇంకా మేడ పైన ప్రత్యేక గదిలో భద్రపరచబడిన జల మరియు తైల వర్ణ చిత్రాలెన్నో, ఎన్నెన్నో మమ్మల్ని ముగ్దుల్ని చేసాయి. డాబాపైన ప్రత్యేక గదిలో భద్రపరచబడిన ఒక్కో చితాన్ని వారి కోడలు నీహారిని గారు మాకు అందిస్తూ చూపిస్తుంటే మంత్రముగ్డులమై మేము మరలా వాటిని శేషగిరిరావు గారికి చూపుతూ అడుగుతుంటే ఎవరు వేసారూ ఇవి అని తిరిగి మమ్మల్ని ఎదురు ప్రశ్నించినపుడు మాకర్దమైంది వయసు ప్రభావంతో వారికి కాస్త మతి మరుపు కూడా తోడయ్యిందని. చిత్రాలన్నింటిని చూసినతర్వాత మేడ క్రిందకి దిగిన నేను రెగ్యులర్ గా యే చిత్రకారుడిని పరిచయం చేసేందుకు వెళ్ళినా చివర్లో వారి ఆటో గ్రాఫ్ ను అడిగినవిధంగానే కొండపల్లి గారిని కూడా కోరినపుడు ఆనందంగా వారు శాకుంతలం సిరీస్ లో వేసిన ఎన్నో జింకలలో ఒక దానిని రేఖాచిత్రంగా గీసి నాకు ఆటో గ్రాఫ్ ఇవ్వడం ఒక తీయని అనుభూతి. ఆ ఆటో గ్రాఫ్ లో ఆ రేఖా చిత్రం గీస్తున్నపుడు మా అందరి కళ్ళు ఆయన చేతి ఒడుపుపైనే. కారణం తొమ్మిది పదుల వయసులోకూడా సహజత్వంతో కూడిన ఆయనరేఖా విన్యాసం మాకు ఆశ్చర్యం కలిగించింది. దానికి కారణం ఆయన చేసిన అపారమైన సాధన, కృషి అని వేరే చెప్పనవసరం లేదు.
శేషగిరిరావు గారి ద్రుష్టిలో కళ అనేది ఒక గొప్ప యోగం. యోగానికి ఏకాగ్రత ఎంత అవసరమో కళా సాధనకు కూడా అంతే అవసరం. అలా ఏకాగ్రతతో సాధన చేసిన కళాకారుని ఆత్మకు శాంతి చేకూరుతుంది అలాంటి శాంతిని ఆనందాన్ని నేను అనుభవించానని చెప్పుకునేవారాయన. అంత ఏకాగ్రత తపస్సుతో వేసినవి కాబట్టే ఆయన చిత్రాలు ముఖ్యంగా శాకుంతలంపై వేసినవి అంత అద్భుతంగా వుంటాయి. తెలంగాణా ప్రాంతమునందలి బండరాళ్ళు, ఎండు చెట్లు, వయోవ్రుక్షాలూ శేషగిరిరావు గారి కుంచేద్వారా దైవత్వాన్ని నింపు కున్నాయి.
పాశ్చాత్య సాంప్రదాయానికి అనుగుణంగా బ్రిటీష్ వారి కాలంలో ఒక మూస పద్దతిలో కొట్టుకుపోతున్న నాటి బ్రిటీష చిత్రకళా రీతులను చేదించి అటు పాశ్చాత్య శైలి నందలి వాస్తవరీతికి మన ప్రాచ్య శైలినందలి లావణ్యాన్ని జోడించి తెలుగు కళకు ఒక వెలుగు తీసుకువచ్చిన మొదటి వ్యక్తి దామెర్ల రామారావు అయితే ఆ పిదప వరదా వెంకట రత్నం అడవి బాపిరాజులాంటి వారు ఆ కొత్త వోరవడిని కొనసాగించారు. ఆతర్వాత ప్రాంతాల మరియు వ్యక్తుల రూపకల్పనలో ప్రాకృతిక సహజత్వము తో బాటు మూర్తుల రూపాల్లో పాత్రోచితమైన సహజత్వాన్ని మరి ముఖ్యంగా సహజసిద్దమైన సుకుమారత్వానికి ప్రతీకగా వుండే స్త్రీమూర్తుల రూపకల్పనలొ ఒకింత లావన్యంతో పాటు అందమైన లయను హోయలులను మరింతగా చేకూర్చి ఇది తెలుగు వాడి చిత్రం అని కాలరెగరేసి గర్వంగా చెప్పుకోనేలా మహిళా మూర్తులను శేషగిరిరావు గారు చిత్రించడం జరిగింది. కాళిదాసు విరచిత అభిజ్ఞాన శాకుంతలమ్ ని దృశ్యమానం చేస్తూ జల, తైల వర్ణాల్లో వారు వేసిన చిత్రాలు చూస్తే మనకు ఈ విషయం అర్ధమౌతుంది.
ఒక చిత్రానికి ప్రాముఖ్యత అనేది ఆ చిత్రకారునికి ఒక ఆలోచన జనించిన పిదప దానికి యే మేరకు స్పందించాడో ఎంత బాగా ఆలోచించాడో, యే మేరకు ఆ చిత్ర రచనకు కృషి చేసాడో ఆ మేరకు మాత్రమే ఆ చిత్రం ప్రామాణికతను సంతరించుకుంటుంది. చిత్రకారునిగా తనకున్న పేరుని వినియోగించుకుని కేవలం ఆర్ధిక ప్రయోజనమే పరమావదిగా ఆయన పని చేయలేదు చిత్రకళను ఒక యోగంగా భావించిన వ్యక్తి గనుక ఒక చిత్రం వేసేముందు దానికోసం ఎంతో పరిశోధన, పరిశీలన, పరిశ్రమ ఆయన చేసేవారు. ఉదాహరణకు 1975 లో రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించే సమయంలో “తెలుగుతల్లి” చిత్రానికి రూపకల్పన చేయాల్సిందిగా ఆయనను కోరినప్పుడు అంత చేయి తిరిగిన చిత్రకారుడైనప్పటికి ఆ చిత్రం గీయడానికి ముందుగా ఆయన తయారు చేసుకున్న నోట్స్ చూసినట్లయితే మనకు ఔరా అనిపిస్తుంది.
ఒక జాతికి ప్రతి రూపమైన తల్లిని రూపొందించేటప్పుడు ఆ తల్లి యొక్క రూపం మనం నిత్యం చూసే సాధారణ విగ్రహాల మాదిరిగా వుండకూడదు .ఆ రూపం కచ్చితంగా ఇతరవాటికి భిన్నంగా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నదై వుండాలి. అంతే గాక చారిత్రక నేపధ్యానికి సంభందించిన రూపాలను ఆ చిత్రంలో ప్రవేశపెట్టాలి, భౌగోళిక స్వరూప ప్రత్యేకతలు కూడా ఆచిత్రం వ్యక్త పరిచేలా వుండాలి . జాతిపరమైన చిహ్నాలను లక్షణాలను అందులో ప్రతిబింబింపజేయాలి. అప్పుడే ఆ చిత్రం మిగిలిన సాధారణ చిత్రాలకు భిన్నంగా ఆ జాతి చరిత్ర సంస్క్రుతులను వ్యక్తం చేస్తూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది కొండపల్లి శేషగిరిరావు గారి కుంచె ద్వారా రూపు దిద్దుకున్న తెల్లుగు తల్లి చిత్రాన్ని చూసినపుడు పైన పేర్కొన్న లక్షణాలన్నీ మనం గమనించగలం. అదీ ఆయన కృషి.
రూపం, వేషం , నడత నడవడిక అన్నింటా శుద్దశాస్త్రీయత, సాంప్రదాయాలను కలబోసుకున్న శేషగిరిరావు గారు కేవలం సాంప్రదాయ శైలిలోనే గాకా ఆధునిక శైలిలో కూడా ఎన్నో చిత్రాలు వేసారు క్షామ, డెడ్ కవ్, ది రెస్ట్, సంతాపం మొదలైన చిత్రాలను ఆధునిక శైలిలో వేయడమేగాక రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎన్నెన్నో బహుమతులను సొంతం చేసుకున్నారు. మోడరన్ ఆర్ట్ గురించి పేర్కొంటూ ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ సరిగా వేయలేనివాడు మోడరన్ ఆర్టిస్ట్ అయిపోతే ఎలా అనేవారు. రియలిజానికి కాస్త ఎమోషన్ కలిపి కాళిదాసు కవితలా రసరమ్యంగా చిత్రించాలి అంటారాయన. పాశ్చాత్య చిత్రకళనందలి వెలుగు నీడల గురించి ప్రశ్నిస్తే క్షణం క్షణం మారేవి వెలుగునీడలు అందుకే వాటిని నేను అంతగా పట్టించుకోనని, శాంతినికేతన్ నందలి నందలాల్ బోస్ అవనీంద్రనాద టాగూర్లు భారతీయ చిత్రకళను ముఖ్యంగా వాష్ పెయింటింగ్ ను ఆధునీకరించిన రీతి తనకు నచ్చిందని ఆయన చెప్పుకునేవారు.
వలస పాలనలో మ్రగ్గిన మన దేశంలో అన్నిరంగాలపై ప్రభావం చూపినట్లే మన కళారంగంపై కూడా పాశ్చాత్య ప్రభావం దాడి చేస్తున్న క్రమంలో బెంగాల్ నందు జామినీ రాయ్, అవనీన్ద్రనాద్ టాగోర్, గగనేంద్ర టాగోర్, నందలాల్ బోస్ లాంటి చిత్రకారులు మన దైన మూలాలను చిత్రకళలో ప్రవేశపెట్టి మన భారతీయ సాంప్రదాయ కళలకు ఒక జవసత్వాలను తీసుకురావడం జరిగింది. రవీంద్రుని శాంతినికేతన్ లో నందలాల్ బోస్ శిష్యరికంలో సంవత్సర కాలం శిష్యరికం చేసిన కొండపల్లి గారిపై ఆ ప్రభావం పడకుండా ఎలాగుంటుంది ? అందుకే వారి నిండు జీవితంలో కొండపల్లి గారు జల, తైలవర్ణాలు, ప్రేస్కో, వాష్, టేన్పేరా, లాంటి వివిధ చిత్రకళా మాధ్యమాలలో భారత, భాగవత, రామాయణము లాంటి గ్రంధాల ఘట్టాలకు రూపకల్పనచేసినా, శాకుంతలం లాంటి కావ్యాలకు మరియు నన్నయ, పోతన, తిక్కన వంటి కావ్యరచయితలకు రూపకల్పన చేసినా, ప్రకృతిలోని వివిధ అందాలను ఆవిష్కరించినా, ఝాన్సీ లక్ష్మిభాయి, గాంధీ, నెహ్రు, ఇందిరా, ప్రకాశం పంతులు, రాజీవ్ గాంధిలాంటి ఎందరో దేశ నాయకుల రూపచిత్రాలను రచించినా లేదా తెలుగు సంకృతి వైభవం, హైదరాబాద్ విముక్తి సమరం లాంటి వాటిని భారీ కుడ్య చిత్రాలుగా మలిచిన, లేదా తెలుగు తల్లి చిత్రానికి రూపకల్పన చేసినా అన్నింటా ఆయా చిత్రాల రచనలో ముఖ్యముగా వ్యక్తం కావాల్సిన ఆత్మను ప్రతిబిమ్బిస్తూనే అన్నింటా ఒకవిధమైన సౌకుమార్యం, లాలిత్యం, లావణ్యం మనోజ్నత, మార్దవం, అప్రతిమాన అలంకారాలు కలిగి వీక్షకుల మానసాలకు ఉల్లాసాన్ని కలిగిస్థాయి వారి చిత్రాలు.
కేవలం చిత్రకారుడిగా మాత్రమే గాక చిత్రకళా రచయితగా కూడా వారు ఎన్నో విలువైన వ్యాసాలను రచించారు. ఆచార్య ఖండవిల్లి లక్ష్మిరంజనం గారి సంపాదకత్వంలో వెలువడిన సంగ్రహాంద్ర విజ్ఞానసర్వస్వంలో చిత్రకళా విభాగానికి వీరు సంపాదకత్వం వహించారు, జానపద కళలపై విశేషంగా కృషి చేసి తెలంగాణా నందలి కాకిపడగలను శేషగిరిరావు గారు వెలుగులోకి తెచ్చారు.
కాలం ఒక నిరంతర ప్రవాహం. ఈ ప్రవాహంలో మనిషి ఏమి చేసినా చేయకపోయినా అది సాగిపోతూనే వుంటుంది .సాధారణ వ్యక్తి జీవితం ఎలా సాగినా పర్లేదు. కాని ఒక కళాకారుడి జీవితం అలా వూరికనే నిస్సారంగా సాగకూడదు నిరంతర తపనతో కళాకారుడు కృషిచేయాలి. అలాంటి వారికి నిండయిన జీవితం కూడా భగవంతుడు ఇవ్వాలి. అలా వున్ననాడు మనిషి జీవితం నిజంగా సపలమౌతుంది. 27-01-1924 నాడు వరంగల్ జిల్లా పెనుగొండలో జన్మించిన శేషగిరిరావు గారు 2012లో దివికేగిన వరకూ తాను నమ్మిన విషయంపై అవిశ్రాంతంగా కృషి చేసి జీవితాన్ని సపలం చేసుకున్న చిత్రకళా యోగి కొండపల్లి శేషగిరిరావు గారు. అలాంటి గొప్ప కళాఋషి కి నూరేళ్ళ పండగ సందర్భంగా వారికివే నా స్మృత్యంజలి.
–వెంటపల్లిసత్యనారాయణ – ఆర్టిస్ట్, కార్టూనిస్ట్ & చిత్రకళారచయిత
(9491378313)