పింగళి నాగేంద్రరావు, మల్లాది రామకృష్ణ శాస్త్రి వంటి ఉద్దండులైన సినీ గేయకవుల సరసన చేర్చాల్సిన మరోపేరు వేటూరి సుందరరామమూర్తి. తెలుగు సినీకవులలో అత్యంత వేగంగా పాటలు రాసిన వారిలో ప్రధమ స్థానం వేటూరిగారిదే. ప్రౌఢ సమాసాలతో, శబ్దసౌందర్యానికి పెద్దపీటవేసి, పదలాలిత్యంతో పల్లవులల్లిన అభినవ శ్రీనాథుడు వేటూరి. వారిని గురించి చెప్పుకునేముందు సంగీత దర్శకుడు ఇళయరాజాతో వేటూరి గారి తొలి సమావేశపు ఉదంతాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. 1981లో కమల్ హాసన్ తొలిసారి నిర్మాతగా మారి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తమిళంలో ‘రాజా పార్వై’ చిత్రాన్ని, అదే సినిమాను తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’ గా సమాంతరంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా. వేటూరికి ఇళయరాజాతో అదే తొలి సినిమా. ఇళయరాజా సాధారణంగా దర్శకుడు చెప్పే సన్నివేశం విని, ఆ భావానికి సరిపోయే ట్యూన్ ఇస్తారు. రాజా ఇచ్చే ‘తతకారాల’కు పదాలు కూర్చి, పాట రాయాలంటే చాలా కష్టం. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. పైగా ఇళయరాజాది రాజీ పడని తత్వం. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్ కి వేటూరి వెళ్లేసరికి రాజా యిచ్చిన తమిళ ట్యూన్ కి వైరముత్తు తమిళ పల్లవి రాయడం జరిగిపోయింది. “అందిమళయ్ పొడిహిరదు…. మన్మద నాట్టక్కు మందిరియే” అనే పల్లవిని వైరముత్తు రాసిఇచ్చారు. అప్పుడే వచ్చిన వేటూరిని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇళయరాజాకి పరిచయం చేశారు. ఇళయరాజా వేటూరిని చూస్తూ “వైరముత్తు వచ్చినప్పుడే ఈ కవిగారు వస్తే బాగుండేది కదా. నేను చాలా బిజీగా వున్నాను. తమిళకవి ఇలా ట్యూన్ ఇవ్వగానే అలా పల్లవి రాసిచ్చారు. ఇప్పటికే నాకు లేట్ అయ్యింది” అంటూ సింగీతంతో పుల్లవిరుపుగా మాట్లాడారు. ప్రక్కనేవున్న వేటూరికి కోపం వచ్చింది. వెంటనే వేటూరి కల్పించుకొని “నేనూ బిజీగా వుండే కవినే! అలా మాట్లాడడం మంచి పధ్ధతి కాదు. వస్తాను. సెలవు” అంటూ లేవబోయారు. అయితే సింగీతం వేటూరిని వారించి పరిస్థితిని చక్కబెట్టారు. విషయం అర్ధం చేసుకున్న రాజా వేటూరికి ‘సారీ’ చెప్పి ట్యూన్ వినిపించారు. ‘తమిళకవి ఇలా ట్యూన్ ఇవ్వగానే అలా పల్లవి రాసిచ్చారు’అంటున్న రాజా మాటలు వేటూరికి రోషాన్ని తెప్పించాయి. వెంటనే ఇళయరాజాతో “పల్లవి రాసుకుంటారా” అన్నారు వేటూరి. రాజాకి ఆశ్చర్యం వేసింది. “ఏంటి ఇంత త్వరగా చెప్పేస్తారా! అయితే చెప్పండి” అంటున్న ఇళయరాజాకి వేటూరి ఆశువుగా ‘’సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో…మలయజ మారుత శీకరమో మనసిజ రాగ వశీకరమో’’ అంటూ పల్లవి చెప్పేశారు. వేటూరి చెప్పిన పల్లవి ఇళయరాజా వినిపించిన ట్యూన్ లో వచ్చే హ్రస్వాక్షరాలు, దీర్ఘాక్షరాలతో సహా అతికినట్టు మీటర్ కు సరిపోయింది. వెంటనే ఇళయరాజా లేచివచ్చి వేటూరిని ఆలింగనం చేసుకుంటూ “ఎంత మధురంగా వుంది పల్లవి. అందుకే మా సుబ్రమణ్య భారతి మహాకవి ‘సుందర తెలుంగు’అని ప్రశంసించా”రని కొనియాడారు. తర్వాత కాలంలో వేటూరి – ఇళయరాజా జంట కలిసి ఎన్ని సినిమాలకు ఎన్ని అద్భుతమైన పాటల్ని సృష్టించారో మీకు తెలియంది కాదు. అందుకే బాలు గారు వేటూరిని ‘‘సుందరయ్యా’’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. ‘మాతృదేవోభవ’ చిత్రంలో వేటూరి రచించిన ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాడిపోయే పువ్వా నీకు వర్ణాలెందుకే’ పాటకు జాతీయ పురస్కారం లభించింది. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో మహాకవి శ్రీశ్రీ రచించిన ‘తెలుగువీర లేవరా’ పాటకు జాతీయ పురస్కారం లభించిన తర్వాత ఆ పురస్కారం అందుకున్న తెలుగుకవి వేటూరి. ట్యూనుకి వేటూరి రాసినంత వేగంగా పాటలు రాసిన సినీ కవులు అరుదు. ఆయన వేగానికి గుర్తుగా ఒక చిన్న సంఘటన కూడా మీకు తెలియజేయాలి. ఓ రెండు చిత్రనిర్మాణ సంస్థలు హడావిడిగా రికార్డింగ్ చేయించాలని వేటూరిని యుగళ గీతం రాయమన్నారు. వేటూరి ఈ రెండు సంస్థలకు రెండు యుగలగీతాలు రాసివుంచారు. రికార్డింగ్ హడావిడిలో ఆ సంస్థల ప్రతినిధులు తీసుకెళ్లిన పాటలు ఒకదానికొకటి మారిపోయాయి. వేటూరి ఈ సంగతి గ్రహించి వాకబుచేసే సమయానికి పాటల రికార్డింగ్ జరిగిపోయింది. ఇరువర్గాలవారు ‘’పాటలు చాలా బాగా రాశారు సార్’’ అని వేటూరిని అభినందించారు. ఆలావుంటాయి వేటూరి రచనలు ఎవరికైనా ఉపయోగపడేలా! మూడు దశాబ్దాలకు పైగా సినిమా పాటలు రాసిన వేటూరి జయంతి సందర్భంగా వారిని గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం.
పత్రికారంగం నుంచి సినిమా రంగానికి…
వేటూరి గారు పుట్టింది జనవరి 29, 1936లో కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి గ్రామంలో. ఒకప్పుడు ఆ గ్రామం బౌద్ధమతానికి ప్రధాన కేంద్రంగా భాసిల్లింది. వేటూరి తల్లిదండ్రులు కమలాంబ, చంద్రశేఖరశాస్త్రి. ప్రముఖ సాహిత్య పరిశోధకులు వేటూరి ప్రభాకరశాస్త్రి సుందరరామమూర్తికి వరసకు పెదనాన్న. తల్లిదండ్రులే వేటూరికి ప్రధమ గురువులు. విజయవాడలో వేటూరి బి.ఏ చదువుతున్నప్పుడు ఆయన గురువు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన శిష్యరికంలో తెలుగు సాహిత్యం మీద వేటూరికి మంచి పట్టుదొరికింది. వేటూరికి మద్రాసు నగరంతో అవినాభావ సంబంధముంది. ఆయన ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించింది మద్రాసులో. న్యాయశాస్త్రం కూడా అక్కడే చదివారు. అయితే పట్టా పుచ్చుకోలేదనుకోండి. తరవాత ఆంధ్రప్రభ కార్యాలయంలో పాత్రికేయునిగా వ్యవహరించారు. ఆంధ్రప్రభ కార్యాలయాన్ని విజయవాడకు మార్చినప్పుడు, వేటూరి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో సహాయ సంపాదకునిగా చేరారు. 1961లో ఎన్.టి.రామారావు ‘సీతారామకళ్యాణం’ సినిమా నిర్మించినప్పుడు ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ‘రామారావణీయం…సీతారామకల్యాణం’ అనే మకుటం పెట్టి ఆ సినిమాకు సమీక్ష రాశారు. అందులో రామకథకు మాతృకగా భాసిల్లే రామాయణ కావ్యాన్ని విధిగా అనుకరించి వుంటే ఉత్తమంగా, సముచితంగా వుండేది అని నిష్కర్షగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ విషయం ఎన్.టి.ఆర్ దృష్టికి వెళ్లింది. వేటూరి గురించి ఆయన వాకబు చేశారు. తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పినందుకు అభినందించారు కూడా. 1969లో ‘ఆంధ్ర జనత’ పత్రికకు సంపాదకునిగా వ్యవహరిస్తున్నప్పుడు ‘సిరికాకొలను చిన్నది’ అనే రేడియో నాటకాన్ని రాయడం జరిగింది. వేటూరి సినిమారంగానికి పరిచయం కావడానికి ఈ నాటకం ఒక ఉపకరణమయింది. ఆ రేడియో నాటక ప్రభావంతో దర్శకులు విశ్వనాథ్ వేటూరిని జూలై 1974లో ‘ఓ సీత కథ’ చిత్రం ద్వారా గేయకవిగా పరిచయం చేశారు. అందులో వేటూరి ‘భారత నారీ చరితము, మధుర కథాభరితము’ అనే హరికథను రాశారు. తర్వాత విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సిరిసిరిమువ్వ’ సినిమాలో పాటలన్నీ వేటూరిగారే రాశారు. అందులో ‘’ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈవేళా, చెలరేగింది ఒక రాసలీలా’’ పాటతోబాటు అన్నీ పాటలూ హిట్టే. దాంతో వేటూరి రచనాశైలి ప్రేక్షకులకు తెలిసింది. పి. సుశీలకు ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని బహుమతి తెచ్చిపెట్టింది. ఇందులోనే ‘’రా దిగిరా దివినుచి భువికి దిగిరా’’ అనే పాట పుట్టుకకు ఒక నేపథ్యం వుంది. చెన్నై లోని విశ్వనాథ్ గారి ఇంటిలో వేటూరి కూర్చున్నప్పుడు ఈ పాట నేపథ్యం చాలా ఆవేశపూరితంగా వుండాలని వేటూరిని విశ్వనాథ్ రెచ్చగొట్టారు. వేటూరి రెచ్చిపోయి ఈ పాటను ఆశువుగా చెబుతూవుంటే విశ్వనాథ్ గారే స్వయంగా పాటను రాసుకొని, దానిని కుదించి, మహదేవన్ చేతిలో పెట్టారు. ఈ సినిమాలో పాటలు సూపర్ హిట్ అవడంతో వరసగా బాపు చిత్రం ‘భక్త కన్నప్ప’, రాఘవేంద్రరావు చిత్రం ‘అడవిరాముడు’ తో వేటూరి అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. వేటూరి పాటలు రాసిన ఆఖరి సినిమా 2010 లో వచ్చిన ‘విలన్’. మొత్తం మీద వేటూరి సుమారు ఐదు వేల పాటలు రాశారు. ఇంత పెద్ద సంఖ్యలో పాటలు రాసిన తెలుగు గేయకవులు లేరనే చెప్పాలి.
పాటల పల్లకిలో వేటూరి…
‘శంకరాభరణం’ చిత్రంలో ‘’దొరకునా ఇటువంటి సేవ’’ అనే పాట అంటే వేటూరి కి చాలా ఇష్టం. ఈ పాటనుగురించి ఒకానొక సందర్భంలో ‘’జీవితాన్ని వ్యాఖ్యానించి, శరీరాన్ని ఒక విపంచిగా భావించి, ఒక్కోసారి తాత్విక దృష్టితో జీవితాన్ని వ్యాఖ్యానించడానికి ఉన్నది వున్నట్టు అనుకుంటూ రాశానా అనిపించేలా ఈ పాట నా మనసును కదిలించింది’’ అని వేటూరి స్వయంగా చెప్పుకున్నారు. శంకరాభరణంలోని పాటల సాహిత్యం గురించి విశ్వనాథ్ మాట్లాడుతూ ‘’ఇలా చెబితే అలా అల్లుకుపోయే తత్వం వేటూరిది. అన్నిరకాల పాటలు రాయగల సవ్యసాచి వేటూరి. ఆయనకు సంగీత జ్ఞానం వుంది. అది సంగీత దర్శకునికి ఎంతో ఉపకరిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. శంకరాభరణంలో ‘’దొరకునా ఇటువంటి సేవ’’, ‘’బ్రోచేవారెవరూరా’’ పాటలు ఆలపించిన వాణీ జయరాం కు ఉత్తమగాయనిగా, ‘’ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము’’ పాటను ఆలపించిన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకుడుగా, ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించిన కె.వి. మహదేవన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమచిత్ర నిర్మాతగా ఏడిద నాగేశ్వరరావుకు నాలుగు జాతీయ బహుమతులు రావడం విశేషం. ‘శంకరాభరణం’ సినిమా ముహూర్త సమయంలో విశ్వనాథ్ దేవుని పటం ముందు మూడుకొబ్బరికాయలు వుంచి, అక్కడ వున్న మహదేవన్, వేటూరి, జంధ్యాల చేతుల్లో వాటినిపెట్టి ‘’నా చిత్రానికి మీరే నాయికానాయకులు. మీమీద నమ్మకముంచి ఈ చిత్రం తీస్తున్నాను. ఇందులో హీరో అరవై యేళ్ళ వృద్ధుడు. హీరోయిన్ లేదు. ఇక మీదే బాధ్యత’’ అంటూ వారిచేత కొబ్బరికాయలు కొట్టించారు. ఆరోజు వేటూరి సినిమా టైటిల్ గీతాన్ని రాయగా మహదేవన్ దేవగాంధారి, కాంభిజి రాగాల్లో స్వరపరచడం విశేషం. ‘’ఉఛ్వాశ, నిశ్వాసములు, వాయులీనాలు… స్పందించు నవనాడులే వీణాగానాలు, నడలు, ఎదలో సడులే మృదంగాలు… నాలోని జీవమై, నాకున్న దైవమై వెలుగొందువేళా మహానుభావా‘’ అంటూ రాయగల సినీకవులను వ్రేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అందుకే వేటూరి రచనాశైలి దర్శకుల అభిరుచిబట్టి వుంటుంది. కృష్ణంరాజు నటించిన బాపు చిత్రం ‘భక్తకన్నప్ప’లో ఒక పాటను గురించి ఇక్కడ ఉదహరించాలి. శ్రీనాథుడు రచించిన హరవిలాసం లోని కిరాతార్జునీయ ఘట్టం నేపథ్యంలో వేటూరి ఒక పాటను అత్యద్భుతంగా మలచారు. శ్రీనాధుడు రచించిన ‘’వికటపాటల జటా మకుటికా భారంబు కరుకైన జుంజురు నెరులుగాక’’ అనే పద్యాన్ని స్పూర్తిగా తీసుకొని తనదైన శైలిలో వేటూరి ‘’నెలవంక తలపాగ నెమలి ఈకగ మారె… తలపైన గంగమ్మ తలపులోనికి జారె… నిప్పులుమిసే కన్ను నిదురోయి బొట్టాయె… బూదిపూతకు మారు పులితోలు వలువాయె… ఎరుక గలిగిన శివుడు ఎరుకగా మారగా … తల్లి పార్వతి మారె తాను ఎరుకతగా’’ అంటూ వాడుక భాషలో పాటను రాశారు. వేటూరికి తెలుగంటే మమకారం. అయితే వేటూరి తన పాటల్లో సంస్కృత సమాసాలు కూడా వాడారు. అవి చాలా గంభీరంగా కూడా వుంటాయి. ‘సాగర సంగమం’లో ’’ఓం నమశ్శివాయ చంద్రకళాధర సహృదయా’’ పాటలో ‘’త్రికాలములు నీ నేత్రత్రయమై, చతుర్వేదములు ప్రాకారములై, గజముఖ షణ్ముఖ ప్రమాధాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై, అద్వైతమే నీ ఆదియోగమై, నీ లయలే ఈ కాలగమనమై, కైలాస గిరివాస నీగానమే జంత్రగాత్రముల శ్రుతి కలయా’’ అంటూ వర్ణించడం ఒక్క వేటూరికే చెల్లింది అనడంలో అతిశయోక్తి లేదు. శివ స్వరూపానికి వేటూరి ఇచ్చిన విశ్లేషణ మనం మరెక్కడా చూడం. కె.విశ్వనాథ్ సినిమా ‘సప్తపది’లో సంస్కృత పదాలతో ‘అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీం’ పాటను గురించి చెప్పుకుందాం. పార్వతీ దేవిని ‘‘శుభగాత్రి గిరిరాజపుత్రీ, అభినేత్రి శర్వార్ధగాత్రీ, సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తీ’’ అంటూ కీర్తించారు. ఇందులో శర్వార్ధగాత్రి అంటే శివునిలో అర్ధభాగం అని, సర్వార్ధ సంధాత్రి అంటే సకల కార్యాలను నెరవేర్చే శక్తి స్వరూపిణి అని వేటూరి భావం. ఇక రెండవచరణంలో మహాలక్ష్మీదేవిని కీర్తించారు. ‘’శ్రీపాద విచలిత, క్షీరాంబురాశీ, శ్రీపీఠ సంవర్ధినీ, డోలాసుర మర్దినీ’’ అంటూవర్ణించారు. మూడవ చరణంలో సరస్వతీదేవిని అద్భుతంగా వర్ణించారు. ‘’ఇందువదనే, కుందరదనే వీణా పుస్తక ధారిణే అంటూ… సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే’’ అన్నారు. అంటే సంగీతము, సాహిత్యము లను రెండు వక్షోజాలుగా కలిగిన తల్లి అనే అర్ధంలో ఈ చరణం రాశారు. ఇక చివరి చరణాన్ని ముగురమ్మల మూలపుటమ్మ గురించి ’హే బ్రహ్మచారిణే, దుష్కర్మ వారిణే’, హే విలంబితా కేశపాశినే, మహిషమర్దన శీల, మహిత గర్జనలోల, భయద నర్తనకేళికే… కాళికే’’ అంటూ వర్ణించడం వేటూరికే సాధ్యం. ‘సప్తపది’ చిత్రంలో ‘’ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు నీ కులమే లెమ్మంది’’ అనే పాటలో ‘’ఆదినుంచి ఆకాశం మూగది… అనాదిగా తల్లి ధరణి మూగది, నడుమవచ్చి ఊరుముతాయి మబ్బులు… ఈ నడమంత్రపు మనుషులకే మాటలు’’ అంటూ ఎప్పుడో విద్యార్థి దశలో రాసుకున్న భావగీతం విశ్వనాథ్ కు నచ్చడంతో, సన్నివేశాన్ని సృష్టించి ఈ పాటను వాడుకున్నారు. సందర్భోచితంగా పాటరాయడం వేటూరి గొప్పతనానికి నిదర్శనం. అలాగే ‘భైరవద్వీపం’ చిత్రంలో ‘’శ్రీతుంబుర నారద నాదామృతం, స్వరరాగ రసభావ తాళాన్వితం’’ పాటలో సింహభాగం సంస్కృత సమాసాలే!”. చిరంజీవి సినిమా ‘ఛాలెంజ్’ లో సంస్కృత సమాసాలతో కూడిన ‘’ఇందువదన, కుందరదన, మంద గమన, మధురవచన, గగన జఘన సొగసు లలనవే’’ పాటను రాశారు. నాయికను వర్ణిస్తూ చంద్రబింబం వంటి ముఖ వర్చస్సు, మల్లెపూల వంటి పల్వరస, సుతారపు నడక, మధురమైన భాష కలిగిన చిన్నదానా నీకు ఆకాశమంతటి విశాలమైన కటి ప్రదేశం వున్నది అంటూ వేటూరి తనదైన శైలిలో చమత్కరించారు. అలాగే ‘గీతాంజలి’ సినిమాలో ‘’ఆమనీ పాడవే హాయిగా, మూగవైపోకు ఈ వేళా’’ అనే పాటలో ‘’వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా, మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా’’ అంటూ ఎండమావి నిరాశను రాసినట్లు పోలుస్తూ లోతైన భావాన్ని వ్యక్తీకరించారు. ఇక సమాసాలు పొసగని పదాలకు సమాసాన్ని కలుపుతూ దుష్టసమాసాలను కూడా వేటూరి యాదేచ్చగా వాడారు. నియమాలకు వ్యతిరేకంగా తెలుగు పదాలను సంస్కృత పదాలను కలిపేస్తూ పాటలు కూడా రాశారు. అడవిరాముడు చిత్రానికి సింగిల్ కార్డ్ పాటల రచయిత వేటూరి గారే. అందులో ‘’ఆరేసుకోబోయి పారేసుకున్నావు హరీ’’ అనే పాటను ఆరోజుల్లో కోటి రూపాయల పాట అని చెప్పుకునేవారు. ‘ప్రేమించు-పెళ్ళాడు’ చిత్రంలో ‘’నిరంతరమూ వసంతములే, మందారముల మరందములే’’ అనే పాటలో ఋతువులు మారిపోతున్నా ప్రేమికులకు మాత్రం అన్ని రుతువులూ వసంత ఋతువులే అంటూ ఓ మంచి పాటను రాశారు. అగ్నిపత్రాలు వ్రాసి గ్రీష్మరుతువు సాగిపోగా, మెరుపు లేఖలు వ్రాసి మేఘం మూగవోయిందట. మంచు ధాన్యాలు కొలిచి పుష్యం వెళ్లిపోతే, మాఘమాసంలో అందమే అత్తరయిందట. ఇలావుంటాయి వేటూరి మధురిమలు. అలాగే ‘ఆఖరి పోరాటం’ చిత్రంలో ‘’ఆషాఢం ఉరుముతువుంటే, నీ మెరుపే చిదుముకున్నా… హేమంతం కరుగుతూ వుంటే, నీ అందం కడుగుతున్నా’’ అని కూడా ఋతువుల పనిపట్టారు. 1979లో వచ్చిన కె. రాఘవేంద్రరావు సినిమా ‘వేటగాడు’ లో వేటూరి మొత్తం 7 పాటలు రాశారు. వాటిలో ‘’ఆకు చాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే … ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది’’ అని ఎన్.టి.ఆర్, శ్రీదేవి కోసం ఒక రెయిన్ సాంగ్ కు పల్లవి రాశారు. దీనికి సెన్సారు వారు అభ్యంతరం పెట్టారు. అప్పుడు…. ఆ పల్లవిని ‘’ఆకు చాటు పిందె తడిసే, కొమ్మమాటు పువ్వు తడిసే…’’ అని మార్చారు. చూడండి వేటూరి చతురత. ఇది వానపాట కావడంతో చినుకు అనే పదంతో వేటూరి ఆడుకున్నారు. ‘’ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే, చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే, ఓ చినుకు నిను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నీ మెడలో నగలాగా నవుతుంటే, నీ మాట విని మబ్బు మెరిసి జడివాన కురిసిందని రాస్తూ… మరొక చరణంలో ‘మెరుపు’ అనే మాటతో ఆటాడుకున్న చతురుడు వేటూరి. అందులోనే ‘’జాబిలితో చెప్పనా జాము రాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా’’ అనే పాటలో ‘’తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు’’ అంటూ తుంటరి వాక్యం కూడా రాశారు. ‘గోరింటాకు’ చిత్రంలో ‘’కొమ్మకొమ్మకో సన్నాయి’’ అనే పాట ఎంతో పాపులర్ పాట. ఈ పేరుతోనే వేటూరి సినీ ప్రముఖుల మీద వ్యాస సంకలనాన్ని వెలువరించారు. ‘మేఘసందేశం’ చిత్ర పాటల కంపోజింగ్ మైసూరు లలిత్ మహల్ రాజభవనంలో జరిగినప్పుడు, సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు ఒక పాటకు స్వరాలు అల్లుతున్నారు. వేటూరి పాలెస్ ఆవరణలో పచార్లు చేస్తుండగా వర్షం ఆరంభమై చిరుజల్లులతోబాటు, చల్లటి గాలి వీచసాగింది. ఆ నేపథ్యంలో పుట్టిందే ‘’ఆకాశ దేశాన ఆషాడ మాసాన మెరిసేటి ఓ మేఘమా… విరహమో దాహమో విడలేని మోహమో… వినిపించు నా చెలికి మేఘసందేశం’’ అనే టైటిల్ సాంగ్. వేటూరి సాహితీ సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే క్లుప్తంగా కొన్ని పాటలు గుర్తుచేయాలి. ‘మల్లెపూవు’ చిత్రంలో ‘’ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులని, ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని’’; ‘ముద్దమందారం’ లో ‘’ముద్దుకే ముద్దొచ్చేమందారం, మువ్వల్లే నవ్వింది సింగారం’’ పాటలో ‘’మల్లెపువ్వా కాదు మరుల మారాణి, బంతిపూవా కాదు పసుపు పారాణి… పరువాల పరవళ్ళు పరికిణీ కుచ్చిళ్లు, కన్నెపిల్లా కాదు కలల కాణాచి’’ అని రాసిన విధానం; ‘మేఘసందేశం’ లో ‘’పాడనా వాణి కల్యాణిగా’’ పాటలో ‘’నా పూజకు శార్వాణిగా, నా భాషకు గీర్వాణిగా, శరీర పంజర స్వరప్రపంచక మధుర గాన శుకవాణిగా’’ అంటూ కల్యాణి రాగంలో రమేశ్ నాయుడు స్వరపరచేలా రాయడం; ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలో దేవకన్య ఇంద్రజ భూలోకంలో అడుగిడుతూ భూలోకపు అందాలను వర్ణించే ‘’అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం, పువ్వు నవ్వు పులకించే గాలిలో… నింగీ నేలా చుంబించే గాలిలో ఆనందాల సాగే విహారమే’’ పాట వినోదయాత్రకు వచ్చినట్లు వర్ణించిన వేటూరీ… సాహో … ‘ఇంటింటి రామాయణం’ సినిమాలో ‘’వీణ వేణువైన సరిగమ విన్నావా… తీగ రాగమైన మధురిమా కన్నావా, తనువు తహతహలాడాల, చెలరేగాల, చెలి ఊగాల ఉయ్యాల ఈవేళలో’’ కూడా ఒక అద్భుతమైన భావగీతం. వేటూరి రాసిన వేనవేల పాటల్లో ఎన్నింటిని ఉదహరిచగలం! అందుకే మన్నించాలి.
వీటూరి నాణేనికి మరో కోణం…
సముద్రాల రాఘవాచార్యులు, మల్లాది రామకృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ, పింగళి నాగేంద్రరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి తొలి స్వర్ణ యుగం గేయకవులు సాంప్రదాయబద్ధంగా పాటలు రాశారు. నవరసాలలో శృంగారం కూడా భాగమే… వీరందరూ శ్రుతిమించని శృంగారాన్ని నర్మగర్భంగా తమ పాటల్లో వినిపించారేగాని, ఎప్పుడూ తమ స్థాయిని తక్కువచేసుకోలేదు. వారి తరవాత వచ్చిన కొత్తకవులు నిర్మాత, దర్శకుల కోరికల మేరకు శృంగార గీతాలను కాస్త శ్రుతిమించి నగిషీలు చెక్కారు. ఎవరైనా ఎందుకు ఇలా రాశారని ప్రశ్నిస్తే ‘’మా జీవన భృతి గేయరచనే కాబట్టి నిర్మాతలు చెప్పినట్లు రాయాల్సిందే. మేము కాకుంటే మరొకరు రాస్తారు’’ అంటూ నిర్మాతలమీద నెట్టివేయడం పరిపాటి. ఈ రాసలీల పాటలు సినిమాలను గట్టెక్కిస్తాయనుకోవడం దురాశే అవుతుంది. అలాగే పచ్చి శృంగారాన్ని పాటల్లో జొప్పిస్తే సినిమాలు బాగా ఆడతాయనే ఆలోచనలు నేటితరం నిర్మాతలకు వుండడం శోచనీయం. అయినా పాటల్లో వున్న శ్లేష సంభాషణాల్లో వుండవెందుకు? ఆచార్య ఆత్రేయ, దాశరథి, వేటూరి వంటి నిబద్ధతగల కవులు కూడా ఈ చట్రంలో చిక్కుకోవడం మన దురదృష్టం. చెప్పడానికే జుగుప్సాకరంగా వుంటుంది. శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సప్తపది, సాగరసంగమం, సీతాకోకచిలుక వంటి సినిమాలలో పాటలు రాసిన వేటూరి గారికి అసభ్యకరమైన శృంగార పాటలు రాయడం అవసరం కాదని నా భావన. ఉదాహరణకు 1992 లో విడుదలైన ‘ధర్మక్షేత్రం’ సినిమాలో హద్దులు దాటిన అశ్లీల శృంగార పాటల వరసలు వింటే జుగుప్స కలుగుతుంది. ‘’ముద్దుతో శృంగార బీటు కొట్టగానే చీరలో మూరకో చిటపట… ఎంగిలే సంపెంగ రంగులేయగానే ఎందుకో ఏమిటో అలసట… ఆషాఢ మాసమో అందాల మోసమో అబ్బాయి కోసమో ముగ్గుబిళ్ళ జారిపోయే’’ అనేది ఒక పాట. అదే చిత్రంలో ‘’ప్రియరతిలో రాగం జతలో తాళం, ఎదలో బంధం, పొద సంబంధం లవ్ మీ’’. మరొక పాటలో ‘’దో బూచీ దొబ్బుడాయ్, ఫోఫో ఛీ బొమ్మిడాయ్… గిలిగుంటే గిల్లి చూడు’’ … అదే సినిమాలో ‘’ఏకాంతం సాక్షిగా, ఏమాత్రం దాచక, ఇస్తాగా నిక్షేపంగా… ఆసాంతం వెచ్చగా, ఆశంతా తీర్చగా వస్తాగా ప్రత్యేకంగా’’ …మరొక పాటలో వేటూరి శ్రుతి మించిన శృంగారపు సాహిత్యం ‘’ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదీ వెనెలమ్మా… ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా…గట్టి వత్తిళ్ళకోసం గాలి కౌగిళ్లు తెచ్చా, తొడిమ తెరిచే, తొనల రుచికే ఒహోహో’’ అనేవి. వేటూరి మరో కోణం కూడా మనకు తెలియాలి అనే వీటిని ఉదహరించాల్సివచ్చింది! అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మాత్రం తన నిర్మాతలకు ముందే పచ్చి శృంగారపు పాటలు తను రాయనని, తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు.
కొస మెరుపు…
‘ప్రతిఘటన’ చిత్రంలో సినిమా మొత్తానికే ఆయువుపట్టు వంటి, నిప్పుల ఉప్పెనలాంటి పాటను వేటూరి అందించారు. ‘’ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో… మరో మహా భారతం, ఆరవ వేదం’’ అనే ఈ పాట నిజానికి ముందు అనుకోలేదు. ఈ పాట స్థానంలో సంభాషణలు రాశారు. వాటి శక్తి చాలదని, పాట రూపంలో చెబితే బాగుంటుందని వేటూరి చెబితే, రామోజీరావు ‘’సరే రాయండి. చూద్దాం’’ అన్నారట. పాట మొత్తం చదివాక అద్భుతమనిపించి రికార్డింగ్ చేశారట. జాతీయ బహుమతి రావలసిన ఈ పాట నంది పురస్కారంతో సరిపెట్టుకుంది. ‘’కృషి వుంటే మనుషులు ఋషులౌతారు, మహాపురుషులౌతారు’’ అని సందేశం ఇచ్చిన ఆ మహనీయునికి నీరాజనాలు!
–ఆచారం షణ్ముఖాచారి