సంప్రదాయ చిత్రకళకు ప్రతీకలు ‘మాశ్రీ’ చిత్రాలు

‘మాశ్రీ’ అన్నది మారేమండ శ్రీనివాసరావు గారి కుంచె పేరు. ఈయన గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో మారేమండ హనుమంతరావు, శకుంతలమ్మ గార్లకు మార్చి 13, 1938 లో జన్మించారు. బాల్యంలో కొలకలూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివారు. చిత్రలేఖనంలో డిప్లమో కోర్సు అప్పట్లో మద్రాస్ లో పూర్తి చేసేవారు. ‘మాశ్రీ’ చిత్రలేఖనం డిప్లమో కోర్సుని ప్రముఖ చిత్రకారులు మరియు చిత్రలేఖన ఉపాధ్యాయులు కీర్తిశేషులు గన్నే వెంకటేశ్వరరావు గారు దగ్గర శిక్షణ తీసుకుని డిప్లమోను పూర్తి చేశారు. గుంటూరు హిందూ కళాశాలలో బి.ఏ. ఇంగ్లీష్ సాహిత్యం, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు సాహిత్యం పూర్తి చేశారు.

1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియామకంతో ఆడిటర్ గా ఉద్యోగంలో చేరారు. శ్రీమతి వాణి గారిని జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. ఈయన దాదాపుగా 20 సంవత్సరాలు శ్రీశైలం దేవస్థానంలో పనిచేశారు.
అదే సమయంలో ఉద్యోగం చేసుకుంటూ చిత్రలేఖనాన్ని మరువకుండా మిగిలిన సమయాన్ని చిత్రలేఖనానికి కేటాయించేవారు. అలాగా ఎన్నో చిత్రాలను చిత్రించారు. ఈ చిత్రించిన చిత్రాలు దినపత్రికలు వారపత్రికలు మాస పత్రికలలో ప్రచురితమయ్యేవి. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ప్రముఖ చిత్రకారులు వెల్లటూరి పూర్ణానంద శర్మ గారి చిత్రాలు ఒక మాసం, ఒక వారం ప్రచురితమైతే తదుపరి ప్రచురణ ఈయన చిత్రాలు ఉండేవి. పురాణాలు మన సంస్కృతి జీవన విధానాలు వీటి గురించి మరియు శ్రీశైలప్రభ పత్రికలో చాలావరకు ముఖచిత్రాలు ఈయన చిత్రించిన చిత్రాలే. ఇక చిత్రలేఖనము కాకుండా సాహిత్యంలో కూడా చాలా దూసుకుపోయారు. గేయాలు పాటలు వ్యాసాలు కథలు రాశారు. అప్పట్లో ఆకాశవాణి విజయవాడ, కడప, కర్నూలు, విశాఖ కేంద్రాలుగా ప్రసారం అయ్యేవి. ఇందులో బాల సాహిత్యం అన్న కార్యక్రమంలో దాదాపుగా 50 పాటలు వ్రాశారు. యువవాణి కార్యక్రమంలో హరివిల్లు అన్న పాట అప్పట్లో ఎంతో ప్రజాదరణ పొందింది. ఇలా దాదాపుగా ఆకాశవాణి రేడియో కేంద్రంతో మంచి అనుబంధం ప్రజాదరణ పొందిన మహా వ్యక్తి ‘మాశ్రీ’ గారు. ఇక చిత్రలేఖన విషయంలో తన చిన్నతనంలో 1953లో ఒక చిత్రాన్ని చిత్రింస్తే అప్పట్లో ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమయింది. చిత్రించిన చిత్రం పేరు కష్టజీవి. అలాగా ఎన్నో చిత్రాలను పత్రికలలో ప్రచురితమయ్యాయి.

ఇక వృత్తిరీత్యా శ్రీశైలంలో ఉండటం వల్ల అది రాయలసీమ ప్రాంతం కనుక ఆ ప్రాంతంలో దాదాపుగా 20 కి పైగా వన్ మెన్ షోలు అక్కడే చేయటం జరిగింది. అప్పటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిచే ప్రశంసా పత్రం అందుకున్నారు. 1975లో నిర్వహించిన తెలుగు మహాసభలలో ‘అన్నమాచార్య’ నిలువెత్తు తైలవర్ణ చిత్రానికి కాసు బ్రహ్మానంద రెడ్డి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నారు. 1981లో 88 మంది చిత్రకారులతో 111 చిత్రాల ప్రదర్శన నిర్వహించారు. అందులో వీరు చిత్రించిన జాయ్ రైడ్ అనే చిత్రానికి బహుమతికి ఎంపిక అయినది. 1982లో హయగ్రీవాచారి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన భాగవత చిత్రాలలో వరాహమూర్తి చిత్రానికి పీవీ నరసింహారావు గారి చేతులమీదుగా బహుమతి అందుకోవటం జరిగినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎంబ్లమ్(లోగో) శ్రీనివాసరావు గారు రూపొందించి, 1986లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారితో సన్మానం కూడా అందుకున్నారు.


ఇలాగా ఎన్నో బిరుదులు సన్మానాలు పొందారు. లలిత కళా అకాడమీ సభ్యులుగా కూడా పనిచేశారు. 1998 లో పదవీ విరమణ పొంది, గుంటూరు బ్రాడీపేటలోని స్వగృహంలో వుండేవారు. ఆరోగ్యరీత్యా పెరాల్సిస్ రావడం వల్ల చేయి సహకరించకపోవడంతో చిత్రకళకు దూరంగా వున్నారు. 2022లో వారి కుమారులు హైదరాబాద్ తీసుకువెళ్లారు. ఇలా జీవనం సాగుతుండగా ఆరోగ్యం విషమించి, ఫిబ్రవరి 6, 2024న ‘మాశ్రీ’ గారు శివైక్యం పొందారు. ఆయన మరణించిన… ఆయన చిత్రించిన చిత్రాలతో చిరకాలం జీవించి ఉంటారు. అందుకే ఇంగ్లీష్ కవి అన్నారు ‘లైఫ్ ఈజ్ షార్ట్ – ఆర్ట్ ఈజ్ లాంగ్ ‘ అని అన్నారు. ఇది అంతా కూడా సామాన్యమైన మానవులకు సాధ్యపడదు, కటోర శ్రమ చేసే పనిలో తన్వయత్వం పొందటం సాధించాలనే పట్టుదల ఇవన్నీ నిండుగా ఉన్నందువల్ల చదువులోనూ, సాహిత్యంలోనూ, చిత్రకళ రంగంలోనూ పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇన్ని రంగాలలో ప్రవేశం ఉన్న వారిని బహుముఖ ప్రజ్ఞాశీలురు అని కొనియాడుతారు. ఈరోజు ఆయన జన్మదినం కనుక వారికి జన్మదిన నివాళి.

మల్లికార్జునాచారి

1 thought on “సంప్రదాయ చిత్రకళకు ప్రతీకలు ‘మాశ్రీ’ చిత్రాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap