శ్రీమతి ఉష.యస్. రావు గారు, నివాసం విజయపురి, తార్నాక, సికింద్రాబాద్.
గవర్నమెంటు మ్యూజికల్ కాలేజీ, రాంకోఠి, హైదరాబాద్ లో అయిదు సంవత్సరాల కర్ణాటక వోకల్ హిందుస్థానీ (సితార) ఇనుస్ట్రూమెంట్ లో పూర్తి చేసారు. అంతేకాదు ఎంబ్రాయిడరీ పనిలో దాదాపుగా 25 వర్క్ లు చేసారు.
1964 లోనే ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇంగ్లీషు భాషలో యమ్.ఎ. లిట్రేచర్ చేసారు. వృత్తిపరంగా నారాయణగూడ, రెడ్డి కాలేజీలో లైబ్రరియన్గా పది సంవత్సరాలపాటు ఉద్యోగంచేసారు. ప్రవృత్తి పరంగా కళాకారిణి. 1965 సంవత్సరంలో, అంటే 22 సంవత్సరాల వయసులోనే “కళా ప్రవేశం” చేసారు. కాని దాదాపుగా 45 సంవత్సరాలుపాటు అనుకోని అవాంతరాలువల్ల గ్యాప్ తీసుకొని, మళ్లీ ఆర్ట్ ను కొనసాగిస్తున్నారు. అయినా ఆర్ట్ కు సంబంధించిన ఎలాంటి చదువులు, కోర్సులు చేయలేదు. కాని ఏడున్నర సంవత్సరాలుపాటు కీ.శే.రాజేశ్వర్ గారి దగ్గర చిత్రకళలో శిక్షణ తీసుకున్నారు. ఓ రకంగా రాజేశ్వర్ గారే తన గురువుగారే అన్నారు.
ఇష్టమైన రంగంలో రాణిస్తూ, ఇంతకాలం కళాకారిణిగా కొనసాగించడం, నా పూర్వజన్మ సుకృతం అంటున్నారు పరిపూర్ణ సంతృప్తితో. ఎప్పుడయితే మనం కళపై దృష్టి పెడితే కళారంగం మొత్తం మనవైపు దృష్టి పెడుతుందని వివరించారు ఉషా గారు. చిత్రకళలో ప్రవేశం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు రమారమి 75 కు పైగానే పేయింటింగ్స్ చేసారు. తన ఫ్రెండ్స్ ద్వారా 15-16 పేయింటింగ్స్ సేల్ అయ్యావని, అవి UK, Canada, England, & USA వివిధ స్టేట్స్ లలోను, బాంబే, బెంగళూర్ మరియు హైదరాబాద్ లలో వున్నాయని, మిగతావన్నీ తన దగ్గరే వున్నాయని వివరించారు. ఇకమీదట నా ప్యింటింగ్స్ అమ్మే ప్రశక్తే లేదని, కేవలం నా తృప్తి కోసమే చేస్తున్నానని చెప్పారు. అవన్నీ ఆయిల్ కలర్స్, పెన్సిల్ తోనే చేసారు.
- స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్, హైదరాబాద్ లోను,
- లైన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ చిలుమూరులోను,
- శ్రీ అజంతా కళారామం తెనాలిలోను,
- కోనసీమ చిత్రకళా పరిషత్ అమలాపురంలోను,
- ఆర్ట్స్ ఫెస్ట్ హైదరాబాద్ లోను,
- రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లోను,
- రాగా (రామం ఆర్ట్ ఘర్), సికింద్రాబాద్ లోను గ్రూప్ ప్రదర్శనలలో పాల్గొన్నారు.
అలాగే ఎన్నో అవార్డులు అందుకున్నారు. పలు సన్మానాలు కూడా జరిగాయి. ఈ చిత్రకళలో నూటికి నూరు శాతం సంతృప్తి చెందుతున్నా, “సంగీతంలో గల రాగాలకు” కాన్వాస్ పై పేయింటింగ్స్ ద్వారా చేయాలన్న ఆలోచన వుంది. వయసురీత్యా చేయలేక పోతున్నానని మాత్రం అసంతృప్తిగానే మిగిలిపోయింది.
చివరిగా “చాలా కష్టపడితే గాని పైకి ఎదగటానికి అవకాశముంది. కళారంగం ఓ తపస్సు లాంటిదని” వివరించారు శ్రీమతి ఉష.యస్.రావు గారు.
డా. దార్ల నాగేశ్వర రావు