“వపా ఒరిజినల్స్ చూడాలనివుంది”

దీపావళి వస్తోందంటే అందరికీ బాణాసంచా మీద ధ్యాస. నాకేమో యువ ప్రత్యేక సంచిక మార్కెట్లోకి ఎప్పుడొస్తుందా అని ఆతృత. మా పెద్దక్క పత్రికలన్నీ కొనేది. వాటిలో బొమ్మలగురించి పెద్దకబుర్లేమీ చెప్పేవారు కాదు. దీపావళి యువలో ‘వపా’ బొమ్మలు చూసి ఇంటిల్లిపాదీ తన్మయత్వం చెందేవారు. అలా అలా వపాగారి బొమ్మలంటే చిన్నప్పటి నుండీ ఆరాధన మొదలైంది. కానీ కలెక్షన్ చేయాలనీ తెలీదు. మా అక్క పెళ్ళయ్యాక లైబ్రరీకెళ్లి చూసేవాణ్ని. మళ్లీ మళ్లీ చూడాలని వెళ్తే కొన్ని బొమ్మలు వుండేవి కావు. ఎవరో తస్కరించేవాళ్లు !

పెద్దయ్యాక ఈనాడులో చేరాక తప్పనిసరిగా యువలు కొని బొమ్మలు జాగర్త చేసేవాణ్ని. యువ మాసపత్రికలో నాలుగు కవర్ బొమ్మలుండేవి. అప్పటికి బొమ్మలమీద అవగాహన రావటంతో ఆ బొమ్మలు చూసి అబ్బురపడేవాణ్ని. మాసపత్రికలో వపాగారు నలుపు తెలుపులో వేసిన బొమ్మలకి ఆయన కలర్ సజెషన్ క్లిష్టంగా ఇచ్చేవారు. అలా ఎవరూ వేసేవారు కాదు. ప్రింటింగ్ సెక్షన్ ఆర్టిస్టులు మంచి అవగాహనతో చక్కగా ప్రింట్ అయేలా చేసేవారు. అలాంటి బొమ్మలన్నీ సేకరించేవాణ్ని చాలా దొరకలేదు.
నాకు తెలిసినంతవరకూ వపా గారు చిత్రించిన బొమ్మల రంగులమేళవింపు ఆవిష్కరించిన చిత్రకారులు ముఖ్యంగా పత్రికల్లో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదేమో !

వపా గారి పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే చిన్నప్పుడు మా మిత్రులతో లైబ్రరీకి వెళ్లినపుడు యువలో ముందుగా “బొమ్మలకే ప్రాణం వస్తే” అనే శీర్షిక చాలా నవ్వు తెప్పించేది. అలాగే “పోలికలు”, “చూపులో చూపు”, “సినిమాక్విజ్” చాలా బాగుండేవి. చందమామ బొమ్మలు సరేసరి. పంచతంత్రం, శివలీలలు, అరణ్యపురాణం మొదలైనవి తదేకంగా చూస్తూ ఎంతసేపైనా గడపవచ్చు. ముఖ్యంగా యువలో నక్షత్రాలు, రాగాలు, పాటలకి సింబాలిక్ వేసేవి మరచిపోలేం.

పాపయ్యగారిని చూడాలని చాలా కోరికగా వుండేది. వారి అబ్బాయి రవిరామ్ మాతో పాటే పనిచేసేవారు. ఆ పరిచయంతో వారిని అడిగాను. కానీ కాలం కలిసి రాలేదు. ఆ విషయంలో వారిని కలిసినవారు ఎంతో అదృష్టవంతులు. ముఖ్యంగా సుంకరచలపతిరావు గారు. “ఈ టీవి’ ప్రారంభమైన తొలినాళ్లలో మా ఎం.డి. సుమన్ గారిని ‘వపా’ మీద డాక్యుమెంటరీ చెయ్యాలని అడిగాను.
చాలా కాలానికి ఆ అవకాశం నాకిచ్చారు. రవిరామ్ గారి సహకారంతో మా యూనిట్ శ్రీకాకుళం వెళ్లి డాక్యుమెంటరీ రూపొందించాం. దానికి సుంకర చలపతిరావుగారి వ్యాసాలు, స్వాతిలో వచ్చిన ఇంటర్వ్యూలు ఆధారం చేసుకున్నాం. ఆ ఏడాది దానికి ‘నంది అవార్డ్’ వచ్చింది. అందులో వపా గారి కుటుంబ సభ్యులతో పాటు వపాగారి ముఖ్య స్నేహితులు పత్తి గజపతిరావు గారు, డ్రాయింగ్ మాస్టర్ టి.వి. రామశాస్త్రి గారు, ప్రముఖ చిత్రకారులు బాలి గారు తమ అనుభవాలు ముచ్చటించారు. ఎటువంటి హంగులు లేని ఆయన నివాసం చూసి ఆశ్చర్యపోయాం! విచారించాం !!

ఇంతవరకూ కళాప్రియులు వపాగారి ఒరిజినల్స్ చూసివుండరు. ఈ నూరేళ్ళ సందర్భంలో స్వాతి బలరాం గారిని, రవిరామ్ గారిని సంప్రదించి కొన్నింటిని సేకరించి ప్రదర్శన ఏర్పాటు చేస్తే ఆ ‘రంగుల రారాజు’ కళని దగ్గరగా వీక్షించే అవకాశముంటుందని ఆశ!

రవికిషోర్ (ఈనాడు చీఫ్ ఆర్టిస్ట్, రిటైర్డ్)

1 thought on ““వపా ఒరిజినల్స్ చూడాలనివుంది”

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap