(ఆచార్య ఆత్రేయ శతజయంతి సందర్భంగా…)
ప్రకృతిలో పల్లవించి కొమ్మల రెమ్మలతో విశాలంగా వ్యాపించి చల్లటి నీడనిస్తుంది చెట్టు. పక్షులకు ఆలవాలమై అందాల హరివిల్లులా కనువిందు చేస్తుంది. అటువంటి ఉత్తమ గుణములు గలవాడు తెలుగుభాషపై మక్కువ గలవాడు. విశేష ప్రతిభను ప్రదర్శించిన మనసుకవి ఆచార్య ఆత్రేయ. మూడక్షరాల మనసుపై అసంఖ్యాక మైన పాటలు రాసిన ఏకైక గేయరచయిత ఆత్రేయ.
కిలాంబి వేంకట నరసింహాచార్యులు అనే ‘ఆచార్య ఆత్రేయ’ మే నెల 7 వ తేదీ 1921 న నెల్లూరు జిల్లా మంగళంపాడు అనే గ్రామంలో జన్మించారు. సినీ రచనా సామ్రాజ్యంలో రత్న కిరీట కాంతులలో శోభించు మనోహరమోహనాంగుడు వేంకట నరశింహాచార్యులు. గుమాస్తాగా జీవితం ప్రారంభించి ఉపాధ్యాయుడుగా పత్రికా సంపాదకునిగా సినీగేయ రచయితగా తారాస్థాయికి చేరుకున్నారు. వీరి పేరులోని ఆచార్యులు, గోత్రంలో ఆత్రేయ కలసి ఆచార్య ఆత్రేయగా ప్రఖ్యాతి గడించారు.
తెలుగు సినీ పాటల ప్రపంచానికి కమ్మటి పాటలనందించిన కవివరేణ్యులెందరో వున్నారు. వారిలో హృదయాన్ని కదిలించి, మనసును కరగించి ఆర్ద్రతలో తడిపిన ‘మనసుకవి’ ఆత్రేయ. ఎటువంటి దీర్ఘ సమాసాలు, గ్రాంధిక పదప్రయోగాలు చేయక తేట తెలుగు పదాలతో అనల్పమైన అర్థం వచ్చేట్లు పదాలను కుమ్మరించిన గేయరచయిత ఆచార్య ఆత్రేయ.
మనసుకు – హృదయానికి జరిగిన ఘర్షణ నుండి పుట్టినదే పాట. ఆనాటి ప్రేక్షలోకాన్ని మోహింపజేసిన పద విన్యాసం అద్భుతం. సమస్య – సందర్భం ఏదైనా అవగాహన చేసుకొని అర్థవంతమైన పదప్రయోగంతో అశేష ప్రజానీకాన్ని అలరించిన అమరుడు ఆత్రేయ.
ప్రపంచ పరిజ్ఞానం లేని, మోసం, కపటం తెలియని గ్రామీణ యువతినోట పలికించిన అద్భుత జానపద గీతం లాంటి పాట “పాండవులు పాండవులు తుమ్మెద పంచ పాండవులోయమ్మ తుమ్మెద”. తేట తెలుగు పదమల్లెల సుగంధంతో మత్తెక్కించిన మురళీకృష్ణుడే మన ఆచార్యుడు. “నవ్విన నాపచేనే పండుతుందనే” చక్కటి సందేశాన్ని అందించాడు. పూర్వకాలంలో బుర్రకథలకు ఎక్కువ ఆదరణ వుండేది. రామాయణ భారత భాగవత కథలను చెప్పేవారు. ప్రేక్షకుల ఆనందానికి హద్దులుండేవికావు. అంతరించి పోతున్న ఈ కళ “దసరా బుల్లోడు చిత్రం ద్వారా” “మల్లయ్య గారి ఎల్లయ్య – బుల్లెయ్య గారి చెల్లెమ్మ” అంటూ బుర్రకథను గానం చేయించాడు. భార్య గయ్యాళి భర్త దయామయుడు. ప్రతిరోజు రామాయణం చదువుతుంది కాని భర్తకు పచ్చడి మెతుకులు, మజ్జిగ నీళ్ళు. ఉత్తర దక్షిణ దృవాలు, తూర్పు పడమర, నింగినేల ఎదురెదురుగా ఉంటాయి. కాని… ఎప్పుడు కలవలేవు. వీరి బంధం అలాంటిదే. రెండు భిన్న మనస్తత్వాల కోణాల దిశానిర్దేశకుడు.
ప్రేమికుల హృదయాలనుండి వెల్లివిరిసిన ప్రేమగీతం “అడగక యిచ్చిన మనసే ముద్దు, అందీ అందని అందమె ముద్దు – విరిసి విరియని పువ్వే ముద్దు – తెలిసి తెలియని మమతే ముద్దు.” అంత్య ప్రాసలతో అక్షరములనే పూలతో తెలుగు భాషా సుగుంధాన్ని ప్రేక్షక లోకానికందించిన ప్రియతమ కవిరేడు ఆత్రేయ. ప్రేమించిన హృదయం తన ప్రేమకోసం ఎంత పరితపిస్తుందో వారి రచనలో పరిపక్వత అంత గొప్పగా, అనుభవం అంత నేర్పుగా కనిపిస్తుంది.
మొక్కకు నీరుపోస్తే ఏపుగా పెరుగుతుంది. తీగెకు తాడును సాయంమందిస్తే దానిని పెనవేసుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. “అందమైన తీగకు పందిరుంటే చాలును.. పైకి పైకి పాకుతుంది చినదానా…..” అంటూ భార్యబిడ్డలు చిత్రంలో విన్నవించాడు. ఇక్కడ నాయిక కాళ్ళు పక్షవాతం వచ్చి చచ్చుబడిపోతాయి. వాటిని తిరిగి రప్పించడం కోసం నాయకుడు తన ప్రయత్నం తాను చేస్తాడు. అతడు చూపించిన ప్రేమకు తను అతనిని ప్రేమిస్తుంది. అతనికి ఇంతకుముందే వివాహమైంది. ఆ విషయం ఆమెకు తెలియక ప్రేమ పెంచుకుంది. నాయకుడు ఆమె నెలాగైనా నడిపించాలనే సదుద్దేశంతో ఈ పాట ద్వారా ఆమె మనసులో ఒక గొప్ప ప్రేరణ కల్పిం చాడు. ఇక్కడ తీగెకు సాయమందిస్తే అది దానిని ఆసరాగా తీసుకొని మెలికెలతో పందిరంతా ఆవరిస్తుంది. అలాగే సచ్చుబడిన కాళ్ళను తిరిగి నడిచే విధంగా ప్రోత్సహించి వెన్నుతట్టి నేనున్నానంటు భరోసా కల్పించి, నీవు నడువగలవు – నీలో ఆ శక్తి వుంది.. అంటూ ప్రేరేపించి ఆమెకు మానసిక బలాన్ని కల్పించాడు. ఆ ప్రేరణతో నడవగలిగింది. ఈ పాటలో తీగె పరంగా ఒక అర్థం నాయక పరంగా మరో అర్థం. శేషార్థాన్ని ప్రయోగించి విశిష్టార్థాన్ని ప్రకటించిన “వికటకవి” ఆత్రేయ.
ప్రేమ విఫలమైతే ఎటువంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో…. ఇంద్ర ధనస్సు “చిత్రంలో ” నేనొక ప్రేమపిపాసిని నీవొక ఆశ్రమ వాసివి – నా దాహం తీరనిది – నీ హృదయం కలదని” అంటూ ప్రేమవైరాగ్యాన్ని ప్రదర్శించాడు.
ఒక పుణ్య దంపతులకు పిల్లలకు పెళ్ళిళ్ళై అమెరికాలో ఉద్యో గానికి వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. తల్లిదండ్రులు ఇక్కడే వుండిపోయారు. పండుటాకువంటి వారి జీవితం ఎప్పుడు రాలి పోతుందో తెలియదు. బడి పంతులు సినిమా ద్వారా “నీ నగుమోము – నా కనులారా – కడదాక కననిండు” అంటూ ఆవేదన ఎలా వుంటుదో… అంతటి ఆవేదన కవి తాను అనుభవించాడా అన్న సందేహం కలిగిస్తుంది. అంతటి తాదాత్మతను పొంది అందించిన ఘనత ఆత్రేయకే దక్కు తుంది. తల్లిదండ్రులను ఆదరించాలనే సందే శాన్ని అందించాడు.
భక్తి రసమయ గీతలహరులలో ఓలలాడిం చిన పుణ్య పురుషుడు. వీటిని బట్టి ఆయన ఆస్థికుడని తెలుస్తుంది. భక్తతుకారం చిత్రంలో “ఉన్నావా – ఆసలున్నావా ఉంటే కళ్ళు మూసు కున్నావా” అంటూ దేవుడినే ప్రశ్నించాడు. ఇచట దేవుడు లేడను సందేహాన్ని వ్యక్తం చేశాడు. దీన్ని బట్టి ఆత్రేయ నాస్తికుడని తెలుస్తుంది.
ప్రేమ, విరహం, వైరాగ్య, శృంగార, వేదన, ఆవేశ, విప్లవ సందేశాత్మక గీతాల నందించిన…. విశిష్ట విభిన్న కోణాల వైవిధ్యాన్ని ప్రదర్శించిన ప్రతిభాశాలి. ఇవిగాక ఎవరు దొంగ, విశ్వశాంతి, అంత్యార్పణ వంటి నాటికలు కూడా రాశారు. విభిన్న వైఖరుల – విభిన్న కోణాల – దిశానిర్దేశకుడు – ప్రతిభాశాలి మనసు పాటల మహర్షి ఆచార్య ఆత్రేయ.
-షేక్ ఖాజావలి