మంగళంపల్లి బాలమురళీకృష్ణ 90 వ జయంతి …

జూలై 6న బాలమురళీకృష్ణ జయంతి విశాఖపట్నంలో  నిర్వహణ …..

కర్ణాటక సంగీతానికి గౌరవం, గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగువారికే దక్కు తుందనడంలో సందేహం లేదు. తెలుగునాట సంగీ తంలో మహా విద్వాం సులు, వాగ్గేయకారులు న్నారు. ‘ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరి గేవు రామచంద్రా’ అని శ్రీరామచంద్రుడినే ప్రశ్నిం చిన భక్తరామదాసు, ‘ఎక్కువ కులజుడైన, హీన కులజుడైన నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు’ అని అన్ని కులాలు సమానమేనని చెప్పిన తాళ్లపాక అన్నమాచార్య, ‘దుర్మార్థ చరాధములను దొరా నేన నజాలరా’ అన్న ధిక్కార స్వరాన్ని వినిపించిన త్యాగరాజు, “నిను నమ్మిన నాపై పరాముఖమేల’ అని పార్వతీదేవిని ప్రశ్నించిన శ్యామ శాస్త్రి లాంటి సరస్వతీ పుత్రులున్నారు. అలాంటి మహానుభా వుల కోవకు చెందిన వారు మంగళంపల్లి బాలము రళీ కృష్ణ. ‘సత్యమునకిది కాదు. మంచి కాలంనిత్య దుర్వర్తనుల కిది మంచి కాలం అని నిర్మొహ మాటంగా రచించి ఆలపించిన బాలమురళి కాలాన్ని జయించిన సంగీత, సాహిత్య మూర్తి, నాకు సంగీతం తెలియదు. నేనొక వాయి ద్యాన్ని మాత్రమే…’ అని జీవితాంతం చెప్పుకున్న మహా గాయకుడు, వాగ్గేయకారుడు, సంగీత విద్వాంసుడు అయిన మంగళంపల్లి నాలుగేళ్ల క్రితం తుదిశ్వాస విడిచినప్పటికీ తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభా వుడు. త్యాగరాజు తర్వాత కర్ణాటక సంగీతంలో దిగ్గ జమనదగ్గ బాలమురళీ కృష్ణ కంఠంలో సృష్టిలోని సకలరాగాలు ఒదిగిపోవడమే కాదు, కొత్త కొత్త రాగాలు ప్రాణం పోసుకున్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలోని శంకరగుప్తం గ్రామంలో జన్మించిన బాలమురళి సంగీత వనంలో పుట్టిన పుష్పం. ఆయన తల్లి సూర్యకాంతమ్మ వీణా విద్వాంసురాలు, తండ్రి వేణువు, వయోలిన్, వీణ వాయిద్యాల్లో విద్వాంసులు. ఎనిమిదవ ఏట ఆయన తిరవాయూరులోని త్యాగరాజు ఆరాధనో త్సవాల్లో కచేరి చేసి శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన తర్వాత సంగీతమే ఆయన వెంట నడిచింది. ఈ అపూర్వ ఘట్టాన్ని బాలమురళీ కృష్ణ ఎన్నోసార్లు తలచుకున్నారు. తిరువాయూరులో నలుమూలల నుంచి వచ్చిన సంగీత విద్వాంసులు తన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఆ వేదికపై ప్రముఖ సంగీత విద్వాంసులు పారుపల్లి రామకృష్ణయ్య తన స్థానంలో తన శిష్యుడైన బాలమురళీకృష్ణతో పాడిం చారు. అప్పటివరకూ మహామహుల మధ్య ఒక ఎనిమిదేళ్ల చిన్న పిల్లవాడు పాడటమా అని నొసళ్లు చిత్రించిన వారంతా బాలమురళీ గానాన్ని విని తన్మయత్వంలో మునిగిపోయారు. ఆయన సంగీత రసధునికి కరతాళధ్వనులు అలంకారాల య్యాయి. అప్పటి వరకూ ఆయన పేరు మురళీ కృష్ణ, ప్రముఖ హరికథా విద్వాంసుడు ముసునూరి హరికథా భాగవతార్ ఆయన సంగీత ప్రతిభ తెలు సుకుని బాల మురళి అని దీవించారు. ఆనాటి నుంచి ఆయన పేరు బాలమురళీకృష్ణగా స్థిరప డింది. సంప్రదాయ సంగీతంలో అనేక ప్రయో గాలు చేసిన నవ్యత, సృజనాత్మకత సాధించిన బాలమురళి గణపతి, సర్వశ్రీ, మహతి, లవంగి, సుముఖం, సిద్ధి, మురళి వంటి రాగాలను తానే సృజించారు.

సినీ రంగంలో కూడా ఆయన ప్రవేశించి ఒక్క మెరుపు మెరిసినప్పటికీ నటన కన్నా, సినీ గీతాల కన్నా సంగీతానికే ప్రాధాన్యతనిచ్చారు. ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో నారదుడి పాత్రకు వన్నెతెచ్చి తన గీతాలు తానే పాడారు. హంసగీతె కన్నడ చిత్రంలో ‘హిమాద్రి సుతే పాహిమాం అన్న కీర్తన ఆలపించినందుకు బాలమురళీకృష్ణకు ఉత్తమ నేపథ్య గాయకునిగా జాతీయ పురస్కారం లభిం చింది. ‘మాధవాచార్య’ అనే సినిమాకు ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ పురస్కారం గ్రహిం చారు. ‘గుప్పెడు మనసు’ చిత్రంలో ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ పాట ఇప్పటికీ మన మన సుల్లో ధ్వనిస్తూనే ఉంటుంది. జాతీయస్థాయిలో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి అత్యు న్నత పురస్కారాలు పొందిన బాలమురళి ఫ్రెంచి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక షెవాలియర్ గార వాన్ని కూడా పొందారు. దేశ విదేశాల్లో కలిపి ఆయన 26వేలకు పైగా కచేరీలు చేశారు.

తన గురు భక్తి చాటుకోవడానికి గురువు పారు పల్లి రామకృష్ణయ్య మీదే అనేక కీర్తనలు రచిం చారు. ఉదాహరణకు గ్రహ వీక్షణము కన్నా, గురు అనుగ్రహ వీక్షణము మిన్న. అయ్యా గురువర్యా, నీ యానతితో పాడుచుంటుమయ్యా అన్న కీర్తనలతో శిష్యుడుగా తన అభిమానాన్ని చాటుకున్నారు. కచే రీల్లో గణపతి కీర్తనను ముందే పాడాలన్న నియమా నికి స్వస్తి చెప్పి ఆయన కచేరీ మధ్యలో కూడా వినా యకుడిపై కీర్తనలు ఆలపించేవారు.

భావగీతాలు, భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు, స్ఫూర్తి గీతాలు, మంగణాలు, తత్వాలు మొదలైన అనేక ప్రక్రియల్లో బాలమురళి రచనలు చేసి ఆమో ఘంగా ఆలపించారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఢిల్లీ మిలటరీ అకాడమీలో అప్పటికప్పుడు అను వుగా ‘సాయుధ సవ్వడి వాయు మూల విననాయె -భయము లేదని మురళి-మ్రోయగా మనదే జయ మనివిజయ దుందుభి నినదించే’ అని ఆలపిం చారు. ఒక తెలుగు వ్యక్తి దాన్ని హిందీలో తర్జుమా చేస్తే ఆయన హిందీలో కూడా ఆ పాట పాడి సైనికు లకు విజయోత్సాహం కలిగించారు.

తెలుగువారి కంటే తమిళులు ఆయనను ఎక్కు వగా ఆదరించినప్పటికీ బాలమురళీ కృష్ణకు తాను జన్మించిన ఆంధ్రప్రదేశ్ అంటే ఎంతో అభిమానం. “ఆరంభమునకు ఆంధ్రము-ఆచరణకు అరవము’ అని రాసినప్పటికీ ‘తెలుగు వెలుగు కిరణాలు మనకూ మనదేశానికి నవరత్నాభరణాలు’ అని ఆల పించారు. విజయవాడలో చాలాకాలం నివసించా సన్న ప్రేమతో ‘వినుమురా విజయవాణి కను మురా కృష్ణవేణి-విజయుని జయాలయం-విజయ మాత విమల నిలయం వికచగాన కళా కవితా విచక్షణుల శుభాలయం’ అని అద్భుతంగా రాసి పాడారు. అసమాన ప్రతిభ, అద్వితీయ సంగీత ప్రావీణ్యం, బహుముఖ ప్రజ్ఞాశాలి, కర్ణాటక సంగీత దుర్గాన్ని బలంగా నిర్మించి తెలుగువారికి విశ్వఖ్యాతి తెచ్చిన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ తెలుగు వాడు కావడం మన పూర్వజన్మ సుకృతం…

(మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని జూలై 6న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా)

-యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్  – చైర్మన్, అధికార భాషా సంఘం
______________________________________________________________________
ఫ్రెండ్స్ పత్రికలోని ఆర్టికల్స్ పై క్రింది కామెంట్ బాక్స్ లో స్పందించండి. మీ విలువైన సూచనలు, సలహాలు తెలియజేయండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap