– 8 గంటల పాటు 36 భారతీయ భాషలు, 69 విదేశీ భాషల్లో పాటలు
– 14 ఏళ్ళ కే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మల్లాది రాహత్
పిల్లల్ని ప్రోత్సహిస్తే ఏ రంగములోనయినా విజయాలు సాధిస్తారనడానికి మల్లాది రాహత్ గొప్ప ఉదాహరణ. అది ఆటలయినా, పాటలయినా … విజయవాడకు చెందిన విద్యార్థి మల్లాది రాహత్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ‘ లో స్థానం దక్కింది. ఎందుకో తెలుసా : 2018 జనవరి 6వ తేదీన గాంధీనగర్ లోని రామా ఫంక్షన్ హాల్లో దాదాపు 8 గంటలపాటు 36 భారతీయ భాషలు, 69 విదేశీ భాషల్లో మొత్తం 105 పాటలు పాడి రికార్డ్ సృష్టించాడు. (వివిధ భాషలలో 76 పాటలు పాడిన గజల్ శ్రీనివాస్ పేరిట గత రికార్డు ఉండేది). ఆ నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మండలి బుద్దప్రసాద్, కార్యక్రమ కోర్డినేటర్స్ గా డా. ఎం.సి. దాస్, వీణాపాణి, విజయభాస్కర్, కూచిబొట్ల ఆనంద్, ఈమని శివనాగిరెడ్డి, డా. సమరం, గోళ్ళ నారాయణరావు, డా. పార్థసారథి వ్యవహరించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు అన్ని రకాలుగా పరిశీలించిన అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డు లో రాహత్ పేరు నమోదు చేసి ‘మోస్ట్ లాంగ్వేజెస్ సంగ్ ఇన్ కాన్సర్ట్’ బిరుదుకు ఎంపిక చేసినట్లు గురువారం సమాచారం అందించారు.
ప్రస్తుతం విజయవాడలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రాహత్ తల్లిదండ్రులు అనిల్ కుమార్, శ్రీమతి శిరీష. నిర్మల హైస్కూల్ లో చదివిన రాహత్ 10వ తరగతిలో 10/10 పాయింట్స్ సాధించి ఆల్ రౌండర్గా గోల్డ్ మెడల్ అందుకొని చదువుకు, కళలు ఆటంకం కాదని నిరూపించాడు. గతంలో సాక్షి దినపత్రిక నిర్వహించిన పోటీలో ‘వండర్ కిడ్ అవార్డు ‘ అందుకున్నాడు. అనేక టీ.వీ. కార్యక్రమాలలో పాల్గొని పలువురి ప్రసంశలు పొందాడు. పలు సాంస్కృతిక సంస్థలు ఉగాది పురస్కారాలతో సత్కరించాయి. బాలల చిత్రం దాన వీర శూర కర్ణ చిత్రంలో శకునిగా నటించడంతోపాటు ఇతర పౌరాణిక నాటకాలలో శ్రీకృష్ణుడు, అనిరుద్ధుడు, నారదుడు, శ్రీ మహావిష్ణువు పాత్రలలో నటించి మెప్పించాడు. గతేడాది నంది నాటకోత్సవాల్లో పౌరాణిక నాటక విభాగంలో నంది అవార్డ్ గెలుచుకున్నాడు. నాటకరంగంలో రాహత్ ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు పి.వి.ఎన్. కృష్ణ గారి దగ్గర శిస్ఖణ పొందుతున్నాడు. రాహత్ విజయాలలో కళామంజరి మరియు కొచ్చెర్లకోట ట్రస్ట్ వారి సహకారం మరువలేనిదన్నారు రాహత్ తండ్రి అనిల్ కుమార్ గారు. రాహత్ కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కడం పట్ల నగరానికి చెందిన పలు కళా సంస్థలు, కళారంగ ప్రముఖులు, రాహత్ చదువుతున్న కళాశాల అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.
వృత్తి రీత్యా లెక్చరర్ అయిన అనిల్ కుమార్ గారు వారి శ్రీమతి శిరీష గార్లను గత పది సంవత్సరాలుగా చూస్తున్నాను. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా రాహత్ ను తోడ్కొని రావడం, ప్రోత్సహించడం, రాహత్ విజయాలనే తమ విజయాలుగా భావించి నిరంతరం శ్రమిస్తున్నారు. అందుకే రాహత్ కళారంగంలో నయినా, చదువులో నయినా రాణిస్తున్నాడు. చిరంజీవి రాహత్ మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని 64కళలు.కాం కోరుకుంటూ… అభినందనలు తెలియజేస్తుంది.
-కళాసాగర్
(అనిల్ కుమార్ గారు – 98490 40579)
Congrats Rahat, you have a bright future
Congrats my dear rahath. Have a great future ahead.
Wonderful..all the best
చిరంజీవి మల్లాది రహత్ గురించి అతడు సాధించిన విజయాల గురించి మీరు రాసిన వ్యాసం చాలా చక్కగా ఉన్నది. ఇలాంటి యువతరాన్ని ప్రోత్సహిస్తున్న 64 కళలు డాట్ కాం కళాసాగర్ గారికి ప్రత్యేక అభినందనలు. ఇక రాహత్ గురించి చెప్పాల్సివస్తే అతని విజయం వెనుక అతని తల్లిదండ్రుల కృషి మరువలేనిది. చదువుతోపాటు, సంస్కారం, కళలు ఆట పాటలు అన్నీ నేర్పించడం బహుశా వారికి తెలిసినట్లుగా ఇంకెవరికీ తెలియదేమో అనిపిస్తోంది. వారి రెండవ అబ్బాయి మహత్ కూడా తానా వారు నిర్వహించిన పోటీల్లో మూడు బహుమతులు గెలుచుకొని ఆశ్చర్యపరిచాడు. పిల్లలిద్దర్నీ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు చేస్తున్న శ్రీఅనిల్ శిరీష దంపతులకు ప్రత్యేక అభినందనలు.
డాక్టర్ పి వి ఎన్ కృష్ణ