సవాళ్ళు విసిరే పాత్రలకు ప్రాణప్రతిష్ట చేయడమే అతనికి తెలిసిన విద్య…
విభిన్న పాత్రలు…వైవిధ్యమైన వేషభాషలు.. విలక్షణమైన సినిమా జోనర్లు చేసే అవకాశం వచ్చిన వారు స్టార్స్ గానే కాదు..ఉత్తమనటులుగా ఎప్పటికీ నిలిచిపోతారు. విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ.. ‘ఎన్ టి రామారావు’గారి రక్తం.. వంశం పంచుకు పుట్టడమే కాదు.. ఆయనలోని కళాతృష్ణని.. తపనని పుణికి పుచ్చుకున్న స్టార్ యాక్టర్.. యువరత్న నందమూరి ‘బాలకృష్ణ’.
బాలకృష్ణ 60వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన పోషించిన కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ గుర్తు చేసుకుందాం.. ‘తాతమ్మ కల’తో సినీ రంగ ఆరంగ్రేటం చేశారు. బాలకృష్ణ, ఆ తర్వాత ‘రామ్.. రహీమ్’.. అన్నదమ్ముల అనుబంధం లాంటి సినిమాలు చేశారు. ఆ తొలిదశలోనే తండ్రి ఎన్ టి ఆర్.. బాలకృష్ణకి పరీక్ష పెట్టారు. అదే ‘వేములవాడ భీమకవి’. తెలంగాణాకి చెందిన కవి..వేములవాడ భీమకవి. ఆయన చాటువులు..కావ్యాలు లోక ప్రసిద్ధం. అన్నింటికి మించి ఆయన మాటలు అక్షరసత్యాలు అవుతుండేవి. అలాంటి ‘వేములవాడ భీమకవి’ పాత్ర బాలకృష్ణకి ఇచ్చి చాళుక్య వంశానికి చెందిన మహారాజుగా నటించారు ఎన్ టిఆర్. చాలా యుక్త వయస్సులో ఉన్న బాలకృష్ణ.. భీమకవి పాత్రకు తండ్రి శిక్షణలో ప్రాణం పోశారు.
ఆ తర్వాత పౌరాణిక పాత్రలు.. చారిత్రాత్మక పాత్రలు ఎన్టీఆరే దగ్గరుండి బాలయ్య బాబుతో చేయించారు. ‘దానవీరశూరకర్ణ’లో తాను ‘కర్ణుడి’గా.. దుర్యోధనుడి’గా.. శ్రీకృష్ణుడి’గా త్రిపాత్రా భినయం చేస్తూనే ‘
బాలకృష్ణ’ని ‘అభిమన్యుడి’ పాత్రలో… ‘హరికృష్ణ’ని ‘అర్జునుడి పాత్రలో నటింపజేశారు ఎన్.టి.ఆర్. బహుశా అన్నదమ్ములు.. తండ్రి కొడుకులుగా నటించిన సినిమా ఇదే ఏమో…అభిమన్యుడిగా పద్మవ్యూహ సన్నివేశాలు.. కలలు కల్లలు కావటే సఖీ’ పాట ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆ తర్వాత శ్రీమద్విరాట్ వర్వంలో కూడా బాలకృష్ణ మళ్ళీ అభిమన్యుడి పాత్ర పోషించారు.
బహుశా. ‘అర్జునుజ కృష్ణ’ని ‘అవకృష్ణుడి’గా ఆకర’లో అభిమన్యుడి జీవితంలోని రెండు ప్రధాన ఘట్టాలు.. (ఉత్తరతో పరిణయం.. కురుక్షేత్రంలో పద్మవ్యూహం) రెండు వేర్వేరు చిత్రాల్లో శ్రీమద్విరాట్ పర్వం.. దానవీరశూరకర్ణ) నటించడం బాలకృష్ణ అదృష్టం. ప్రపంచంలోని గొప్ప ప్రేమికుల పేర్లు చెప్పడమంటే అందరూ చెప్పే పేర్లలో ముందుండేవాడు సలీమ్. ఎన్.టి.ఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘అక్బర్.. సలీమ్. . అనార్కలి’ చిత్రంలో ఎన్.టి.ఆర్ ‘అక్బర్’గా.. బాలకృష్ణ ‘సలీమ్’గా నటించారు. ఈ సినిమాకి సంబంధించి రెండు విశేషాలు చెప్పాలి. ప్రఖ్యాత హిందీ నేపధ్య గాయకుడు ‘మహమ్మద్ రఫీ’.. బాలకృష్ణకి పాటలు పాడటం ఓ విశేషం అయితే.. ప్రముఖ గీత రచయిత ‘సి.నారాయణరెడ్డి’ ఈ సినిమాకి సంభాషణలు రాయడం.
సి. నారాయణరెడ్డి మాటలు రాసినా సినిమాలు రెండే రెండు.. ఒకటి ‘ఏకవీర’.. రెండు ‘అక్బర్ సలీం.. అనార్కలి’. అలాగే హీరోలు పోషించడానికి ఇష్టపడని పాత్ర నారదమహర్షి క్యారెక్టర్ కూడా బాలకృష్ణ ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’ సినిమాలో చేశారు. ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’లో బ్రహ్మంగారి ప్రియ శిష్యుడు ‘సిద్దయ్య’గా బాలకృష్ణ నటించారు. ఇలా తండ్రి దర్శకత్వంలో పౌరాణిక పాత్రధారణలోని మెలకువలు కెరీర్ తొలిదశలోనే నేర్చుకున్నారు బాలకృష్ణ, హీరోగా ఒకవైపు సినిమాలు చేస్తూనే.. ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం బాలకృష్ణ తనకి తానే విసురుకున్న ఛాలెంజ్. బాలకృష్ణ కెరీర్ లోనే ఫస్ట్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్ ‘మంగమ్మగారి మనవడు’లో శ్రీరాముడిగా ఓ పాటలో కన్పించారు. బాలకృష్ణ. తర్వాత పూర్తిస్థాయిలో బాపుగారి ‘శ్రీరామరాజ్యం ‘ చిత్రంలో పోషించారు. ‘భార్గవరాముడు’ అనే ఒక సోషల్ సినిమాలో ఓ పాటలో వచ్చే ఘట్టంలో ప్రవరాఖ్యుడిగా నటించారు బాలకృష్ణ. తెలుగులో ఈ ప్రవరుడి పాత్ర చేసిన నటులు ఇద్దరే ఇద్దరు.. ఒకరు ‘వరూధుని పరిణయం’లో ‘ఎస్.వి.రంగారావు గారు.. మరొకరు ‘భార్గవరాముడు’లో ‘బాలకృష్ణ’గారు. ఇక భైరవద్వీపం విషయానికొస్తే పూర్తిస్థాయి జానపదచిత్రం. రాజకుమారుడి గెటప్ తో పాటు బాలకృష్ణ పోషించిన పాత్ర గురించి అప్పుడే కాదు.. ఎప్పటికీ చెప్పుకుంటారు. అలాగే ‘ఆదిత్య..369’లో శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఆ ఎపిసోడ్ సినిమాకే ఆయువుపట్టుగా నిలిచాయి. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో సత్య హరిశ్చంద్రుడు.. దుష్యంతుడి పాత్రలు పోషించారు. ‘శ్రీకృష్ణార్జున విజయం ‘లో శ్రీకృషుడు.. అర్జునుడిగా చేశారు.. ‘పరమవీరచక్ర’ సినిమాలో రావణాసురుడిగా ఓ ఎపిసోడ్ లో నటించారు. ‘పాండురంగడు’ సినిమాలో పుండరీకుడి పాత్రతో పాటు పాండురంగడిగా ముఖ్య పాత్రలో శ్రీకృష్ణుడు స్త్రీ పాత్ర ధరించిన ఘట్టం మరిచిపోలేనివి. సీతారామ కళ్యాణం చిత్రంలో బాలకృష్ణ శివుడు గెటప్ వేసుకున్నారు. ఇక ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విషయం చెప్పనే అక్కర్లేదు. తొలి తెలుగు పాలకుడిగా చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మక చిత్రం అందించారు. తన తండ్రి జీవితచరిత్ర ఆధారంగా తీసిన బయోపిక్స్ లో (‘కథానాయకుడు.. మహానాయకుడు’)లో దుర్యోధనుడు.. రావణుడు.. శ్రీవేంకటేశ్వరస్వామి లాంటి ఎన్నెన్నో గెటప్స్ లో కనిపించారు. ఎన్.టి.రామారావుగారు పోషించిన ‘శ్రీరాముడు’… ‘శ్రీకృష్ణుడు’.. ‘అర్జునుడు’.. ‘సత్యహరిశ్చంద్రుడు’.. ‘శ్రీకృష్ణదేవరాయులు’.. ‘దుష్యంతుడు’.. ‘రావణుడు’… ‘పుండరీకుడు’ లాంటి పాత్రలతో పాటు ఆయన చేయని ‘అభిమన్యుడు’.. ‘నారదుడు’.. ‘సిద్ధయ్య… ప్రవరాఖ్యుడు’.. ‘సలీమ్’ లాంటి పాత్రలకి కూడా ప్రాణ ప్రతిష్ట చేసి తండ్రికి తగ్గ తనయుడనే కాదు.. నటరాజ నటనా పరీక్షల్లో తనదైనశైలి ఆవిష్కరించారు బాలకృష్ణ.
– తోట ప్రసాద్