డిస్కో కింగ్ బప్పి లహిరి కన్నుమూత

బప్పి లహిరి ముంబై క్రిటికేర్ ఆసుపత్రిలో ఈరోజు (16-02-2022) కన్నుమూశారు.

బప్పి లహిరి 27 నవంబరు 1952లో కలకత్తాలోని జల్పైగురి లో జన్మించాడు. అతని అసలు పేరు ఆలోకేష్ లహిరి. తండ్రి ఆపరేహ్ లహిరి గొప్ప బెంగాలీ సంగీత విద్వాంసుడు. తల్లి బన్సూరి లహిరి శ్యామలా సంగీత సంప్రదాయ విద్యలో నిష్ణాతురాలు. వారిది సంప్రదాయ సంగీత కుటుంబం. ప్రముఖ నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు కిషోర్ కుమార్ బప్పి లహిరికి మేనమామ. లహిరి కేవలం 19 యేళ్ళ వయసులోనే సంగీత దర్శకుడుగా సినీ ప్రస్థానం ప్రారంభించాడు. భారతీయ చలనచిత్ర చరిత్రలో డిస్కో సంగీతాన్ని ప్రవేశపెట్టిన ఘనత బప్పి దే కావడం విశేషం. తొలుత బప్పి ‘అమర్ సంగీ’, ‘ఆశా ఓ భలోబాషా’, ‘అమర్ తుమి’, ‘మందిర’ వంటి బెంగాలీ చిత్రాలకు సంగీతం అందించాడు. బప్పి లహిరి అంటే సినీ ప్రియులకు ముందుగా గుర్తుకొచ్చే సినిమా ‘డిస్కో డాన్సర్’. బప్పి తబలా, పియానో, డ్రమ్స్, గిటార్, సాక్సాఫోన్, బాంగోస్, డోలక్ వంటి సంగీత వాద్య పరికరాలను వాయించడంలో నిష్ణాతుడు. నమక్ హలాల్, వర్దత్, శరాబీ, డాన్స్ డాన్స్, సాయిలాబ్ వంటి సినిమాలు బప్పి లహిరి కి మంచి పేరు తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా తెలుగులో సూపర్ హిట్టయిన చిరంజీవి సినిమా ‘గాంగ్ లీడర్’ కు అద్భుత సంగీతాన్ని అందించిన ఘనుడు బప్పి లహిరి. డిస్కో సంగీత దర్శకుడుగా ముద్ర పడిన బప్పి ‘జఖ్మి’, ‘చల్తే చల్తే’ వంటి చిత్రాలలో అద్భుతమైన మెలోడీలను స్వరపరచి హిట్ చేశాడు. నయా కదమ్, అంగారి కి కాలీ, హాత్ కడి, మాస్టర్జీ, హిమ్మత్ వాలా, తోఫా, జస్టిస్ చౌదరి, కమాండో వంటి సినిమాలకు సంగీతం సమకూర్చి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తన తొలి బెంగాలీ చిత్రం 1973 లో వచ్చిన ‘దాదు’లో లతామంగేష్కర్ చేత పాటలు పాడించడం గొప్ప విషయం.

అలాగే తన తొలి హిందీ సినిమా ‘నన్హా షికారి’ లో ముఖేష్ చేత తొలి పాటను పాడించాడు. ’తూ హి మేరా చందా’ అనే ఈ పాట మంచి హిట్టయింది. 1975 లో విడుదలైన తాహిర్ హుసేన్ చిత్రం ‘జఖ్మి’ బప్పి లహిరి ని సంగీత దర్శకుడిగా నిలబెట్టింది. అందులో బప్పి పాటలు కూడా పాడి మరిపించాడు. కిషోర్ కుమార్, ఆశా భోస్లే ఆలపించినన్ ‘జల్టా హై జియా మేరా’ పాట, లతాజీ ఆలపించిన ‘అభి అభి తీ దుష్మని’ పాటలు బప్పికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘ఫిర్ జనం లెంగే హమ్’ చిత్రంలో కిషోర్ ఆలపించిన టైటిల్ సాంగ్ ను సంగీత ప్రియులు మరచిపోలేరు. ఇక చల్తే చల్తే సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్లే! గజళ్ళు స్వరపరచడంలో కూడా బప్పి లహిరి అందేవేసిన చెయ్యి. ‘కిసీ నజర్ కొ తేరా ఇంతజార్ ఆజ్ భీ హై’, ‘ఆవాజ్ ది హై’ వంటి గజళ్ళు 1985 లో విడుదలైన ‘యేత్ బార్’ చిత్రంలో వినిపించారు. హిమ్మత్ వాలా చిత్రంలో పాటలు హిట్టయ్యాక జితేంద్ర హీరోగా నటించిన జస్టిస్ చౌదరి, జానీ దోస్త్, మవాలి, బలిదాన్ వంటి సినిమాలకు సంగీతం సమకూర్చారు. 1983-85 మధ్యకాలంలో జితేంద్ర నటించిన 12 సూపర్ హిట్ సినిమాలకు సంగీతం సమకూర్చింది బప్పి లహిరి కావడం విశేషం. 1986 లో బప్పి 33 సినిమాలకు సంగీత దర్శకత్వం నిర్వహించి 180 పాటలకు స్వరాలు సమకూర్చి గిన్నీస్ ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించాడు. డిస్నీ 3D కంప్యూటర్ యానిమేషన్ చిత్రానికి బప్పి డబ్బింగ్ చెప్పాడు. బప్పి లహిరి ఫిల్మ్ ఫేర్ వారి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నాడు. 2014లో బప్పి లహిరి భారతీయ జనతా పార్టీలో చేరి శ్రేరంపూర్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికలలో పోటీచేసి కల్యాణ్ బెనర్జీ చేతుల్లో ఓటమి చెందాడు. విచిత్ర వేషధారణకు మారుపేరుగా నిలిచిన బప్పి లహిరి ముంబై క్రిటికేర్ ఆసుపత్రిలో ఈరోజు (16-02-2022) తనువు చాలించడం విషాదకరం.

ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap