విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 24
అక్రమంగా మన స్వేచ్ఛను హరించిన ఆంగ్ల దౌష్ట్యంపై భగ్గుమన్న భారత స్వాతంత్ర్య అగ్నిజ్వాలకు మరో పేరే భగత్ సింగ్. భరత మాతకన్న వీరకిశోరం భగత్ సింగ్ విద్యార్థిగా ఉన్నరోజుల్లోనే లాలా లజపతిరాయ్ వంటి వారి భావాలకు ప్రభావితుడై సహాయ నిరాకరణోద్యమంలో గాంధీ పిలుపుకు ఉత్తేజితుడై కాలేజీలో తాను చదువుతున్న చదువుకు స్వస్తి చెప్పి స్నేహితులతో కలసి బయటకు వచ్చేసి పలు ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విప్లవాత్మక భావాలతో నిండిన తన ఉడుకు రక్తాన్ని దేశం కోసం ధారపోయడానికే నిర్ణయించుకుని స్వాతంత్ర్య విప్లవ అగ్నిపర్వతమైన చంద్రశేఖర్ ఆజాద్ తో పరిచయం పెంచుకొని, విప్లవం ద్వారానే మనకు స్వాతంత్ర్యం లభిస్తుందని భావించి, నవజవాన్ భారత్ సభను స్థాపించాడు. సైమన్ కమీషను వ్యతిరేకంగా జరుగుతున్న శాంతియుత ప్రదర్శనలో లాలా లజపతిరాయ్ ను లాఠీలతో కొట్టి తీవ్రంగా గాయపరచిన సాండర్స్ అనే ఆంగ్ల అధికారిని సుఖదేవ్, రాజగురులతో కలిసి అంతమొందించాడు. 1931లో ఉరి తీయబడిన ఈయన తరువాతి తరం విప్లవ వీరులలో చలనం తెచ్చి మన స్వాతంత్ర్య సముపార్జనకు సహకరించిన, వెరు పెరుగని వీర భారతీయుడు, స్వతంత్ర భారతావనిలో చిరస్మరణీయుడు భగత్ సింగ్ నేటికీ మన ధృవతార.
( భగత్ సింగ్ ఉరికంబమెక్కిన రోజు 23 మార్చి 1931)