విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 25
నటవిశిష్టుడు తెలుగు తమిళ సినీ చరిత్రలో వశిష్టుడు, నట తపస్సంపన్నుడు కుప్పలగడియ నాగయ్య చిత్తూరు నాగయ్యగా అందరికీ సుపరిచితుడు. తానాడిన వీథి నాటకాల్లో, విధి తనను ఆడించిన నాటకాల్లోనూ ధీరోదాత్తుడై నటించిన నటమహర్షి. బి.ఎన్.రెడ్డి సాయంతో మనస్సును సినీ కథలవైపు మళ్ళించి రచయితగా, గాయకునిగా, సంగీత దర్శకునిగా, నిర్మాతగా, దర్శకునిగా, గృహలక్ష్మీ, త్యాగయ్య వంటి మేటి చిత్రాలను నిర్మించి పద్మశ్రీ అందుకున్న తొలి దక్షిణ భారతీయ నటుడు నాగయ్య. సారంగధర నాటకంలో చిత్రాంగి అనే స్త్రీ పాత్రకుగాను బంగారు పతకం సాధించిన మేలిమి బంగారు నటుడీయన. ‘నా’ అనే వారు లేకున్నా సినీ పరిశ్రమలో అందరూ నాగయ్యను “నాన్నగారూ” అని ఆత్మీయంగా పిలుచుకునేవారు. తిరుపతి దేవస్థానం స్కాలర్ షిప్పులతో చదువుకున్న నాగయ్య ఆంధ్రపత్రికలో జర్నలిస్టుగా తన జీవితం ప్రారంభించి మేటి నటుల లిస్టులో ప్రథమునిగా మిగిలారు. మునులు, ఋషులు ఎలా ఉంటారో తెలియని మనకి నాగయ్య ధరించిన పాత్రల ద్వారా ఇదిగో ఇలా ఉంటారని తెలిసింది. సినిమాల్లో పోతన, వేమన, త్యాగయ్యగా నిజజీవితంలో సర్వస్వం దానధర్మాలు చేసిన త్యాగయ్యగా మిగిలిన నాగయ్య ధన్యజీవి. సినీ పురాణ పురుషుడు, స్ఫురద్రూపుడూ, తెలుగు ప్రేక్షక హృదయాకాశంలో నేటికీ వెలుగు లీనుతున్న ఓ సజీవ నటతార సినీముని నాగయ్య నేటికీ మన ధృవతార.
(చిత్తూరు నాగయ్య జన్మదినం 28 మార్చి 1904)