ఆస్కార్ అందుకున్న తొలి మహిళా’చిత్రకారిణి ‘

సాధారణంగా సినీ రంగంలో ఆర్ట్ డైరెక్టర్ గా చిత్రకారులు పనిచేస్తారు… కాస్టూం డిజైనర్ కి కావలసిన స్కెచ్ లు కూడా ఆర్ట్ డైరెక్టరే ఇస్తాడు. కాని కాస్టూం డిజైనర్ గా చిత్రకారులే పనిచేస్తే ఆ ఫలితాలు ఎలావుంటాయో చూపించారు భాను అతియా.

ముంతాజ్ ‘బ్రహ్మచారి’ సినిమాలో వేసుకున్న ‘టైట్లీ డ్రాఫ్ట్’ ఆరెంజ్ చీర దగ్గరి నుంచి… శ్రీదేవి ‘చాందిని’ స్టయిల్ దాకా… ఒక్కమాటలో చెప్పాలంటే తన కాస్ట్యూమ్ డిజైనింగ్ తో హీరోయిన్లను స్టయిల్ ఐకాన్లుగా మార్చిన రూపశిల్పి భాను అతియా. ‘గాంధీ’ (1982) సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలామె. ఇటీవల 91 ఏళ్ల వయసులో (15-10-2020 న) ఆ లెజెండ్ మనల్ని విడిచివెళ్ళిపోయినా… ఆమె రూపొందించిన స్టయిల్స్ మనతోనే ఉన్నాయి. 

భాను అతియా పుట్టింది 28 ఏప్రిల్ 1926  కొలహపూర్(మహారాస్ట్ర) లో. బొమ్మలు గీయడం అనేది ఆమెకు తండ్రి నుంచి అబ్బిన విద్య. భానుమతి అన్నా సాహెబ్ రాజోపాధ్యాయ ఉరఫ్ భాను అతైయా తండ్రి అన్నా సాహెబ్ పెయింటర్‌గా పనిచేసేవారు. ఆమెకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడే ఆయన మరణించారు. ఏడుగురు పిల్లల్ని తల్లి శాంతా బాయి రాజోపాధ్యాయే కష్టపడి పెంచి పెద్ద చేసింది. చిన్నతనం నుంచే భానుకు చిత్రలేఖనంపై ఆసక్తి ఉంది. ఇంటికి ఒక ఆర్ట్ టీచర్ వచ్చి బొమ్మలు గీయడం నేర్పించేవాడు. ఆ అభిరుచి అలాగే కొనసాగి సొంతూరు కొల్లాపూర్ నుంచి ముంబయిలోని ప్రతిష్టాత్మకమైన ‘సర్ జె.జె.ఆర్ట్ ఆఫ్ స్కూల్ వరకు తీసుకొచ్చింది. ఫైన్ ఆర్ట్స్ లో ఆమె గోల్డ్ మెడలిస్ట్.

Bhanu Athaiya paintings

ఫ్యాషన్ చిత్రకారిణిగా….
ఫ్యాషన్ పై ఇష్టంతో భాను అతియా రెగ్యులర్ ఆర్టిస్ట్ గా బొమ్మలు వేయకుండా ఫ్యాషన్ ఇల్లస్ట్రేటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ప్రముఖ మహిళా పత్రిక ‘ఈవ్స్’ వీక్లీలో రకరకాల ఫ్యాషన్ బొమ్మలు గీసి గ్లామర్ ప్రపంచానికి కొత్త స్టయిల్స్ పరిచయం చేసేవారు. ఆ తర్వాత పత్రిక ఎడిటర్ ‘బొటిక్ పెట్టడంతో ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా మారారు. 1956లో తొలిసారిగా గురుదత్ సినిమా ‘సీఐడీ’కి క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. అప్పట్లో సినిమాలపై పాశ్చాత్య ప్రభావం ఎక్కువగా ఉండేది. దానికి అనుగుణంగానే భాను విదేశీ స్టయిలకు భారతీయ స్టయిలను మ్యాచ్ చేసేవారు. దాంతో దుస్తులు కొత్తగా, విభిన్నంగా కనిపించేవి. ఆ తర్వాత కూడా సాహెబ్ బీబీ ఔర్ గులామ్’ (1962) వంటి సినిమాలతో ఆమె గురుదతో కలిసి ప్రయాణించారు. శశికపూర్, సిమీ గరేవాల్ విదేశీ దర్శకుడు కాన్రాడ్ రూక్స్ తీసిన ‘సిద్ధార్ (1972) ఒకవిధంగా ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన సినిమాగా చెప్పొచ్చు. ఇందులో భాను రూపొందించిన కాస్ట్యూమ్స్ సిమీ గరేవాలకు తెగ నచ్చాయి. దాంతో ఆమె కాస్ట్యూమ్స్ సిమీ గరేవాలకు తెగ నచ్చాయి. దాంతో ఆమె ‘గాంధీ’ సినిమా దర్శకుడు రిచర్డ్ అట్బెరీకు భానును రికమండ్ చేశారు. 1956 నుండి 2004 వరకు సుమారు 22 చిత్రాలకు కాస్టూం డిజైనర్ పనిచేసారు.

Bhanu Athaiya Was Win Oscar For Best Costume Designer

‘గాంధీ’కి మన దుస్తులు…
‘గాంధీ పై అంతర్జాతీయ సినిమా అనగానే అది ఆషామాషీ ప్రాజెక్ట్ కాదనే విషయం భాను అతైయా త్వరగానే గ్రహించారు. అప్పటిదాకా సినిమాలకు చేసిన కాస్ట్యూమ్ డిజైన్స్ వేరు.. ఈ సినిమాకు చేయాల్సింది వేరని కథా చర్చల్లోనే ఆమెకు అర్థమైంది. సినిమాకు ప్రధానంగా మూడు లేయర్లో దుస్తులు సమకూర్చుకోవాలని అనుకున్నారు. మన దేశంలో బ్రిటీషర్ల కాలం….. స్వాతంత్రోద్యమం… దేశంలో కనిపించే దారిద్ర్యం… ఈ మూడు కోణాల్లో దుస్తులు డిజైన్ చేసేందుకు కావాల్సిన నూలు వస్త్రాల్ని ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల నుంచి, బంగ్లాదేశ్ లోని ఢాకా నుంచి తీసుకున్నారు. కేవలం మూడు నెలల్లోనే ఆయా పాత్రలకు తగ్గట్టుగా వేలాది దుస్తులను డిజైన్ చేసి ఇచ్చారు. “గాంధీ సినిమాలో భాను అతైయా రూపొందించిన దుస్తులను జాగ్రత్తగా గమనిస్తే, ఆమె చిన్న చిన్న డీటైల్స్ కూడా ఎంత బాగా వర్కవుట్ చేశారో అనిపిస్తుంది. అందుకే ఈ సినిమాకు ఆమె ఆస్కార్ అవార్డు అందుకున్నారు” అని ప్రముఖ ఫ్యాషన్ డిజైర్ రీతూ కుమార్ అన్నారు. అప్పటిదాకా ఆస్కార్ అంటే కేవలం విదేశీయులకు మాత్రమే అనే అభిప్రాయాన్ని చెరిపేసి, ఆస్కార్ అందుకున్న తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించారు.

The art of Costume Design Book Title


ఆ తర్వాత కూడా ఆమె అనేక హిందీ సినిమాలకు పనిచేశారు. 1990లో గుల్జార్ తీసిన ‘లేకిన్”, 2002లో అశుతోష్ గోవారికర్ తీసిన ‘లగాన్’ సినిమాలకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ పై 2010లో భాను రాసిన ‘ది ఆర్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్ పుస్తకం ఆమెకు ఆ రంగంపై ఉన్న మక్కువను, అవగాహనను తెలియజేస్తుంది. 2012లో భాను అతైయా తనకు లభించిన ‘ఆస్కార్ అవార్డును కమిటీకి తిరిగి ఇచ్చేశారు. ఆమె కీర్తిని చాటుతూ ఆ అవార్డు మిగతా ఆస్కార్ విజేతల సరసన దీవిగా ఇప్పటికీ అక్కడే ఉంది. ‘ఆస్కార్ కమిటీకి అవార్డు తిరిగి ఇచ్చినందుకు నాకు సంతోషంగా, తృప్తిగా ఉంది. నాకన్నా ముందు విజేతలు కూడా ఇలాగే చేశారు. నా అవార్డు సరైన చోటే ఉంది” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన అతైయా అంటే కేవలం ఆస్కార్ విజేత మాత్రమే కాదు… భారతీయ ఫ్యాషన్ ప్రపంచంలో చెరిగిపోని సంతకం.

2 thoughts on “ఆస్కార్ అందుకున్న తొలి మహిళా’చిత్రకారిణి ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap