కాలం ఒడిలో బజ్జున్న బుజ్జాయి

‘డుంబు’ పాత్ర సృష్టికర్త బుజ్జాయి గురువారం రాత్రి చెన్నై లో కన్నుమూశారు.

దివంగత కవిదిగ్గజం దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు, కార్టూన్ ప్రపంచంలో ‘డుంబు’ పాత్ర సృష్టికర్త బుజ్జాయి (91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం (27-01-22) రాత్రి చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, చిత్రకారులు సంతాపం వ్యక్తం చేశారు.

తన పదిహేడవ ఏటనే బొమ్మల పుస్తకాన్ని ప్రచురించి సాహితీలోకాన్ని ఆకర్షించిన బుజ్జాయి పుట్టింది 1931 సెప్టెంబర్ 11న తూర్పు గోదావరిజిల్లా, పిఠాపురంలో. తల్లిదండ్రులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస. బుజ్జాయిగా పాపులర్ అయిన వీరి అసలు పేరు దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి. బొమ్మలు వేయడం అడవి బాపిరాజుగారి ఒళ్ళో కూర్చొని నేర్చుకున్నారు. నాన్న కృష్ణశాస్త్రితో కవితా ప్రసంగాలకు ఊరూరా తిరగడంవల్ల స్కూలుకు వెళ్ళేలేదు. 1941 సం.లో తండ్రితో మద్రాసు వెళ్ళిన బుజ్జాయి అక్కడ ‘ఆంధ్రమహా సభలు‘ సందర్భంగా జరిగిన ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో పిల్లల విభాగంలో తన చిత్రాలను కూడా ప్రదర్శించాడు.

1944లో వీరి బొమ్మలను ఆంధ్రమహిళ పత్రికలో మొదటిసారిగా ప్రచురించారు. అపుడు వారి వయసు 13 ఏళ్ళు. 1946లో బి.ఎన్.రెడ్డి గారి పిలుపు మేరకు కృష్ణశాస్త్రిగారి కుటుంబం మద్రాసుకు మారింది. మద్రాసులో బుజ్జాయిని బాల పత్రిక అఫీసుకు తీసుకెళ్ళారు కృష్ణశాస్త్రిగారు. బుజ్జాయి బొమ్మలు చూసి నెలనెలా బొమ్మలు వేసి పంపించు ప్రచురిస్తామన్నారు.

ఆరోజుల్లో ‘ఫ్రీఇండియా’ వారపత్రికలో ఆఖరి పేజీలో వచ్చే ‘టార్జాన్’ కామిక్ స్ట్రిప్ బుజ్జాయిని బాగా ఢవివితంచేసింది. ఆ స్ఫూర్తితో 15 ఏళ్ళ వయసులో జాన్ హంటర్ పేరుతో ఐదు పేజీల బొమ్మల కథవేశారు.
1975-78 మధ్య కాలంలో గ్రీటింగ్ కార్డ్స్ వేసి ఆర్థికంగా లాభపడ్డారు. 1969-74 కాలంలో ‘ఆంధ్రప్రభ వీక్లీ’కి చాలా బొమ్మల కథలు వేశారు. 1978లో ఆనందవికటన్ పత్రికలో డిటెక్టివ్ కథలకు బొమ్మలువేశారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ, దినమణి, యువ, చందమామ, ఉదయం, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వారపత్రిక లాంటి ప్రముఖ పత్రికలలో కార్టూన్ స్ట్రిప్స్ వేశారు.

Dumbu created by Bujjayi

వీరు తెలుగు, ఇంగ్లీషులోనే కాక తమిళ, కన్నడ, హిందీ భాషలలో వందకు పైగా బొమ్మల కథల పుస్తకాలు ప్రచురించారు. అందులో పంచతంత్రం, కన్యాశుల్కం ప్రముఖమైనవి. 1992లో ఏ.పి. ప్రభుత్వం నుండి ‘డుంబు’ కార్టూన్ కేరెక్టర్ సృష్టికర్తగా వీరికి ‘బాలబంధు‘ అవార్డు అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డిగారి చేతులమీదుగా అందుకున్నారు. 2005లో మంగాదేవి పురస్కారం పొందారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీలో వీరి పంచతంత్రం బొమ్మలకథ ఐదేళ్లపాటు సీరియల్ గా వచ్చింది. 1999లో ఇది పుస్తకరూపంలో వచ్చింది.
వీరి కుమారుడు కృష్ణశాస్త్రి (బబ్లూ)కి చిత్రకళలో ప్రవేశంవుంది. ఇద్దరు కుమార్తెలు రేవతి, రేఖ. వీరి ఆత్మకథను ‘నాన్న-నేను‘ పేరుతో 2010 సం.లో ప్రచురించారు.

-కళాసాగర్

Popular comic strip Panchatantram

2 thoughts on “కాలం ఒడిలో బజ్జున్న బుజ్జాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap