జ్ణానపీఠ పురస్కార కవివరేణ్యుడు ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి సినీరంగ ప్రవేశానికి 1954-55 మధ్యకాలంలోనే బీజం పడింది. అప్పుడు విజయనగరంలో జరిగిన నాటకపోటీలకు న్యాయనిర్ణేతగా పాల్గొనడానికి వెళ్లినప్పుడు ముదిగొండ లింగమూర్తి, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గార్లతో సినారె గారికి పరిచయమైంది. తర్వాత 1955లో సినారె రచించిన కావ్యం ‘నాగార్జున సాగరం’ ను ప్రముఖ దర్శకనిర్మాత బి.ఎన్.రెడ్డి విని సినారె ను చిత్రసీమకు ఆహ్వానించారు. తర్వాతి కాలంలో రూపుదిద్దుకున్న ‘కర్పూర వసంతరాయలు’ కావ్యం చదివిన బి.ఎన్.రెడ్డి ఆ ఇతివృత్తాన్ని సినిమాగా తీయాలని నటీనటులను కూడా ఎంపిక చేశారు. అందులో కావ్యనాయిక ‘లకుమ’ పాత్రకు సరైన నటీమణి స్ఫురించక ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఇంచుమించు అదే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కావ్య గోష్టిలో సినారె ‘కర్పూర వసంతరాయలు’ కావ్యపఠనం కావించారు. బి.ఎన్.రెడ్డి గారితో సినారె కి మైత్రీబంధం బలపడింది. ‘రాజమకుటం’ సినిమా నిర్మాణంలో వుండగా సినారె ని నటుడు ఎన్.టి. రామారావు కు బి.ఎన్.రెడ్డి పరిచయం చేశారు. అప్పటికే రామారావు సినారె రచించిన ‘విశ్వనాథ నాయకుడు’ కావ్యాన్ని చదివి వుండడంతో, రామారావుతో కూడా మైత్రీబంధం బలపడింది. అలాగే అంజలీ పిక్చర్స్ ఆదినారాయణరావు వంటి స్రష్టలతో సినారె కు స్నేహం కుదిరినా, ఎందుకో సినారె దృష్టి సినిమాలమీద ప్రభావం చూపలేదు. రిపబ్లిక్ ప్రొడక్షన్స్ సీతారాం ‘పెళ్లిసందడి’ చిత్రం నిర్మిస్తూ సినారె ని ఒక పాటను రాయమని కోరారు. అలాగే సుందర్ లాల్ నహతా కూడా ‘శభాష్ రాముడు’ చిత్రానికి పాట రాయమన్నారు. ఒక పాట రాసి సినీరంగ ప్రవేశం చెయ్యడం సినారె కు ఇష్టం లేదు. ఎల్.వి. ప్రసాద్ ‘కొడుకులు కోడళ్ళు’ చిత్రం తీయాలని సినారె చేత అన్ని పాటలు రాయించే దిశగా అడుగులు వేస్తే, ప్రబల కారణాలవలన ఆ చిత్రనిర్మాణం కొండెక్కింది. అప్పుడు సినారె నిజాం కళాశాలలో అధ్యాపక వృత్తిలో వుంటూ ‘ఆధునిక ఆంధ్ర కవిత్వం’ అనే అంశం మీద పి.హెచ్.డి పట్టాకోసం పరిశోధన చేస్తూ, సాహిత్యసభల్లో పాల్గొంటూ వుండేవారు.
1960 లో సారధి స్టూడియో వారు ‘కలసి వుంటే కలదు సుఖం’ చిత్రాన్ని నిర్మిస్తున్న సమయంలో సినారె తన మిత్రుడైన ఒక కళాకారుణ్ని ఎన్.టి.ఆర్ కు పరిచయం చేద్దామని స్టూడియోకి వెళ్లారు. ‘’హైదారాబాద్ లో వుంటూ సారధి స్టూడియో వంటి నిర్మాణ సంస్థలకు మీరు పాటలు రాయవచ్చు కదా! వారు ఎందుకు మీ సేవలు వినియోగించుకోవడలేదు?’’ అని ప్రశ్నించిన రామారావుకు, సినారె “వారి సినిమాలకు అందరూ ప్రసిద్ధ కవులే పాటలు రాస్తున్నారు కదా, ఇక నా అవసరమేముంటుంది” అంటుండగా రామారావు ‘రామప్ప’ సంగీత రూపకంలోని ‘’ఈ నల్లని రాలలో” పాటను వినిపించమని కోరారు. సినారె ది శ్రావ్యమైన కంఠం. అద్భుతమైన ఆ పాటతోబాటు అదే రూపకంలో సినారె రచించిన “మబ్బులో ఏముంది, నా మనసులో ఏముంది’’ పాటను కూడా ఎన్.టి.ఆర్ విన్నారు. ఆ పాటలు విన్న తర్వాత రామారావు ‘’మీకు సినిమా పాటలు రాయడం గురించి ఏమైనా అభ్యంతరమా’’ అని ప్రశ్నించారు. “తొలి చిత్రంలో అన్నీ పాటలూ నేనే రాసే అవకాశం వస్తే అభ్యంతరం లేదు. ప్రవేశిస్తే సింహద్వారం ద్వారానే!” అని సినారె జవాబిచ్చారు. అది వినిన ఎన్.టి.ఆర్ “ఆ అవకాశం మాకే వస్తుందేమో” అంటుండగా, సినారె రామారావు గారి వద్దనుంచి సెలవు తీసుకున్నారు. తర్వాత ఎన్.టి.ఆర్ సినారె కు కబురంపారు. “మేము త్వరలో నిర్మించనున్న ‘గులేబకావళి కథ’ చిత్రానికి మీతో అన్నీ పాటలు రాయించాలని నిర్ణయించాం. మీరేమంటారు?” అంటుండగా సినారె కు సంతోషమేసింది. అయితే అప్పటికే పత్రికల్లో ఆ చిత్రానికి మాటలు, పాటలు జూనియర్ సముద్రాల రాస్తున్నట్టు, ఒక పద్యాన్ని కూడా రికార్డు చేసినట్టు వార్త వెలువడింది. సినారె కు సందేహ నివృత్తి చేస్తూ రామారావు “ముహూర్తం కోసం ఒక చిన్న పద్యాన్ని రికార్డు చేయించాం. ఆ చిత్రంలో పది పాటలు మీరే రాస్తున్నారు. జూనియర్ సముద్రాల మాటలు రాస్తారు. ఆయనేమీ అనుకోరు” అంటూ జవాబిచ్చారు. తను నిజాం కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తుండడంతో, వేసవి సెలవల్లో అంటే 1960 మార్చ్ నెలలో మద్రాసు వెళ్ళేందుకు సిద్దమయ్యారు.
మద్రాసు సెంట్రల్ స్టేషన్లో దిగిన సినారె గారికి ఎన్.టి.ఆర్ స్వయంగా రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. ఆయనతోబాటు త్రివిక్రమరావు, గుమ్మడి, మిక్కిలినేని కూడా వచ్చారు. కారులో తిన్నగా బజుల్లా రోడ్డులోని రామారావు ఇంటికి వెళ్ళారు. తర్వాత సినారె గారికి ఎన్.ఏ.టి సంస్థ కార్యాలయంలోని గెస్ట్ హౌస్ లో విడిది ఏర్పాటయింది. రామారావు సినారె చేతిలో ‘గులేబకావళి కథ’ స్క్రిప్ట్ గల బౌండ్ పుస్తకం చేతిలో పెట్టి సన్నివేశాలకు ఎక్కడ పాటలు పెట్టాలో సూచించారు. సినారె పాట రాయగానే రామారావు చూసేవారు. ఆయన ఆమోదం పొందాక వేలూరు కృష్ణమూర్తి, జోసెఫ్ ల చేత బాణీలు కట్టించేవారు. అలా మొదటిరోజు సినారె రాసిన రెండు పాటలు ‘’నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని”, ‘’కలల అలలపై తేలెను మనసు మల్లెవూవై’’ ఆమోదముద్రకు నోచుకొని రికార్డింగ్ చేసుకున్నాయి. ఈ రెండింటిలో మొదట రికార్డయిన పాట ‘’నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’’ పాట. అందులో ‘వన్నెల దొరసాని’, ‘కర్పూర కళిక’ పదప్రయోగాలు రామారావు కు ఎంతగానో నచ్చాయి. భీంపలాస్ రాగచాయల్లో ఆ పాటను స్వరపరచగా ఘంటసాల, సుశీల ఆలపించిన ‘’నన్ను దోచుకుందువటే’’ పాట బహుళ జనాదరణ పొందిన విషయం అందరికీ తెలిసిందే. అందులో సినారె “మదనా సుందర నా దొరా” అనే జావళి కూడా రాయడం విశేషమే. సినారె గారి సినీరంగ ప్రవేశం అలా జరిగింది.
–ఆచారం షణ్ముఖాచారి