(అక్టోబరు 11న యాంగ్రీ యాంగ్ మ్యాన్ జన్మదినం సందర్భంగా…ఆచారం షణ్ముఖాచారి ప్రత్యేక వ్యాసం….)
“ఆజ్ మేరే పాస్ బంగళా హై.. గాడీ హై.. బ్యాంక్ బాలన్స్ హై.. క్యా హై తుమ్హారే పాస్” అని దీవార్ సినిమాలో పోలీసు అధికారిగా వున్న తమ్ముడు శశికపూర్ ను ప్రశ్నించినా; “మై ఆజ్ భి ఫేంకే హుయే పైసే నహీ ఉఠాథా” అంటూ అదే సినిమాలో విలన్లను ఎదిరించినా; “ఘడి ఘడి డ్రామా కర్తా హై… సాలా” అంటూ షోలే లో ధర్మేంద్ర హేమామాలినితో ఆడే నాటకాన్ని పసికట్టినా; “ఏ తుమ్హారా బాప్ కా ఘర్ నహీ, పోలిస్ స్టేషన్ హై. ఇస్లియే సీధీ తరహ్ ఖడే రహో” అని జంజీర్ లో కరడుగట్టిన రౌడీని నిలబెట్టినా; “ఐ కెన్ టాక్ ఇంగ్లీష్, ఐ కెన్ వాక్ ఇంగ్లీష్, ఐ కెన్ లాఫ్ ఇంగ్లీష్, బికాజ్ ఇంగ్లీష్ యీజ్ వెరీ ఫన్నీ లాంగ్వేజ్. భాయిరో బికాస్ బైరాన్ బికాజ్ దెయిర్ మైండ్స్ అర్ వెరీ న్యారో” అని నమక్ హలాల్ లో హాస్య సంభాషణ వెలువరించినా; “తుమ్హారా నామ్ క్యా హై, బసంతీ” అంటూ షోలే లో గోముగా టాంగావాలీ ని ప్రశ్నించినా ఆ కంఠం అమితాభ్ బచ్చన్ దే అయివుంటుంది. ఆయన ఒక వ్యక్తి కాదు… ఒక సామూహిక వ్యవస్థ! డెబ్భై దశకంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా నాటి యువకులకు ఆరాధ్య దైవంగా నిలచినా, నేటితరం ప్రేక్షకులకు ఆదర్శవంతమైన సలహాలు ఇస్తున్నా, ఒక మంచి నిర్మాతగా లాభాపేక్షలేని సినిమాలు నిర్మించినా, హీరోలు కూడా పాటలు పాడగలరు అని రుజువు చేసినా, కష్టపడి జ్ఞానసముపార్జన చేస్తే యువకులు కరోడ్ పతులు కాగలరని ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ లో నినదించినా ఆ క్రెడిట్ దక్కించుకోగల అర్హత ఆ బిగ్-బి కే వుంది. రాజకీయంలో అడుగిడి, అది తన ఒంటికి సరిపడదని గుర్తించి తప్పుకున్న మేధావి, అంతటి ప్రజ్ఞావంతుడు మరొకరు సినీరంగంలో కనిపించరు. అక్టోబరు 11న ఆ బిగ్-బి… ఆ యాంగ్రీ యాంగ్ మ్యాన్ జన్మదినం. ఆ సందర్భంగా అమితాభ్ భాయిని ఒకసారి గుర్తు చేసుకుందాం.
త్రివేణి సంగమ తనయుడు…
అమితాభ్ బచన్ పుట్టింది 11, అక్టోబరు 1942 న పవిత్ర నదుల సంగమస్థానం అలహాబాద్ లో. తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ హిందీ భాషా పండితుడు. తండ్రి అమితాభ్ ను ‘ఇంక్విలాబ్’ అని ముద్దుగా పేరుపెట్టి పిలిచేవారు. తన సహచర కవి సుమిత్రానందన్ పంత్ సలహామేరకు ఆ పేరును అమితాభ్ గా మార్చారు. తన కలంపేరు ‘బచ్చన్’ ను అమితాభ్ ఇంటిపేరుగా పెట్టారు. అమితాభ్ అసలు ఇంటిపేరు శ్రీవాత్సవ. జవహర్ లాల్ నెహ్రూ, హరివంశ్ రాయ్ బచ్చన్ లు ఇరుగుపొరు వాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. భారత ప్రధాని రాజీవ్ గాంధీ అమితాభ్ కు సన్నిహిత మిత్రుడు. అమితాభ్ కాలేజి చదువు నైనిటాల్ లోని ప్రసిద్ధ షేర్ వుడ్ కళాశాలలో పూర్తయింది. తరవాత ఢిల్లీ విశ్వవిద్యాలయం లోని కిరోరి మల్ కాలేజిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తల్లి తేజీ బచన్ కు నటన మీద ఆసక్తి వుండేది. ఆ ప్రభావం అమితాభ్ మీద బాగా పనిచేసింది. 1969లో మృణాల్ సేన్ నిర్మించిన జాతీయ అవార్డు చిత్రం ‘భువన్ షోమ్’ సినిమాకు గళాన్ని అందించి సినిమారంగ ప్రవేశానికి బాటలు పరిచారు. అమితాభ్ సినిమాలలో అవకాశాలకోసం వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పినప్పుడు, ఆ అవకాశాలకోసం తొలి సిఫార్సు వుత్తరం ఇచ్చింది ఇందిరాగాంధి. ఆ వుత్తరమ్ పట్టుకెళ్లి ప్రముఖ దర్శక నిర్మాత కె.ఎ. అబ్బాస్ కు ఇవ్వగా, 1969లో తను నిర్మించిన ‘సాత్ హిందుస్తానీ’ సినిమాలో అబ్బాస్ అమితాభ్ కు మొదటి సారి వెండితెరమీద అవకాశమిచ్చారు. పోర్చుగీసు పాలనలో మగ్గుతున్న గోవా వాసులకు స్వాతంత్ర్యం సాధించేందుకు పోరాడిన నేపథ్యంలో నిర్మించిన ఈ సినిమా కు నర్గీస్ పేరిట నెలకొల్పిన జాతీయ బహుమతి లభించింది. అయితే ఇది అమితాభ్ కు పెద్దగా పేరు తెచ్చిన సినిమా కాదు. ఈ సినిమాలో హాస్యనటుడు మెహమూద్ తమ్ముడు అన్వర్ అలీ కూడా నటించాడు. అతడితో అమితాభ్ కు దోస్తీ కుదిరింది. ఆ స్నేహం అన్వర్ ఆలీ అమితాభ్ ను తన ఇంటిలోనే పెట్టుకొని ఆదరించాడు… అవకాశాలకోసం ప్రయత్నం ఛేశాడు. 1971లో ఎన్.సి. సిప్పీ హృషికేష్ ముఖర్జీ దర్శకత్వంలో నిర్మించిన ‘ఆనంద్’ సినిమా లో వేరొకరు నటించాల్సిన వేషాన్ని మెహమూద్ అమితాభ్ కు ఇప్పించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ హిట్టై రాజేష్ ఖన్నాకు సూపర్ స్టార్ ఇమేజ్ ని, అమితాభ్ బచ్చన్ కు గుర్తింపును తెచ్చిపెట్టింది. అందులో క్యాన్సర్ వ్యాధితో బాధపడే యువకుడుగా రాజేష్ ఖన్నా నటించగా అతణ్ణి బ్రతికించేందుకు శ్రమించే డాక్టర్ భాస్కర్ గా అమితాభ్ నటన ప్రేక్షకులను యెంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు జాతీయ అవార్డు దక్కడం తోబాటు ఆరు ఫిలిం ఫేర్ బహుమతులు దక్కగా, అమితాభ్ బచ్చన్ ను ఉత్తమ సహాయనటుడి బహుమతి వరించింది. జ్యోతి స్వరూప్ దర్శకత్వంలో వచ్చిన ‘పర్వానా’ (1971) చిత్రంలో అమితాభ్ విఫల ప్రేమికుడిగా హత్యకు పూనుకొనే నెగటివ్ పాత్రలో నటించారు. నవీన్ నిశ్చల్ ఇందులో హీరో కాగా, హీరోయిన్ గా యోగితా బాలి నటించింది. తమిళ హిట్ చిత్రం ‘కై కొడుత్త దైవం’ సినిమాను నిర్మాత డూండీ రవికాంత్ నగాయిచ్ దర్శకత్వంలో ‘ప్యార్ కి కహాని’ అనే సినిమా నిర్మించాడు. ఈ సినిమాలో జితేంద్ర హీరోగా నటించాల్సి వుండగా, అప్పుడు ఏ హీరో అయినా సంవత్సరానికి ఆరు సినిమాలకు మించి నటించరాదనే నిబంధన ఉండడంతో, అదృష్టంకొద్దీ ఆ పాత్ర అమితాభ్ కు దక్కింది. తనూజ హీరోయిన్ గా, అనిల్ ధావన్, ఫరీదా జలాల్ సహాయ నటులుగా నటించిన ఈ సినిమా పరాజయం పాలయింది. అదే సంవత్సరం అమితాభ్ ‘రేష్మా అవుర్ షేరా’, ‘గుడ్డి’ సినిమాల్లో నటించారు. హృషికేష్ ముఖర్జీ నిర్మించిన ‘గుడ్డి’ సినిమాలో అమితాభ్ ది స్పెషల్ అప్పియరెన్స్. అమితాభ్ భార్య జయభాదురి కి ఇదే తొలి సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ‘రేష్మా అవుర్ షేరా’ సునీల్ దత్ సొంత సినిమా. ఈ సినిమా బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది. అలాగే ఫారిన్ కేటగరీలో 44 వ ఆస్కార్ బహుమతి కోసం భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఇందులో సునీల్ దత్ కు తమ్ముడుగా అమితాభ్ నటించారు. 1972లో అమితాభ్ బచ్చన్ ఏకంగా ఆరు సినిమాలలో హీరోగా, ‘పియాకా ఘర్’, ‘గరమ్ మసాలా’, ‘జబన్’ సినిమాలలో అతిథిగా నటించారు. తమిళంలో హిట్ అయిన బాలచందర్ సినిమా ‘ఇరు కొడుంగళ్’ని ‘సంజోగ్’ పేరుతో ఎస్.ఎస్. బాలన్ దర్శకత్వంలో అయాజ్ ఆలి షేక్ పునర్నిర్మించారు. ఇందులో అమితాభ్ సరసన సీనియర్ నటి మాలాసిన్హా నటించింది. బాలచందర్ సినిమా కథకు రచయిత ముఖ్రమ్ శర్మ మార్పులు చెయ్యడంతో సినిమాలో ఊపు లోపించింది. దాంతో సినిమా సరిగ్గా ఆడలేదు. మరో తమిళ సినిమా ‘మద్రాస్ టు పాండిచేరి’ (1966) ని హిందీలో ఎన్.సి. సిప్పీ ‘బాంబే టు గోవా’ పేరుతో పునర్నిర్మించారు. ఆర్.డి. బర్మన్ అద్భుత సంగీతంతో ఈ సినిమా హిట్టయింది. ఇందులో ప్రధాన హీరో అమితాభ్ కావడంతో అతనికి తొలి బ్రేక్ ఇచ్చిన సినిమాగా ‘బాంబే టు గోవా’ నిలిచింది. ఆ సంవత్సరం అమితాభ్ నటించిన ఇతర సినిమాలు ‘బావర్చి’ (సహాయక పాత్ర), ‘బన్సి బిర్జు’ ‘ఏక్ నజర్’, ‘రాస్తే కా పథర్’ యావరేజిగా నడిచాయి.
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా…
దర్శక నిర్మాత ప్రకాష్ మెహ్రా 1973 లో ‘జంజీర్’ సినిమా నిర్మించారు. సలీం జావేద్ రచన చేసిన ఈ సినిమా అమితాభ్ ను ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ గా నిలబెట్టింది. ఇందులో హీరోయిన్ గా నటించిన జయభాదురి అమితాభ్ కు హీరో పాత్ర రావడానికి కొంత సహకరించింది. ఈ సినిమాలో ప్రాణ్ ది షేర్ ఖాన్ (పఠాన్) అనే ఒక మహత్తరమైన పాత్ర. ఈ సినిమా బాలీవుడ్ లో ఒక నూతన శకానికి అంకురార్పణ జరిపిందని చెప్పవచ్చు. ఈ సినిమా తరవాత హిందీలో ఉద్రేక పూరిత సినిమాలు రావడం మొదలైంది. అందుకు కారకులు ఇద్దరు. ఒకరు కథా రచయితల ద్వయం సలీం-జావేద్ కాగా, రెండవ వారు అమితాభ్ బచ్చన్. అమితాభ్ కు బాలీవుడ్ లో ఒక సుస్థిర స్థానం కలిపించిన సినిమా ఈ బ్లాక్ బస్టర్ మూవీ. సోవియట్ యూనియన్ లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ కావడం విశేషం. నిజానికి అమితాభ్ బచ్చన్ ను ఎంపిక చెయ్యడానికి జయాభాదురి, సలీం-జావేద్ లే కారణం. అప్పటికి అమితాభ్ బచ్చన్ ఖాతాలో పన్నెండు ఫ్లాప్ చిత్రాలున్నాయి. ఆనంద్ సినిమాలో సపోర్టింగ్ పాత్ర, బాంబే టు గోవాలో హీరో పాత్రల విజయం మినహాయిస్తే మిగతా సినిమాల పాత్రలన్నీ ఫ్లాపులే. పైగా అప్పటికే అమితాభ్ కు 30 ఏళ్ళ వయసొచ్చింది. బాలీవుడ్ లో ‘ఫెయిల్డ్ న్యూ కమ్మర్’ గా అమితాభ్ కు ముద్రపడింది. అప్పట్లో రాజేష్ ఖన్నా ‘సూపర్ స్టార్’ హోదాను చేరుకున్నాడు. నిజానికి సలీం-జావేద్ రాజేష్ ఖన్నాకు సన్నిహితులు. అయినా ఈ సినిమాకు వారు అమితాభ్ బచ్చన్ వైపే మొగ్గు చూపారు. దర్శక నిర్మాత ప్రకాష్ మెహ్రా స్క్రిప్టు ను దృష్టిలో వుంచుకొని తొలుత శత్రుఘ్న సిన్హాను, తర్వాత రాజకుమార్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, దేవానంద్ పేర్లను పరిశీలిస్తూ వుంటే, సలీం-జావేద్ అమితాభ్ పేరును సూచించారు. అందుకు కారణం బాంబే టు గోవా సినిమాలో అమితాభ్ చేసిన ఫైటింగులే. కొన్ని సినిమాలకు అనుకోకుండా అన్నీ కుదురుతాయి అనేదానికి ‘డాన్’ సినిమానే దృష్టాంతం.
ముంతాజ్ ను హీరోయిన్ గా అనుకున్నా కాల్షీట్లు సర్డలేక ఆమె తప్పుకుంది. అయితే అప్పటికే అమితాభ్ బచ్చన్-జయభాదురి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఉండడంతో, అమితాభ్ కు జంటగా జయభాదురిని తీసుకోవడం జరిగింది. తరవాత ఓ.పి. రల్హన్ ‘బందే హాథ్’ సినిమా నిర్మించాడు. ముంతాజ్ అందులో హీరోయిన్. ఈ సినిమా బాగా ఆడింది. తమిళ నిర్మాత దర్శకుడు సి. వి. శ్రీధర్ ‘గెహరి చాల్’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా నిర్మించాడు. అమితాభ్ బచ్చన్, హేమామాలిని నటించిన ఈ సినిమా కూడా విజయవంతమైంది. హృషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘అభిమాన్’ సినిమా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొంది. అమితాభ్ అప్పటికే జయభాదురిని పెళ్ళాడారు. ఆమే ఇందులో హీరోయిన్ గా నటించింది. ఆమె నటనకు ఫిలింఫేర్ బహుమతి కూడా లభించింది. ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్, అన్నపూర్ణా దేవి ల వైవాహిక అనుబంధం విచ్చిన్నం కావడం ఈ సినిమాకు నేపథ్యంగా తీసుకున్నారు. సచిన్ దేవ్ బర్మన్ ఈ సినిమాకు అందించిన సంగీతం అజరామరం. మరో హృషికేష్ ముఖర్జీ చిత్రం ‘నమక్ హరామ్’ కూడా అదే సంవత్సరం విడుదలై డంకా బజాయించింది. ఇందులో అమితాభ్ బచ్చన్ తో పాటు రాజేష్ ఖన్నా హీరోగా నటించారు. అమితాభ్ బచ్చన్ కు ఫిలింఫేర్ వారి ఉత్తమ సపోర్టింగ్ నటుడి బహుమతి లభించింది. 1974 లో అరవింద్ సేన్ చిత్రం ‘కసౌటి’, నరేంద్ర బేడి సినిమా ‘బేనామ్’, ‘మజబూర్’ సినిమాల్లో అమితాభ్ హీరోగా నటించారు.
1975 లో అమితాభ్ నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి ‘దీవార్’, మరొకటి ‘షోలే’. యాష్ చోప్రా దర్శకత్వంలో గుల్షన్ రాయ్ నిర్మించిన ’దీవార్’ సినిమాలో అమితాభ్ విశ్వరూప ప్రదర్శన చేశారు. ఇందులో అమితాభ్ పాత్ర అండర్ వరల్డ్ గూండా హాజీ మస్తాన్ ను పోలి ఉండేలా సలీం-జావేద్ రచన చేశారు. ఇదొక బాలీవుడ్ మాస్టర్ పీస్ గా చెప్పవచ్చు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ బహుమతి గెలుచుకుంది. ఈ సినిమా ఎంత పాపులర్ అయ్యిందంటే తెలుగులో ‘మగాడు’ పేరుతో, తమిళంలో ‘దీ’ పేరుతో, మలయాళం లో ‘నత్తి ముత్తల్ నత్తి వరె’ గా పునర్నిర్మితమైంది. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ ప్రక్రియను ఉపయోగించి ఫైటింగ్ సన్నివేశాలను రూపొందించారు. ఇందులో పతాక సన్నివేశం కోసం అమితాభ్ పది గంటలు తన హోటల్ రూములో రిహార్సల్స్ చేసి రక్తి కట్టించారు. నిర్మాత గుల్షన్ రాయ్ కి అమితాభ్ పోషించిన విజయ్ పాత్రను రాజేష్ ఖన్నాకు, అతని తమ్ముడు రవి పాత్రను నవీన్ నిశ్చల్ కు ఇవ్వాలని తొలుత భావించినా సలీం-జావేద్ ససేమిరా అన్నారు. రవి పాత్రకు శశికపూర్ న్యాయం చేశాడు.
ఇక ‘షోలే’ విషయానికొస్తే, చెప్పాల్సింది తక్కువే. ఎందుకంటే ఈ చిత్ర విషయాలు, విశేషాలు అందరికీ కరతలా మలకాలే కావడం! ఇది సలీం-జావేద్ ల రచనా పరాకాష్టకు నిదర్శనం. జయదేవ్ (జయ్) పాత్రను అమితాభ్, వీరూ పాత్రను ధర్మేంద్ర పోషించారు. ‘షోలే’ సినిమాను 1925-75 మధ్యకాలంలో వచ్చిన అత్యుత్తమ సినిమాగా ఫిలింఫేర్ మ్యాగజైన్ పేర్కొనడం విశేషం. ఈ సినిమా కోసం జి.పి. సిప్పీ, రమేష్ సిప్పీ ఏకంగా బెంగుళూరుకు దగ్గరలో ‘రామ్ నగర్’ పేరుతో ఒక గ్రామాన్నే సృష్టించారు. అమ్జాద్ ఖాన్ కు ఇది తొలి సినిమా. అతడు పోషించిన గబ్బర్ సింగ్ పాత్ర సంభాషణలతో ఒక ఎల్.పి రికార్డు విడుదల కావడం ఆరోజుల్లో ఒక విప్లవంగా చెప్పుకున్నారు. విజయవాడ నవరంగ్ థియేటర్ లో, హైదరాబాద్ మనోహర్ థియేటర్ లో షోలే 27వారాలు ఆడింది. నిజామాబాద్, వరంగల్ వంటి పట్టణాలలో వందరోజులు పూర్తిచేసుకుంది.
హృషికేష్ ముఖర్జీ నిర్మించిన ‘చుప్ కే చుప్ కే’, దులాల్ గుహా నిర్మించిన ‘దో అంజానే’ యాష్ చోప్రా నిర్మించిన ‘కభీ కభీ’, ప్రకాష్ మెహ్రా నిర్మించిన ‘హీరా ఫేరి’, నరేంద్ర బేడి నిర్మించిన ‘అదాలత్’ చిత్రాలు విజయవంతంగా ఆడాయి. 1977 లో వచ్చిన మన్మోహన్ దేశాయ్ చిత్రం ‘అమర్ అక్బర్ ఆంథోని’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో ఆంథోనీ గోసాల్విస్ గా అమితాభ్ నటనలో హాస్యాన్ని రంగరించారు. ఈ చిత్రంలో నటనకు అమితాభ్ ఫిలింఫేర్ బహుమతి అందుకున్నారు. మన్మోహన్ దేశాయ్ నిర్మించిన ‘పర్వరీష్’ కూడా విజయాన్ని నమోదు చేసింది. 1978 లో వచ్చిన యాష్ చోప్రా సినిమా ‘త్రిశూల్’, చంద్ర బారోత్ సినిమా ‘డాన్’, ప్రకాష్ మెహ్రా సినిమా ‘ముకద్దర్ కా సికందర్’ లలో నటనకు అమితాభ్ బచ్చన్ ఉత్తమ నటుడిగా నామినేట్ కావడం విశేషం.
‘డాన్’ సినిమాలో నటనకు ఉత్తమ నటుడి బహుమతి అమితాభ్ కు దక్కింది. ‘డాన్’ క్రైం త్రిల్లర్ ను అప్పుల్లో మునిగిన సినిమాటోగ్రాఫర్ నారిమన్ ఇరాని సహాయార్ధం నిర్మించారు. ఈ సినిమా నిర్మాణానికి మూడేళ్ళు పట్టింది. సినిమా నిర్మాణం పూర్తవతుండగా పాపం నారిమన్ ఇరాని ప్రమాదంలో మరణించాడు. “ఖైకే పాన్ బనా రస్ వాలా” పాటతో సినిమా సూపర్ హిట్టయింది. వచ్చిన లాభాలను నారిమన్ ఇరాని భార్యకు అందజేశారు. ‘మిస్టర్ నట్వర్ లాల్’, ‘కాలా పత్తర్’, ‘దోస్తానా’, ‘లావారిస్’ సినిమాలు విజయవంతమయ్యాయి. అమితాభ్ పేరు ఫిలింఫేర్ బహుమతులకి నామినేట్ అయ్యాయి.
సూపర్ స్టార్డం లో కూలీ ప్రమాదం…
1982 జూలై 26 న బెంగుళూరు యూనివర్సిటీ క్యాంపస్ లో ‘కూలీ’ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ పునీత్ ఇస్సార్ తో ఫైటింగ్ సన్నివేశాన్ని దర్శకుడు మన్మోహన్ దేశాయ్ చిత్రీకరిస్తున్నాడు. అమితాభ్ ఒక టేబుల్ మీదకు ఉరికి నేలమీద పడే సన్నివేశమది. పునిత్ ఇస్సార్ ఫైట్ చేడంతో పొరపాటున అమితాభ్ బల్ల చివర్న పడడంతో కడుపులో పెద్ద గాయమై రక్తస్రావమైంది. అమితాభ్ కోమాలోకి వెళ్ళినంత పనైంది. బెంగుళూరు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించినా లోపల రక్తం కారుతూనే వుంది. వెంటనే హెలికాప్టర్లో బొంబాయి జస్లోక్ ఆసుపత్రికి తరలించారు. అమితాభ్ కు తగిలిన గాయాన్ని కనుక్కోవడానికే చాలా సమయం పట్టింది. మృత్యుకోరలనుంచి అమితాభ్ బయటపడి కోలుకున్నారు. సినిమా విడుదలై బాక్సాఫీస్ హిట్టయింది. దేశం నలుమూలలనుంచి అమితాభ్ అభిమానులు ఎన్నో పూజలు, యాగాలు చేసి అమితాభ్ కు రక్షణగా నిలిచారు.
అమితాభ్ కోలుకున్నాక మిత్రుడు ప్రధాని రాజీవ్ గాంధి కోరికమేరకు రాజకీయాల్లోకి వెళ్ళారు. 1984-87 మధ్య కాలంలో అలహాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యునిగా మూడేళ్ళు రాజకీయాల్లో వుండి, తన అభిరుచికి సరిపడక రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తరవాత అమితాభ్ బచ్చన్ రెండవ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. 1988 లో ‘షెహన్ షా’లో నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ హిట్టయింది. 1990 లో వచ్చిన ‘హమ్’ చిత్రంలో నటనకు ఫిలింఫేర్ బహుమతి లభించింది. ‘అగ్నిపీట్’ సినిమాలో ఉత్తమ నటనకు జాతీయ పురస్కారం లభించింది. ‘ఖుదా గవా’ సినిమాలో నటించాక ఐదేళ్ళు సినిమా నటనకు విరామం ప్రకటించారు. ఆ విరామ సమయంలో ‘అమితాభ్ బచ్చన్ కార్పోరేషన్’ (ABC) స్థాపించి సినిమాల నిర్మాణం, పంపిణీ, ఆడియోల విడుదల వంటి కమర్షియల్ వ్యాపారం మొదలుపెట్టారు. ఆ పరంపరలో వచ్చిన మొదటి సినిమా ‘తేరే మీరే సప్నే’(1996). ఈ వ్యాపారంలో అమితాభ్ నష్టపోయారు. ఆ వ్యాపారానికి స్వస్తి చెప్పి మరలా సినిమాలో నటించడం మొదలు పెట్టారు. ‘బడే మియా చోటే మియా’, ‘మేజర్ సాబ్’, ‘సూర్యవంశం’ సినిమాలు విజయవంతమయ్యాయి. 2000నుంచి సపోర్టింగ్ పాత్రలు, వైవిధ్య మైన పాత్రలు పోషిస్తూ వచ్చారు. 2001 లో వచ్చిన ‘కభి ఖుషి కభి ఘమ్’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘అక్స్’ సినిమాలో నటనకు ఫిలింఫేర్ బహుమతి దక్కించుకున్నారు. సంజయ్ లీలా బన్సాలి నిర్మించిన ‘’బ్లాక్’ సినిమాలో నటనకు జాతీయ బహుమతి లభించింది. 2009లో వచ్చిన ‘పా’ సినిమాలో నటనకు ఫిలింఫేర్ బహుమతి లభించింది. 2013 లో ‘ది గ్రేట్ గట్స్ బై’ అనే హాలీవుడ్ సినిమాలో నటించారు. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కి సారధ్యం వహించారు. అమితాభ్ బచ్చన్ కు రాజకపూర్ పేరిట ‘సూపర్ స్టార్ ఆఫ్ మిలీనియం 2000’ పురస్కారం ఇచ్చి గౌరవించారు. లండన్, న్యూయార్క్, హాంగ్ కాంగ్, బ్యాంకాక్, వాషింగ్టన్, ఢిల్లీ నగరాలలోని మేడం టుస్సాడ్ మ్యూజియంలలో అమితాభ్ బచ్చన్ మైనపు బొమ్మలను ఆవిష్కరించారు. 2011లో పద్మభూషణ్, 2015 లో పద్మవిభూషణ్ పురస్కారాలను భారతప్రభుత్వం ప్రదానం చేసింది. 2019 లో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అమితాభ్ స్వీకరించారు. ఫ్రెంచ్ ప్రభుత్వం నైట్ హుడ్ బిరుదుతో సత్కరించింది. అలా అమితాభ్ బచ్చన్ జీవిత ప్రస్థానం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తూనే వుంది.
-ఆచారం షణ్ముఖాచారి