పనిలో పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తుంటాను- డా. పూతేటి

ఎనిమిదేళ్ళ క్రితం ప్రారంభించిన శీర్షిక ‘మన కార్టూనిస్టులు ‘. 99 మంది కార్టూనిస్టుల పరిచయాలతో విజయవంతంగా పాఠకాధరణతో కొనసాగుతుంది. 100 వ కార్టూనిస్టుగా ఈ వారం ప్రవాసాంధ్ర కార్టూనిస్ట్ డా. పూతేటి గారు మీ ముందుకొచ్చారు.

నా పేరు ప్రభాకర్ పూతేటి, డాక్టర్ పూతేటి గా గత 15 సంవత్సరాలుగా కార్టూన్లు గీస్తున్నాను. నేను నవంబర్ 24, 1976 న చీరాల (ఏ.పి) లో జన్మించాను. నా తల్లిదండ్రులు సూర్యప్రభ మరియు సుధాకర్ పూతేటి. సృజనాత్మకత బహుశా నా రక్తంలో ఉందేమో, ఎందుకంటే నా తండ్రి నా తల్లి పేరు నుండి “ప్రభా” మరియు తన పేరు నుండి “కర్” తీసుకొని నాకు ప్రభాకర్ అని పేరు పెట్టారు. నా తండ్రి భారత వైమానిక దళంలో పనిచేసినందున, నేను భారతదేశంలోని అనేక ఉత్తర మరియు దక్షిణ రాష్ట్రాల్లో పెరిగాను.

నాకు బొమ్మలు గీయడం పై ఆశక్తి పాఠశాల స్థాయిలోనే కలిగింది. నా రెండవ తరగతి ఉపాధ్యాయురాలు “కుటుంబం” అనే అంశంపై డ్రాయింగ్ పోటీని నిర్వహించారు. సమయం చాలనందున నేను అసంపూర్ణంగా గీసిన డ్రాయింగ్ను సమర్పించాను. నా చిత్రాన్ని చూసిన మా ఉపాధ్యాయురాలు ఆశ్చర్యపడి చిత్రాన్ని పూర్తి చేయడానికి మరికొంత సమయం ఇచ్చారు. ఒక వారం తరువాత, నాకు మొదటి బహుమతి వచ్చింది. అప్పటివరకు నేను బొమ్మలు వేయగలను అన్న విషయం నాకే తెలియలేదు. బాల్యంలో కళలను ప్రోత్సాహిస్తే అదే వారిని జీవితంలో ప్రతిభావంతులుగా రాణించేందుకు తోడ్పడుతుందని నేను నమ్ముతాను.

కొన్ని సంవత్సరాల తరువాత, నా తండ్రి తన డ్రాయింగ్లు మరియు పెయింటింగ్స్ నాకు చూపించారు. ఆయన ఒక అభిరుచి గల కళాకారుడు అయినా దానిని ఎప్పుడూ వృత్తిగా మార్చుకోలేదు. నా చిన్నతనం నుండి, నేను డ్రాయింగ్ను ఒక అభిరుచిగా మాత్రమే తీసుకున్నాను కాని ప్రొఫెషనల్ శిక్షణ కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదు.

నేను భారతదేశంలో ఎంఎస్సీ చేసి, స్వీడన్‌లో పీహెచ్‌డీ చేశాను. తరువాత నేను బోస్టన్‌లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడయ్యాను మరియు న్యూయార్క్‌లోని వెయిల్-కార్నెల్ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌ అయ్యాను.

నాలో వున్న హాస్యపరమైన ఆలోచనలను వ్యక్తీకరించడానికి నేను కార్టూనింగ్ ఎంచుకున్నాను. నేను కార్టూనింగ్ పుస్తకాలు చూసి, కార్టూనింగ్ నేర్చుకున్నాను. నేను కాగితంపై మరియు డిజిటల్ మాధ్యమంలో వందలాది కార్టూన్లను గీసాను. నేను 2008 నుండి అనేక పత్రికలలో ప్రచురించాను. నా కార్టూన్లు మరియు కథనాలను ఇండియన్ అమెరికన్ జర్నల్స్-ఇండియా కరెంట్స్ మరియు సిలికోనీర్లలో ప్రచురించాను.

సుప్రసిద్ధ తెలుగు కార్టూనిస్ట్ హరగోపాల్ నాకు అన్నయ్య వరస అవుతారు. వారు నా కార్టూన్లను చూసి తెలుగు పత్రికలకు సమర్పించమని, కార్టూన్ పోటీల్లో పాల్గొనమని నన్ను ప్రోత్సహించారు. మల్లెతీగ, ఎస్.వి.రమణ, కెనడా తెలుగు తల్లి నిర్వహించిన కార్టూన్ పోటీలలో నేను అనేక బహుమతులు గెలుచుకున్నాను. నా కార్టూన్లు తెలుగు కార్టూనోత్సవం 2017, బెంగళూరులో మరియు తెలుగు కార్టూనిస్టులు దినోత్సవం 2019, హైదరాబాద్ లో ప్రదర్శించబడ్డాయి.

SV Ramana Cartoon Award received in 2019

నేను బాపు మరియు ఫడ్నిస్ గారి కార్టూన్లు మరియు బొమ్మలను ఇష్టపడతాను. అమెరికా‌లో నేను విల్లార్డ్ ముల్లిన్ డ్రాయింగ్‌లకు ఆకర్షితుడయ్యాను. రామకృష్ణ, సరసి, లేపాక్షి, హరగోపాల్, బాచి, కళాధర్ బాపు కార్టూన్‌ల పట్ల నాకు ప్రత్యేక ఇష్టం ఉంది. కౌంటెయా సిన్హా మరియు సౌమ్యదీప్ సిన్హా యొక్క బొమ్మలు అద్భుతంగా వుంటాయి. ప్రస్తుతమున్న వర్థమాన కార్టూనిస్టులలో పైడీ శ్రీనివాస్ గారి కార్టూన్లు నాకు ఇష్టం.

ఇతర కళాకారుల మాదిరిగా కాకుండా, కార్టూనిస్టులు ప్రత్యేక కళ కలిగి ఉండాలి అలాగే హాస్య భావన కలిగి ఉండాలి. చాలా మంది కార్టూనిస్టులు బొమ్మలు బాగా వేస్తారు, కాని వారి కార్టూన్లలో హాస్యం లోపిస్తుంది, కొంతమంది చక్కటి హాస్యం కలిగి ఉంటారు కాని వాటిని బొమ్మల రూపంలో వ్యక్తికరించలేకపోతారు. కొంత మంది సీనియర్ కార్టూనిస్టులు వర్ధమాన కార్టూనిస్టులలో ప్రతిభను మెరుగుపెట్టుకోవడానికి కార్టూన్ పోటీల రూపంలో మరియు సోషల్ మీడియా ద్వారా సూచనలు, సలహలు ఇచ్చి మార్గనిర్దేశనం చేస్తున్నారు వారికి నా ధన్యవాదాలు.

నా పనిలో పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తాను. నేను సంతృప్తి చెందే వరకు ఎన్ని సార్లయినా మళ్ళీ మళ్ళీ గీస్తూ గంటల తరబడి పనిచేస్తాను. మన కృషి మన బొమ్మలలో వ్యక్తం అవుతుంది నా నమ్మకం. నా భార్య పల్లవి, మరియు పిల్లలు, ఆధర్ష్ మరియు ఆకృతి నాకు మద్దతుగా వుండడమే కాదు నా కార్టూన్ల మొదటి విమర్శకులు వారే. నేను ఇంతవరకూ నా కార్టూన్ల తో ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించలేదు, కాని ఏదో ఒక రోజు, అమెరికా‌లో మరియు భారతదేశంలో నా కార్టూన్లు, బొమ్మలు ప్రదర్శించాలనుకుంటున్నాను.
డా. పూతేటి

6 thoughts on “పనిలో పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తుంటాను- డా. పూతేటి

 1. చతుష్షష్టి(64) కళల్లో….
  సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, నృత్యం మరియు శిల్పం అనే ఈ 5 కళలను లలిత కళలు అని అంటారు…
  కారణం ఈ కళలు మనస్సుకు లాలిత్యాన్నిస్తాయి గనుక..
  పూర్వ జన్మసంస్కారం, తల్లిదండ్రులకూ అందులో అభినివేశం ఉండడం, పరిసరాల ప్రభావం… కారణం ఏదైనా కావచ్చు,
  ఒక కళను అందిబుచ్చుకోవడం, దానిలో ప్రశంసనీయ స్థాయికి ఎదగడం.. సాధారణమైన విషయం కాదు… దాని వెనుక అకుంఠిత దీక్ష ఉండాలి. అందుకేనేమో
  “పనిలో పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తుంటాను” అన్న శీర్షిక చాలా బాగా నప్పింది..
  కేవలం ఒక చిన్న చిత్రంలో అద్భుతమైన హాస్యరసాన్ని సృష్టించి, సందేశాన్నిస్తూ … క్షణకాలంలో మనల్ని మనం మర్చిపోయేట్టు చేసే అమృత కళ చిత్రలేఖనం…మన భాషలో… కార్టూన్స్ గీయడం. ఒక భావాన్ని వేరే ఏ ఇతర కళ ద్వారా వ్యక్త పరచాలన్నా కావలసిన వస్తువులు, వేదిక, అమర్పులూ అధిక ఖర్చుతో కూడినవే…. అవి అప్పటికపుడే ఆస్వాదించి స్మృతి లో మిగలవలసినవే….

  అదే కార్టూన్స్ అలా కాదు… కొన్నేండ్ల వరకూ సజీవంగా అలా నిలబడిపోతాయి…
  అందుకే ఒక పికాసో, రవి వర్మ, డావిన్సీ, మైకెలాంజీలియో…
  ….. చరిత్రలో నిలబడిపోయారు… నాదృష్టిలో చిత్రకారుడు, శిల్పి అపరబ్రహ్మలు…

  ప్రభాకర్ అన్న పేరు వ్యాసంలో కనబడింది… శీర్షిక క్రింద “పూతేటి” అనే ఉంది..
  తెలిసి వ్రాసినా, తెలియక వ్రాసినా. చిత్రకారుడు “తేనెటీగ” లాంటి వాడు..
  రకరకాల కళా పూల సుగంధాన్ని ఆఘ్రాణించినపుడే రసప్లావితం చేయగలడు.. అలా “పూతేటి” సరిపోయింది…
  పూతేటి అంటే పూల మీద సంచరించే తేనెటీగ అని అర్థం….

  ప్రభాకర్ గారికి హృదయపూర్వక అభినందనలు… మరింత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ..

  వంగిపురపు శ్రీకాంత్ శర్మ‌ (యశశ్వీ)..

 2. బొమ్మన్ ఆర్టిస్ట్ & కార్టూనిస్ట్. విజయవాడ. says:

  ప్రవాసాంధ్ర కార్టూనిస్ట్ డా. పూతేటి గారి పరిచయం సంతోషకరం. కార్టూనింగ్ పట్ల ఆయనకున్న ఆసక్తి, కృషీ అభినందనీయం. Bestwishes to Dr. పూతేటి గారు !.మంచి ఆర్టికల్. 👍–బొమ్మన్, కార్టూనిస్ట్ విజయవాడ

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link