పులిపాక పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు పులిపాక సత్య ప్రభాకర్ కాశ్యప్. పుట్టింది జూన్ 15, 1960లో తోట్లవల్లూరు, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ఆంధ్రా బ్యాంక్ (ఇప్పుడు యూనియన్ బ్యాంక్) లో 38 సం. పనిచేసి 2020 లో పదవీ విరమణ చేసాను. కార్టూన్లు గీయటం, పాత హిందీ పాటలు వినడం నా ప్రవృత్తి.
1977లో కార్టూన్లు గీయటం మొదలు పెట్టటం జరిగింది. మా రెండవ అన్నగారు శ్రీ రామమోహనరావుగారు నాకున్న అభిరుచి గమనించి వారి ఆఫీస్ లోనే పనిచేస్తూ కార్టూన్లు గీసే కార్టూనిస్ట్ పాప గారికి పరిచయం చేశారు. వారి వద్ద కొన్ని మెళకువలు నేర్చుకొని కార్టూన్లు వేయటం మొదలు పెట్టాను. అప్పట్లో “కాశ్యప్” అనే పేరుతో కార్టూన్లు గీసేవాడిని. ఆంధ్రభూమి వారపత్రిక అప్పటి సంపాదకులు స్వర్గీయ సి. కనకాంబర రాజుగారు కార్టూన్లు తమ వారపత్రికలో ప్రచురిస్తూ మంచి ప్రోత్సాహం ఇచ్చారు. ఆంధ్రభూమి కాక ఆంధ్రప్రభ, యువ, విజయ పత్రికల్లో నా కార్టూన్లు ప్రచురితం అయ్యాయి.
ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగంలో చేరటంతో కార్టూన్ కళకి బ్రేక్ ఏర్పడింది. మధ్యలో కొన్ని సార్లు ప్రయత్నించినా పత్రికలు కార్టూన్లు ప్రచురింప పడకపోవడంతో నిరుత్సాహంతో పూర్తిగా మూలనపడింది. 2018లో ప్రముఖ కార్టూనిస్ట్, నా సహోద్యోగి నాగిశెట్టి గారు World Telugu Cartoonists గ్రూప్ కి పరిచయం చేయటంతో మళ్లీ సీరియస్ గా కార్టూన్లు గీయటం మొదలు పెట్టటం జరిగింది. 2018 నుండి ఇప్పటి వరకూ సుమారు మూడు వందలకు పైగా కార్టూన్లు గీయటం జరిగింది.
మళ్లీ కార్టూన్లు వేసే విధంగా నన్ను WTC గ్రూప్ కి పరిచయం చేసిన నాగిశెట్టి గారికి, అడిగినప్పుడల్లా నాకు అమూల్యమైన సలహాలు ఇస్తున్న గురువుగారు సరసి గారికి, నా కార్టూన్లు ప్రచురిస్తున్న ఆన్లైన్ పత్రికలకు కృతజ్ఞతలు.
-పులిపాక
అభినందనలు కాశ్యప్ గారూ. (నాకు పెద్ద పదని కట్టబెట్టారే!!)
పులిపాక గారు మీ కార్టూన్ ప్రయాణం బాగుంది.మీ కార్టూన్లు కూడ బాగుంటాయి