సంగీత శుభప్రదం… కల్యాణి రాగం

సినిమా పాటల సంగీతంలో రాగాలకుండే ప్రత్యేకతలను తెలియజేస్తూ వారం -వారం ఒక్కో రాగం గురించి ఆచారం షణ్ముఖాచారిగారు అందిస్తారు…మొదటిగా సంప్రదాయ రాగ (కల్యాణి రాగం) పరిచయం.

కర్నాటక సంగీతంలో ముఖ్యంగా శంకరాభరణం, తోడి, భైరవి, కాంభోజి, కల్యాణి రాగాలలో కనీసం ఒక్కరాగమైనా లేకుండా చిన్న కచేరీలు కూడా జరగవు అనేది వాస్తవం. మనోధర్మ సంగీత సాంప్రదాయంలో శుభప్రదమైన రాగం ‘కల్యాణి’. (శాస్త్రీయ సంగీతాన్ని అభ్యాస సంగీతమని, మనోధర్మ సంగీతమని రెండు విధాలుగా విభజిస్తారు). మనోధర్మ సంగీతంలో స్వరకల్పన, రాగం, పల్లవి ముఖ్య అంశాలుగా వుంటాయి. శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకపోయినా మనకు తెలియకుండానే ఆ సంగీతాన్ని ఆస్వాదించగలగటానికి కారణం మనోధర్మమే! ఇక కల్యాణి రాగంలో పాడుతూవుంటే అటు పాడినవారికి, ఇటు వింటున్నవారికి ఎప్పటికప్పుడు నిత్యనూతనం అనిపిస్తూనే వుంటుంది. కల్యాణి రాగం ఆధారంగా కొన్ని జన్యరాగాలు ఉద్భవించాయి. వాటిలో ‘హమీర్ కల్యాణి ‘, ‘అమృతవర్షిణి’, ‘హంసనాదం’, ‘బేహాగ్’ రాగాలు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. కల్యాణి రాగాన్ని ‘మేచకల్యాణి’ అని కూడా వ్యవహరిస్తారు. కర్ణాటక సంగీతంలోని మేళకర్త రాగాలు 72. ఈ మేళకర్త రాగాలు యేర్పడటానికి ముందునుంచే కల్యాణి రాగం వుందనేది సంగీత పండితుల విశ్వాసం. కల్యాణి రాగంలో మొత్తం 7 స్వరాలను ఆరోహణ, అవరోహణంలో ఉపయోగించగలగడం విశేషం. ఆరోహణంలో ‘స రి గ మ ప ద ని స’ స్వరాలు పలుకగా అవరోహణం లో ‘స ని ద ప మ గ రి స’ స్వరాలు వరసగా పలుకుతాయి. హిందూస్తానీ సాంప్రదాయంలో కల్యాణి రాగానికి సమానగా వుండే రాగం ‘యమన్’. సాధారణంగా కల్యాణి రాగాన్ని రాత్రివచ్చే తొలి జాము రాగంగా వాడడం కద్దు.

సినిమా పాటల విషయానికి వస్తే ‘దేశద్రోహులు’ చిత్రంలో సాలూరు రాజేశ్వరరావు స్వరపరచగా ఘంటసాల ఆలపించిన ‘జగమే మారినది మధురముగా ఈవేళ’ అనే పాట ప్రారంభంలో వినిపించే పియానో బిట్ రాజేశ్వరరావు అసలైన కల్యాణి రాగ మార్క్ కి సంకేతం. ఇదే పాటలో ‘’కమ్మని భావమే కన్నీరై చిందెను’’ అన్న తరవాత వచ్చే వయొలిన్ బిట్ వింటుంటే ‘వహ్వా’ అనక తప్పదు. అలాగే రాజేశ్వరరావు ‘మల్లీశ్వరి’ చిత్రంలో ‘’మనసున మల్లెలమాలలూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో’’ పాటను స్వరపరచిన విధానం కల్యాణి రాగానికి నిలువుటద్దం. రాజేశ్వరరావే ‘చెంచులక్ష్మి’ చిత్రంలో యమన్ కల్యాణి రాగంలో ‘’పాలకడలిపై శేష తల్పమున పవళించేవా దేవా’’ అనే అద్భుతమైన భక్తిపాటకు ఊపిరులూదారు. ఇలా ఎంతోమంది సంగీత దర్శకులు కల్యాణి రాగాన్ని సినిమాలలో హుషారైన పాటలకోసం విరివిగా వాడుకున్నారు. సాధారణంగా ఈ రాగాన్ని విషాద గీతాలకు వాడరు. కానీ ‘దేవదాసు’ చిత్రంలో ‘’కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్’’ అనే విషాద గీతానికి కల్యాణి రాగాన్ని వాడి హిట్ చెయ్యడం సి.ఆర్. సుబ్బురామన్ కి దక్కిన కీర్తి. ఈ స్పూర్తితోనే మాస్టర్ వేణు ‘మాంగల్యబలం’ చిత్రంలో ‘’పెనుచీకటాయే లోకం చెలరేగే నాలో శోకం’’ అనే విషాద గీతానికి కల్యాణి రాగాన్ని వాడుకున్నారు.

కల్యాణి రాగంలో వచ్చిన సినిమా పాటలు… మచ్చుకు కొన్ని

రాధను రమ్మన్నాడు రాసక్రీడకు (అర్థాంగి- ఆకుల నరసింహారావు- భీమవరపు నరసింహారావు).
జగమే మారినది మధురముగా ఈవేళ (దేశద్రోహులు- ఘంటసాల- రాజేశ్వరరావు)
మనసున మల్లెల మాలలూగెనే ఎంతహాయి ఈరేయి నిండెనో (మల్లీశ్వరి- భానుమతి- రాజేశ్వరరావు).
చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా (కులగోత్రాలు- ఘంటసాల, సుశీల- రాజేశ్వరరావు).
మధుర భావాల సుమమాల (జైజవాన్ –ఘంటసాల, సుశీల- రాజేశ్వరరావు)
చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగ మారినవి (పూలరంగడు- కె.బి.కె. మోహన్ రాజు, సుశీల- రాజేశ్వరరావు).
పెనుచీకటాయే లోకం చెలరేగే నాలో శోకం (మాంగల్యబలం- ఘంటసాల, సుశీల- మాస్టర్ వేణు).
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో (సంతానం- ఘంటసాల- సుసర్ల దక్షిణామూర్తి).
సలలిత రాగ సుధారస సారం (నర్తనశాల- మంగళంపల్లి బాలమురళి, బెంగుళూరు లత- సుసర్ల దక్షిణామూర్తి)
సఖియా వివరింపవే వగలెరుగని చెలునికి నా కథ (నర్తనశాల- సుశీల- సుసర్ల దక్షిణామూర్తి).
హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి (వెలుగునీడలు- ఘంటసాల, సుశీల- పెండ్యాల నాగేశ్వరరావు).
రావే నా చెలియా … చెలియా నా జీవన నవ మాధురి నీవే (మంచిమనసుకు మంచిరోజులు- ఘంటసాల- ఘంటసాల).
పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్ (పెళ్ళిచేసి చూడు- ఘంటసాల- ఘంటసాల).
పలుకరాదటే చిలుకా (షావుకారు- ఘంటసాల- ఘంటసాల).
నాసరినీవని నీ గురి నేనని ఇపుడే తెలిసేనులే (CID- ఘంటసాల, సుశీల- ఘంటసాల).
తోటలో నారాజు తొంగిచూసెను నాడు నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు (ఏకవీర-ఘంటసాల, సుశీల- మహదేవన్).
పాడనా వాణి కల్యాణిగా (మేఘసందేశం- మంగళంపల్లి బాలమురళి-రమేష్ నాయుడు).
శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహు తీపి (మీనా- సుశీల- రమేష్ నాయుడు).
అభినవ తారవో నా అభిమాన తారవో (శివరంజని-బాలు- రమేష్ నాయుడు).
మనసా తుళ్లిపడకే అతిగా ఆశ పడకే (శ్రీవారికి ప్రేమలేఖ- జానకి- రమేష్ నాయుడు)
సాగేను జీవిత నావ (తోబుట్టువులు- ఘంటసాల, సుశీల –సి. మోహన్ దాసు).
పూవై విరిసిన పున్నమివేళ (శ్రీతిరుపతమ్మ కథ- ఘంటసాల- బి. శంకర్, పామర్తి)
ఎవరివో నీ వెవరివో (పునర్జన్మ- ఘంటసాల- తాతినేని చలపతిరావు).
నేడు శ్రీవారికి మేమంటే పరాకా (ఇల్లరికం- సుశీల-తాతినేని చలపతిరావు).
తలనిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వులతోడ మురిపించబోకే (ఘంటసాల ప్రైవేట్ రికార్డు- దాశరథి రచన).

హిందూస్తానీ యమన్ రాగంలో ఇమిడిన కొన్ని హిందీ పాటలు…
చందన్ స బదన్ చంచల్ చితువన్ (సరస్వతీచంద్ర).
ఆంసూ భరీ హై యే జీవన్ కి రాహే (పర్వరిష్).
ఆయ్ మేరే దీవానాపన్ హై (యాహూది).
ఎహసాన్ తేరా హోగా ముఝ్ పర్ (జంగ్లీ).
జిందగీ భర్ నహీ భూలేగి బర్సాత్ కి రాత్ (బర్సాత్ కి రాత్).
జబ్ దీప్ జలే ఆనా జబ్ షామ్ ఢలే ఆనా (చిత్ చోర్).
నిగాహే మిలన్ కొ జీ చాహతా హై (దిల్ హి తో హై).
ఇస్ మోడ్ పే జాతే హై (ఆంధీ).
పాన్ ఖాయే సయ్యా హమారో (తీస్రీ కసమ్).
కుహూ కుహూ బోలె కోయలియా (సువర్ణసుందరి).
కుచ్ నా కహో కుచ్ భీ నా కహో (1942 లవ్ స్టోరీ).

కళ్యాణి/యమన్ రాగాలలో వచ్చిన సినిమా పాటలు కోకొల్లలు. అందుకే అన్నీ ఇవ్వలేక పోతున్నాను. గమనించగలరు.

-ఆచారం షణ్ముఖాచారి

1 thought on “సంగీత శుభప్రదం… కల్యాణి రాగం

  1. కల్యాణి రాగం గురించి షణ్ముఖాచారి గారు బాగా రాశారు. అన్ని రాగాల గురించి ఇలా రాస్తే చాలా బావుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap