చింతామణి నాటకం నిషేదాన్ని ఎత్తివేయాలి..!

ఏ.పి. టూరిజం, సాంస్కృతిక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ రజిత్ భార్గవ్ గారిని ఆంద్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్ పర్సన్ శ్రీమతి రాగే హరిత గారు కలిసి చింతామణి నాటకాన్ని అభ్యంతరకర మాటలు, సన్నివేశాలు తొలగించి ఆ నాటకాన్ని ఆడుకోవడానికి అవకాశం కల్పించాలని కళాకారులు, కళాసంఘాల నాయకులు మాకు విజ్ఞప్తులు వచ్చాయి వాటిని పరిగణనలోకి తీసుకొని వారికి నాటకాన్ని ఆడుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతూ, వినతి పత్రాన్ని బుధవారం (2-2-22) అందజేశారు.

Nataka Academy Chairman Haritha letter given to Rajith Bhargav

…………………………………………………………………………………………………………………..

ఐదో తేదీ విజయవాడ ధర్నా చౌక్ లో కళాకారుల నిరసన దీక్ష
రాష్ట్ర ప్రభుత్వం ‘చింతామణి’ సాంఘిక పద్య నాటకాన్ని నిషేధించడం అప్రజాస్వామికమని కళారంగ ప్రముఖులు పేర్కొన్నారు. ‘చింతామణి’ నాటకంపై నిషేధాన్ని ఎత్తేయాలని కోరుతూ పంచాయతీ ఆఫీస్ సెంటర్ లో స్థానిక, షాబాద్ కళాకారులు బుధవారం ఉదయం ఆందోళన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రజానాట్యమండలి కృష్ణా జిల్లా (తూర్పు) కమిటీ అధ్యక్షుడు జి. వి. రంగారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నిషేధం వంటి ఓ అతి ముఖ్యమైన నిర్ణయంలో నాటక అకాడమీనీ సంప్రదించకపోవడం ప్రభుత్వ ఏకపక్ష దుందుడుకు ధోరణికి నిదర్శనమని గర్హించారు. కళాకారులు మాత్రమే కాకుండా ప్రజాతంత్రవాదులు కూడా ఐక్యంగా ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసించాలని సూచించారు. గుమ్మడి జైరాజ్ కళాపీఠం, విజయవాడ రంగస్థల కళాకారుల సమాఖ్య బాధ్యులు అగురు త్రినాథనాయుడు ప్రసంగిస్తూ నాటకంపై నిషేధాన్ని ఎత్తేసేవరకూ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ‘చింతామణి’ నాటకం నిషేధంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని సీనియర్ కళాకారులు బండి సదాశివరావు ఆవేదన వ్యక్తంచేశారు.

ఎం. ఆంజనేయులు, మెండెం సుబ్బారావు, దుగ్గిరాల బాలస్వామి, కూరపాటి మన్మథరావు, కొల్లి శ్రీనివాసరావు, మార్కాపురం వెంకటేశ్వరరావు, మార్కాపురం రాము, ఉయ్యూరు గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. నాటకాన్ని నిషేధించడం సిగ్గు సిగ్గు అని ఆందోళనకారులు నినదించారు. ఐదో తేదీ ఉదయం విజయవాడ ధర్నా చౌక్ లో జరగనున్న కళాకారుల నిరసన దీక్షను విజయవంతం చేయాలని నాయకులు విజ్ఞప్తిచేశారు.
………………………………………………………………………………………………………………..

శ్రీమతి ఆర్ హరిత గారు,
ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఛైర్పర్సన్,
ఆంధ్రప్రదేశ్,

వారి దివ్యసుముఖమునకు
ద్రాక్షారామ, నాటక కళా పరిషత్,ద్రాక్షారామ వారు నమస్కరిస్తూ చింతామణి నాటకంపై నిషేధాన్ని పునఃపరిశీలించవసింగా కోరుతూ కళాకారుల తరపున మీకు తెలియజేయి విన్నపములు.
అమ్మా.!
కాళ్ళకూరు వారి చింతామణి ఏ సంఘ సంస్కర్త కంటే .. తక్కువ కాదు. చింతామణి తన కులవృత్తిని స్వీకరించినా, చివరకు బుద్ధి వికసించి, బురదలోని పద్మంలా ప్రకాశించింది.ఒక మంచి నాటకం ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తెస్తుందనడానికి చింతామణి నాటకం ఓ చక్కని ఉదాహరణ.మనుషుల్లో సహజంగా వుండే వేశ్యా వ్యామోహం పట్ల కళ్ళు తెరిపిస్తుందీ నాటకం. అంతే కాదు వేశ్యా సంపర్కం పట్ల జుగుప్సను, విముఖతను కూడా కలిగిస్తుందీ నాటకం! అలాంటి 100 సంవత్సరముల చరిత్ర కలిగిన కాళ్లకూరి నారయణరావు గారు రచించిన చింతామణి నాటకం గొప్ప ప్రజాదారణ పొందింది.మా ద్రాక్షారామంలో శ్రీ ప్రసన్నాంజనేయ బాల భక్త సమాజం మరియు ద్రాక్షారామ నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నాటకం ఎన్నో సార్లు ప్రదర్శించారు. ద్రాక్షారామ పరిసర ప్రాంత ప్రజలు ఎంతోమంది ఈ నాటకం చూడడానికి వచ్చేవారు. ఈ నాటకం ప్రదర్శన పూర్తయ్యేసరికి తెల్లవారిపోయినా జనం ఏమాత్రం తగ్గేవారు కాదు. అంత గొప్ప ప్రజాదారణ పొందింది ఈ నాటకం. నేటి సిమిమాలనుండి సమాజం మారుతుందా లేదా అనేది తెలియదు కానీ ఆనాటి నుండి నేటి వరకూ కూడా సమాజంలోని దురాచారాలను రూపుమాపే ఏకైక సాధనం మాత్రం నాటకాలే. అలాంటి నాటకాలు ప్రస్తుతం ఆదరణ కోల్పోయాయి,వీలైతే వాటికి ఆదరణ కల్పించాలని, ఇలా నిరాదరణకు గురిచేయవద్ధని మనవి చేసుకుంటున్నాము. కాళ్ళకూరి నారాయణరావుగారి చింతామణి నాటకం కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, సంపద పాండిత్యం ఉన్నప్పటికీ మనసులో కలిగే వాంఛలకి వశమైతే వారెలాంటి స్థితిని ఎదుర్కొంటారు వంటి అంశాలను సందేశంగా చెబుతూ వ్రాసిన సదుద్దేశ్యపూరిత నాటకం ఇలా నిషేధానికి గురికావడం శోచనీయం. ఈనాటక ప్రదర్శనాకారులలో లోపాలుంటే తగిన ఆంక్షలు విధించి నాటకాన్ని ప్రదర్శింప జేయాలని, అంతేగానీ నాటకాన్ని నిషేదించరాదని, ప్రభుత్వాలు కూలంకుషంగా నాటకాన్ని చదివి, వివరాలను తెలుసుకుని ఈ నాటకంపై నిషేధాన్ని ఎత్తివేసి కాళాకారులకి అండగా నిలవాలని ద్రాక్షారామ నాటక కళా పరిషత్ మరియు ద్రాక్షారామ పరిసర ప్రాంతాల కళాకారులు మరియు చింతామణి నాటక అభిమానుల తరుపున ప్రభుత్వాన్ని వినమ్రంగా వేడుకుంటున్నాము.
ఇట్లు,
నాగిరెడ్డి సతీష్ రావు, ద్రాక్షారామ నాటక కళా పరిషత్ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాటక సమాజాల ఆర్గనైజింగ్ సెక్రటరీ,
ద్రాక్షారామ నాటక కళా పరిషత్ కార్యదర్శి వై. సరోజ,
ట్రెజరర్ V. రాంబాబు, ఉపాధ్యక్షులు Y.N.N.V సత్యనారయణ (కొండ), సహాయ కార్యదర్శి అయినవిల్లి సతీష్ బాబు, పరిషత్ సభ్యులు, కళాపోషకులు, కళా అభిమానులు మరియు ఉపాధ్యాయ బృందం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap