ఏదైనా చెయ్యటాన్ని ‘కరో’ అంటారు. వద్దనటాన్ని ‘న’ అంటారు. “అలా చెయ్యవద్దు” అనటాన్ని కరోన అంటారు. ఎన్నో నియమాలను ప్రభుత్వాలు “కరో-న” పేరుతో అలా చెయ్యవద్దని చెప్తున్నాయి.
లాక’డౌన్ – మూతవెయ్యటం అంటే, ఒక ప్రాంతం నుంచి కదలకుండా నిరోధించే అత్యవసర అధికారం. లోపలికి, బయటకు రాకపోకలు ఏవీ జరగకుండా తలుపులు మూసేయటం. సౌకర్యవంతంగా, ఎలాంటి ప్రమాదమూ లేని సురక్షిత స్థావరంలో ఉంచటం కోసం లాక్ డౌన్ విధిస్తారు. “భయో-న” అంటే, భయంలేదు అని! ఇవన్నీ ముదుజాగ్రత్తగా చేస్తున్న నివారణ చర్యలేనని, భయపడవద్దని, ధైర్యంగా అందరమూ కలిసి ఈ వ్యాధిని ఎదుర్కొందా మనే భరోసాని ఇది ప్రజలకు కల్పించాలి. కరోనా వ్యాధికి విరుగుడు మందు “భయో-న” మాత్రమేనని ప్రజలకు ఏర్పడచెప్పాలి.
ఏర్పడచెప్పటం అంటే, తేటతెల్లం అయ్యేలా చెయ్యటం. ఈ బాధ్యత మీడియా మీద ఉంది, మేధావుల మీద ఉంది. రచయితలు కళాకారుల మీద ఉంది. వీరందరికన్నా ప్రభుత్వం మీద ఎక్కువ ఉంది. అందరి సహకారాన్ని ప్రభుత్వం తీసుకోవాలి. భయం వదిలి యుధోన్ముఖులయ్యేలా ప్రజల్ని సన్నద్ధుల్ని చెయ్యాలి.
కరోనా మహమ్మారి నుండి మనుషుల్ని రక్షించటానికి ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు అవసరమే! రోడ్ల మీద జన సంచారాన్ని చూస్తుంటే ఈ కఠినాలు చాలట్లేదా అనిపిస్తోంది! ప్రతీ కరోనా పాజిటివ్ వ్యక్తి సగటున కనీసం ముగ్గురుకి ఈ వ్యాధిని అంటిస్తున్నాడని ఒక అంచనా ! ఇదొక గొలుసుకట్టు వ్యాపనం. కరోనా ఉన్న వ్యక్తి తుమ్మినా ఆ తుంపర్లు వచ్చి పడకుండా మనిషికీ మనిషికీ మధ్య మూడడుగుల దూరం ఉండాలి. కానీ, సామాజిక దూరం (సోషల్ డిస్టెన్సింగ్), దూరవాసం (క్వారంటైన్) లాంటి అంశాలను మన ప్రజలు ఇంకా అర్థం చేసుకోలేదు. ఇంత ప్రమాదం ఎదురుగా పెట్టుకున్నా లెక్కలేనితనం ప్రజల్లో ఎందుకొస్తోందో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. రోడ్డు మీదకొస్తే పోలీసులు ఎందుకు కొడుతున్నారో చాలా మందికి తెలీదు. కరోనా మీద చేసే పోరాటం ప్రజల మీద చేసే పోరాటంగా మారకూడదు.
“లాక్’ డౌన్లు ప్రకటించినంత తేలిక కాదు దాన్ని అమలు చేయటం” అన్నది అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ! భారతీయ సామాజిక జీవన వ్యవస్థను బట్టి మన “మూసివేత-లాక్’ డౌన్- అమలు ఆధారపడి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ప్రజలను సన్నద్ధుల్ని చేస్తేనే ఇది ప్రజా ఉద్యమం అవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి తొలివారంలోనే ప్రజా సన్నద్ధత గురించి ప్రపంచ దేశాలకు సూచించింది. మార్చి నెలంతా కరోన గురించి దేశీయుల్లో విస్తృత చర్చ జరిగేలా పౌర సంబంధమైన ప్రచారాలు జరిగి ఉంటే ప్రజల సన్నద్ధత ఇంకా బావుండేది. అమెరికా తన చాపకిందకు నీరొచ్చే దాకా ఉరుకుంది. మనమూ ఊరుకున్నాం.
ప్రజా సన్నద్ధత అనే విషయాన్ని ప్రభుత్వాలు తరచూ విస్మరిస్తున్నాయి. చట్టాన్ని ప్రయోగించి ప్రభుత్వం ఒక్కటే కరోనాని జయించాలనే ఆలోచనే ఇందుకు కారణం. అమెరికాలో రోజుకు 10,000 మంది కరోనా పాజిటివ్ వ్యక్తులు బయట పడ్తున్నారంటే ప్రజా నిర్బంధం ఒక్కటే చాలదనీ, ప్రజా సన్నద్ధత కూడా అవసరం అని అర్థం అవుతోంది. అమెరికా లాంటి అగ్రదేశాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మన దేశంలో ప్రజా చైతన్యం తేవటానికి ఎంతో కష్టపడాల్సి ఉంది. కానీ ఆ ప్రయత్నాలు చాలినంతగా లేవు.
దినపత్రికలు, టీవీలలో తప్ప మరో మార్గాన సమాచార ప్రచారం జరగట్లేదు. ఈ మాద్యమాల ద్వారా కరోనా సమాచారం దేశజనాభాలో చేరుతున్నది చాలా తక్కువమందికి. ఈ కొద్ది మందికీ చెప్పి దేశ ప్రజలందరికీ చెప్పినట్టు భావించటం సరికాదు. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగలూరు, హైదరాబాద్, కోల్ కత్తాలతో సమానంగా మారుమూల పల్లెల్ని కూడా దిగ్బంధం చేశారు. కానీ, దాని గురించిన అవగాహన సామాన్య జనానికి ఎంత ఉన్నదో తెలీదు.
ఉదయం 6-9 మధ్య నిత్యావసరాల కోసం వీధుల్లోకి అనుమతించిన సమయంలో ఎగబడ్డ జనానికి కరోనా అంటుకునే ప్రమాదం ఎక్కువ. మూడడుగుల దూరం అమలు కాక, ఆ మూడు గంటల వ్యవధి వేలమంది బతుకును మూర్ణాళ్ల ముచ్చట చేస్తుంది. అలాగని, ఆ మాత్రం షాపింగ్ అవకాశమూ లేకుండా చేస్తే మనుషులు ఏం పెట్టుకు తింటారు? ప్రభుత్వ సరఫరాలు తెల్లకార్డులున్న వాళ్లకే అనటం వలన కార్డులు లేని ప్రజలు గార్డులు (నాథులు) లేని పరిస్థితిలో పడ్డారు.
21 రోజులపాటు లాక్’ డౌన్ విధించాల్సినంత మెడికల్ ఎమర్జెన్సీ కమ్ముకొస్తే, రోగనిర్ధారణ కేంద్రాలు, దూరావాస (క్వారంటీన్) కేంద్రాలు దేశవ్యాప్తంగా ఎన్ని ఎంతమందికి అందుబాటులో ఉన్నాయి, వాటి గురించిన సమాచారం సామాన్యుడికి ఎంత ఉన్నదీ అనేది ప్రశ్నే ! మనం ఊహించిన దానికన్నా ఎక్కువ మందిని స్క్రీనింగ్ చేయాల్సి వస్తే, వేల సంఖ్యలో రోగులు నమోదౌతుంటే సమర్థవంతంగా ఎదుర్కోగలమనే భరోసాని ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వాలి!
ఎన్నికల ప్రచారం కోసం మైకులతో ధ్వనికాలుష్యానికి కారకులయ్యే నాయకులు సమస్త ప్రజానీకం అనేక కష్టనష్టాల కోర్చి పాటించవలసిన నియమాలని మాత్రం ప్రజల్లో ప్రచారం చేయటం లేదు. రేపు ఎన్నికల్లో ఇలానే మైకు ప్రచారం మానేసి, టీవీ ప్రెస్ మీట్లతో సరిపెట్టగలరా? మునిసిపాలిటీలు, పంచాయితీలు భద్రతా చర్యల గురించి కనీస ప్రచారం చేయక పోవటం విచారకరం. వీధివీధికి, ఇంటింటికీ కరోనా సమాచారాన్ని చేర్చి, ప్రజల్లో చరోసా నింపి, యుద్ధానికి సన్నద్ధం చేయటమే తరుణోపాయం.
మలేరియా ఉద్యోగి ఇంటింటికీ వచ్చి కుశలం కనుక్కున్నట్టు, ఒంట్లో నలతగా ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ జరగాలి. వైరస్ కలిగి ఉన్న వారినీ, రోగలక్షణాలు ప్రారంభమైన వారిని కేవలం ఇంటికి పరిమితం చేసి బయటకు రాకుండా చేస్తే, ఇంట్లో అందరికీ వ్యాధిని అంటించి జలుబు బిళ్ళలు, జ్వరం బిళ్లలో సరిపెట్టేయాలని చూస్తారు. మరణాల సంఖ్య పెరగటానికి ఇది ఒక కారణం అవుతుంది. కరోనా రోగిని గుర్తించే ప్రయత్నం ప్రభుత్వ పరంగా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి.
మాటిమాటికీ మోచేతులదాకా వెనకా ముందు ఎలా కడగాలో, దగ్గు, తుమ్ము వస్తే తుంపర్లు పడకుండా ఎలా మాస్కులు వాడాలో నేర్పటం అవసరమే! అందుకు సర్జికల్ మాస్కుల్ని దుర్వినియోగ పరచవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ గట్టిగా చెప్తోంది. శాస్త్రీయంగా తయారైన కాటన్ మాస్కుల్ని కుట్టించి ప్రభుత్వం పంపిణీ చేయాలి. మార్కెట్లో ఒక్కో మాస్కుని 250 నుండి 3,000 దాకా అమ్ముతున్నారు. సగటు మానవుడు ఒక మాస్కుకోసం అంత ఖర్చు భరాయించలేడు. కనీసం సబ్సిడీ ధరకైనా వాటిని అందించాలి. స్వచ్చంద సంస్థల సేవల్ని ఇందుకు ఉపయోగించుకోవచ్చు కూడా!
కరోనా అనేది వ్యక్తులు చేసిన స్వంత తప్పుల వలన రావటం లేదు. కేవలం గ్రహపాటు… అంతే! వ్యాధి ఉన్నట్టు తేలిన వ్యక్తుల్ని దూరవాసంలో ఉంచేప్పుడు వైద్య సిబ్బంది, రక్షణ సిబ్బంది వారితో గౌరవ పూర్వకంగా వ్యవహరించాలి. తప్పు చేసిన వాణ్ణి లాకప్పులో పెట్టినట్టు చూడకూడదు. కరోనా పాజిటివ్ వ్యక్తి ఈ దూరావాసాన్ని అమానుషమైన శిక్షగా భావించి ఆసుపత్రి లోంచి పారిపోవటం లాంటి వార్తలు చదవాల్సి వస్తుంది. అలా పారిపోయినవ్యక్తి నిజంగానే నడిచే కాళనాగు. ఎందరిని కాటు వేస్తాడో తెలీదు. అందుకు కారకులు ఎవరౌతారు?
పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలు బందయినందువలన తెల్లకార్డుల వారికి నిత్యావసరాల సరఫరా, ఆర్థిక సాయం వగైరా సదుపాయాలు ప్రకటించారు! కానీ, తెల్లకార్డులు లేనివారు, మధ్యతరగతి ప్రజలు ఇంటికి పరిమితంగా దూరవాసం విధించుకుని ఉంటున్నారు కాబట్టి, వారికి కూడా ప్రభుత్వ అండ అవసరమే! తెల్లకార్డులున్నవారే మనుషులన్నట్టు, ఇతరులతో సంబంధం లేనట్టు వ్యవహరించే సమయం ఇది కాదు. మహమ్మారి వ్యాపించినప్పుడు భయంతో వణికిపోకుండా ప్రజలందరికీ భరోసా కావాలి. ప్రభుత్వాలనుండి ప్రజలు ఆశిస్తున్నది అదే! కరోనా ఇన్సూరెన్సు అసాధ్యమా?
కరోనా వైరస్ ఎవరికి ఎప్పుడు సోకుతుందో తెలీదు. ప్రైవేట్ ఇన్సూరెన్సు కంపెనీలు తమ కవరేజిలో కరోనా లేదని ఇన్సూరెన్సు మొత్తాన్ని ఎగొట్టినా ఆశ్చర్యం లేదు. ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించాలి.
కరోనా జబ్బు వచ్చిన వ్యక్తికి వైద్యానికయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వం భరిస్తుందా? ఆ ఒక్కడి మీదే ఆధారపడి సంసారం ఉంటే ఆ ఇల్లు గడవటం ఎలా? కనీసం 30 రోజుల మానిటరింగ్ అవసరం అవుతుంది. తక్కువ మొత్తంలో ప్రీమియం నిర్దేశించి, కరోనా ఇన్సూరెన్సు ప్రవేశపెడితే, దేశీయులందరికీ మేలుకలుగుతుంది. వ్యాధి అవగాహన కూడా పెరుగుతుంది.
తక్కువ ధరకుగానీ, వీలైతే ఉచితంగా నమ్మకమైన రిపోర్టు వచ్చేలాగా కరోనా వైరస్ పరిక్షా కేంద్రాలు మరిన్ని తెరవాలి. రాష్ట్రం మొత్తానికి ఒకటి ఉంటే సరిపోయే పరిస్థితి కాదు
కరోనా మొదటి దశను దాటి రెండవ దశలోకి ప్రవేశిస్తోందిప్పుడు. మొదటి దశలో హెచ్చరికలే! రెండవదశలో గృహనిర్బంధం, స్వీయ దూరవాసం అవసరం అవుతాయి. మూడవ దశలో ప్రమాద ఘంటికలు మోగాయని అర్థం. కర్ఫ్యూ లాంటి వాతావరణంలో అవసరం అయితే మిలటరీని దింపి మనుషుల్ని కట్టడి చేయవలసి వస్తుంది. చైనా మూడు దశల్నీ అధిగమించింది. అమెరికా మూడవ దశలోకి చేరుతోంది. మనం రెండవదశలోకి అడుగుపెడుతూనే లాక్’ డౌన్ లాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నాం ఇది సరయిన సమయంలో సరయిన దిశలో తీసుకున్న సరయిన నిర్ణయం. చైనా నుండి నేర్చుకోవలసిన గుణపాఠాలు ఇంకా చాలా ఉన్నాయి. రెండవదశతోనే కరోనా భారతదేశంలో అంతం అయిపోవాలి. అపోహల్ని పోగొట్టి, అవగాహన పెంచి, ప్రజలను సన్నద్ధుల్ని చేయాలనేదే విజ్ఞప్తి.
-కళారత్న డా. జి.వి. పూర్ణచందు