(సాంస్కృతిక ప్రేమికుడు జి.ఎల్.ఎన్.మూర్తి ప్రథమ వర్దంతి ఆగస్ట్ 7 న)
సాంస్కృతిక రంగం అంటే ప్రాణం ఇచ్చేటోడు. చెత్త ప్రదర్శన అయినా ఓపికగా చివరి వరకు ఆసక్తిగా చూసేటోడు. నాటకం అంటే సొంత ఖర్చు పెట్టుకుని ఎంత దూరం అయినా ప్రయాణించేటోడు. ప్రతిభ ఎక్కడ వున్నా వెతికి పట్టుకుని ప్రోత్సహించేటోడు. తెలుగు భాష వికాసం కోసం పరితపించేటోడు. తెలుగుకు అన్యాయం జరిగిందని ట్యాంక్ బండ్ పై ఉద్యమం చేసినోడు. మానవత్వం కనుమరుగు అయిపోతోంది అంటూ ప్రజాహక్కుల కోసం పోరాడినోడు. అట్టడుగు వర్గాలకు అండగా నిలిచి ఎందరికో గుప్తంగా దానాలు చేసినోడు.
సెంట్రల్ యూనివర్సిటీలో ఫిజిక్స్ ల్యాబ్ లో విధులు నిర్వహిస్తూ, క్రింది ఉద్యోగుల పక్షాన నిలిచి సలహాలు ఇస్తూ పెద్ద దిక్కుగా నిలిచినోడు. రవీంద్రభారతిని నాకు పరిచయం చేసినోడు! కళారంగానికి అండగా ఉండాలని దశ దిశా నిర్దేశనం చేసినోడు. హైదరాబాద్ నుంచి కూచిపూడి, తిరుపతి, చెన్నై, ఢిల్లీ, మౌంట్ అబూ, ఒకటేమిటి ఎన్నో ఊర్లు తిప్పినోడు. ఆఖరకు అమెరికా వరకు నన్ను వెంట పెట్టుకుని తిరిగినోడు.
కళాకారులకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చినోడు. ఎందరికో మార్గదర్శకులుగా నిలిచినోడు. ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో ఎందరో కళాకారులకు వేదిక కల్పించి ప్రపంచానికి పరిచయం చేసినోడు. ఒక్కసారి అతను ఇంటర్వ్యూ చేస్తే బావుండు అని ఎందరో కళాకారులు ఎదురు చూసేలా ఒక క్రేజ్ తీసుకొచ్చినోడు. మంచి ప్రదర్శన నేను మిస్ అయితే, మరుసటి రోజు ఉదయాన్నే ఫోన్ చేసి గంటలు గంటలు వివరించేటోడు. ఎవరైనా కళాకారుడు మంచి పద్యం పాడితే వెంటనే ఫోన్ చేసి వినమనేటోడు. నంది నాటకోత్సవాలు ఎక్కడ జరిగినా, జరిగినన్ని రోజులు ఇద్దరం ఆ ఊర్లో హోటల్ లో ఒకే గది లో ఉండాలని పట్టుబట్టి ఉంచేటోడు! ఆ ప్రదర్శనల గురించి గంటలు గంటలు చర్చించేటోడు. ఏ ఊరు వెళ్లినా ఉదయాన్నే అన్ని దిన పత్రికలూ తెప్పించి ఆద్యంతం చదివి మంచి వార్తలను ఎంతో ఓపికగా విశ్లేషించేటోడు. రఫీ నా పిల్లోడు అంటూ ఎందరికో పరిచయం చేసి నిలదొక్కుకునేందుకు మంచి బాట వేసి గుర్తింపు తెచ్చినోడు.
దురదృష్టవశాత్తు గత ఏడాది కరోనా బారిన పడి ఆకస్మికంగా తిరిగి రాని లోకాలకు వెళ్లినోడు! అతనే… సాంస్కృతిక పిచ్చి పిపాసి జి.ఎల్.ఎన్.మూర్తిగారు. అతని లేని కళారంగం వెలవెలబోతోంది. మొదటి వరసలో కూర్చునే అర్హత ఉన్నప్పటికీ ఎప్పుడూ నాలుగో వరసలో చివరి సీట్ లోనే కూర్చునేటోడు. ఆ సీటు కూడా కన్నీరు కారుస్తోంది. మనసున్నోడు, మానవతావాది, కళా అర వీర భయంకర ప్రేమికుడు, ఆత్మీయ మిత్రుడు, గురు తుల్యులు మూర్తి గారి తొలి వర్ధంతి ఇవాళ. ఆయన లేకుండా అప్పుడే ఏడాది గడచిపోయింది. కన్నీటి శ్రద్ధాంజలి.
- డాక్టర్ మహ్మద్ రఫీ