చలనచిత్ర పితామహుడు ‘దాదా సాహెబ్ ఫాల్కే ‘

అతడి అంకిత స్వభావం, కృషి, జిజ్ఞాస ఫలితంగా మనదేశంలో చలనచిత్ర రంగం ఆవిష్కారమైంది. ఇది జరిగి తొంభై సంవత్సరాలకు పైగానే అయింది. తొలి చలనచిత్రాలు మూగవి. వాటిద్వారానే మన ప్రేక్షకులు భారతీయ దేవుళ్ళను తెరపై చూడగలిగారు. వాటి ఆవిష్కర్త దాదా సాహెబ్ ఫాల్కే గా పిలుచుకునే దుండీరాజ్ గోవింద్ ఫాల్కే. అతడు భారత చలనచిత్ర పితామహుడిగా గణుతికెక్కిన మహనీయుడు. ఫాల్కే వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు.

ఫాల్కే తొలి రోజులు: భారత చలనచిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే మహారాష్ట్ర లోని నాసిక్ కు దగ్గరలో వుండే త్రయంబకేశ్వర్ లో 30, ఏప్రిల్ 1870న జన్మించారు. జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చదివిన తరవాత బ్రోదాలోని కళాభవన్ లో చిత్రకళ అభ్యసించారు. ఫోటోగ్రఫీ, మూడు రంగుల బ్లాక్ మేకింగ్, పింగాణి వస్తువుల తయారీలో కూడా శిక్షణ పొందారు. ఫొటోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్నారు. 1908లో ఫాల్కే ఆర్ట్ ప్రింటింగ్ & ఎంగ్రేవింగ్ వర్క్స్ అనే దుకాణం తెరచి రాజా రవివర్మ తైలవర్ణ చిత్రాలను ఫోటోలిథో ప్రింట్లుగా మార్చి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. జర్మనీకి వెళ్లి మూడురంగుల కలర్ ప్రింటర్ ను తీసుకొచ్చి కలర్ ప్రింట్లను వేయడం మొదలుపేట్టారు. 1910 లోఫాల్కే “ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్” అనే సినిమా చూడడం తటస్థించింది. భారతీయ కథలను మనదేశంలోనే సినిమాలుగా ఎందుకు నిర్మించ కూడదు అనే ఆలోచన అతని మెదడును తొలిచేసింది. అంతే… కొంత డబ్బును సేకరించి కొన్ని లఘు చిత్రాలను నిర్మించడం మొదలెట్టారు. సినిమా నిర్మాణంలో మెళకువలు అధ్యయనం చేసేందుకు 1912లో ఫాల్కే లండన్ పయనమయ్యారు. అక్కడ వాల్టన్ స్టూడియోలో సిసిల్ హెప్వర్త్ వద్ద శిక్షణపొంది విలియమ్స్ మూవీ కెమెరాతో భారత్ వచ్చేశారు. బొంబాయి దాదర్ మెయిన్ రోడ్డులో “ఫాల్కే ఫిలిమ్స్” సంస్థను స్థాపించారు. అతని భార్య సరస్వతి అతనికి చేదోడువాదోడుగా ఉంటూ స్టూడియో బాధ్యతలు నిర్వహించేవారు. అలా తన తొలిచిత్రం “రాజా హరిశ్చంద్ర” నిర్మాణానికి 1913లో శ్రీకారం చుట్టారు. తరవాత తన కంపెనీని నాసిక్ కు మార్చారు.

Dadasaheb Phalke

ఫాల్కే తొలి సినీ అడుగులు: “రాజా హరిశ్చంద్ర” మూకీ సినిమాకు మరాఠీ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో సబ్ టైటిల్స్ వేయడంతో, తొలి మరాఠీ మూకీ చిత్రంగా ఈ సినిమా గుర్తింపు పొందింది. నలభై నిమిషాల నిడివిగల ఈ సినిమాను నాలుగు రీళ్లతో ఒకే ఒక ప్రింటుగా నిర్మించడం జరిగింది. రాజా రవివర్మ చిత్తరువుతో ఈ సినిమా మొదలవు తుంది. మరాఠీ రంగస్థల నటుడు దత్తాత్రేయ దామోదర దబ్కే హరిశ్చంద్రుడుగా, అన్నా సాలుంకే తారామతి గా, ఫాల్కే కుమారుడు బాలచంద్ర లోహితాస్యుడుగా, జి.వి.సానే విశ్వామిత్రుడుగా నటించారు. చంద్రమతి వేషం వేసేందుకు ఎవరూ ముందుకు రాక పోవడంతో ఫాల్కే దేవదాసీలను కూడా ప్రయత్నించారు. ఆ ప్రయత్నం కూడా విఫలమవడంతో అన్నా సాలుంకే అనే రంగస్థల నటుడి చేత తారామతి వేషాన్ని కట్టించారు. ఈ సినిమా ప్రీమియర్ ప్రదర్శన 21 ఏప్రిల్ 1913న బొంబాయి ఒలింపియా థియేటర్ లో నిర్వహించారు. తరువాత బొంబాయి కోరోనేషన్ సినిమా హాలులో 3 మే 1931న ప్రజలకు ప్రధమ ప్రదర్శన ఇచ్చారు. ఈ చిత్ర విజయంతో “సత్యవాన్ సావిత్రి”, “లంకా దహన్”, “శ్రీకృష్ణ జన్మ”, కాళీయ మర్దన్” వంటి మూకీ సినిమాల నిర్మాణాన్ని కొనసాగించారు. 1914లో ఈ సినిమాల ట్రేడ్ షోలు నిర్వహించేందుకు లండన్ వెళ్లి అధునాతన పరికరాలను తీసుకొచ్చారు. ఆ తరవాత 1918లో ఫాల్కే ఫిలిమ్స్ సంస్థను మూసివేసి “హిందూస్తాన్ సినిమా ఫిలిమ్స్” అనే నూతన సంస్థను స్థాపించారు. స్టూడియో నిర్మించారు. అదే బ్యానర్ మీద 44మూకీ సినిమాలు ఫాల్కే నిర్మించారు. ఆ స్తూడియోని ఒక మోడల్ గా రూపుదిద్ది, కళాకారులకు, సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇచ్చారు. 1920 ప్రాంతంలో అతనికి భాగస్వాములతో పేచీ వచ్చింది. ఆ సంస్థకు తిలోదకాలిచ్చి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సినిమా నిర్మాణరంగం నుంచి తప్పుకోవడమే ఆ నిర్ణయం. కొన్నాళ్ళకు హిందూస్తాన్ ఫిలిమ్స్ కూడా మూతబడిపోయింది.

చిత్ర విశిష్టతలు:

ఫాల్కే సినీరంగం నుంచి తప్పుకున్న తరవాత ‘రంగ భూమి’ అనే నాటకాన్ని రాశారు. ఆ రంగస్థల నాటకం చాలా ప్రదర్శనలకు నోచుకుంది.

కాలం మారడంతో మారుతున్న సాంకేతికతకు ఎదురు నిలవలేక సినిమా నిర్మాణం నుంచి ఫాల్కే తప్పుకోవడం కూడా ఒక బలమైన కారణమే.

ఫాల్కే నిర్మించిన ఆఖరి మూకీ సినిమా ‘సేతుబంధన్’ (1932) ని తరవాత సౌండ్ ట్రాక్ తో అనుసంధానించి విడుదల చేశారు. ఆ సినిమా బాగా ఆడింది.

ఫాల్కే నిర్మించిన ఆఖరి సినిమా ‘గంగావతరణ్’. ఈ చిత్రం 1937లో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన తరవాత ఫాల్కే నాసిక్ వెళ్ళిపోయారు. అక్కడే 16, ఫిబ్రవరి 1944 లో చనిపోయారు.

ఫాల్కే నిర్మించిన మరికొన్ని సినిమాలు… ‘బుద్ధదేవ్’, ‘శ్రీకృష్ణ జన్మ’.

2009 లో ప్రముఖ మరాఠీ దర్శక నిర్మాత ‘హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ’ పేరిట ఒకసినిమా నిర్మించారు. అందులో ‘రాజా హరిశ్చంద్ర’ సినిమా నిర్మాణానికి దాదా సాహెబ్ ఫాల్కే ఎంత కష్టపడింది చూపారు. మనదేశం నుండి ఆంగ్లేయేతర భాషల కోవలో ఆస్కార్ అవార్డు కోసం ఈ సినిమాను అధికారిక ఎంట్రీగా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది.

బొంబాయిలో భారతీయ సినిమా జూబిలీ ఉత్సవాల సందర్భంగా 1939 లో దాదా సాహెబ్ ఫాల్కే కు బహుమతిగా ఐదు వేలు బహూకరించారు.

భారత ప్రభుత్వం 1969 లో దాదాసాబ్ ఫాల్క్ పేరుతో చలన చిత్రపు అత్యున్నత పురస్కారాన్ని నెలకొల్పింది. చలనచిత్ర అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ ప్రతిష్టాకర బహుమతి అందజేస్తారు. తొలి బహుమతి దేవికారాణికి ప్రదానం చేశారు.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap