‘దర్శక కేసరి దాసరి’ పుస్తకంలో ఏముంది?

బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి నారాయణరావు గారివి బోలెడన్ని ఇంటర్వ్యూలు చదివాను/చూశాను. దాసరి గారిని ఇంటర్వ్యూల నిమిత్తం చాలాసార్లు కలిశాను.
ఒక రకంగా ఆయన జీవితం ‘తెర’చిన పుస్తకమే.
మరి ఆయన గురించి కొత్తగా ఇంకేం చెబుతారు!?

నందం హరిశ్చంద్రరావు గారి ‘దర్శక కేసరి దాసరి’ (దాసరి సమగ్ర సంచలన జీవిత దర్పణం) పుస్తకం చూడగానే నాలో రేగిన మొదటి ప్రశ్న అది.
దాసరి గారి గురించి ‘దర్శక కేసరి దాసరి’లో కొత్తగా ఏం రాసి ఉంటారు?

400 పేజీల పుస్తకం ఇది. చదవడం మొదలు పెడితే ఆపలేనంత, వదిలి పెట్టలేనంత బిగితో, జిగితో రాశారు నందం హరిశ్చంద్రరావు గారు. ఆయనేం చేయి తిరిగిన రచయిత కాదు. కానీ, దర్శకత్వ శాఖలో విశేషానుభవం ఉంది. దాసరి గారితో ఏళ్లకు ఏళ్లు క్లోజ్‌గా అసోసియేట్ అయ్యారు.
అదే ఆయన పెట్టుబడి.
గురువు గారి మీద ప్రేమ – గురువు గారి మీద భక్తి – గురువు గారిచ్చిన జ్ఞాపకాలు –
ఇవే ఆయన ఈ పుస్తకం రాయడానికి ధైర్యం ఇచ్చినట్టున్నాయి.
ఈ రోజుల్లో పుస్తకం రాయడం ఎంత కష్టమో, రాసిన పుస్తకాన్ని సొంతగా పబ్లిష్ చేసుకోవడం అంతకన్నా కష్టం. ఈ రెండు కష్టాల్ని చాలా ఇష్టంగా స్వీకరించినట్టున్నారు హరిశ్చంద్రరావు గారు.
70 ఏళ్ల వయసులో చాలా పెద్ద భారమే తలనెత్తుకున్నారాయన.

గురువు గారి లాగానే మహా పట్టుదల గల వ్యక్తి ఆయన. దాసరి గారి జీవితంపై పుస్తకం తీసుకురావాలని అనుకున్నారు… ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తెచ్చారు! అందుకోసం స్థలం కూడా తాకట్టు పెట్టడానికి కూడా వెనుకాడలేదాయన.

ఎంతో రేసీగా రాశారు ఈ పుస్తకాన్ని. తెలిసిన విషయాల కన్నా తెలియని విషయాలే ఎక్కువ కనిపిస్తాయి.
కొన్ని వివాదాస్పద అంశాల్ని కూడా అలా తెలివిగా టచ్ చేసుకుంటూ వెళ్లారు.
కృష్ణంరాజుతో డిస్కషన్ – చిరంజీవితో తేడా –
రామోజీరావుతో విరోధం – అన్నపూర్ణ స్టూడియోస్ వివాదం –
వీటినన్నిటినీ రేఖామాత్రంగా చెప్పుకుంటూ వెళ్లడం బాగుంది.
సందర్భోచితంగా రామాయణం, భారత, భాగవతాల్లోని అంశాలు, వేమన పద్యాలు, ఇంగ్లీషు కొటేషన్లు వాడటం వల్ల ఒక సంపూర్ణత్వం వచ్చినట్టయ్యింది.
అంతర్లీనంగా ఒక ఫిలసాఫికల్ టచ్ కనపడటం ఈ పుస్తకంలోని గొప్పతనం. “ఆకాశానికి, చందమామకి కూడా అమావాస్య రోజు ఎడబాటు తప్పదు’’ లాంటి వెంటాడే వాక్యాలు ఒక ఎమోషన్‌ని కలిగిస్తాయి.

ప్రముఖుల ఆత్మకథలు, జీవిత చరిత్రలు రావాల్సిన ఆవశ్యకత గురించి చెబుతూ, బాలీవుడ్ సూపర్‌స్టార్ దిలీప్ కుమార్ ఎగ్జాంపుల్ చెప్పడం భలే ఇంటరెస్టింగ్‌గా అనిపించింది. దాసరి దర్శకుడయ్యాక పాలకొల్లులో ఉన్న తండ్రికి కారు పంపితే, ఆయన తిప్పి పంపించే సందర్భం మనసుని కదిలిస్తుంది. ఇలాంటి ఇంటరెస్టింగ్ ఇన్సిడెంట్స్ ని బాగా కాప్చర్ చేశారు.
దాసరి గత జన్మలో కేరళలో నంబూద్రి వంశానికి చెందినవాడనే అంశం చాలా ఆసక్తిగా అనిపిస్తుంది.
‘‘దర్శకుడిగా సూపర్ హిట్! తండ్రిగా ఫెయిల్’’ అంటూ నిక్కచ్చిగా రాయడానికి ధైర్యం ఉండాలి. ఈ పుస్తకంలో ఆ ధైర్యం వుంది.

పుస్తకమంతా ఒకెత్తు… దాసరి, దాసరి పద్మ గార్ల ఆఖరి ప్రస్థానం ఇంకో ఎత్తు. ఆ ఎపిసోడ్స్ ని కళ్ళకు కట్టినట్టుగా రాశారు నందం హరిశ్చంద్రరావు గారు. అవి చదువుతుంటే గుండె బరువెక్కడం ఖాయం. ఈ రెండు ఎపిసోడ్ల కోసమైనా ఈ పుస్తకం కొని, చదివి తీరాల్సిందే!

ఈ పుస్తకం ఎందుకు కొనాలి? ఎందుకు చదవాలి?
దాసరి పోరాట పటిమ – దాసరి నాయకత్వ లక్షణం –
మనుషుల్ని డీల్ చేసే తీరు – క్రైసిస్ మానేజ్మెంట్-
శత్రువుల్ని కూడా మిత్రుల్ని చేసుకునే లక్షణం – తప్పుల్ని ఎదిరించే గుణం –
తనను నమ్ముకున్నవారితో పాటు కార్మికులకు అండగా నిలబడాలనుకునే విశాల హృదయం –
ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో, వంచాలో తెలిసిన చాణక్యం –
భోళాతనం – చేసిన తప్పులు – పొరపాట్లు –
తప్పుల్ని సరిదిద్దుకునే మొండితనం –
ఒంటి చేత్తో ఎదురీత – సమయస్ఫూర్తి –
ఇవన్నీ భావితరాలకు పాఠాలు, గుణపాఠాలు.
అందుకే ఈ పుస్తకం చదవాలి. తప్పులు, అక్షర దోషాలు ఏ పుస్తకంలోనైనా ఉంటాయి. ఓ పెద్దాయన ప్రేమించి చేసిన ఈ బృహత్తర ప్రయత్నంలో లోపాలని భూతద్దంలో పెట్టి చూడకూడదు.
కంటెంట్ బావుంది. లే అవుట్ బాగుంది. మన లైబ్రరీలో కచ్చితంగా ఉండి తీరాల్సిన పుస్తకం ఇది.
పుస్తకం కావాలనుకునేవారు రచయిత నందం హరిశ్చంద్రరావు గారిని సంప్రదించండి.

పులగం చిన్నారాయణ

పుస్తకం వెల : Rs. 500/-
హరిశ్చంద్రరావు ఫోన్ నంబర్లు:
9848384469
9963833368

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap