సినారె భవన్ కు నటి రేఖ ‘కోటి’ విరాళం!

ఆధునిక మహా కవి సౌర్వ భౌమ సినారె… సింగిరెడ్డి నారాయణ రెడ్డి. వచన కవిత్వం లో మేరు శిఖరం. గజల్స్ రాయడం లో మహా జలపాతం. సినిమా పాటల్లో ఆయానొక మహా సముద్రం. ఉస్మానియా తెలుగు శాఖ పగ్గాలు చేపట్టినా, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సెలర్ గా దశ దిశ చాటి చెప్పినా, రాజ్యసభ సభ్యులుగా, సాంస్కృతిక మండలి చైర్మన్ గా, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, సారస్వత పరిషత్ అధ్యక్షులుగా రారాజుగా ఆయా పదవులకు హుందాతనం తెచ్చినా, కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణుడు అయినా, విశ్వంభరుడి గా నిలిచి జ్ఞానపీఠం కోటను సొంతం చేసుకున్నా… ఏం చేసినా ఆయనకే చెల్లింది. తెలంగాణ కే కాదు ప్రపంచం లోని తెలుగు వారికి తెలుగు భాష కు ఆయన సుగుణాభరణం.

అలనాటి బాలీవుడ్ నటీమణి రేఖను మెచ్చుకుని తీరాల్సిందే. తెలంగాణ కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో నిర్మించ తలపెట్టిన సి. నారాయణరెడ్డి గారి స్మృతి భవన్ కోసం కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ విషయం పూర్వ గవర్నర్ కె. విద్యాసాగర్ గారు తెలిపారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతి లో సినారె 92వ జయంతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వంతో పట్టించుకోకుండా సినారె స్వగ్రామం హనుమాజీ పేట్ లో స్మృతి వనం కూడా అద్భుతంగా నిర్మించుకున్నారు. ఇప్పుడది సాహిత్య లోకానికి పర్యాటక ప్రదేశంగా మారింది. రేఖ ప్రత్యేకంగా సినారె పై అభిమానంతో కోటి రూపాయలు విరాళం ఇవ్వడం మామూలు విషయం కాదు.

సినారె కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన జాతీయ పురస్కారం ఈసారి బాలివుడ్ రచయిత కవి జనాబ్ జావెద్ అక్తర్ స్వీకరించారు. సినారె కవిత్వం అద్భుతంగా ఉంటుందని మానవీయ కోణం తో రాస్తారని విన్నానని, ఆంగ్ల అనువాదాలు ఉంటే తనకివ్వాలని ఆయన కోరారు. ఈ వేడుకలో మహారాష్ట్ర పూర్వ గవర్నర్ శ్రీ కె. విద్యాసాగర్, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్య, నేషనల్ బుక్ ట్రస్ట్ సంపాదకులు డా. పత్తిపాక మోహన్, సినారె మనవరాలు యువ కవయిత్రి వరేణ్య, పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ గారు స్పందించాలి. బంజారాహిల్స్ లో కేటాయించిన స్థలంలో భూమి పూజ కూడా జరిగింది కానీ, ఒక్క ఇటుక కూడా పడలేదు. వెంటనే తగిన నిధులు కేటాయించాలి. సినారె భవన్ నిర్మాణం పూర్తి చేయాలి. అక్కడ సినారె గ్రంధాలయం, ఆడిటోరియం అందుబాటులోకి రావాలి. కవులు రచయితలు తమ పుస్తకాలను ఆవిష్కరించుకునేందుకు ఉచితంగా కేటాయించాలి. సాహితీ వేత్తలతో చర్చ వేదికలతో సినారె భవన్ కళ కళ లాడుతూ ఉండాలి. సినారె నిలువెత్తు విగ్రహం నెలకొల్పాలి. వెరసి అదొక గొప్ప పర్యాటక ప్రదేశంగా తీర్చి దిద్దాలి. దాశరధి, కాళోజిల పేరిట రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు ఏర్పాటు చేసినట్లుగా సినారె పేరిట జాతీయ పురస్కారం ఏర్పాటు చేయాలి.

-డా. మహ్మద్ రఫీ

2 thoughts on “సినారె భవన్ కు నటి రేఖ ‘కోటి’ విరాళం!

  1. వెంటనే తగిన నిధులు కేటాయించాలి. సినారె భవన్ నిర్మాణం పూర్తి చేయాలి. అక్కడ సినారె గ్రంధాలయం, ఆడిటోరియం అందుబాటులోకి రావాలి. కవులు రచయితలు తమ పుస్తకాలను ఆవిష్కరించుకునేందుకు ఉచితంగా కేటాయించాలి. సాహితీ వేత్తలతో చర్చ వేదికలతో సినారె భవన్ కళ కళ లాడుతూ ఉండాలి. సినారె నిలువెత్తు విగ్రహం నెలకొల్పాలి. వెరసి అదొక గొప్ప పర్యాటక ప్రదేశంగా తీర్చి దిద్దాలి. దాశరధి, కాళోజిల పేరిట రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు ఏర్పాటు చేసినట్లుగా సినారె పేరిట జాతీయ పురస్కారం ఏర్పాటు చేయాలి……………. అత్యాశ.

  2. గ్లామర్ తో పాటు గ్రామర్ తెలిసిన రేఖ *సినారే భవన్* కు కోటి విరాళం అభినందనీయం.
    సి నారాయణ రెడ్డి లా తెలుగు సాహిత్యం హుందాతనం చూద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap