మహాచిత్రకారుడు నేర్పిన ‘జీవిత’పాఠం

చందమామ చిత్రకారుడు శంకర్ గారితో బాలల పత్రికారంగ చిత్రకారుడు దేవీప్రసాద్ గారి జ్ఞాపకాలు ….
అది 1976వ సంవత్సరం... చెన్నై మహానగరంలో చిత్రకారుడిగా బ్రతికేందుకు వెళ్ళి, బాలల పత్రిక బుజ్జాయిలో ఆరంభించిన ప్రయాణం, వసంతబాల, బాలమిత్ర, బాలభారతి వంటి ఆనాటి ప్రముఖ బాలల పత్రికలలో కథాచిత్రకారుడిగా జీవితం సాగుతున్న సమయం. చిత్రకారుడిగా జీవితం మలుచుకోవాలనే అభిప్రాయానికి చిన్ననాటనే బీజం వేసిన చందమామ పత్రిక ఆఫీసు చూసేందుకు, నా ఆరాధ్య దైవాలవంటి చిత్ర, శంకర్, వ.పా.లను కలిసి, వారి ఆశీశ్శులు తీసుకొందామనే ఆశతో, చిత్రకార మిత్రుడు ప్రియతమ్ రెడ్డితో కలిసి వెళ్ళడం జరిగింది.
ఐతే నా అదృష్టం పరిమితంగానే ఉంది. వ.పా.గారు వర్కులో ఉండి, గదిలోకి అనుమతించలేదు. చిత్రాగారు అనారోగ్యం వల్ల ఆరోజు రాలేదు ఇక మిగిలింది శంకర్ గారు. నా అదృష్టం పండి, వారి గదిలోకి ఆత్మీయంగా ఆహ్వానించారు. కుశలప్రశ్నలు, వివరాలు తెలుసుకొని, కాఫీతో సత్కరించి, నాబొమ్మలు చూపించమన్నారు. ఆనెలలో బుజ్జాయి, బాలమిత్ర పత్రికలలో నేను వేసిన చిత్రాలను వారికి చూపించాను. వారు చాలా మెచ్చుకొని, కొన్ని మెళకువలను చెప్పారు. చివరగా, నేను వేసిన చిత్రాల ప్రసక్తి తీసుకువచ్చి, “ఈ బొమ్మల్లో చందమామ శంకర్ కనబడుతున్నాడు గానీ, బొమ్మ వేసిన దేవీ కనబడడంలేదు! నువ్వు నన్ను అనుకరించు, కానీ నీలోని ఒరిజినాలిటీని బయటకు తీసుకురా! లైన్ డ్రాయింగు బావుంది, మంచి చిత్రకారుడివి అవుతావు.” అని ఆశీర్వదించారు. ఆపైన 1992 వరకూ సాగిన ఆంధ్రజ్యోతి వారి బాలజ్యోతి ఉద్యోగంతో, బాలలపత్రికారంగ చిత్రకారుడిగా నా జీవితానికి ఫుల్ స్టాప్ పడినా, వారి మాటలు మాత్రం ఎప్పుడూ గుర్తుండి, చిత్రకళారంగంలో, నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి ఎంతో దోహదపడ్డాయి.

With Shankar garu Gantasala Ratna kumar , Dharma Lingam, Devi Prasad, A.S. Murthy, Rakhi, Jaya, Gali Ankaiah and Abdulla

ఆతరువాత చెన్నైకి చెందిన చిత్రకారుడు, నాశిష్యుడు అయిన రాకీ 2018లో నన్ను శ్రీశంకర్ గారి ఇంటికి తీసుకువెళ్ళి వారితో, వారి ధర్మపత్ని, కుమార్తెలతో నేరుగా సంభాషించే అదృష్టాన్ని కలుగజేశాడు. అదే సమయంలో అక్కడి కళాసంస్థ శ్రీదర్శిని చిత్రకళాకూడం నిర్వాహకుడు ధర్మలింగంతో మాట్లాడి, వారు నిర్వహించే వార్షికోత్సవంలో శ్రీశంకర్ గారికి జీవనసాఫల్యం పురస్కారంతో సత్కరిద్దామనే ప్రసక్తికి అతను ఆనందంగా అంగీకరించేసరికి, ఆ కార్యక్రమం నిర్వహణలో రాకీతో బాటు నాకు కూడా భాగం దొరికింది. ఆ సభలో వేదికపైన శ్రీశంకర్ గారిని సత్కరించి గౌరవించిన వారిలో నేనుకూడా ఉండడం, వారి ప్రక్కన కూర్చునే ఆదృష్టం పొందడం, నా జీవితంలో నేను పొందిన మహాద్భాగ్యం!
శతాయురంతే, శివలోకమేతిః అన్నట్టు… దాదాపు నూరు సంవత్సరాల పరిపూర్ణ జీవితం గడిపిన శ్రీశంకర్‌గారు భౌతికంగా మనకు దూరమైనా, నాలాంటి చందమామ అభిమానుల గుండెల్లో శాశ్వతంగా నివశిస్తుంటారు. వారితో పొందిన ఈ ప్రత్యక్ష అనుభవం మీతో పాలుపంచుకునే భాగ్యం కల్పించిన 64 కళలు కళాసాగర్‌కు ధన్యవాదాలు.
దేవీప్రసాద్, బాలల పత్రికారంగ చిత్రకారుడు, గుంటూరు.

with artist Shankar garu Devi Prasad and Rakhi
Devi Prasad with artist Shankar couple

3 thoughts on “మహాచిత్రకారుడు నేర్పిన ‘జీవిత’పాఠం

  1. Devi Prasad garu is not only artist but also good writer . V good friend also. Very lovable person . Writing meaning for 4000 pasuras of Nalayiram Divya prabhandam for which DTP is in progress . Shortly will be published which will be useful for all vysnavites

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap