స్వర్ణయుగంలో దుక్కిపాటి ‘అన్నపూర్ణ’

అక్టోబర్ 2 వ తేదీకి భారతదేశ చరిత్రలో ఓ ప్రత్యేకత వుంది. జాతిపిత పూజ్య బాపూజీ జయంతి రోజది. దక్షిణ భారత సినీచరిత్రలో కూడా అక్టోబర్ 2 కి ఓ ప్రత్యేకత వుంది. 1952 సవత్సరం ఆదేరోజు ‘అన్నపూర్ణ’ చిత్రనిర్మాణ సంస్థ వూపిరి పోసుకుంది. కళాత్మక, సృజనాత్మక చిత్రనిర్మాణంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన కరదీపిక ‘అన్నపూర్ణ’. ఆ సంస్థ రథసారథి దుక్కిపాటి మధుసూదనరావు. ‘అన్నపూర్ణ’ సంస్థ తమ తొలి చిత్ర నిర్మాణానికి ప్రముఖ దర్శక నిర్మాత కె.వి.రెడ్డికి బయానా ఇచ్చినరోజు కూడా అదే. అప్పుడు కె.వి.రెడ్డి తన నిర్మాణతలో వాహినీ బ్యానర్ మీద ‘పెద్ద మనుషులు’ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తూవున్నారు. ఒక సినిమా నిర్మాణం పూర్తి కానిదే వేరొక సినిమాకు శ్రీకారం చుట్టడం ఆయన నిఘంటువులోనే లేదు. “నాదర్శకత్వంలో చిత్రాన్నినిర్మించాలంటే రెండు సంవత్సరాలు ఆగాలి. ఆగగలరా” అని కె.వి.రెడ్డి షరతు పెట్టారు. మరో నిర్మాత అయితే ఆ షరతుకి నీరుకారిపోవలసిందే…. కానీ అలా జరగలేదు. తొలి చిత్ర నిర్మాణం గొప్పగా వుండాలి… గొప్ప హిట్ కావాలి. ‘అన్నపూర్ణ’ సంస్థకు గొప్పగా గుర్తింపు రావాలి. తన స్కూల్ డేస్ నుంచి అన్నింటిలో ఫస్ట్ అనిపించుకున్న తను, చిత్రనిర్మాణంలో కూడా ఫస్ట్ అనిపించుకోవాలి అనేదే దుక్కిపాటి ఆశయం. అలాగే రెండేళ్ళు నిరీక్షణకు ఒప్పుకున్నారు. నిరీక్షణా కాలం పూర్తయింది. గొప్ప చిత్రాన్ని అందించాలనుకున్న ఆ నిర్మాత ఆశయం, తనకోసం రెండేళ్ళు నిరీక్షించిన నిర్మాతకు గొప్ప చిత్రాన్ని అందించాలన్న దర్శకుని కృషి ఫలించింది. 1955 అక్టోబర్ 2 (గాంధీ జయంతి రోజు) తొలిచిత్రం ‘దొంగరాముడు’ విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు … ఈ సినిమా స్క్రీన్ ప్లే మొదలు టేకింగ్ వంటి అంశాలను పుణె లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నేటికీ పాఠ్యాంశాలు గా చేర్చడం ‘దొంగరాముడు’ చిత్ర విశిష్టత. అంతటి విశిష్ట నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు వర్ధంతి (మార్చి 26) సందర్భంగా కొన్ని విశేషాలు.

దుక్కిపాటి నేపథ్యం:

దుక్కిపాటి మధుసూదనరావు, అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ సంస్థ కు కృష్ణార్జునులు. వారిలో దుక్కిపాటి ఆ సంస్థకు కర్త, కర్మ, క్రియ కూడా! కాస్త ముందుకెళ్లి చూస్తే, దుక్కిపాటిది గుడివాడ తాలూకా పెయ్యేరు గ్రామం. ఆయన జన్మించింది 27-జూలై 1917న. గంగాజలం, సీతారామస్వామి వారి తల్లిదండ్రులు. వారిది సంపన్న కుటుంబం. 1932లో దుక్కిపాటి ఇంటర్మీడియట్ ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. మెడిసిన్ లో చేరదామంటే కుటుంబ పరిస్థితులు అనుకూలించ లేదు. తండ్రిగారి ఆరోగ్యం దెబ్బతినడంతో వ్యవసాయం చూసుకోవలసివచ్చింది. తండ్రి ఆరోగ్యం కుదుటబడ్డాక బందరు నోబుల్ కళాశాలలో దుక్కిపాటి బి.ఏ డిగ్రీ చదివి ఇంగ్లిష్ సబ్జక్టులో స్వర్ణ పతకం సాధించారు. కాలేజీలో డ్రెమెటిక్ అసోసియేషన్ కు దుక్కిపాటి కార్యదర్శిగా వుంటూ ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. నాటకాలంటే ఆయనకు చాలా మక్కువ. ముదినేపల్లి లో ఎక్సెల్సియర్మ్ క్లబ్ వుండేది. తరచూ దుక్కిపాటి అక్కడకు వెళ్తుండేవారు. ఆ సమాజం పౌరాణిక నాటక ప్రదర్శనలు జరుపుతూ వుండేది. అయితే దుక్కిపాటి ధృక్పథం వేరేగా వుండేది. సాంఘిక నాటకాలైతే ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చనేది ఆయన ఉద్దేశ్యం. అలాగే తన ఉద్దేశ్యాన్ని క్లబ్ యాజమాన్యానికి సూచించారు. ఆ క్లబ్ నిర్వాహకులు అందుకు అంగీకరించి దుక్కిపాటిని క్లబ్ కార్యదర్శిగా ఎంపికచేసి, సాంఘిక నాటకాల ప్రదర్శనల బాధ్యతలను వారికి అప్పగించారు. అప్పట్లో గుడివాడ పాఠశాలలో కోనేరు కుటుంబరావు అనే తెలుగు మేస్టారు వుండేవారు. వారిని పిలిపించి ‘ఆశాజ్యోతి’ అనే నాటకాన్ని రాయించి ప్రదర్శనలు ఇచ్చారు. ఆలాగే సూరపనేని శోభనరావు అనే మరొక రచయిత చేత ‘సత్యాన్వేషణ’ అనే నాటకాన్ని రాయించి ప్రదర్శనలు నిర్వహించారు. ‘సత్యాన్వేషణ’ నాటకం వితంతు వివాహాలను, కుల, మత సంకుచిత భావాల నిర్మూలన వంటి నేపథ్యంలో నడుస్తూ ప్రగతిశీలక భావాలకు అద్దంపట్టింది. ఈ రెండు నాటకాలు 1941-44 మధ్యకాలంలో విస్తృతంగా ప్రదర్శనకు నోచుకున్నాయి. అయితే ఈ నాటకాలలో విప్లవ భావాలను ప్రేరేపించే విషయాలు వున్నాయని ప్రభుత్వం వీటి ప్రదర్శనలను నిషేధించింది. ఈ నాటకాలలో స్త్రీ పాత్రలు లేకుండడం లోటనిపించింది. ఆరోజుల్లో స్త్రీ పాత్రలు ధరించేందుకు మహిళలు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. ఆయా పాత్రలు ధరించేందుకు మగవారినే ఎంపికచేసేవారు. అప్పట్లో గుడివాడలో ‘విప్రనారాయణ’ అనే నాటకంలో దేవదేవిగా ఓ కుర్రాడు బాగా నటిస్తున్నాడనే విషయం దుక్కిపాటి దృష్టికి వచ్చింది. అప్పుడు దుక్కిపాటి, పెండ్యాల నాగేశ్వరరావు కలిసి ఆ కుర్రవాడి అన్నయ్య రామబ్రహ్మంతో మాట్లాడి తమ నాటక సమాజంలో ఆ కుర్రవాడిని చేర్చేందుకు ఒప్పించారు. ఆ కుర్రవాడే ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు. దుక్కిపాటి ప్రదర్శనలు నిర్వహించే నాటకాలలో అక్కినేనేని అలా స్త్రీ పాత్రలు పోషిస్తూ వచ్చారు. అయితే అక్కినేని భవిష్యత్తుకు మంచి పునాది వేయించాలని సినిమాలలో నటింపజేసేందుకు దుక్కిపాటి అక్కినేని ని తీసుకొని మద్రాసు వెళ్ళి అక్కడ దర్శకనిర్మాత ఘంటసాల బలరామయ్య గారికి పరిచయం చేశారు. ఇక అక్కినేని స్వయంకృషితో ఎంత ఎత్తుకు ఎదిగారో మనకు తెలిసిన విషయమే! దుక్కిపాటి విజయవాడలో జరిగిన పరిషత్ నాటకాలకు ప్రముఖ దర్శక నిర్మాత వి. శాంతారాం ను, కాకినాడలో నిర్వహించిన పరిషత్ నాటకాలకు పృధ్వీరాజ్ కపూర్ ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి ఆంధ్ర నాటక కళాపరిషత్ కు విశిష్ట సేవలు అందించారు. ఈ పరిషత్తు ద్వారా నాటక రంగానికి పరిచయమైన ఆచార్యఆత్రేయ, పింగళి నాగేంద్రరావు, డి.వి. నరసరాజు, పినిశెట్టి శ్రీరామమూర్తి వంటి రచయితలు, సావిత్రి, నిర్మలమ్మ, అక్కినేని, ఎన్.టి. రామారావు వంటి నటీనటులు సినీ రంగానికి వెళ్ళిపోవడంతో, దుక్కిపాటి దృష్టి సినిమారంగం మీదకు మళ్ళింది. సినిమాలు నిర్మించాలనే సంకల్పంతో మద్రాసు చేరారు.

అన్నపూర్ణ సంస్థ ఆవిర్భావం:

దుక్కిపాటి తల్లి అతని చిన్నతనంలోనే చనిపోతే, అతని సవతి తల్లి అన్నపూర్ణమ్మ దుక్కిపాటిని పెంచి పెద్దచేసింది. అందుకు కృతజ్ఞతగా దుక్కిపాటి ‘అన్నపూర్ణ’ పేరుతో సెప్టెంబరు 10, 1951 న ‘అన్నపూర్ణా పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థకు అక్కినేని నాగేశ్వరరావు చైర్మన్ గా, దుక్కిపాటి మేనేజింగ్ డైరెక్టర్ గా, నవయుగ పంపిణీ సంస్థ అధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావు మరి కొందరిని డైరెక్టర్లుగా తీసుకున్నారు. సంస్థకు ఛైర్మన్ అయినా అక్కినేని నిర్మాణ వ్యవహారాలలో ఎప్పుడూ కలుగజేసుకోలేదు. అక్కినేని ఒక గురువు వెంట శిష్యుడిలా దుక్కిపాటి వెంట నడిచారు. అక్కినేనికి ఆయనే ఫ్రండ్, ఫిలాసఫర్, గైడ్ కూడా. అక్కినేనిని నాటకాల్లో రాణింపజేసినా, సినిమాలలోకి ప్రవేశపెట్టినా అదంతా దుక్కిపాటి చలవే అనాలి. విధానపర నిర్ణయాలన్నీ దుక్కిపాటే తీసుకునేవారు. తమ సంస్థ తరఫున తొలి సినిమా బాగా రావాలి కదా అని మంచి దర్శకునికోసం అన్వేషించారు. తొలుత భానుమతి భర్త రామకృష్ణ ను దర్శకత్వం వహించమని కోరారు. రామకృష్ణకు అడ్వాన్స్ గా పదివేల రూపాయలు కూడా చెల్లించారు. కథా చర్చలు కూడా కొంత జరిగాయి. అయితే కొన్ని వ్యక్తిగత ఇబ్బందులవలన దర్శకత్వ బాధ్యతలు నిర్వహించలేనని రామకృష్ణ తెలపడంతో, దుక్కిపాటి బి.ఎన్.రెడ్డిని, పి. పుల్లయ్యను అడిగి చూశారు. అయితే వారిద్దరూ తమ సొంతచిత్ర నిర్మాణాలలో బిజీగా వుండడంచేత సున్నితంగా తిరస్కరించారు. అప్పుడే ‘పాతాళభైరవి’ చిత్రం తర్వాత కె.వి. రెడ్డి, నాగిరెడ్డి మధ్య గొడవలు వచ్చాయని, అందుచేత బయటి చిత్రాలు చేసేందుకు కె.వి. రెడ్డి సుముఖంగా వున్నారని తెలిసి అక్కినేని, దుక్కిపాటి ఇద్దరూ వెళ్ళి కె.వి. రెడ్డి ని కలిసారు. వారితో కె.వి. రెడ్డి “ఇంకా నిర్ణయమేదీ తీసుకోలేదు. నెలరోజుల తరవాత చెబుతాను” అన్నారు. తర్వాత వెళితే, ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న వాహినీ వారి ‘పెద్దమనుషులు’ సినిమా నిర్మాణం జరుగుతూ వుందని, అది పూర్తయ్యాక అన్నపూర్ణా చిత్రానికి పనిచేస్తానన్నారు. కానీ రెండు సంవత్సరాలు ఆగాల్సి వస్తుందని సూచించారు కూడా. ఎందుకంటే ఒక సినిమా పూర్తయితేగాని రెండవ సినిమాకు పనిచెయ్యని పద్దతి కె.వి. రెడ్డిది. అందుకు దుక్కిపాటి ‘సరే’నన్నారు. పెద్దమనుషులు సినిమాకు మాటలు సమకూర్చుతున్న డి.వి. నరసరాజునే తమ సినిమాకు కూడా పనిచేయించమని కె.వి.రెడ్డిని నిర్మాతగా దుక్కిపాటి కోరారు. ఆరునెలలపాటు కథా చర్చలు జరిగాయి. కథ తయారయింది. అయితే కథ ప్రధమ భాగం ఒకలా, ద్వితీయ భాగం మరోలా వుందని దుక్కిపాటి మధుసూదనరావు కె.వి. రెడ్డి కి సూచించారు. “అయితే మరో కథను చూద్దాం” అన్నారు కె.వి. రెడ్డి. తర్వాతికాలంలో ఈ కథనే కె.వి. రెడ్డి ‘పెళ్లినాటి ప్రమాణాలు’ గా రూపొందించారు.. అది వేరే విషయం.

దొంగరాముడు సినిమా నిర్మాణం:

ఒకసారి దుక్కిపాటి మద్రాసు మౌంటు రోడ్డులో వుండే హిగ్గిన్ బాదమ్స్ బుక్ స్టోర్ కు వెళ్లారు. అక్కడ ‘లవింగ్ బ్రదర్స్’ అనే ఆంగ్ల నవల అతని కంటబడింది. ఆ నవల అట్ట వెనుక వున్న కథ సారాంశం చదివారు. కథ ఆసక్తిని పెంచింది. నవలను కొని పూర్తిగా చదివారు. అందులో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అన్న దొంగతనాలుచేసి తమ్ముణ్ణి చదివిస్తాడు. తమ్ముడు ఉన్నత స్థాయికి చేరుకునే సమయానికి పోలీసులు దొంగతనం కేసులో అన్నను అరెస్ట్ చేస్తారు. తను దొంగననే విషయం తమ్ముడికి తెలిస్తే అతని ప్రతిష్టకు భంగం కలుగుతుందనే ఉద్దేశ్యంతో అన్న ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు మెదపడు. ఈ నేపథ్యం దుక్కిపాటి కి నచ్చింది. తమ్ముడి పాత్రను చెల్లెలు పాత్రగా మార్చి నరసరాజు చేత కొన్ని మార్పులతో కథను తయారు చేయించారు. అన్న దొంగతనాలు చేసే విషయాన్ని మాత్రమే తమ చిత్రానికి వాడుకున్నారు. మిగతా కథను పూర్తిగా సొంతంగా తయారు చేశారు. ఆ విధంగా ‘దొంగరాముడు’ సినిమా చిత్ర కథ తయారైంది. అక్కినేని, సావిత్రి, జమున, ఆర్. నాగేశ్వరరావు ముఖ్య తారాగణంగా ఈ చిత్రం కె.వి. రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. రషెస్ చూసినవాళ్లు, ప్రివ్యూ చూసినవాళ్లు పెదవి విరిచారు. కానీ కె.వి. రెడ్డి మాత్రం “’ఈ సినిమా ఫెయిలయితే నేను చిత్రపరిశ్రమనుంచే రిటైర్ అవుతాను” ఛాలెంజ్ చేశారు. గణతంత్రదినోత్సవమైన అక్టోబరు 2, 1955 న ‘దొంగరాముడు’ సినిమా విడుదలై డంకా బజాయించింది. చిత్రనిర్మాణ సంస్థ ప్రారంభించిన నాలుగేళ్లకు గాని ఈ తొలి సినిమా తయారుకాలేదు. సినిమా నాణ్యతకు దుక్కిపాటి విలువిచ్చే విధానం అలాంటిది. తదుపరి చిత్రానికి కూడా కె.వి. రెడ్డి దర్శకత్వం వహిస్తాడేమోనని దుక్కిపాటి అడిగితే వాహినీ సంస్థకు సినిమా చేయాల్సి వుందని కె.వి. రెడ్డి ‘నో’ చెప్పారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే మొదలు టేకింగ్ వంటి అంశాలను పుణె లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో పాఠ్యాంశాలు గా చేర్చడం ‘దొంగరాముడు’ విశిష్టత. ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేసి విడుదలచేస్తే అక్కడ ఈ సినిమా శతదినోత్సవం చేసుకుంది.

రెండవ చిత్ర నిర్మాణానికి పూనుకున్నప్పుడు, నవయుగ శ్రీనివాసరావు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ‘అమరసందేశం’ చిత్రాన్ని చూడవలసిందిగా దుక్కిపాటికి సలహా ఇచ్చారు. దుక్కిపాటి, అక్కినేని ఈ సినిమా చూశారు. సినిమా గొప్పగా ఆడకపోయినా ఆదుర్తి టేకింగ్ తోబాటు ఎడిటింగ్ కూడా నచ్చడంతో అతణ్ణి దర్శకత్వం నిర్వహించమని ఆహ్వానించారు. ‘నిష్కృతి’ అనే శరత్ బెంగాలీ నవలను అప్పట్లో చక్రపాణి తెలుగులోకి అనువదించి వున్నారు. ఆ కథను ఎంపిక చేసి, కె.వి. రెడ్డి గారికి వినిపిస్తే, కథ బాగుంది కానీ కామెడీ తక్కువగా వుంది. రెండవ కోడలు సూర్యకాంతాన్ని గయ్యాళిగా పెట్టి ఆమె భర్త రేలంగిని తప్పుదారి పట్టించే కామెడీ విలన్ గా మార్చితే బాగుంటుందని సలహా ఇవ్వడంతో అందులో లేని ఒక హాస్యపాత్రను సృష్టించి ‘తోడికోడళ్ళు’ సినిమాను నిర్మించారు. చక్రపాణి తను అనువదించిన కథలో అంత స్కోప్ లేదే అనుకుంటూ, స్క్రిప్ట్ తెప్పించుకొని చదివి ‘’భలే ఆడాప్ట్ చేసారే’’ అని మెచ్చుకున్నారు. ‘దొంగరాముడు’ సినిమా డబ్బింగ్ వర్షన్ కూడా తమిళంలో విజయవంతం కావడంతో ‘తోడికోడళ్ళు’ సినిమాను సమాంతరంగా తమిళంలో కూడా నిర్మించారు. ఈ సినిమాతో అక్కినేనికి తమిళంలో కూడా ఫాన్ ఫాలోయింగ్ పెరిగింది. పైగా ప్రధాన పాత్రల్లో ఎస్.వి. రంగారావు, కన్నాంబ, సావిత్రి వుండడంతో తమిళ ప్రేక్షకులు బాగా ఆదరించారు. తమిళంలో ఈ సినిమా 1957 లో ‘ఎంగవీట్టు మహాలక్ష్మి’ పేరుతో విడుదలై రజతోత్సవం చేసుకుంది. తెలుగు వర్షన్ ‘తోడికోడళ్ళు’ శతదినోత్సవం చేసుకుంది. ‘తోడికోడళ్ళు’ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసా పత్రం లభించింది.

Doctor Chakravarthy

దుక్కిపాటి నిర్మించిన మూడవ చిత్రం ‘మాంగల్యబలం’. బెంగాలీ లో నిర్మింపబడిన ‘అగ్నిపరీక్ష’ సినిమా ఆధారంగా ‘మాగల్యబలం’ సినిమా తయారయింది. ‘తోడికోడళ్ళు’ చిత్రంలాగే ‘మాగల్యబలం ‘సినిమాను తమిళంలో లో ‘మంజల్ మహిమై’ పేరుతో సమాంతరంగా నిర్మించాఏరు. రెండుచోట్ల కూడా ఈ సినిమా విజయవంతమైంది. ఆదుర్తి సుబ్బారావే ఈ సినిమాలకు దర్శకత్వ, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. తదుపరి నిర్మించిన అన్నపూర్ణా వారి సినిమాలకు ఆదుర్తి సుబ్బారావు ఆస్థాన దర్శకుడుగా నిలదొక్కుక్లున్నారు. 1961 లో ఆదుర్తి దర్శకత్వంలో ‘వెలుగు నీడలు’ చిత్రం రూపొందుకుంది.. తాము నిర్మించిన సిమాలన్నింటిలోనూ కథాపరంగా, సంగీత సాహిత్య పరంగా, సాంకేతిక పరంగా కూడా ‘వెలుగు నీడలు’ సమగ్రమైన చిత్రమని దుక్కిపాటి భావించేవారు. అయితే ‘వెలుగు నీడలు’ సినిమాను ‘తూయ్ ఉళ్ళం’ పేరుతో తమిళంలో నిర్మిస్తే అక్కడ సరిగా ఆడలేదు. దాంతో దుక్కిపాటి తమిళంలో సినిమాలు నిర్మించడం మానుకున్నారు. ‘వెలుగునీడలు’ చిత్రం తర్వాత డాక్టర్ కొర్రపాటి గంగాధరరావును సంభాషణల రచయితగా పరిచయం చేస్తూ అన్నపూర్ణా వారు నిర్మించిన సినిమా ‘ఇద్దరు మిత్రులు’. బెంగాలీ చిత్రం ‘తాషేర్ ఘర్’ ఈ సినిమాకు ఆధారం. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత ఏ.వి. సుబ్బారావుతో కలిసి దుక్కిపాటి కలకత్తా వెళ్ళి ఈ బెంగాలీ సినిమా చూశారు. సుబ్బారావుకు ఈ సినిమా పెద్దగా నచ్చలేదు. కానీ దుక్కిపాటి మాత్రం ఈ చిత్రం ఆధారంగా సినిమాకు కథను మలుస్తాను అనిచెప్పి ఆ సినిమా హక్కులు కొన్నారు. అలా అద్భుతంగా తయారైన ‘ఇద్దరుమిత్రులు’ చిత్రంలో అక్కినేని తొలిసారి ద్విపాత్రాభినయం చేయగా ఆ చిత్రం రజతోత్సవం జరుపుకుంది. దాశరథి ని పాటల రచయితగా పరిచయం చేసిన సినిమా కూడా ఇదే. ‘ఇద్దరు మిత్రులు’ సినిమా విజయంతో దుక్కిపాటి ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమాను నిర్మించారు. డాక్టర్ శ్రీదేవి రచించిన ‘కాలాతీత వ్యక్తులు’ నవల ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాకు యద్దనపూడి సులోచనారాణి కథ సమకూర్చగా త్రిపురనేని గోపీచంద్ సంభాషణలు సమకూర్చారు. ఈ చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేసిన సులోచనారాణి ‘జైజవాన్’, ‘ఆత్మీయులు’ చిత్రాలకు కూడా కథను సమకూర్చారు. 1963 లో నిర్మించిన ‘చదువుకున్న అమ్మాయిలు’ చిత్రం పూర్తిగా హైదరాబాద్ లో నిర్మితమైంది. స్థానిక కళాకారులను దుక్కిపాటి ఈ చిత్రంలో పరిచయం చేయడమే కాకుండా రీరికార్డింగ్ కూడా సారథి స్టూడియోలోనే పూర్తిచేశారు. త్రిపురనేని గోపిచంద్ చేత ఈ చిత్రానికి మాటలు రాయించారు. 1963లో ఆంధ్రప్రభ నిర్వహించిన నవలలపోటీలో ఉత్తమ నవలగా ఎంపికైన కోడూరి కౌసల్యాదేవి నవల ‘చక్రభ్రమణం’ ఆధారంగా ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాను నిర్మించారు. తెలుగులో తొలి నవలా చిత్రంగా రూపొందించిన ఘనత దుక్కిపాటి మధుసూదనరావుకు దక్కింది. రచయితగా ఈ సినిమా ద్వారా గొల్లపూడి మారుతీరావును దుక్కిపాటి సినీరంగానికి పరిచయం చేశారు. 1964 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చిత్రాలకు నంది బహుమతులను ప్రవేశపెట్టింది. తొలి బంగారు నంది బహుమతి ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాకు లభించింది. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ప్రాంతీయచిత్ర బహుమతి కూడా దక్కింది.

‘ఆత్మగౌరవం’ సినిమా నిర్మిస్తూ దర్శకుడిగా కాశీనాథుని విశ్వనాథ్ ను దుక్కిపాటి పరిచయం చేశారు. అలాగే స్థానిక నృత్య కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న ప్రఖ్యాత నాట్యకారిణి సుమతీ కౌసల్ ను కూడా ఈ చిత్రం ద్వారా పరిచయం చేసిన ఘనత దుక్కిపాటి వారిదే కావడం మరో విశేషం. ఈ సినిమాకు ఉత్తమ తృతీయ చిత్రంగా కాంస్య నంది, ఉత్తమ కథా రచయితగా గొల్లపూడి మారుతీరావుకు నంది బహుమతులు లభించాయి. 1967లో ముళ్ళపూడి వెంకటరమణ కథను సమకూర్చగా, ముప్పాళ్ళ రంగనాయకమ్మ చేత మాటలు రాయించి దుక్కిపాటి ‘పూలరంగడు’ చిత్రాన్ని నిర్మించారు. ముళ్ళపూడికి ఉత్తమ కథారచయితగా నంది బహుమతి లభించింది.. 1969లో సారథి స్టూడియో వారికోసం దుక్కిపాటి నిర్మాతగా మారి ‘ఆత్మీయులు’ సినిమా నిర్మించారు. 1970 లో డి. యోగానంద్ దర్శకత్వంలో ‘జై జవాన్’ సినిమా నిర్మించారు. ఆ తర్వాత అన్నపూర్ణా ఆర్ట్ పిక్చర్స్ పేరిట, అన్నపూర్ణా కళా నికేతన్ పేరిట ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘విచిత్రబంధం’, ‘బంగారు కలలు’ సినిమాలను దుక్కిపాటి నిర్మించారు. ఆలాగే ‘ప్రేమలేఖలు’, ‘రాధాకృష్ణ’ సినిమాలకు కె. రాఘవేంద్రరావును దర్శకుడిగా నియమించారు. తర్వాత బాపు దర్శకత్వంలో ‘పెళ్లీడు పిల్లలు’, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘అమెరికా అబ్బాయి’ చిత్రాలను దుక్కిపాటి నిర్మించడం జరిగింది.

సినీ పరిశ్రమకు దుక్కిపాటి అందించిన సేవలకు గుర్తింపుగా 1994 లో వారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారం ప్రదానం చేసింది. ఈ పురస్కారం క్రింద అందించిన యాభైవేల రూపాయలను కె.వి. రెడ్డి స్మారక నిధిగా వెచ్చించి ప్రభుత్వానికే ఆ నిధిని అందజేసి ప్రతి ఏటా ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో ఉత్తమ దర్శకునికి కె.వి. రెడ్డి పేరుతో స్వర్ణ పతకాన్ని బహూకరించేలా స్మారకనిధిని యేర్పాటు చేశారు. దుక్కిపాటి నిర్మించిన 22 చిత్రాలలో 16 సినిమాలు శతదినోత్సవాలు, 4 సినిమాలు రజతోత్సవాలు జరుపుకున్నాయి. 16 సినిమాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ బహుమతులు దక్కడం విశేషం. మధుసూదనరావు మార్చి 26, 2006 న కాలంచేశారు.

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

1 thought on “స్వర్ణయుగంలో దుక్కిపాటి ‘అన్నపూర్ణ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap