పుస్తకాలు కొని చదివేవారు ఇప్పటికీ వున్నారు
  • (మందరపు హైమావతి గారి ‘పలకరింపు’ – కొత్త ఫీచర్ ప్రారంభం..)
    • ………………………………………………..
    • నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అలా ప్రచురణ రంగంలో చిన్న నాడే అడుగిడి, ఆ ప్రచురణ సంస్థ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ‘ఎమెస్కో లక్ష్మి’ గారిని (మార్చి 8, మహిళా దినోత్సవం సందర్భంగా…) ఇంటర్ వ్యూ చేశారు మందరపు హైమావతి.
      కొన్నేళ్ళ కిందట విశాలాంధ్రలో వచ్చిన నా ‘వానచినుకులు’ కాలం పుస్తక ప్రచురణ కోసం గుత్తికొండ లక్ష్మి గారి పేరు చూచించారు డా. పూర్ణచంద్ గారు. మొదటి సారిగా ఎమెస్కో ఆఫీసులో కలిశాను లక్ష్మి గారిని. ఆత్మీయమైన పలకరింపు, నిరాడంబరత, పెదవులపై చెదరని చిరునవ్వు లక్ష్మి గారి సొంతం. తర్వాత నా పుస్తకం ఎమెస్కో సంస్థ ప్రచురించింది.
      రచయితలకు తమ పుస్తకాలు కొన్ని ప్రచురణ సంస్థలే పబ్లిష్ చేయాలని కోరిక వుంటుంది. అలాంటి వాటిలో ఎమెస్కో కూడా ఒకటి. ఎమెస్కో అనగానే ఒక నాటి పాకెట్ సైజు పుస్తకాలు గుర్తుకువస్తాయి. చరిత్ర, సంస్కృతి, సాహిత్యాలలో గొప్ప పుస్తకాలెన్నో ప్రచురించింది ఈ సంస్థ.

      విశాలాంధ్ర దిన పత్రిక ఆఫీస్ వెనుక విశాలమైన ఆవరణలో కొలువుదీరిన పుస్తకాల వరుసలు అవిగో… వేదాల దగ్గనుంచి ఆధునిక సాహిత్యం వరకు ఎన్నో అంశాల పుస్తకాలు మనల్ని పలకరిస్తాయి. చిరునవ్వుతో స్వాగతం చెప్పే లక్ష్మి గారిని పలకరిద్దాం రండి…
      ……………………………………………………..
  • పితృస్వామ్య సమాజంలో స్త్రీలు టీచర్లు, డాక్టర్లుగా కొన్ని ఉద్యోగాలకు మాత్రమే పరిమితం. ప్రచురణరంగంలో స్త్రీలు తక్కువ. అలాంటి రంగానికి మీరెలా వచ్చారు?
    జవాబు: నేను రాలేదు. అవసరం రప్పించింది. అకౌంటెంట్గా వచ్చి, ప్రచురణకర్తగా మారాను.
  • మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి ?
    జవాబు: బి.కామ్. చదివాను. ఆడపిల్లలు అన్నీ నేర్చుకోవాలి. మగపిల్లలకి ఏమీ తక్కువ కాదు అని నేర్పించారు మా నాన్న. అలాంటి నాన్న వున్న నేను అదృష్టవంతురాలిని.
  • విశాలాంధ్ర, నవోదయ, ప్రజాశక్తి, క్వాలిటీ, నవసాహితి, నవరత్న మొదలగు ప్రచురణసంస్థలు విజయవాడలో వున్నాయి. వాటన్నిటికంటె ఎమెస్కో ప్రచురణల పట్ల ప్రజల్లో చాలా అభిమానం వుంది. దానికి కారణమేమిటి?
    జవాబు: పాఠకులకు కావాల్సి సాహిత్యాన్ని తక్కువ ధరలో, క్వాలిటీగా అందిస్తున్నాం కాబట్టి గుర్తింపు. ఏ ప్రచురణకర్త దగ్గర లేని సాహిత్య భాండాగారం “ఎమెస్కో”.
  • మిమ్మల్ని “ఎమెస్కో లక్ష్మిగారు” అని అంటారు. దానికి కారణమేమిటి?
    జవాబు: లక్ష్మి- అనేపేరు ఇంటికి ఒకటి వుంటుంది. మా పేరు పలికేటప్పుడు ఏ లక్ష్మీనో తెలియాలంటే “ఎమెస్కో లక్ష్మి”నే కదా!
  • మీరు తెలుగు సాహిత్యాన్ని ఎన్నో ఏళ్ళుగా ముద్రిస్తున్నారు కదా? మీ అభిమాన రచయితలు ఎవరు?
    జవాబు: యద్దనపూడి సులోచనారాణిగారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు.
  • మీ సంస్థ వేగుంట చితి-చింత, చినవీరభద్రుడి గారి కవితా సంపుటాలు ప్రచురించారు. తరువాత మిగిలిన కవుల కవిత్వం ప్రచురించలేదేమిటి?
    జవాబు: నేనూ కవితా ప్రేమికురాలినే. కాని మార్కెటింగ్ పరంగా కవితలు అమ్ముడు పోవు. అందుకే చెయ్యలేము.
  • తెలుగువారిలో పుస్తకాలు కొని చదివే అలవాటు లేదు కదా! మీ పుస్తకాలు ఎలా అమ్ముడు పోతున్నాయి?
    జవాబు: అది ఒక అపోహమాత్రమే. కొని చదివేవారు ఎప్పుడూ వున్నారు. పబ్లిషర్ కి పాఠకుల నాడి తెలియాలి. కొనేవాళ్ళు లేకపోతే ఇంత పెద్ద సంస్థ నడపటం సాధ్యంకాదు. కాబట్టి కొనేవాళ్ళు వున్నారు. కానీ పరిమితంగా వున్నారు. దానికి తగ్గట్టే మేము కాపీలు ప్రింట్ చేస్తాము.
  • మీరు సంప్రదాయ సాహిత్యాన్ని ముద్రించారు. మీరు ప్రచురించిన పుస్తకాల వివరాలు చెప్పండి.
    జవాబు: ప్రబంధకావ్యాలు, రామాయణ, భాగవత, భగవద్గీత, నవలలు- ఇలా ప్రతిదీ ప్రచురించాము.
  • భవిష్యత్తులో ఎవరైనా స్త్రీలు ఈ రంగంలో రావాలనుకొంటే మీ సలహా ఏమిటి?
    జవాబు: స్త్రీలు, పురుషులు అనేమీ లేదు. మనం చేసే పనిలో నిజాయితీ, నిబద్ధతా వుండాలి. రచనలు చేసేవారిని గౌరవించాలి. రచయిత లేనిదే ప్రచురణకర్త లేడు. ప్రచురణకర్త లేనిదే రచయిత లేడు. ఇద్దరి మధ్య మంచి స్నేహసబంధాలు వుండాలి.
  • ఎమెస్కో పుస్తకం అనగానే ఎన్ని పుస్తకాలు వున్నా గుర్తుపట్టవచ్చు. దానికి కారణమేమిటి?
    జవాబు: నాణ్యత, ధర, సాహిత్యం, అన్నిటికంటే బాపుబొమ్మ “సరస్వతమ్మ”.
  • చాలామంది రచయితలు తమ పుస్తకాలు ఎమెస్కోవారి ముద్రణలో రావాలనుకొంటారు. ఈ పోటీ ప్రపంచంలో అలాంటి స్థాయి ఎలా సంపాదించారు?
    జవాబు: నమ్మకమే పెట్టుబడి. పిచ్చి పిచ్చి కారణాలతో వారిని వెంటతిప్పుకోము. రెమ్యూనరేషన్ ఎగ్గొట్టటంలాంటివి చెయ్యం.
    – మందరపు హైమావతి

1 thought on “పుస్తకాలు కొని చదివేవారు ఇప్పటికీ వున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap