తొలి తెలుగు కార్టూనిస్ట్ – తలిశెట్టి

“మే 20” తేదీన తెలుగు కార్టూన్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం

వజ్రం ఉనికిని అగాధం అంతం చేయలేదు. అవి ఎంత లోతుకు కూరుకుపోయినా కాంతిని వెదజల్లే అవకాశం దానికీ, ఆ ప్రకాశాన్ని చూసి తరించే అవకాశం జనానికి ఏదో రోజు తప్పక వస్తుంది.

కారణం… కాలం పూసిన మసి ఆ కాంతిని ఏ మాత్రం తగ్గించలేదు. స్వత: సిద్దమైన దాని వెలుగులు ఎప్పటికైనా అలా విరాజిల్లుతూనే వుంటాయి. అలా 116 ఏళ్ల క్రిందట వెలిగి మాయమై నేడు మరలా ప్రకాశిస్తున్న ఆ కళా వజ్రమే తలిశెట్టి రామారావు అయితే, ఆ వజ్రాన్ని వెలికి తీసి ఆ వెలుగులను మనం చూడడానికి కారణభూతుడైన ఆ ఘణుడు. మాత్రం ముల్లంగి వెంకటరమణారెడ్డిగారు.

ఏమిటీ ఈయన గొప్ప తనం! ఏం చేసాడని ఈ వ్యక్తిని స్మరించుకోవాలి అని అనుకుంటే… కేవలం తన 28 ఏళ్ళ అత్యల్ప జీవితకాలంలోనే అంసఖ్యాకమైన చిత్రరచన ద్వారా చరిత్ర సృష్టించిన స్వర్గీయ దామెర్ల రామారావుకి ఇంకా ఒక సంవత్సరం ముందుగానే అనగా 20-05-1896లో శ్రీమతి రామానుజమ్మ, సీతయ్య దంపతులకు ఆనాటి జయపురం సంస్థానంలోని ఉమర్ కోటలో తలిశెట్టి జన్మించారు. అది యాదృచ్చికమో ఏమో గానీ ఈ ఇరువురు రామారావులులో ఒకరు ఆధునిక తెలుగు చిత్రకళకు ఆధ్యుడిగా ప్రసిద్ది గాంచితే రెండో వ్యక్తి తొలి తెలుగు కార్టూనిస్ట్గా ఖ్యాతి గడించాడు. కానీ చిత్రకళ, కార్టూన్ రంగాలను అధ్యయనం చేస్తున్న వాళ్లకు సైతం తలిశెట్టిని గురించి నిన్న మొన్నటి వరకూ తెలిసింది కేవలం ఒక కార్టూనిస్ట్గా మాత్రమే అది కూడా వేళ్లమీద లెక్కింపదగిన ఓ ఐదారు కార్టూన్ల ద్వారా మాత్రమే. కానీ ఆ కాలంలో ఆయన జయపురం సంస్థానంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే లలితకళారంగాలలో అజరామమైన కృషిని చేసిన విషయం ఇంతకాలం మరుగునపడిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం.

ప్రాథమిక విద్యనుండి మెట్రిక్యులేషన్ వరకూ జయపురంలో విద్యాభ్యాసం గడిచింది. ఇంటర్ మీడియట్ పర్లాకిమిడిలోనూ, బి.ఏ. డిగ్రీని విజయనగరంలోనూ చేసిన తలిశెట్టికి ఆనాటి జయపురం మహారాజు ఆర్థికసాయం చేయడంతో చెన్నపట్నం (మద్రాస్) వెళ్లి ఎల్.ఎల్.బి. చదివారు. సహజంగా చిత్రకళ యందు అమిత ఆసక్తి కల తలిశెట్టిని ఆకాలంలో మద్రాస్లో విరివిగా లభించే పంచ్, పాసింగ్షో, న్యూయార్క్ల లాంటి ప్రఖ్యాత విదేశీ కార్టూన్ మ్యూగజైన్స్ బాగా ప్రభావితం చేసాయి. మద్రాస్లో న్యాయశాస్త్రం పూర్తిచేసిన తదుపరి ఆయన జయపురం మహారాజా వారి కోర్టులో దివాన్గా పనిచేసారు. ఒక ప్రక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే చిత్రకళ పై గల అమిత ఆసిక్తతో చూసిన ప్రతి సంఘటననూ చిత్రాల్లోకి మలచడం హాబీగా చేసుకున్నారు. విరివిగా లైఫ్ స్కెచెస్ గీయడం ద్వారా డ్రాయింగ్ పై మంచి పట్టు సాధించారు..

మనకు అందుబాటులో వున్న దానిని బట్టి 1929ల నాటికే భారతి, ఆంధ్రపత్రిక, వాణి లాంటి పత్రికలలలో విరివిగా ప్రచురించపబడ్డ ఆయన కార్టూన్లు మనం పరిశీలించినట్లైతే లైఫ్ స్కెచింగ్ పై ఆయన ఎంత శ్రద్ధ పెట్టారో గమనించవచ్చు. ఎంతో సాధన చేస్తేనే గాని రాని ఆ గీతల్లోని పరిణతి పరిపక్వత, అనాటమీ ప్రతి కదలికల్లో కనబడే భంగిమలు ఇవన్నీ కార్టూన్లలో అప్పటికే అంతగొప్పగా వేయగలిగారూ అంటే దానికి ఆయన ఎంతో సాధన చేసి యుండాలి.

ప్రభందసుందరి వర్ణణతో మొదలైన అతని కార్టూన్ ప్రస్థానం క్రమక్రమంగా సామాన్యులు, అసామాన్యులు, కూలీలు, పనివాళ్లు, వారు వీరు అనే భేదం లేకుండా సమాజంలో మనకు ఎదురయ్యే అందరి వ్యక్తులు వారి వృత్తులు, దైనందిన వ్యవహారాలు, వేషభాషలు, కట్టు, బొట్టు, సాంప్రదాయాలు, కళలు, కళాకారులు, ఏ వర్గాన్నీ వదలకుండా అందరిపైనా ఆయన ఎన్నో కార్టూన్లు వేసారు. ముఖ్యంగా ఆయన కార్టూన్లలో మెచ్చుకోదగిన అంశం చక్కని డ్రాయింగ్. క్షురకర్మ అన్న పేరుతో అతను వేసిన కార్టూన్ స్ట్రిప్ మంగళివాడు క్షవరం చేసే క్రమంలో కత్తెర చేయించుకుంటున్న వ్యక్తిని రకరకాల భంగిమలలో పెట్టి అతడికి నరకం చూపిస్తున్నట్లు వేసిన ఆ కార్టూన్ లోని బొమ్మలు చూసినపుడు మనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాం. వ్యాఖ్యారహితంగా (రి)చిత్రాల్లో చూపించిన ఈ కార్టూన్ లోని డ్రాయింగ్ నేటి యానిమేషన్ కి ఏమాత్రం తీసిపోదు.  బస్స్టాప్ లో కూర్చున్న ఇద్దరు ప్రయాణీకులకు వారిపైన గోడకు పెట్టబడ్డ “దొంగలున్నారు జాగ్రత్త” అనే బోర్డ్ ద్వారా వారిలో ఒకరిపై ఒకరికి రేకెత్తించిన అనుమానపు చూపులను అద్భుతంగా వ్యక్తం చేయడం ద్వారా ఎలాంటి వ్యాఖ్యా లేకుండానే అది చూసే ప్రేక్షకుడికి పొరలు పొరలుగా నవ్వు వచ్చేటట్లు చేసారు.

మనం ఇంతకాలం కేవలం ఒక కార్టూనిస్ట్ గానే చూస్తున్న తలిశెట్టి రామారావు ఓ మంచి చిత్రకారుడు, రచయిత కూడా అంటే ఆశ్చర్యపోక తప్పదు. ఆయన వేసిన చిత్రాలలో, భరతాగమనము, విరంగిణి, రాధాకృష్ణ నిద్రిత యాక్షాంగణ, శివపార్వతులు లాంటి ఎన్నో చిత్రాలు ఆనాటి భారతి తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. చిత్రకళలో ఈయనకు సమకాలికులయిన దామెర్ల, వరదవెంకటరత్నం, భగీరధి, బుచ్చికృష్ణమ్మ లాంటి వారు ఆకాలంలో రాజమహేంద్రిలో ఆధునిక ఆంధ్రచిత్రకళకు బలమైన పునాదులు వేయగా తలిశెట్టి మాత్రం ఈ ప్రాంతంలో చిత్రాలు వేసినా ఆయన కార్టూన్ రంగంపైనే ఎక్కువగా దృష్టిపెట్టి విరివిగా వాటినే వేసారు. బహుశా జయపురం సంస్థానంలో వారి దివాన్ ఉద్యోగబాధ్యతలు నిర్వాహణ… కొంత కారణం కావచ్చు.

ఇక రచయితగా కూడా ఆయన వివిధ అంశాలపై ఎన్నో వ్యాసాలు వివిధ పత్రికలలో రాసారు. నాటకాలు, ప్రదర్శనలు, కార్టూన్ చిత్రకళ, నాట్యకళ, మేజువాణీలు వాటి వ్యవహారాలు, వాటియందలి చిత్రాలు లాంటి అంశాలతో పాటు బళ్లారిరాఘవ తదితర వ్యక్తులపై కూడా వ్యాసాలు రాసి ప్రచురించారు. అంతేకాకుండా 1930లో భారతీయ చిత్రకళపై అనేక వ్యాసాలతో 208 పేజీల పుస్తకాన్ని ఆయన రచించి ప్రచురించారు. భారతీయ చిత్రకళకు సంబంధించి బహుశా ఇదే తొలి గ్రంధమని ఆంధ్రపత్రిక సంపాదకులు, దేశాద్దారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు పేర్కొనడం గమనార్హం.

మసకబారిన చరిత్రపుటల్లో ఇరుక్కుపోయి, పొరలు కమ్మిన కళ్లకు ఇంతవరకు కనిపించకుండా పోయిన ఈ అరుదైన మన కళావజ్రాన్ని వెలికి తీసి ఆ కళాకాంతుల్ని మనం చూసేందుకు కారణభూతుడైన 75 ఏళ్ళ నవయువకుడు ముల్లంగి వెంకటరమణారెడ్డి గారి కృషిని అభినందించాలి, తలిశెట్టి రామారావు జన్మ దినమైన “మే20” తేదీన మొట్టమొదటిగా 2012 హైదరాబాద్ లో వారి కార్టూన్ పుస్తకాన్ని ఆవిష్కరించి తెలుగు కార్టూన్ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం తో ఈ కార్టూన్ పండుగ కు అంకురార్పణ జరిగింది.

– వెంటపల్లి సత్యనారాయణ

11 thoughts on “తొలి తెలుగు కార్టూనిస్ట్ – తలిశెట్టి

  1. వెంటపల్లి సత్యనారాయణ గారు, తలిశెట్టి రామారావు గారి గురించి మీరు రాసిన వ్యాసం చాలా బాగుంది. తొలి తెలుగు కార్టూనిస్టు గానే తెలిసిన తలిశెట్టి గారి గురించి ఇతర విషయాలు ఆసక్తిదాయకంగావుంది.
    – సురేన్

  2. తలిశెట్టి రామారావు గారిపై మంచి వివరాలు అందించారు సత్యనారాయణ గారు. అభినందనలు. తలిశెట్టి రామారావు గారు ఆనాటి సామాజిక పరిస్థితులపై, కుటుంబ పోకడలపై, మనుసుల ఆహార్యం, ఆహారపు అలవాటు వంటి వాటిపై మంచి కార్టూన్లు సృష్టించారు. వారిని తెలుగు కార్టూనిస్టులందరూ మే 20 నా ప్రతీ యేటా వివిధ కార్టూన్ల పోటీల ద్వారా స్మరించుకోవడం మనందరి అదృష్టం.

  3. మంచి వ్యాసం. వెంటపల్లి గారికీ, కళాసాగర్ గారికీ అభినందనలు

  4. తెలుగు లో తొలి కార్టూనిస్ట్ తలిశెట్టి రామారావు గారి గురించి చక్కని సమాచారం అందించారు.థాంక్సండీ…..

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link