నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నంది స్థానంలో ఇక నుంచి గద్దర్ పురస్కారాలు అని ప్రకటించినప్పటి నుంచి ఒకవైపు ప్రశంసలు, మరో వైపు విమర్శలు వెల్లువెత్తాయి. నా దృష్టిలో ఇదొక గొప్ప సంచలన నిర్ణయంగా భావిస్తున్నాను. మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించింది. వారం రోజులుగా రేవంత్ రెడ్డి పలువురు తెలంగాణ వాదులతో, కొంతమంది సీనియర్ నాయకులతో, కొందరు మంత్రులతో చర్చించి తీసుకున్న నిర్ణయం. ఆయనతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ గొప్పగా ఉందని అభివర్ణించిన నిర్ణయమే.
కానీ, చాలామందికి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ సెటిలైన వారికి కానివ్వండి, ఎన్నో ఏళ్ళుగా ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన వారికి ఇది మింగుడు పడని నిర్ణయం. గద్దర్ కు సినిమాకు సంబంధం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు, జీర్ణించుకోలేక పోతున్నారు. అంతగా ప్రేమ ఉంటే గద్దర్ జీవన సాఫల్య పురస్కారాలు ఇచ్చుకోవచ్చు అంటూ ఉచిత సలహాలు ఇచ్చి వారికి వాళ్ళు ఉపశమనం పొందుతున్నారు.
నిజానికి ఇది తెలంగాణ వాదులంతా హర్షించే నిర్ణయం. గద్దర్ ఒక మహా వాగ్గేయకారుడు, ప్రజా గాయకుడు, కవి, రచయిత, సినీ గేయరచయిత. మాజీ నక్సలైట్. ఆయన పాట తూటా లాగా ఎందరినో ప్రభావితం చేసి అడవి బాట పట్టించింది. ఎందరో ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఆ తరువాత బుల్లెట్ ను విభేదించి బ్యాలెట్ ను కూడా నమ్మిన వ్యక్తి. ప్రభుత్వ తూటాలను ఒంట్లో దాచుకుని పాతికేళ్ళు బతికిన వ్యక్తి. చిన జీయర్ స్వామిని కలసి ఆధ్యాత్మికత్వాన్ని గౌరవించిన శక్తి! దక్షిణ భారత కళాకారుల ఐక్యవేదిక ప్రారంభించి రాజకీయ పార్టీగా మార్చాలని తపించిన మేధావి. తరువాత తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ కు మద్దతు పలికిన వ్యక్తి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో, ప్రజా నాట్యమండలిలో కీలక పాత్ర పోషించిన మహా ఉద్యమ నేత. ఇందులో ఎవ్వరికీ సందేహం లేదు.
సినిమా రంగానికి నంది అవార్డులను ఇవ్వాలని, మంచి సినిమాలను ప్రోత్సాహించాలని 1963లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి తీసుకున్న నిర్ణయం. 1964లో ముఖ్యమంత్రి గా కాసు బ్రహ్మానందరెడ్డి తెలుగు సంవత్సరాది ఉగాది రోజున సినిమా నంది పురస్కారాలు ప్రారంభించారు. 1998లో నాటక, టివి కళాకారులకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. అప్పటి ఫిల్మ్, టివి, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ సినీ నటుడు మురళీమోహన్, అప్పటి కమీషనర్ డా. కె.వి. రమణచారి తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు అమల్లోకి తెచ్చారు. అసలు నంది సింబల్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి.
రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్ నంది పురస్కారాలు కొనసాగిస్తోంది. వైసీపీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తామని చెప్పి చేయలేకపోయారు. ఇటీవల నంది నాటకోత్సవాలు విజయవంతంగా నిర్వహించారు. కెసిఆర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వారి నందిని కొనసాగించడం ఇష్టం లేక పేరు మార్చేందుకు డా. కె.వి. రమణచారి గారితో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ గరుడ పురస్కారాలు అని నివేదిక సమర్పించారు. అప్పటి మంత్రులు గరుడ కన్నా కాకతీయ పెట్టమని సూచించారు. కొందరు తెలంగాణ వాళ్ళు సినిమా రంగం లో వున్న వాళ్లలో 80 శాతం మంది ఆంధ్ర వాళ్లే, వాళ్ళకు అవార్డులు అవసరం లేదని వాదించారు. దాంతో గత పదేళ్లుగా నంది లేదు, గరుడ లేదు, కాకతీయ లేదు, ఏది లేదు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గద్దర్ పురస్కారాలుగా మార్చనున్నట్లు ప్రకటించారు రవీంద్రభారతిలో. అదే వేదిక పై వున్న మల్లు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, సిపిఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, గుమ్మడి వెన్నెల, కంచె ఐలయ్యతో పాటు సభికులంతా హర్షించారు. నేరుగా రేవంత్ రెడ్డిని అభినందించారు. తెలంగాణ కల్చరల్ బ్రాండ్ అంబాసిడర్, తెలంగాణ లెజెండ్, తెలంగాణ ఐకాన్ గద్దర్ అని, తెలంగాణ ఆత్మ గౌరవం చాటేలా గద్దర్ పేరిట పురస్కారాలు ఇస్తామన్నారు. మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలని, ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రేక్షకుల నుంచి ఎవరో కోరారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మంత్రివర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
ఇక అసలు విషయానికి వస్తే… గద్దర్ పేరిట పురస్కారం సినిమా వాళ్ళు తీసుకోరు, గద్దర్ ఉత్తమ నటుడు అవార్డు, గద్దర్ ఉత్తమ నటి, గద్దర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు… ఇలా పలకడానికి వినడానికి బాగాలేదు, ఆ అవార్డు ఇంట్లో పెట్టుకోవడానికి కూడా స్టార్ నటులు ఇష్టపడరు అని చాలామంది నాతో ఫోన్ లో అభిప్రాయాలూ పంచుకున్నారు. ఇక్కడసలు వాళ్ళు పెట్టుకుంటారా తీసుకుంటారా వస్తారా అనేది విషయమే కాదు. ఇది తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అనే ఒక కళా చైతన్యానికి ఇచ్చిన గౌరవం. పూర్తిగా తెలంగాణ ఆత్మ గౌరవం. తీసుకుని తీరాల్సిందే. తెలంగాణలో ఉంటున్న ప్రతి నటుడు, నటి గౌరవించి తీరాల్సిందే. ఇక్కడ మనకు ఒక వ్యక్తి పేరిట అవార్డు తీసుకోవడం ఏమిటి అని అంటున్నారు. ఎందుకంటే గతంలో ఏ నాయకుడు ఇలాంటి నిర్ణయాలు మన రాష్ట్రాల్లో ఆమాటకొస్తే దేశం లోనే తీసుకోలేదు. మనం ఒక మూసకు అలవాటు పడిపోయాం. విదేశాల్లో ముఖ్యంగా ఫ్రెంచ్, ముస్లిం దేశాల్లో ఒక కవి లేదా ఒక రచయిత, లేదా ఒక స్ఫూర్తి ప్రదాత పేరిట ఆయా దేశాల్లో జాతీయ పురస్కారాలు ఇస్తుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు ఇలా అందరూ ఆ పురస్కారాలు అందుకుంటూ ఉంటారు. అది జాతీయ పురస్కారం పై గౌరవం. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఆ ఒరవడిని తీసుకొచ్చారు అనిపిస్తోంది. ఇదొక గొప్ప నిర్ణయం. సాహస నిర్ణయం.
రంగస్థలం, టివి సాహిత్య రంగాలకు సంబంధించి ఎలాంటి వాదన లేదు కానీ, సినిమా నటులతోనే సమస్య. తెలంగాణకు చెందిన సినిమా వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సినిమా రంగం లోకి ఎక్కువ మంది తెలంగాణ ప్రతిభను ప్రోత్సాహించాలనేది రేవంత్ రెడ్డి లక్ష్యం. ఆధిపత్యం ఆంధ్ర వాళ్ళదే అనే ఉద్దేశ్యం తోనే ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. సినిమా రంగంలో కూడా ఆంధ్ర ఆధిపత్యమే నడుస్తోంది. కళలకు ప్రాంతాలతో సంబంధం లేకపోయినా తెలంగాణ వాదుల్లో ఉద్యమకారుల్లో సినిమా రంగంలోనూ తెలంగాణ ప్రతిభ కు అన్యాయం జరిగిందనే భావిస్తున్నారు. తెలంగాణ సినిమా రంగాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఫిల్మ్ నగర్ లో తెలంగాణ వారికి స్థలాలు, స్టూడియోలు, ఇళ్ళు లేవని ఆవేదనా చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు పడింది. తెలంగాణ కళాకారుడుగా గద్దర్ అవార్డులు స్వీకరించక తప్పని పరిస్థితి. పైగా అమ్మడు కుమ్ముడు లాంటి చిత్రాలకు ఇక అవార్డులు ఇవ్వరు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలకు, తెలంగాణ నటులకు, దర్శకులకు, టెక్నీషియన్లకు ప్రాధాన్యం ఇచ్చేలా నిబంధనలు ఉంటాయి. ఇప్పటికే పేరు తెచ్చుకున్న స్టార్స్ కు ప్రభాకర్ రెడ్డి, పైడి జయరాజ్, కాంతారావు… ఇలాంటి తెలంగాణ స్టార్స్ పేరిట అవార్డులు ఇస్తారు. తెలంగాణ సంస్కృతిని సందేశాన్ని అందించి హిట్ కొట్టిన సినిమాలకే ఇక నుంచి గద్దర్ అవార్డులు లభిస్తాయి. త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కాబట్టి, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన వ్యవహారం. తెలంగాణలో జీవిస్తున్న అందరూ గౌరవించి తీరాల్సిందే.
–డా. మహ్మద్ రఫీ