‘హాస్యమేవ జయతే’ అంటున్న సుమధుర కళానికేతన్-విజయవాడ
ఫిబ్రవరి 1 నుండి 4 తేదీలో నాలుగు రోజుల పాటు “హాస్యనాటిక”ల పోటీలు
……………………………………………………………………………………….
50 సంవత్సరాల క్రితం అంటే 1973 వ సంవత్సరంలో సుమధుర మనసుల కలయికతో ఓ నవ్వుల పువ్వు మొగ్గ తొడిగింది విజయవాడలో. దాని ఆహ్లాదకరమైన పేరే సుమధుర కళానికేతన్. ఆనాడు యువతరంగం “శ్రీయుతులు H.V.R.S ప్రసాద్, J.S.T. శాయి, ఏ. ప్రేమ్ కుమార్, పి. రఘుబాబు, పి. సాంబుశివరావు, B.K. రాధ, వి. ప్రభాకర్ గార్లు ప్రారంభించిన “సుమధుర” ఫలాలను అందిస్తోంది ప్రేక్షక దేవుళ్ళకి.
విజయవాడలో నెలవారీ ప్రేక్షక సంస్థగా ప్రతినెలా క్రమ తప్పకుండా మంచి మంచి నాటకాలు, నాటికలే కాకుండా సంగీత, నృత్యరంగాలలో విశేష ప్రతిభాపాఠవాలు ప్రదర్శించే అనేక మంచి కార్యక్రమాల్ని ప్రేక్షకులకి రుచి చూపించింది.
ఆయారంగాల్లో లబ్దప్రతిష్ఠులైన ఎంతోమంది రచయితలు, దర్శకులు, కవులు, నటీనటులు నర్తకీమణులు, సంగీత ప్రముఖులు, నాటిక ప్రచురణకర్తల్ని ప్రేమతో, ఆత్మీయతతో ఘనంగా సన్మానించింది.
కొత్త యువరక్తంతో కలిగిన ఉత్సాహంతో అనేక నాటకాలు, నాటికలు రాష్ట్రంలోనూ, రాష్టేతర ప్రాంతాల్లో ప్రదర్శించి అనేక బహుమతులు పొందడమే కాకుండా ప్రశంసల వర్షంలో తడిసి ముద్దయింది. ప్రేక్షకుల్ని రసానందంలో ముంచెత్తింది. సుమధుర పొందిన ఆనందం, యువతలో అందరూ పొందాలనే ఆకాంక్షతో వారిలో నిభిడీకృతంగా దాగిన ప్రజ్ఞాపాఠవాల్ని వెలికితీయాలనే సద్యుద్దేశంతో వక్తృత్వ, స్కిల్స్, మైమ్, కార్టూన్లు, సంగీతం, నృత్య, నాటక విభాగాల్లో పోటీలు నిర్వహించి అనేక బహుమతుల్ని అందించి వారిని వెన్నుతట్టి ప్రోత్సహించింది సుమధుర.
“నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒక భోగం నవ్వకపోవడమే ఒక రోగం.” అంటూ, ప్రపంచంలోని జీవరాశిలో “నవ్వగలశక్తి” ఒక్క మానవుడికే ఉన్నదని, అలాంటి మనిషికి అందించే ‘నవ్వు’తో శరీరానికి ఆరోగ్యాన్ని మనసుకి ఆనందాన్ని పంచిపెట్టాలని చెప్పిన నటుడు, దర్శకుడు, రచయిత ‘హాస్యబ్రహ్మ’ “జంధ్యాల” స్పూర్తితో, సలహాలతో రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ప్రప్రథమంగా హాస్యనాటికల పోటీలను 1996 సం.లో అంతర్జాతీయ హాస్యనటులు “చార్లీ చాప్లిన్, లారెల్, హార్డీ” ఉన్న లోగోతో సుమధుర కళానికేతన్ అంకురార్పణ చేసింది. క్రమంతప్పకుండా ఇప్పటివరకు ప్రతి సంవత్సరం జులై నెలలో హాస్యనాటికల పరిషత్ నిర్వహించి ప్రేక్షకుల మనసుల్ని ఆనంద తాండవం చేయిస్తోంది. సుమధుర కళానికేతన్, ఫ్లూట్ మీద చిలక లోగో వేశారు శ్రీ నాగరాజు గారు.
సుమధుర కళానికేతన్ స్థాపించి 50 సంవత్సరాల సందర్భంలో స్వర్ణోత్సవ సంబరం జరుపుకుంటూ 26వ తెలుగు “హాస్యనాటిక”ల పోటీలను 2024 ఫిబ్రవరి 1 నుండి 4 తేదీలో నాలుగు రోజుల పాటు ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం సౌజన్యంతో విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తోంది. కుటుంబ సమేతంగా రండి… హాయిగా నవ్వుకోండి…
-‘కళామిత్ర’ అడివి శంకరరావు
హైదరాబాద్
(63010 02268)