సీనియర్ సినీ పాత్రికేయ శిఖరం-వాశిరాజు ప్రకాశం

వాశిరాజు ప్రకాశం కు అంతర్జాతీయ తెలుగు సినిమా పురస్కారం

నిన్న భారతీయ టాకీ సినిమా పుట్టినరోజు! భారతీయ సినిమా కు 92 ఏళ్ళు! 53 ఏళ్ళ సినిమా పాత్రికేయ శిఖరం, జాతీయ పురస్కార గ్రహీత, ఐదు బంగారు నంది అవార్డులు పొందిన కాలం మారింది సినిమా నిర్మాత వాశిరాజు ప్రకాశంను సత్కరించుకోవడం సముచితంగా ఉంటుందని అంతర్జాతీయ తెలుగు సినిమా సంస్థ వ్యవస్థాపకులు డా. కె. ధర్మారావు భావించారు. నన్ను కూడా ఆహ్వానించారు. 82 ఏళ్ల ప్రాయం లో మోకాళ్ళ శస్త్ర చికిత్స చేయించుకుని రెస్ట్ లో వున్న వాశిరాజు ప్రకాశం గారిని ఏదొక ఆడిటోరియంకు పిలిచి ఇబ్బంది పెట్టడం ఎందుకని, జూబ్లీహిల్స్ భరణి లే అవుట్ లో వున్న వారి ఇంటికే వెళ్ళాం. ఆయన ఎంతగానో సంతోషించారు.

అంతర్జాతీయ తెలుగు సినిమా పురస్కారంతో వాశిరాజు ప్రకాశం ను ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, కోశాధికారి, శత చిత్ర నిర్మాత తుమ్మల రామ సత్యనారాయణ, డా. మహ్మద్ రఫీ, రామరాజు థియేటర్ అధినేత రాజు, ఫోటో జర్నలిస్ట్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు. సినిమా నిర్మాతగా, గోల్కొండ పత్రిక సబ్ ఎడిటర్ గా, ఫిల్మ్ ఫేర్ రిపోర్టర్ గా, వార్త కాలమిస్ట్ గా సినిమా రంగానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. రాష్ట్ర, జాతీయ పురస్కారాల కమిటీ లోనూ, కేంద్ర సెన్సార్ బోర్డు లోనూ, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ స్థాపనలోనూ వాశిరాజు ప్రకాశం కీలక పాత్ర పోషించారని అభినందించారు. డా. కె. ధర్మారావు సమన్వయం చేశారు. వాశిరాజు ప్రకాశం స్పందిస్తూ తాను చేసింది చాలా తక్కువ అని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని 82 ఏళ్ల వయసులో ఉత్సాహంగా చెప్పడం స్ఫూర్తినిచ్చింది. చివరి శ్వాస వరకు సినిమా రంగానికి సంబంధించి ఏదొకటి రాస్తూనే ఉంటానని సంతోషంగా చెప్పారు. అన్నీ అనుకూలిస్తే మళ్ళీ కాలం మారింది సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
డా. మహ్మద్ రఫీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap