బాపు గారి దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన కార్టూనిస్ట్, సినీ దర్శకుడు గాంధీ గారి జ్ఞాపకాలు…
మా గురువు గారు శ్రీ బాపు గారి వర్ధంతి సందర్భంగా మూడు ఇన్సిడెంట్స్ మీకు చెప్పాలనిపించింది. నేను బాపు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వున్నప్పుడు ఈ ఇన్సిడెంట్స్ జరిగాయి. 1994 రాజమండ్రి లో ‘పెళ్లి కొడుకు’ సినిమా షూటింగ్ జరుగుతోంది.. ఓ రోజు నేను సెకండ్ షో సినిమాకు వెళ్లి ‘అలీ బాబా అరడజన్ దొంగలు’ సినిమా చూసొచ్చాను. అది తెల్సి బాపుగారు ‘సినిమా ఎలా వుంది ?’ అని నన్ను అడిగారు ‘నేను బాగాలేదని చెప్పాను.(ఇందుకు నన్ను క్షెమించాలి. ఎందుకంటే నాకు ఆరోజుల్లో బాపు గారిలాగా స్టడీ ఫ్రేమ్స్ లేకుండా తీసే సినిమాలు అస్సలు నచ్చేవికాపు.నేను కథలు గురించి అస్సలు పట్టించకునేవాణ్ని కాదు.కేవలం షాట్ డివిజన్, ఫ్రేమింగ్, షాట్ కంపోజింగ్ ఇలాంటివి మాత్రమే నచ్చేవి..చూసేవాణ్ణి.)
‘మరి ఆ సినిమాని అందరూ హిట్ అంటున్నారే !’ అని బాపు గారు ఆంటే ‘అవును సర్..అది హిట్టే ..’ అని అన్నాను. బాపుగారు నవ్వుతూ’ ఏమండీ.. జనాలకు నచ్చితేనే సినిమాలు హిట్ అవుతాయి. మరి ఆ హిట్ సినిమా మీకు నచ్చకపోతే రేపు మీరు డైరెక్టర్ అయ్యాక, జనాలకు నచ్చే సినిమా ఎలా తీస్తారు’ అని లాజిక్ గా అనేసి అక్కడినుండి వెళ్ళిపోయారు.
ఆ తర్వాత ఆ మానియా నుండి బయటపడి మారిపోయననుకోండి.
ఇప్పుడు ఏదైనా హిట్ సినిమా నచ్చకపోతే నాకు భయమేస్తుంది. ఏంటీ నాలో ప్రాబ్లం .. ఆ సినిమా నాకు ఎందుకు నచ్చలేదు ? అని. మదనపడి పోతాను.. ఏ ఒకటో ఆరో తప్పితే హిట్ సినిమాలన్నీ నాకు నచ్చుతుంటాయి. హిట్ అయిన సినిమాలు నాకు మనస్పూర్తిగా నచ్చితే అప్పుడు నాకు చాలా ఆనందంగా వుంటుంది. ఎందుకంటే జనాలకు నచ్చిందే నాకు నచ్చింది. కాబట్టి జనాలకు నచ్చే సినిమా నేను ఇప్పుడు కూడా తీయగలను అని.
గులాబీ సినిమా: అలాగే ఈ టీవి భాగవతం కు వర్క్ చేస్తుండగా కృష్ణ వంశీ గారి గులాబీ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా గురించి బాపుగారు అడిగితే నాకు సినిమా నచ్చినా స్టడీ ఫ్రేమ్స్ ఎక్కడా లేవని ఆ విషయాన్ని కంప్లైంట్ లాగా చెప్పాను. ‘నేను స్టడీ ఫ్రేమ్స్ పెట్టి తీస్తాను మరి నా సినిమాలన్నీ వన్ వీక్ కూడా ఆడి చావవే! ’ అని’ స్టడీ ఫ్రేమ్స్ వల్ల సినిమాలు ఆడవు. గుర్తు పెట్టుకో ‘అని కోపంగా అన్నారు.
స్టోరీ బోర్డ్ : బాపుగారు ప్రతి సీన్ కు స్టోరీ బోర్డ్ వేసుకుంటారని అందరికీ తెలుసుగా. ఒకరోజు భ్వ్శ్ రామారావుగారు (గుండెల్లో గోదారి కథా రచయిత) బాపు గారికి కలవడానికి వచ్చారు. బాపుగారి స్క్రిప్ట్ చదువుతూ..వేసుకున్న స్టోరీ బోర్డ్ చూస ‘నువ్వు చాలా గ్రేట్ రా! ప్రతి సీన్ కి ఇంత ఓపిగ్గా, ఇంత డిటైల్డ్ గా స్టోరీ బోర్డ్ వేసుకుంటావ్ ‘అని అన్నారు.దాంతో బాపుగారు ’ రేయ్.. ఇది నా చేతగాని తనంరా!! . అసలు సీన్ పేపర్ పట్టుకోకుండా రాఘవేంద్ర రావు, మణిరత్నం, రాం గోపాల్ వర్మ ఇలా చాలా మంది డైరెక్టర్స్ సినిమాలు అద్భుతంగా తీస్తారు. నేను సీన్ పేపర్ చేతిలో లేకపోతే సీన్ తీయలేను. ఏ విధంగా నేను గ్రేట్ రా ’ అని అన్నారు. ఇలా చాలా మంది బాపుగారిని పొగడం వల్ల కూడా ఆయనతో తిట్లు తిన్నారు.
బాపుగారు తనని ఎప్పుడూ జీరో అని అనుకుంటారు.. అలాంటి మహానుభావుడి దగ్గర పనిచేసే అవకాశం వచ్చినందుకు ఎంతో గర్వంగా వుంటుంది. హిట్ సినిమాలు తీయలేదని బాధ వేసినప్పుడు ‘నేను బాపుగారి దగ్గర పని చేసిన విషయం గుర్తు తెచ్చుకుని అవే నేను తీసిన హిట్ సినిమాలనుకొని ఓదార్పుగా ఫీల్ అయి రీఛార్జీ అవుతుంటాను.
ఇప్పుడు నన్ను ఎవరైనా “ఏంటిరా నీ గొప్ప?” అని అడిగితే ఇలాంటి విషయాలే చెప్పుకుని మురిసిపోతుంటాను.