ఎంతో ప్రఖ్యాతి కలిగిన గోరఖ్ పూర్ ‘గీతా ప్రెస్’కు ప్రతిష్ఠాత్మకమైన ‘గాంధీ శాంతి పురస్కారం’ ప్రదానం కానుంది. ఈ దిశగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
జాతిపిత మహాత్మాగాంధీ పేరిట ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్న విషయం తెలిసిందే. గీతా ప్రెస్ స్థాపించి ఈ ఏటికి వందేళ్ళు పూర్తయ్యాయి. ఇటువంటి విశిష్ట సమయంలో ఇంతటి విశిష్ట పురస్కారాన్ని ప్రకటించడం ఎంతో సంతోషకరం. శాంతి, సామాజిక సామరస్యత వంటి గాంధీ ఆశయాలను పుస్తకాల ప్రచురణ ద్వారా ఆచరణలో ఆవిష్కరణ చేస్తున్న గీతా ప్రెస్ నూటికి నూరు శాతం ఎన్నదగినది.
వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ పురస్కారానికి ఎంపిక కావడం సామాజిక సేవకు అందిస్తున్న గొప్పసేవకు గొప్ప ప్రతిఫలంగా చెప్పవచ్చు. అహింస, గాంధేయ విధానాల్లో సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరివర్తన కోసం గీతా ప్రెస్ శతాబ్దం నుంచి కంకణం కట్టుకొని అజేయంగా ముందుకు వెళ్తోంది.
పురస్కారాన్ని ఎంపిక చేసే జ్యూరీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాన సారధి. ఈ పురస్కారానికి గీతా ప్రెస్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
1923లో గీతా ప్రెస్ ను స్థాపించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా ఈ సంస్థకు విశ్వ విఖ్యాతి వుంది. 14 భాషల్లో సుమారు 42 కోట్లకు పైగా పుస్తకాలను ప్రచురించిన ఘనత గీతా ప్రెస్ సొత్తు. వీటిల్లో దాదాపు 16.21 కోట్లు ‘శ్రీమద్ భగవద్గీత’ పుస్తకాలే కావడం ఎంతో విశేషం. 1995లో మహాత్మాగాంధీ 125వ జన్మదిన వేడుకల్లో భాగంగా ‘గాంధీ శాంతి పురస్కారం’ కేంద్ర ప్రభుత్వం వ్యవస్థీకరించింది.
దేశం, జాతి, భాష, కులం, మతం, లింగం వంటి ఎటువంటి భేద భావాలు లేకుండా గాంధీజీ త్రోవలో శాంతియుత మార్గంలో నవ ప్రపంచ నిర్మాణానికి కృషి చేస్తున్నమహనీయులకు, మహనీయ సంస్థలకు ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ పురస్కారం కింద కోటి రూపాయల నగదు, జ్ఞాపికను అందజేస్తారు. 2019, 2020కి గానూ కలిపి ఒకేసారి గత ఏడాది మార్చిలో శాంతి పురస్కారాలను ప్రకటించారు.
గీతా ప్రెస్ మనదేశంలో ఆధ్యాత్మిక పుస్తకాల ప్రచురణలో అగ్రగామి. అతి తక్కువ ధరలో మంచి నాణ్యతతో గొప్ప పుస్తకాలను ప్రచురించి అమ్మడం గీతా ప్రెస్ ప్రత్యేకత. జయదయాళ్ అనే ఓ మార్వాడీ తను నిర్వహించే గీతా సత్సంగాలకు ఉపయోగపడేలా టీకాతాత్పర్య సహితంగా ‘భగవద్గీత’ను అచ్చువేసి అందించాలను కోవడంతో సరిగ్గా వందేళ్ల క్రితం గీతాప్రెస్ పురుడుపోసుకుంది. గీతతో పాటు రామచరిత మానస్, ఉపనిషత్తులు, పురాణాలు, మహిళలకు, పిల్లలకు ఉపయోగపడే చిన్న చిన్న పుస్తకాలు, భారతదేశ చరిత్ర,పురాణాల నుంచి సంకలనం చేసిన కథలుగాథలు, ఆధ్యాత్మిక గీతాలు మొదలైన అనేక రకాల పుస్తకాలను గీతా ప్రెస్ ఇన్నేళ్లుగా ప్రచురిస్తూనే వుంది. ఇంతటి సుచరిత్ర, సుకీర్తి, భారతీయత కలబోసుకున్న గీతా ప్రెస్ మనది కావడం మనకు గర్వకారణం. తెలుగులో ‘వావిళ్ళ’ వంటి పుస్తక ప్రచురణ సంస్థలు చేసిన కృషి కూడా సామాన్యమైంది కాదు. కనీసం మన తెలుగు ప్రభుత్వాలు ఇటువంటి విశిష్ట సంస్థలను గుర్తించి గౌరవించాలి.
-మాశర్మ