E=mc2 అని చెప్పిన ఒక పెద్దాయన G=hl2 ( G ఫర్ గాంధీ, h ఫర్ హ్యూమర్, l ఫర్ లాఫ్టర్) అని చెప్పలేక పోయాడు. ఆయనకి తెలిసిన అంచనాలో గాంధీజీ ఒక అపూర్వమైన ‘మనీషి ‘మాత్రమే.
అయితే మనకీ, మన పిల్లలకీ, మన బాపూజీ గురించి ఇంకా చాలా తెలుసు. పాటలు పాడుకున్నాం,
భలే తాత మన బాపూజీ, బాలల తాతా బాపూజీ..
బోసినవ్వులా బాపూజీ, బంగరు తాతా బాపూజీ..
బాపూజీ చిరునవ్వుల మందహాసం మన అణువుల్లో కూరుకు పోయి వుంది.
గాంధీజీ కి సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కడిదీ ? …
ఎప్పుడు చూసినా శాంతీ, అహింసా, నిరాహార దీక్షా, సత్యాగ్రహాలూ , మేక పాలూ తో మునిగిపోయి, పటేలూ, నెహ్రూ, జిన్నా, ఆజాద్, గఫార్ ఖాన్ ల మధ్య, బ్రిటిష్ పాలకులని బైటకి గెంటే వ్యూహాలు పన్నుతూ, రాట్నం తిప్పుతూ, నూలు వడుకుతూ, కూర్చున్నారు కదా అనుకుంటే, అన్నిపనులూ అయన తన చిరునవ్వులతో నే సాధించారంటారు మన తెలుగు మాస్టార్లూ, కవులూ. C. రాజగోపాలాచారి గారు వ్యాఖ్యానించారు , గాంధీజీ నవ్వుల మనిషి ( Man of laughter) అని. గాంధీజీ గారే స్యయంగా అన్నారు, “If I had no sense of humour, I would long ago have committed suicide.”(నాకు సెన్సాఫ్ హ్యూమర్ లేదని తెలిసుంటే, నేనెప్పుడో ఆత్మహత్య చేసుకునుండేవాడిని.)
బాపూజీ శిలల్ని నిర్మించిన శిల్పులు, ఆయన చిరునవ్వుని భలేగా పట్టుకున్నారు. కళ్ళ జోడూ, చెప్పులూ, చేతి కర్రా, నడుమున వేలాడే గడియారాల్లో చిన్న చిన్న తేడాలుంటాయేమో గానీ, బాపూజీ నవ్వులో ఏ మాత్రం లోపం కనిపించదు.
బాపూజీ పంచెకట్టూ, కండువా చూసి , చుట్ట కాల్చే ఒక ఇంగ్లీషు దొర, హాఫ్ నేకెడ్ ఫకీర్ అని ఎకసక్కాలాడితే, ఓహో .. వీళ్ళకి జోకులేయడం కూడ తెలుసా అని పగలబడి నవ్వారు బాపూజీ. అప్పట్నుంచీ ఇంగ్లీషు పత్రికల్లో కార్టూన్లు వెతికిపట్టి చూసి అనందించడం ప్రారంభించారు.
ఆ రోజుల్లో ‘పంచ్ ‘ పత్రిక (మొదట్లో దాని పేరు ‘లండన్ చారివారి’) వ్యంగ్యానికి, హాస్యానికి ప్రాధాన్యమిచ్చింది, మనూళ్ళోని శంకర్స్ వీక్లీ లాగా. బాపూజీ ఆ పత్రిక, మరో పత్రిక, ‘ది డెయ్లీ ఎక్స్ప్రెస్ ‘తెప్పించుకుని, ఆసక్తిగా వ్యాసాలు చదివేవారు. కార్టూన్లు చూసి, కార్టూనిస్టుల సందేశాలు ఏ తీరులో వున్నాయో పరిశీలించే వారు.
మనదేశంలో స్వాతంత్ర సమరం, నలుమూలలా రగులుకుని పొగలు కక్కుతున్న వేళ, ఉప్పుసత్యాగ్రహ దండీ నడక సందర్భంగా ఒక కార్టూను అచ్చయింది. అందులో గాంధీగారు, చెడు చూడను, చెడు వినను, చెడు పలకను అని మూడు కోతుల బాణీలో చెబుతుంటారు. వెనక పోలీసులు లాటీలతో గాంధీ అనుచరులని కొడుతుంటారు (THE THREE MONKEYS page 80).
స్ట్రూబ్ అనే కార్టూనిస్టు చిత్రించాడు ఈ బొమ్మని, శాసనోల్లంఘన ఉద్యమం గురించి. గాంధీ వ్యతిరేకి అని తెలిసిపోయింది. బాపూజీ నవ్వుకున్నారు.
‘డెయ్లీ మెయిల్ ‘అనే పత్రికలో మరో కార్టూనిస్టు గాంధీజీ గారి మేక పాలు మోజు మీద ఒక బాణం విసిరాడు, చక్రం పలక సభ (రౌండ్ టేబుల్ కాన్ ఫరెన్స్) లండన్ కి వెళుతూ మేకల్ని వెంట తీసుకెళ్తున్నట్లు. ( MR. GANDHI AND THE GOATS page 94). బాపూజీ విరగబడి నవ్వి, లండన్ కి వెళ్ళి, ఆ సభలో తన ఉద్యమం ఏ మాత్రం ఆగబోదని, పెదవి విరిచి చెప్పి, తిరిగొచ్చారు.
ముళ్ళపూడి వారంటారు, సెన్సాఫ్ హ్యూమర్ వున్నోడికి సెన్సాఫ్ పేషన్స్ (ఓర్పు)కూడా పొట్ట నిండా వుంటుందని. నిజమే. బాపూ రమణలు తీసిన సినిమాల్లో కొన్ని వీర ఫ్లాపులు. వాటివల్ల కలిగిన నష్టాన్నీ, అపకీర్తినీ పక్కన పెట్టి చివరిదాకా తమ రచనలు, కార్టూనుల్లో హాస్యరసం వొలికించారంటే కారణం వాళ్ళ సెన్సాఫ్ వోర్పే.
గాంధీగారి ఓర్పూ, చర్చిల్ మొండి వైఖరి గురించి మరో కార్టూనిస్టు నిస్పక్షపాతంగా స్పందించాడు. గాంధీ “ఉప్పు ఉప్పూ “అంటే, చర్చిల్ “నిప్పూ నిప్పూ” అంటున్నాడు. శాంతి దూతకి ఏమీ పాలు పోవటం లేదే అని. (THE PEACE MAKER page 90).
గాంధీగార్ని సమర్ధించిన కార్టూనిస్టులున్నారా అనడిగితే, ఉన్నారు. మన దేశంలో తెల్లదొరలని ధిక్కరించిన అలజడులూ, సత్యాగ్రహాలూ, త్యాగాలూ, జరుగుతున్న సమయంలో అనేక పత్రికలు గాంధీజీకి అండగా నిలిచాయి. ఎవరి వంతు వారు కార్టూన్ల ద్వారా సందేశాలు ప్రజలకి అందిస్తూ వచ్చారు. ముఖ్యంగా హిందూస్తాన్ పత్రికలో శంకర్ గారు, ఎప్పటికప్పుడు గాంధీజీ, బ్రిటిష్ సామ్రాజ్యంతో జరుపుతున్న మంతనాల మీద అద్భుతమైన కార్టూన్లు స్రుష్టించారు. గాంధీజీ, లిన్లిత్గొ, జిన్నాలు, ఎడమొహం పెడమొహంగా వుండి, ఏ నిర్ణయానికీ రాలేకపోయారని చెప్పే ఈ కార్టూన్ ఒక చక్కటి ఉదహరణ. (IN SITU page 170). మరో కార్టూన్, గాంధీజీ వావెల్ తో చెబుతారు. తనకి కావల్సింది అగ్రీమెంట్లు కాదు, స్వాతంత్రం అని. (SIMLA NOT MT.EVEREST page 208).
ప్రపంచ చరిత్రలో, కార్టూనిస్టులకీ, చిత్ర కారులకీ, గాంధీజీ నచ్చినంతగా మరెవరూ వుండరేమో. ఆయన వేషధారణ , ఆకారం, బట్ట తలా, మీసం, బోసి నోరూ, కారికేచర్ చిత్రీకరణకి చాలా అనువైన అంశాలు. అతి సున్నితమైన గీతలతో చిన్నా పెద్దా, జూనియరూ సీనియరూ చిత్రకారులు తమ కుంచెలతో గాంధీజీ బొమ్మలని వేల సంఖ్యలో గీసి చూపించారు. ఈ గాంధీజీ చిత్రీకరణ ప్రక్రియ నేటికీ ఒక మహోన్నత ఉద్యమ రీతిలో కొనసాగుతున్నది. రంగగారు గీసిన బొమ్మతో, తపాలాశాఖ వాళ్ళు స్టాంప్ విడుదల చేశారు. ఇది ఒక కార్టూనిస్టుకి దక్కిన అరుదైన గౌరవం.
భరతమాత ముద్దు బిడ్డడు, యోగి, త్యాగి, మహాత్ముడు గాంధీజీ, ఇప్పుడు శిలా రూపంలో వున్నా మనకి సజీవంగానే కార్టూన్ల రూపంలో దర్శన మిస్తున్నాడు. ఆయనే గనక ఇప్పుడు జీవించే వుంటే మనం చిత్రిస్తున్న కార్టూన్లు చూసి ఎంతగా నవ్వుకునే వారో.
– Dr. జయదేవ్ బాబు,
కార్టూనిస్ట్.