ప్రతీ కార్టూనిస్ట్ లోనూ ఒక చిత్రకారుడు వుంటాడు అంటాను నేను. అలా అని ప్రతీ ఆర్టిస్ట్ కార్టూనిస్ట్ కాలేడు. కార్టూన్ అనేక కళల సమాహారం. కార్టూనిస్ట్ గోపాలకృష్ణ చిత్రలేఖనంలో అరితేరిన వ్యక్తి. కార్టూనిస్ట్ గా మూడున్నర దశాబ్దాల అనుభవం వున్న వ్యక్తి. వీరి కార్టూన్ వేగంగా గీసిన గీతలు, కుదురుగా చెక్కిన శిల్పాల్లా వుండే బొమ్మలతో టోటల్ గా ప్రతీ కార్టూన్ ఒక పెయింటింగ్ లా వుంటుంది. ముఖ్యంగా అమ్మాయిల బొమ్మలు ఎంత అందంగా ముద్దుగా ఉంటాయో. కథకి వేసిన ఇలస్టేషన్లలా అనిపిస్తాయి. ఇక ఈ ‘గోపాలకృష్ణ కార్టూన్లు’ కార్టూన్ సంపుటికి వస్తే “జయదేవ్ రాజలక్ష్మి కార్టూన్ అకాడెమీ” ద్వారా వర్థమాన కార్టూనిస్టులను ప్రోత్సహించడానికి జయదేవ్ గారు చేసిన తొలి ప్రయత్నంగా ఈ పుస్తకం ప్రచురించబడింది. ఇందులో అన్నీ నవ్వులే… చక్కిలిగింతలే. ప్రతి కార్టూను ఆలోచింప చేస్తుంది. గిలిగింతలు పెడుతుంది. ఇంతకుమించి ఏ కార్టూనిస్టుకైనా కావాల్సింది ఏముంటుంది? జలుబు, దగ్గు ఉన్నాయని ఓ పెద్దమనిషి కరోనా టెస్ట్ బయటికి వస్తే పోలీసులు చావబాదుతారు. తర్వాత ‘ముందు చెప్పొచ్చు. కదయ్యా టెస్ట్ కోసం వెళ్తున్నానని..’ అని బాధపడటం క్యాప్షన్. ఇది కరోనా కాలంలో వచ్చిన కార్టూన్ కాబట్టి గోపాలకృష్ణకు ఎంత సమయోచిత స్పందన ఉందన్న విషయం అర్ధం అవుతుంది.
ఇంకో కార్టూన్ క్యాప్షన్ లెస్ కారు వృద్ధాశ్రమం వైపు పరుగులు తీస్తుంటుంది. ముందు కూర్చున్న భార్యాభర్తలు ఫుల్ ఖుషిగా ఉంటే వెనక కూర్చున్న తల్లిదండ్రులు రోదిస్తుంటారు. దొంగతనం చేసి వస్తున్న దొంగను పోలీస్ పట్టుకుంటే ‘శివరాత్రి కదండీ జాగారం ఉన్నా.. ఏదో నిద్ర రాకుండా ఇలా’ అంటాడు దొంగ ఇకిలిస్తూ. వరుడు తాళి కడుతుంటే వధువు తండ్రిని అడుగుతుంటుంది ‘ఇక అమెరికా సంబంధం రానట్టేనా డాడీ?’ అని. ఆ సమయంలో వరుడు, పెళ్లికి వచ్చిన పెద్దలు, ఆ తండ్రి, పురోహితుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో అచ్చుగుద్దినట్టు దింపాడు గోపాలకృష్ణ. ఈ కార్టూనిస్ట్లో ఉన్న మరో గొప్పతనం కేవలం బొమ్మ వేసి క్యాప్షన్ రాసి ఊరుకోకుండా దృశ్యానికి సంబంధించిన నేపథ్యం చూపడం. దీనివల్ల కార్టూని జీవం వస్తుంది. ఈ టెక్నిక్ కొద్దిమంది కార్టూనిస్టులే పాటిస్తుంటారు. మరో కార్టూన్లో పెళ్లి జరుగుతూ ఉంటుంది వధూవరుల మధ్యలో దూరి ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తూ ఉంటాడు. అప్పుడు పురోహితుడు అతన్ని తిడుతూ. ఉంటాడు ‘నువ్వు ఇద్దరిమధ్య దూరినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించాను’ అని ఇంతకీ జరిగింది ఏమంటే తాళి వధువుకి కాక ఫోటోగ్రాఫర్ మెడలో కడతాడు వరుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్టూన్లు… అందులో కొన్ని నవ్వుల మతాబుల్లా వెలుగుతాయి, మరికొన్ని నవ్వుల బాణాల్లా గుచ్చుకుంటాయి.
ఇంకా ప్రకృతి వైధ్యం, ప్రేమలు-పెళ్ళిళ్ళు, చదువులు, మొబైల్ ఫోన్లు, పర్యావరణం, వరదలు, పండుగలు లాంటి అనేక అంశాలపై ఎన్నో కార్టూన్లున్నాయి. నవ్వుకున్న వారికి నవ్వుకున్నంత. ప్రతీ పేజీని ఎంజాయ్ చేసే విధంగా వున్నాయి కార్టూన్లు. స్ట్రిప్ కార్టూన్లు కాస్త పెద్దవిగా ప్రచురించి వుంటే ఇంకా బావుండేది. ‘కరోనా’ తర్వాత పత్రికలు మూత పడిపోతున్న తరుణంలో పాఠకులకు కార్టూన్లు చూసి నవ్వుకునే అవకాశం లేకుండా పోయింది. ఆలోటు జయదేవ్ రాజలక్ష్మి కార్టూన్ అకాడెమీ మరిన్ని కార్టూన్ పుస్తకాలు ప్రచురించడం ద్వారా తీరనున్నదని ఆశించవచ్చు. ఈ కార్టూన్ సంకలనాన్ని ప్రముఖ కార్టూనిస్టు జయదేవ్ గారు సమర్పించడం, ‘హాస్యానందం’ వారు ప్రచురించడం అభినందనీయం.
–కళాసాగర్ యల్లపు
పేజీలు : 112, వెల: రూ. 100/-
ప్రతులకు: గోపాలకృష్ణ (9440490384)