పాత్ర పోషణలో మంచి చెడ్డల ఉమ్మడి… గుమ్మడి

గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలో వుండే కొల్లూరు గ్రామంలో ఆ రోజు ‘పేదరైతు’ అనే నాటకం జరుగుతోంది. ఆ పిల్లాడికి పట్టుమంటే పదిహేనేళ్లు కూడా లేవు. నూనూగు మీసాలు కూడా రాలేదు. తొంభై ఏళ్ల ముసలిరైతు వేషం కోసం అతనికి మేకప్‌ వేశారు. ఆ నాటకంలో ప్రధాన పాత్ర ఆ కుర్రాడిదే. ప్రార్ధనా గీతం అవగానే తెర లేచింది. ఆ కుర్రాడు వేదిక మీదికి వచ్చాడు. అయితే స్టేజి మీద నుంచి ప్రేక్షకజనాన్ని చూసి అతనికి సొమ్మసిల్లినంత పనైంది. కారణం ఏ నటనానుభవం లేని ఆ కుర్రాడికి అదే తొలి నాటకం కావడం. కాళ్లు గజగజ వణుకుతున్నాయి. అది నటనే అనుకున్నారు ప్రేక్షకులు. డైలాగులు చెప్పాలి. పెదాలు వణుకుతున్నాయి. అలాగే సంభాషణలు స్పష్టంగా వణుకుడు కంఠంతో చెప్పేస్తున్నాడు. ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులు మిన్నుముట్టుతుంటే, నటన అంటే అదేనేమో అనుకున్నాడు ఆ కుర్రాడు. నిజానికి అతని నటన అద్భుతంగా వుంది. నాటకం అయ్యాక ఒక్కొక్కరూ స్టేజిమీదకు వచ్చి ఆ కుర్రాణ్ణి అభినందిస్తున్నారు. ‘నువ్వే ఉత్తమ నటుడివి’ అంటూ చేతిలో వెండికప్పు పెట్టారు. ఆ కుర్రాడి ఆనందానికి అవధుల్లేవు. ఆ సహజ నటుడే ప్రముఖ క్యారక్టర్‌ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. ‘‘బహుశా నేను నటించిన సినిమాల్లో ముసలిపాత్రలు ఎక్కువగా వెయ్యడానికి అది నాంది కాబోలు’’ అని అంటుండేవారు గుమ్మడి. హీరో వేషాలు వేయాల్సిన వయసులో ఆయన తండ్రి పాత్రలు పోషించడం, ఆ పాత్రల్ని రంజింపజేయడంలో ఆయనకున్న సాత్విక మనస్తత్వమే కారణం కావచ్చు. అందుకే బాపు-రమణలు గుమ్మడి గురించి ‘పాత్రపోషణలో మంచిచెడ్డల ఉమ్మడి, నానాటికీ తానే వరవడి, నటనలో దిద్దుకుంటున్నాడు ఒక్కుమ్మడి’ అని కీర్తించారు. ఆంధ్రా ప్యారిస్‌గా కీర్తించే తెనాలి పట్టణ సమీప గ్రామంలో పుట్టి, నాటకాల్లో రాణించి, తెలుగు చలన చిత్రసీమలో ఒక అద్భుత నటుడుగా అరవై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసి ఇదు వందలకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న గుమ్మడి వర్ధంతి జనవరి 26న. ఈ దర్భంగా గుమ్మడి నటనానుభవం గురించి కొన్ని విశేషాలు….

తీపి గుర్తుల తొలిరోజులు
గుమ్మడి వెంకటేశ్వరరావు పుట్టింది జూలై 9, 1927న. స్వస్థలం తెనాలికి దగ్గరలో వున్న రావికంపాడు గ్రామం. తల్లి పుట్టిల్లు అక్కడకు ఐదారు మైళ్ల దూరంలో వుండే దావులూరు. తాతయ్య వెంకయ్యకు గుమ్మడి తల్లి ఒక్కర్తే కూతురు. గారాబంగా పెరిగింది. పదేళ్ల వయసులో ఏమాత్రం అవకాశం దొరికినా గుమ్మడి దావులూరు వెళ్లి తనకన్నా రెండేళ్లు పెద్దవారైన మేనమామలు, ఆ చుట్టుప్రక్క ఇళ్లలో వుండే తన ఈడువాళ్లతో కలిసి బాడ్మింటన్, చెడుగుడు వంటి ఆటలు ఆడుకునేవారు. గుమ్మడి తొలిసారి చూసిన నాటకం ‘కీచకవధ’. అందులో కీచకుడుగా నటించింది రంగస్థల ధురీణ వేమూరు గగ్గయ్య. ఆయనది రావికంపాడుకు మైలు దూరంలోవున్న వేమూరు. నాయనమ్మ సీతమ్మవద్ద ఐదణాలు పుచ్చుకొని తెనాలి వెళ్లి గుమ్మడి చూసిన తొలి సినిమా చిత్తజల్లు పుల్లయ్య నిర్మించిన ‘లవకుశ’ (1934). ప్రముఖ రచయిత చెరువు ఆంజనేయశాస్త్రి గుమ్మడి సహాధ్యాయి. గుమ్మడి స్కూలు ఫైనలు పరీక్ష పాసయ్యారు. వాళ్ల తండ్రికి గుమ్మడిని వ్యవసాయంలో దించాలని, అతడు ఇంటిపట్టునే వుండాలని కోరిక. కానీ గుమ్మడికి మాత్రం గుంటూరు వెళ్లి కాలేజీ చదువులు చదవాలని, నాటకాలు వెయ్యాలని, సినిమాలు చూడాలని వుండేది. పంతం నెగ్గించుకొని గుంటూరు హిందూ కాలేజీలో చేరారు. దర్శకుడు ఎం.మల్లికార్జునరావు (సీనియర్‌ శ్రీరంజని కుమారుడు) కాలేజీలో గుమ్మడికి బెంచ్‌ మేట్‌. ఒకసారి ఉన్నట్టుండి మల్ల్లికార్జునరావు కాలేజీకి రావడం మానేశాడు. తరువాత మళ్లీ కాలేజీలో అడుగెట్టాడు. విచారిస్తే మద్రాసు వెళ్లి ‘గొల్లభామ’ (1947) చిత్రంలో నటించి వచ్చానని గుమ్మడితో చెప్పాడు. ఇది తెలిసిన గుమ్మడికి సినిమాల్లో వేషం కట్టాలనే ఆశక్తి పెరిగింది. కాలేజీలో చదివేరోజుల్లో గుమ్మడి ‘పల్నాటియుద్ధం’ నాటకం వేశారు. అందులో తను బ్రహ్మనాయుడుగా, మల్లికార్జునరావు బాలచంద్రుడుగా నటించారు. సాహిత్య అకాడమీ బహుమతి అందుకున్న జనపతి వరలక్ష్మి హిందూ కాలేజీలోనే చదివేది. మొత్తం నాలుగువందల విద్యార్థుల్లో ఆమె ఒక్కర్తే విద్యార్థిని. ఎవరైనా ఆమెగురించి కామెంట్‌ చేసినా వాళ్లకి బుద్ధిచెప్పడం, ఆమెకు బాడీ గార్డుగా రక్షణ కల్పించడం గుమ్మడి పని. కాలేజీ విద్యార్థి నాయకుడుగా వుండగా పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య వంటి కాకలు తీరిన నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. నాటకాల మీద ఎక్కువ ఆసక్తి చూపడం, సినిమాలు ఎక్కువగా చూడడం వంటి కారణాల వలన గుమ్మడి ఇంటర్‌ పరీక్ష తప్పారు. దాంతో చదువుకు స్వస్తి చెప్పి పెద్దలు చెప్పినట్లు వ్యవసాయం చేద్దామని రావికంపాడు వచ్చేశారు. అప్పటికే గుమ్మడికి వివాహమైంది. అప్పటినుంచే పంచలు కట్టుకోవడం మొదలెట్టారు. అదే సమయంలో మిత్రులతో కలిసి ‘వీరాభిమన్యు’ నాటకాన్ని ప్రదర్శిస్తూ అందులో దుర్యోధనుని పాత్ర పోషించారు. ఈ విషయం మాధవపెద్ది వెంకట్రామయ్యకు తెలిసింది. కొల్లూరు పిలిపించి గుమ్మడిని నటించమని చెప్పారు. అయితే గుమ్మడి నటన ఆయనకు నచ్చలేదు. సాత్వికాభినయం ఎలావుండాలో, వాచకాభినయం ఎలావుండాలో గుమ్మడికి వివరించి మంచి శిక్షణ ఇచ్చారు. గుమ్మడిని మాధవపెద్ది ఎంతగా తీర్చిదిద్దారంటే రావికంపాడులో ప్రదర్శించిన ‘వీరాభిమన్యు’ నాటకంలో గుమ్మడి చేత దుర్యోధన పాత్ర వేయించి తను కర్ణుడి వేషం వేయడం వరకు! నాటకం తరవాత కౌగలించుకొని ‘బాబూ నీ సాత్వికాభినయం బాగుంది. వాచకంలో స్పష్టత వుంది. నువ్వు సినిమాల్లో అయితే ఇంకా బాగా రాణిస్తావు’అని దీవించారు. తరువాత గుమ్మడి తన తోటిఅల్లుడుతో కలిసి తెనాలిలో ఎలక్టిక్రల్‌ దుకాణం ప్రారంభించారు. అక్కడే నాటకాలమీద, సినిమాలమీద చర్చలు జరుగుతుండేవి. ఒకసారి చక్రపాణి తెనాలి వచ్చినప్పుడు ఆయన స్నేహితుడు చక్రపాణిని గుమ్మడి దుకాణానికి తీసుకొని వచ్చారు. గుమ్మడిని వెండితెరకు పరిచయం చేయవలసిందిగా ఆ మిత్రుడు సిఫారసు చేయగా ‘అవకాశం వచ్చినప్పుడు ఆలోచిద్దాం’ అని సరిపెట్టారు చక్రపాణి. మరొకసారి ప్రతిభా ఫిలిమ్స్‌ ఘంటసాల బలరామయ్య నిర్మిస్తున్న ‘శ్రీలక్ష్మమ్మ కథ’ చిత్రంలో నటించేందుకు శేషుమాంబను బుక్‌ చేసేందుకు డి.ఎల్‌.నారాయణ తెనాలి వచ్చారు. శేషుమాంబ భర్త డి.ఎల్‌ ని గుమ్మడి షాపుకు తీసుకొచ్చారు. ఈ సినిమాలో ఒక పాత్రకు గుమ్మడి సరిపోతాడని, మద్రాసు వెళ్లాక ఆ పాత్రకు ఎవరినీ తీసుకొని ఉండకపోతే అవకాశం ఇప్పిస్తానని డి.ఎల్ చెప్పి వెళ్లారు. అయితే ఆ పాత్రకోసం కోన ప్రభాకరరావును అప్పటికే తీసుకున్నారని తరవాత కబురందింది.

మద్రాసు రమ్మని టెలిగ్రామ్
ఒకరోజు అనుకోకుండా మద్రాసు రమ్మని ‘తమిళనాడు టాకీస్‌’ వారినుంచి గుమ్మడికి టెలిగ్రామ్‌ వచ్చింది. అందరూ కొత్తవారిని పెట్టి సినిమా తీయాలనుకుంటున్న తమిళనాడు టాకీస్‌ సంస్థ యజమాని సౌందర్యరాజన్‌ డి.ఎల్‌.నారాయణ వద్ద ప్రస్తావించగా, ఆయన సిఫారసు మీద గుమ్మడికి టెలిగ్రామ్‌ వచ్చింది. శేషుమాంబ భర్తను తోడు తీసుకొని గుమ్మడి మద్రాసు చేరుకున్నారు. డి.ఎల్‌ సహాయంతో నిర్మాత సౌందర్యరాజన్‌ను కలిశారు. మేకప్‌ టెస్టు, రిహార్సల్స్‌ అయ్యాక గుమ్మడికి అందులో ఒక సహాయక పాత్రను ఖరారు చేసి, పారితోషికం వెయ్యి రూపాయలుగా నిర్ణయించి, అడ్వాన్సుగా నూటపదార్లు ఇచ్చి ‘ఒక నెల తరువాత కబురంపుతాం. అప్పుడు రండి’ అని పంపేశారు. నెలరోజుల తరువాత గుమ్మడి మద్రాసు వెళ్లారు. తమిళనాడు టాకీస్‌ వారి ఆఫీసులోనే ఆయనకు చిన్న గది ఇచ్చారు. రోజులు గడుస్తున్నాయి. తెనాలి నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. చేతి ఉంగరాన్ని తాకట్టు పెట్టి పాతికరూపాయలు సంపాదించారు. సినిమా మాత్రం మొదలు కాలేదు. తమిళనాడు టాకీస్‌ ఆఫీసుకు ఎదురుగా వున్న ఇంటి గదిలో ఎన్‌.టి.రామారావు, సంగీత దర్శకుడు టి.వి.రాజు వుండేవారు. రిహార్సల్స్‌ అయ్యాక రామారావు గదికి వెళ్లి పరిచయం చేసుకొని స్నేహం పెంచుకున్నారు గుమ్మడి. అక్కడే త్రిపురనేని గోపీచంద్‌తో పరిచయం అయింది. ఆ పరిచయంతోనే ‘పేరంటాలు’ అనే చిత్రంలో గుమ్మడికి చిన్న వేషం ఇచ్చారు. రామారావు గుమ్మడికి పొదుపుగా ఖర్చు పెట్టడం నేర్పారు. గుమ్మడి ఉంటున్న లాడ్జికి ఒకసారి నిర్మాత బి.రామానందం వచ్చారు. ఆయన గుమ్మడికి ‘జై వీరభేతాళ’ సినిమాలో హీరో వేషం ఇచ్చారు. ఆ సినిమాలో హీరోయిన్‌ జమున. అయితే చిత్రనిర్మాణం జరుగుతున్న రోజుల్లోనే రామానందం కాలం చేయడంతో ఆ సినిమా పూర్తి కాలేదు… చిత్రం విడుదల కాలేదు. హీరో వేషం కోసం గుమ్మడి తొలిసారి ప్యాంటు, షర్టు వేసుకున్నారు. అయితే గోపీచంద్‌ మాత్రం హీరో వేషాలకు ప్రయత్నించవద్దని, సహాయక పాత్రలకు ఢోకా వుండదని సలహా ఇచ్చారు. ఆ మేధావి సలహా ఎంతగానో పనిచేసింది. రోహిణీ పిక్చర్స్‌ నిర్మాత హెచ్‌.ఎం.రెడ్డి ‘ప్రతిజ్ఞ’ (1952) సినిమా నిర్మిస్తూ అందులో కాంతారావు తండ్రి పాత్రను గుమ్మడికి ఇచ్చారు. అప్పుడు గుమ్మడి అందుకున్న జీతం నెలకు రెండువందల యాభై రూపాయలు. అవి ‘పెళ్లిచేసి చూడు’ సినిమా విడుదలైన రోజులు. ఆంధ్రదేశం కరువురక్కసిలో మ్రగ్గుతోంది. రామారావుతో వున్న చనువుతో రాష్ట్ర పర్యటన చేసి ‘క్షామ నివారణ’ కోసం నిధులు సేకరిద్దామని గుమ్మడి ప్రతిపాదించారు. రామారావు వెంటనే ‘సరే’నని చెప్పి నెల్లూరు నుంచి విజయనగరం దాకా వివిధ ప్రాంతాలలో పర్యటించి, ప్రదర్శనల ద్వారా నిధులు సేకరించారు. ‘కరువురోజులు’ నాటకంలో గుమ్మడి, ఎస్‌.వరలక్ష్మి నటించారు.

నేసనల్ ఆర్ట్స్ తో గుర్తింపు
రామారావు నేషనల్ ఆర్ట్స్ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా ‘పిచ్చిపుల్లయ్య’ (1953) చిత్రం మొదలెట్టారు. విజయా సంస్థలో సహాయకుడుగా వున్న తాతినేని ప్రకాశరావును దర్శకుడిగా నియమించారు. గుమ్మడికి మంచి వేషం ఇచ్చారు. సినిమా కాసులు రాల్చకున్నా మంచిపేరు మాత్రం తెచ్చిపెట్టింది. తరువాత యోగానంద్‌ దర్శకత్వంలో సాంఘిక ప్రయోజనం, సందేశం కలిగిన ‘తోడుదొంగలు’ (1954) చిత్రాన్ని నిర్మించారు. అందులో రామారావు, గుమ్మడి తోడుదొంగలుగా నటించారు. చిత్రం అపజయం పాలయింది. ఇక కసికొద్దీ ‘జయసింహ’ (1955) జానపద చిత్రాన్ని నిర్మించారు. అది సూపర్‌ హిట్టయింది. అందులో గుమ్మడిది వృద్ధ సిపాయి పాత్ర. అంజలీదేవి తండ్రిగా గుమ్మడి అభినయించిన ‘జయజయ శ్రీరామా’ పాట నేటికీ ప్రేక్షక జనానికి గుర్తే. అది మొదటి రోజు చిత్రీకరించిన పాట కావడంతో అంజలీదేవి మేకప్‌లో వున్న గుమ్మడిని గుర్తుపట్టలేకపోయింది. అదే సమయంలో పి.పుల్లయ్య నిర్మించిన ‘అర్ధాంగి’ చిత్రంలో గుమ్మడికి జమీందారు పాత్ర లభించింది. ఆ పాత్రకు మంచి పేరొచ్చింది. ‘అర్థాంగి’లో హీరో పాత్ర పోషించిన అక్కినేని కన్నా గుమ్మడి మూడేళ్లు చిన్న, అలాగే భార్యగా నటిస్తున్న శాంతకుమారి కన్నా పదకొండేళ్లు చిన్న. సైడ్‌ హీరో జగ్గయ్య కన్నా కూడా ఒక సంవత్సరం గుమ్మడి చిన్నవారు. అయితే మేకప్‌ వేశాక గుమ్మడికి పెద్దరికం వచ్చేస్తుంది. అది గుమ్మడి అదృష్టం. ఎల్‌.వి.ప్రసాద్‌ ప్రోత్సాహంతో విజయా వారి ‘మిస్సమ్మ’ చిత్రంలో గుమ్మడి ఒక చిన్న హాస్యపాత్రను పోషించారు. ఈ సన్నివేశాన్ని తొలుత భానుమతితో చిత్రీకరించారు. చక్రపాణికి ఆమెతో విభేదాలు తలెత్తడంతో అప్పటివరకూ తీసిన నాలుగు రీళ్ల సినిమాను తగులబెట్టి భానుమతి స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. అలా గుమ్మడి మీద అదే సన్నివేశాన్ని మరలా సావిత్రితో చిత్రీకరణ జరిపించారు. అది కేవలం రెండురోజుల షెడ్యూలు. నాగిరెడ్డి గుమ్మడికి రెండువేల రూపాయల పారితోషికం అందించారు. ‘’చాలా ఎక్కువ సొమ్ము ఇచ్చారు సర్’’ అని గుమ్మడి అంటుంటే ‘’వెంకటేశ్వరరావ్ నువ్వు ఫామిలీ మద్రాసులో పెట్టావని, పిల్లలు పెద్దవాళ్లవుతున్నారని తెలిసింది. అందుకే ఈ పారితోషికం’’ అంటూ తన పెద్దమనసును చాటుకున్నారు. తొలిసారి దర్శకుడిగా వి.మధుసూదనరావు నిర్మించిన ‘సతీ తులసి’ చిత్రంలో గుమ్మడి జలంధరుడి పాత్ర ధరించారు. రషెస్‌ చూడానికి వచ్చిన చక్రపాణి గుమ్మడిని ప్రక్కకు పిలిచి ‘’ఇలాంటి రాక్షసుడి వేషాలు వెయ్యకు. నిన్ను దుర్మార్గుడిగా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడరు’’ అని సలహా ఇచ్చారు. రాజ్యం పిక్చర్స్‌ వారు నిర్మించిన ‘హరిశ్చంద్ర’ (1956) సినిమాలో విశ్వామిత్రుడు వేషం వేసి గుమ్మడి మెప్పించారు. తరువాత డి.ఎల్‌.నారాయణ ‘చిరంజీవులు’ (1956) సినిమా నిర్మిస్తూ అందులో రామారావుకు సరిసమానమైన ప్రాధాన్యంగల డాక్టర్‌ పాత్రను ఇచ్చి గుమ్మడి స్టార్డం పెరిగేందుకు సహకరించారు. ఈచిత్రంలో రామారావు నటిస్తున్నప్పుడు ఒక పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. చెంగల్పట్టు వద్ద ఎలక్టిక్రల్‌ రైల్వే పట్టాల మధ్య రామారావు నడిచి వెళ్తుంటే ఎదురుగా వస్తున్న రైలు ప్రమాదం నుంచి గుమ్మడి పరుగెత్తుకుంటూ వచ్చి కాపాడాలి. ఆ రోజులలో జూమ్‌ లెన్సులు లేవు. రామారావుది గుడ్డివాని క్యారక్టర్‌ కావడంతో కళ్లకు కాంటాక్ట్‌ లెన్సులు పెట్టుకున్నారు కనుక ఆయనకేమీ కనిపించదు. రైలు దగ్గరకు వచ్చేసింది. రామారావు ట్రాక్‌ మీద నడుస్తున్నారు. గుమ్మడి పరుగెత్తారు. అనుకోకుండా గుమ్మడి కాలి బూటు స్లిప్‌ అయి పడిపోయారు. లేచి ఎలాగోలా పరుగెత్తి గుమ్మడి రామారావును ప్రక్కకు లాగేశారు. రైలు వెళ్లిపోయింది. క్షణమాగితే ఎంత ఘోరం జరిగిపోయేదోనని ఆ సంఘటన తలచుకుంటే గుమ్మడి ఎప్పుడూ వ్యాకులత చెందేవారు. అప్పుడే రామారావు కి గుమ్మడి మీద స్నేహంతోబాటు అభిమానం కూడా రెట్టింపయింది. తరువాత గుమ్మడి నటించిన ‘దొంగల్లో దొర’ (1957) విడుదలయింది. హైదరాబాదులో సారథి స్టూడియో కట్టిన తరువాత అందులో తీసిన తొలి సినిమా పర్వతనేని గంగాధరరావు నిర్మించిన ‘మాఇంటి మహాలక్ష్మి’ (1959). అందులో గుమ్మడిది విశిష్టమైన పాత్ర. అలాగే శంభూ ఫిలిమ్స్‌ పతాకం మీద యార్లగడ్డ వెంకన్న చౌదరి నిర్మించిన ‘నమ్మినబంటు’ సినిమాలో ఎస్‌.వి.రంగారావుకు ప్రత్యర్ధిగా వుండే పాత్రలో గుమ్మడి రాణించారు. స్పెయిన్‌లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ సినిమా తరఫున గుమ్మడి, రంగారావు పాల్గొన్నారు. అదే గుమ్మడికి తొలి విదేశీ యాత్ర.

With NTR

గుమ్మడిని హీరో చేసిన తిమ్మరుసు సినిమా
గౌతమీ ప్రొడక్షన్స్‌ పతాకం మీద నిర్మాతలు అట్లూరి పుండరీకాక్షయ్య, నర్రా రామబ్రహ్మం తొలి ప్రయత్నంగా 1962లో ‘మహామంత్రి తిమ్మరుసు’ పేరుతో సినిమా నిర్మించారు. జాతీయ స్థాయిలో ఉత్తమచిత్రంగా భారత రాష్ట్రపతి రజత పతాకాన్ని సాధించిన ఈ చిత్రంలో రామారావు శ్రీకృష్ణదేవరాయలుగా నటించగా టైటిల్‌ రోల్‌ గుమ్మడి పోషించారు. సహనిర్మాత రామబ్రహ్మం ఆ పాత్రకు ఎస్.వి. రంగారావును తీసుకుందామని పట్టుపట్టారు. పుండరీకాక్షయ్య ‘’రంగారావు ఈ పాత్రను ధరిస్తే ఆ పాత్రలో రంగారావు కనపడతాడేగాని తిమ్మరుసు కనపడడు. నువ్వు కాదు, కూడదు అంటే నేనే ఈ చిత్రనిర్మాణం నుంచి తప్పుకుంటాను’’ అనడంతో రామబ్రహ్మం కాదనలేకపోయాడు. ఇందులో తిమ్మరుసు పాత్రలో గుమ్మడి అసమాన నటన ప్రదర్శించారు. ఈ సినిమా కథను రూపొందించేందుకు కమలాకర కామేశ్వరరావు, పింగళి నాగేంద్రరావు, నిర్మాతలు హంపి వెళ్లారు. చిత్రకథను రక్తి కట్టించేందుకు పింగళి ప్రతాపరుద్ర గజపతి (ముక్కామల) కూతురు అన్నపూర్ణాదేవి (దేవిక) పాత్రను, హమ్‌ వీరుడు (లింగమూర్తి), తిమ్మరుసు మహిళా గూఢచారిణి కందోలి (రాజశ్రీ) పాత్రలను సృష్టించారు. తిమ్మరుసుకు కళ్లు పెరికివేసేదానికి ముందు వచ్చే సన్నివేశంలో తన చేతులతో పెంచి పెద్దచేసిన రాయలుని ఆఖరిసారిగా అప్పాజీ ఆపాదమస్తకం చూసిన క్లోజప్‌ షాట్‌ ఆ దృశ్యానికి పరిపూర్ణత చేకూర్చడమే కాదు, ప్రేక్షకులకు కన్నీరు తెప్పించింది. ఈ చిత్రంలో నటన గుమ్మడికి వ్యక్తిగతంగా చాలా బాగా నచ్చినదని ఆయనే చెప్పుకున్న సందర్భాలు వున్నాయి. యువ తిరుమల రాయలకు విషంపెట్టి చంపించే సన్నివేశం తీసిన సమయంలోనే రామారావు పెద్దకుమారుడు రామకృష్ణ మసూచికం సోకి మరణించడం విధిలిఖితం. ఈ చిత్రానికి రావి కొండలరావు వారం వారం రాసిన ప్రచార శీర్షికలు సినిమా విజయానికి ఎంతో ఉపకరించాయి. సినిమా గొప్పగా ఆడి ఐదు కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి ‘నిత్యకళ్యాణం పచ్చతోరణం’ (తరువాత ఈ సినిమాను ఎల్‌.వి.ప్రసాద్‌ హిందీలో ‘దాది మా’ పేరుతో పునర్నిర్మించారు) సినిమా నిర్మిస్తూ గుమ్మడికి ఒక పెద్ద వేషాన్ని ప్రతిపాదిస్తే, ఆ పాత్రకు సి.ఎస్‌.ఆర్‌ను సిఫార్సు చేసిన ఆదర్శవంతుడు గుమ్మడి. నాగయ్య సొంత చిత్రం ‘రామదాసు’లో కబీరు పాత్ర పోషించిన గుమ్మడి ఒకానొక సన్నివేశంలో నాగయ్య ఆయనకు పాదపూజ చేసే సందర్భంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘అంతటి మహనీయుడు నా కాళ్లు కడిగి పాదపూజ చేయడమా? ఎంత బాధాకరం’ అంటూ వాపోయిన సంఘటన మరపురానిది. అయితే, గుమ్మడికి నిరాశ కలిగించిన చిత్రం రామినీడు దర్శకత్వం వహించిన ‘భక్తపోతన’ (1966). నాగయ్య గారికి పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ‘పోతన’ పాత్రను తను ధరించడం ఒకరకంగా సాహసమే. గుమ్మడి ఆ పాత్రను భక్తి శ్రద్ధలతో చేశారు. కానీ సినిమా ఫెయిలయింది. జగ్గయ్య నిర్మించిన ‘పదండి ముందుకు’ సినిమా రష్యాలో జరిగిన భారత చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైనప్పుడు, ఆ చిత్ర ప్రతినిధిగా గుమ్మడి, జమున, వి.మధుసూదనన రావు రష్యా వెళ్ళారు.

Mahamantri Timmarusu

ఇతర పాత్రల్లో గుమ్మడి
గుమ్మడి తన అరవయ్యేళ్ల చిత్రరంగ ప్రస్థానంలో ఐదువందలకు పైగా సినిమాల్లో నటించారు. ‘వాగ్దానం’లో తేనె పూసిన కత్తిలాంటి విలన్‌గా, ‘భీష్మ’లో కర్ణుడుగా, ‘కానిస్టేబుల్‌ కూతురు’లో కానిస్టేబుల్‌గా, ‘ఇద్దరు మిత్రులు’లో విలన్‌గా, ‘కులగోత్రాలు’లో అక్కినేని తండ్రిగా, ‘చదువుకున్న అమ్మాయిలు’లో రంగయ్యగా, ‘లక్షాధికారి’లో విలన్‌గా, ‘మూగ మనసులు’, ‘పునర్జన్మ’, ‘అంతస్తులు’ చిత్రాలలో జమీందారుగా, ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’లో ధర్మరాజుగా, ‘పూజాఫలము’లో దివాన్‌ రామకృష్ణయ్యగా, ‘ప్రేమించిచూడు’లో జగ్గయ్య తండ్రిగా, ‘రహస్యం’లో శ్రీగంధ ప్రభువుగా, ‘బంగారుగాజులు’లో చంద్రశేఖరంగా, ‘గోవులగోపన్న’లో చైర్మన్‌ నాగరాజుగా, ‘పూలరంగడు’లో చలపతిగా, ‘సంపూర్ణ రామాయణం’లో దశరథుడుగా, ‘పండంటికాపురం’లో కార్మిక నాయకుడుగా, ‘తాత-మనవడు’లో పరమాత్మరావుగా, ‘సోగ్గాడు’లో సింహాద్రిగా, ‘కురుక్షేత్రం’లో భీష్ముడుగా, ‘దాన వీర శూర కర్ణ’లో పరశురాముడుగా, ‘మరోమలుపు’ (నంది బహుమతి తెచ్చిపెట్టిన చిత్రం)లో ఛాందస బ్రాహ్మడుగా, ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘ఈ చదువులు మాకొద్దు’లాంటి సినిమాల్లో వైవిధ్య పాత్రల్లో, ‘పెళ్ళిపుస్తకం’(నంది బహుమతి తెచ్చిపెట్టిన చిత్రం)లో కంపెనీ యజమానిగా ఇలా అనేక పాత్రల్లో అప్రతిహతంగా 1996 వరకు గుమ్మడి నటించారు. 1998లో గుమ్మడికి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. గుమ్మడి ఎక్కువగా అన్నపూర్ణ, జగపతి, ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్, పద్మశ్రీ, అన్నపూర్ణా, అనుపమ వంటి సంస్థల్లో సినిమాలలో నటించారు.

మరపురాని అనుభూతి
అనుపమా సంస్థ అధిపతి, దర్శక నిర్మాత కొల్లిపర బాలగంగాధర తిలక్‌ తెలుగులో నిర్మించిన ‘ఈడూ-జోడూ’ చిత్రాన్ని ‘కంగన్’ (1971) పేరుతో హిందీలో తీయాలనుకున్నారు. అందులో జగ్గయ్య పాత్ర సంజీవ్ కుమార్ పోషించగా, జమున పాత్ర మాలాసిన్హా పోషించింది. గుమ్మడి ధరించిన పాత్రకు వెటరన్‌ నటుడు అశోక్‌ కుమార్‌ను ఎంపిక చేశారు. తెలుగు మాతృకను అశోక్‌ కుమార్‌ కోసం తిలక్‌ ప్రత్యేకంగా ప్రదర్శించారు. ‘అంతస్తులు’ తమిళ వర్షన్‌లో నటిస్తున్న గుమ్మడి విరామ సమయంలో స్టూడియోలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గుమ్మడి లేచి చూసేసరికి ఎదురుగా అశోక్‌ కుమార్‌ కూర్చొనివున్నారు. కుశలప్రశ్నలు అయ్యాక అశోక్‌ కుమార్‌ ‘నేను ఇప్పుడే మీ ‘ఈడూ-జోడూ’, తెలుగు సినిమా చూశాను. దక్షిణాది నటులు తాగుడు పాత్రలు చాలా ఓవర్‌గా చేస్తారని నాకొక దురభిప్రాయం వుంది. కానీ మీ శైలి అందుకు భిన్నంగా నాకు నచ్చే విధంగా వుంది. మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను”అన్నారు. గుమ్మడి తన చిన్నతనంలో అశోక్‌ కుమార్‌ నటించిన ‘కిస్మత్‌’ సినిమా పదిసార్లకు పైగానే చూశారు. ఆ విషయాన్ని గుర్తుచేసి, అశోక్‌ కుమార్‌కు ధన్యవాదాలు చెప్పారు. అశోక్‌ కుమార్‌ కల్పించుకొని “మీరు హిందీ వర్షన్‌లో నాతో కలిసి నటించాలి” అన్నారు. అలా కంగన్’ సినిమాలో అశోక్ కుమార్ గురువు పాత్రను పోషించడమే కాదు తన అభిమాన నటుడైన అశోక్ కుమార్ తో కలిసి నటించే అదృష్టం గుమ్మడికి లభించింది. బొంబాయిలో గుమ్మడి, తిలక్‌ బసచేసిన హోటల్‌కు వచ్చి అశోక్‌ కుమార్‌ కబుర్లు చెప్పేవారు. నిజానికి బొంబాయిలో జరిగే ఏ పార్టీలకు అశోక్‌ కుమార్‌ హాజరు కారు. అటువంటి అశోక్‌ కుమార్‌తో నటించడమే కాదు, హోటల్‌కు వచ్చి ఆయన చిన్ననాటి అనుభవాలు చెబుతుంటే గుమ్మడికి ఎంత ఆనందం కలిగేదో చెప్పలేం. గుమ్మడికి ఐదుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. అందరూ ఇతర దేశాల్లో స్థిరపడినవారే. జాతీయ చలనచిత్ర అవార్డుల కమిటీలో గుమ్మడి మూడు పర్యాయాలు జ్యూరీగా వ్యవహరించారు. రాష్ట్ర నంది బహుమతుల కమిటీలో అధ్యక్షునిగా రెండుసార్లు వ్యవహరించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుమ్మడికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. పేరుప్రఖ్యాతులు వచ్చిన తరువాత కూడా రావికంపాడుకు వచ్చి బంధుమిత్రులతో కొన్నిరోజులు గడపటం గుమ్మడికి అలవాటు. స్థాయి పెరిగినా ఆడంబరం తెలియని పెద్దమనిషి గుమ్మడి. 26 జనవరి 2010 రిపబ్లిక్‌ దినోత్సవం నాడు గుమ్మడి హైదరాబాదులో కన్ను మూశారు.

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap