(గురజాడ స్ఫూర్తితో నేటి సామాజిక రుగ్మతలు తొలగింపుకు పాటుపడాలి. – ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు)
మహాకవి గురజాడ అప్పారావు 161 వ జయంతి సందర్భంగా గురువారం ఉదయం 8 గంటలకు విజయవాడ మున్సిపల్ స్టేడియం ఫుడ్ కోర్టు రోడ్డు వద్ద జరిగిన సభలో ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు ప్రసంగించారు. గురజాడ అప్పారావు 130 సంవత్సరాల నాడు ఆ నాటి సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలపై గొప్ప రచనలు చేసారని అన్నారు. కన్యాశుల్కం, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ లాంటివాటిలో సమాజాన్ని మోసం చేసే గిరీశం లాంటి పాత్రలతో, బాల్యవివాహాల దురాచారాలను ఎండగట్టారని అన్నారు. నేటి సమాజంలో అటువంటి గిరీశాల సంఖ్య పెరగటం ఆందోళనకర అంశమని పేర్కొన్నారు. తెలుగుభాష అభివృద్ధికి విశేషకృషి చేసారని తెలిపారు. ఈ నాటి బాలలకు పాఠశాలల్లో గురజాడ రచనలపై చర్చా వేదికలు నిర్వహించాలని కోరారు. “దేశమును ప్రేమించుమన్న మంచిఅన్నది పెంచుమన్న” అన్న గేయం అనేక తరాలకు ఉత్తేజం కలిగించేదని అన్నారు.
దేశమును ప్రేమించుమన్న గేయాన్ని వందలాది మంది విద్యార్థులు ఒకే సారి ఆలాపించారు. అనంతరం ఢిల్లీరావు జెండా ఊపి 1000 మంది విద్యార్థులుతో 2కె రన్ను ప్రారంభించారు. ఈ రన్ రెడ్సర్కిల్ మీదుగా కస్తూరిబాయిపేట గాంధీ బొమ్మలు, మధుగార్డెన్స్, శిఖామణి సెంటర్ మీదుగా ఫుడ్ కోర్టు వద్ద ముగిసింది. కందుకూరి, జాషువా, గిడుగురామ్మూర్తి, లాంటి 50 మంది సంస్కర్తల ఫోటోల ప్లకార్డులతో ర్యాలీ జరిగింది. మతములన్నియు మాసిపోవును. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అనే కొటేషన్తో ఏర్పాటు చేసిన బ్యానర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో పురప్రముఖులు ప్రొఫెసర్ ఎం.సి. దాస్, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, ప్రముఖ విద్యావేత్త ఎస్.ఆర్.పరిమి, వాసవ్య మహిళామండలి జి. రష్మి, అమరావతి బాలోత్సవం గౌరవాధ్యక్షులు చలవాది మల్లిఖార్జునరావు, ఆక్వాడెవిల్స్ అధ్యక్షలు వెలగపూడి వెంకటేశ్వరరావు, అల్లూరి సాంస్కృతిక కేంద్రం కార్యదర్శి ఎస్.వెంకటేశ్వరరాజు, సేఫ్ కార్యదర్శి జి. జ్యోత్స్న, ఎం. బి.వి.కె కార్యదర్శి పి. మురళీకృష్ణ, జి.ఆర్.కె పోలవరపు కళాసమితి అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు, పారిశ్రామికవేత్త బాయన అప్పారావు, జాషువాసాంసృ్కతిక వేదిక కార్యదర్శి గుండు నారాయణరావు, ఫోరంఫర్ అర్టిస్ట్ నాయకులు సునీల్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ ఆర్టిస్ట్ స్ఫూర్తి శ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించారు.