కేసీఆర్ ఆవిష్కరించిన ‘హరితహాసం’–ట్రీ టూన్స్

ప్రకృతి, పర్యావరణంపై స్పృహను కలిగించే ‘హరితహాసం’ కార్టూనిస్టు మృత్యుంజయ కార్టూన్ సంకలనాన్ని విడుదల చేసిన మఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, ముఖ్యఅతిధిగా హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి.

పచ్చదనం పెంపు, పర్యావరణ హితమే లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో అరుదైన ప్రయోగం చేసింది. చెట్ల పెంపు ఆవశ్యకతను, పర్యావరణ సమతుల్యత ప్రాధాన్యతను తెలిపేలా మృత్యుంజయ వేసిన కార్టూన్ల సంకలనమే ‘హరితహాసం’–ట్రీ టూన్స్. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మార్గదర్శకత్వంలో ఈ కార్టూన్ల సంకలనం రూపొందింది. దీనిని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ జూన్ 19 న విడుదల చేశారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమయోచితంగా, ప్రతీ ఒక్కరికీ చెట్ల పెంపకంపై అవగాహన కలిగేలా హరితహాసం–ట్రీ టూన్స్ లో కార్టూన్లు ఉన్నాయని, ఒక సామాజిక అంశంపై మూడు వందల కార్టూన్లతో సంకలనం వేయటం అభినందించదగిన విషయమని ముఖ్యమంత్రి అన్నారు. కార్టూనిస్టు మృత్యుంజయను ప్రశంసించారు. హరిత తెలంగాణను ప్రతిబింబించేలా ఉన్న కార్టూన్ పెయింటింగ్ ను ఈ సందర్భంగా మృత్యుంజయ, సీఎంకు బహూకరించారు.

కేవలం రాజకీయ విషయాలపైనే కాకుండా, సామాజిక అంశాలపై ప్రజలను ఆలోచించేలా కార్టునిస్టులు గీసే చిత్రాలు మరింత మందిని ప్రకృతికి దగ్గర చేస్తాయని కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆకాంక్షించారు.

ఒక మొక్కతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నేడు దేశ వ్యాప్తంగా లక్షల మందిని చేరటం, కోట్ల మొక్కలు నాటేలా ప్రోత్సహించిందని, మృత్యుంజయ లాంటి కార్టూనిస్టులను కూడా స్పందిపచేసి వందలాది కార్టూన్లు గీసేలా చేయటం తమకు సంతృప్తిని ఇస్తోందని ఎంపీ సంతోష్ కుమారు అన్నారు.

తెలంగాణ ఉద్యమ కాలం నుంచే సోషల్ యాక్టివిస్టుగా ఉన్న మృత్యుంజయ ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకువెళ్తున్నారని ఎంపీ ప్రశంసించారు. ఈ కార్టూన్ల సంకలనంతో త్వరలోనే ప్రదర్శన (ఎగ్జిబిషన్) ఏర్పాటు చేస్తామని కార్టూనిస్టు మృత్యుంజయ తెలిపారు.

కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, గ్రీన్ ఇండియా ప్రతినిధులు కరుణాకర్, రాఘవ, తదితరులు హాజరయ్యారు.

-కళాసాగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap