మానవ నిర్మిత ఉపకరణాల(కుంచెల్లాంటి పనిముట్ల) సాయం లేకుండా, కేవలం చేతిని, చేతివేళ్ళను మాత్రమే ఉపయోగించి కేవలం పదమూడున్నర గంటల్లో 100 తైలవర్ణ చిత్రాలను సృజించి రికార్డుల మీద రికార్డులు సాధించిన ఒక అద్భుత సందర్భానికి సంబంధించిన సవివర, సవిస్తర, సమగ్ర, సరంజక డాక్యుమెంటేషన్ (A Monograph On World Record Winner’s Success Story) – ఈ `ఫింగర్ పెయింటింగ్ మారథాన్ (వర్ణాంచిత హస్తాంగుళీ విన్యాసం).
2010లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌తో పాటు మరో 14 జాతీయ, అంతర్జాతీయ రికార్డులను సాధించిన అరుదైన, అపురూప కళాప్రక్రియ చిత్రకారుడు రామకృష్ణ వర్ణాంచిత హస్తాంగుళీ విన్యాసం. రికార్డులకెక్కిన ఫీట్ యొక్క విశేషాలతో రికార్డు అయిన ఈ పుస్తకం, ప్రపంచ రికార్డుల విజేత అయిన చిత్రకారుని ఒక్కరోజు పనితనాన్నే పొందుపరచిన ఈ పుస్తకం ప్రచురణ రంగంలో వెలువడిన తొలి పుస్తకంగా రికార్డుల్లోకి ఎక్కి చరిత్ర సృష్టించింది. నేడు రచయితగా రామకృష్ణ ఖాతాలో మరో రికార్డును చేర్చడానికి కారణమైంది. ప్రపంచ తొలి స్వల్ప వ్యవథి మోనోగ్రాఫ్ (World’s First Short Span Monographer)గా గుర్తింపు పొందింది.
ఆత్మకూరు స్వీయ మోనోగ్రాఫ్ అనే అపురూప ప్రక్రియను చేపట్టి తన విజయగాథను ‘ఫింగర్ పెయింటింగ్ మారథాన్’గా ఎలా మలచారన్నదే సంపాదకునిగా మాకినీడి సూర్యభాస్కర్ తన ‘ముందు మాట’లో చెప్పారు. పదమూడున్నర గంటలపాటు కూర్చొన్న చోటనే కూర్చుని తన లక్ష్యం వైపు ఎలా పరుగు తీయాలో చూపారు. ఏ విజయమైనా అయాచితంగా రాదు. దాని వెనుక కొన్ని వత్సరాల నిరంతర సాధన, తపన ఉంటాయని, సాధారణంగా చిత్రకారుడు తన శైలినిగాని, మెటీరియల్‌ను గానీ పరిచయం చేసేందుకే అర్థగంట నుండి గంట సమయం పడుతుంది. ఆ గంట, అర్థగంట సమయంలోనే రమారమి 5 నుండి 8 చిత్రాలను దేనికదే భిన్నంగా ఉండేలా చిత్రించి చూపడం రామకృష్ణ ప్రత్యేకత అంటారు.
ఒక చిత్రకారుడి జీవితకాలపు కృషినీ, సాఫల్యాన్ని రికార్డు చేయగల మోనోగ్రాఫ్‌ను ఏదైనా ఒకదాన్ని తీసుకుని పరిశీలించినట్లయితే… రైటప్‌తో కలుపుకుని మహా అయితే ఏభై, అరవై పుటలు మించదు. పోనీ వంద పుటలనుకుందాం. రామకృష్ణ, తన జీవితంలోని ఒక రోజుకు (2010 మే 20వ తేదీకి) సంబంధించిన కేవలం 13 గంటల 26 నిమిషాల అపురూప ఘట్టాన్ని సుమారు 472 పుటల మోనోగ్రాఫ్‌గా సంతరించారు.
‘చేతివేళ్ళతో’ చిత్రాలు వేయడానికి ప్రేరణ, మానేద్దామనుకున్న సందర్భాన్ని అధిగమించి ప్రపంచ రికార్డు సాధించాలన్న తృష్ణకు అందిన ప్రోత్సాహం…‘అసోసియేషన్ ఆఫ్ పీపుల్ విత్ డిజెబిలిటీ’ బెంగుళూరుతో అసోసియేషన్… మెటీరియల్ & మెథడ్ పరిచయం దగ్గర్నుంచీ, అసలు ఎలా మొదలైందో… ఏదో సాధించాలనే తపనతో పాటు, ఆ తపనను రికార్డు చేయాలనే ఆలోచనను కూడ ప్రతి కళాకారుడూ కలిగి ఉండాలని చెప్పేలా ఈ గ్రంథాన్ని మలచిన రామకృష్ణను అభినందించక తప్పదు. 100 చిత్రాలను రచించిన 13:26 గంటల కృషి ఒక ఎత్తైతే, ఆ కృషిని పొందుపరచిన ఈ గ్రంథం అంతకు మించిన కృషి.
“నేను నా చేతుల్ని నమ్ముకున్నాను. అవి నన్ను నిలబెట్టాయి” అని గర్వంగా చెప్పుకోగలిగారు. ఈ ‘మునివేళ్ళ మాయావి’ (ఈనాడు), “నా ఐదు వేళ్ళే నాకు పదివేలు అంటున్న ‘కళాకృష్ణుడు” (సాక్షి, శ్రీ పంతంగి రాంబాబు), ‘చేతికి బాగా పట్టిన రంగు’ (ప్రసిద్ధ చిత్రకారులు, శ్రీ ఎల్లా సుబ్బారావు) అంటూ పలువురిచే కీర్తింపబడ్డ ఆత్మకూరు రామకృష్ణ కృషికి దర్పణం ఈ పుస్తకం.
ప్రత్యేకించి ఆంగ్లంలో స్వయంగా చిత్రకారుడు ఆత్మకూరు రాసిన వ్యాసం ‘Wonders With Fingers Painting’. ఈ పుస్తకానికి మకుటాయమానం. అలాగే, ఇటువంటి రికార్డులు సాధించాలనుకునే ఔత్సాహికులకు ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థ అడిగిన ఆ నాల్గు ప్రశ్నలూ ఇవే’’నన్న వ్యాసం ఎంతో ఉపకరిస్తాయి. ‘‘నిండు సామర్థ్యంతో అల్పమైన పనులు చేసినా అలరించగల’’వంటూ, సూక్ష్మంలో మోక్షం గుట్టు రట్టు చేశారు. పనిలో పనిగా ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు సమర్పించిన ఆంగ్ల పత్రం’ కూడ ఈ పుస్తకంలో చేర్చి ఔత్సాహికులకు మేలొనరించారు.
ఇప్పటివరకు పబ్లికేషన్ రంగ చరిత్రలో ఇటువంటి మోనోగ్రాఫ్ రావటం అరుదైన విషయం! కాగా, రామకృష్ణకు మాత్రమే దొరికిన మహదావకాశం!! కవి – చిత్రకారుడు, రచయిత, ముద్రాపకుడు కూడా అయినందున తన భావాలను విస్తృతంగా వ్యక్తీకరించ గలిగారు.
గతంలో… ఒక్కరోజులో ఒక చిత్ర(కళా)కారుడు చేసిన కళాసృష్టినిగాని, తన వ్యక్తిగత విశేషాలతో కూడిన వైభవాన్నిగాన్ని తెలిపే గ్రంథాన్ని మోనోగ్రాఫుగా రూపొందింటం జరగలేదు. మోనోగ్రాఫ్‌కు ఉండాల్సిన పూర్తి లక్షణాలు ఈ పుస్తకానికి అమరటం ఒక ఎత్తయితే, ఈ పుస్తకం ప్రపంచ రికార్డుకాగలగటం మరో అరుదైన విశేషం! రికార్డుల్లో కెక్కిన అంశాన్ని ముద్రించడం ద్వారా మరలా రికార్డుల్లోకి ఎక్కగలగటం వంటి అరుదైన విషయాలు ఇంతటి బృహత్తర గ్రంథం రూపొందించేందుకు రచయితకు మరింత ఉత్సాహాన్ని తెచ్చి పెట్టింది.
ఆత్మకూరు రామకృష్ణ తన మోనోగ్రాఫ్‌కు తానే రచయితగా మారి వ్రాయటం ఇందులో వినియోగంచబడ్డ అన్ని తైలవర్ణ చిత్రాలు ఒక్క రోజులోనే (806 ని.లలో) వేసినవి! ‘ఫాస్టెస్టు పెయింటర్’గా రికార్డులు నెలకొల్పినవి!!
పేజీలు : 472
ప్రతులకు: ఆత్మకూరు రామకృష్ణ (94934 05152)
–కళాసాగర్
అభినందనలు మిత్రమా!మీ ప్రతిభ ప్రపంచవ్యాప్తమైంది.
Thankyou
Really so great 👍
Thank you sir
Excellent review celebrating the Finger Paintings Marathon
Ramakrishna గారూ.. అమేయ విజయాన్ని పొందిన మీరు మా చిత్రకారులందరికీ గర్వ కారణమయ్యారు . హృదయ పూర్వక అభినందనలు.