అభిమానం, స్వస్థలాభిమానం మెండుగా కలిగిన రచయిత ఆదివిష్ణు. హాస్యం పండించటంలో, సగటు మనుషుల జీవితాలను కథలుగా మలచటంలో అందెవేసినవాడు. ఎంతో చిన్న పదాలు. అంత చిన్న పదాలతోనే పాఠకుల గుండెల్లోకి తన భావాలను పంపగలిగిన కలం ఆదివిష్ణుది.
మహాలౌక్యుడు , ఎదుటివారిని ఏమాత్రం నొప్పిం చటం ఇష్టం లేనివాడు అని ఎంతో మందిచేత అని పించుకున్న ఆదివిష్ణుకు స్నేహం అంటే ప్రాణం. స్నేహితులతో సమయం గడపటం అంటే ఎంతో ఇష్టం. తాను రచయితగా వెలుగు చూసినప్పటినుండి తనదైన బందరు గ్యాంగ్ అదే స్థాయిలో స్నేహ బంధాన్ని కాపాడుకుంటూ జీవించినవాడు. .
ఆదివిష్ణు ఆయన ఇంటి పేరా! కలం పేరా అని విడదీయలేనంతగా కలిసిపోయినది.
ఆయన అసలు పేరు విఘ్నేశ్వరరావు. 1940, సెప్టెంబర్ 5న సరిగ్గా వినాయకచవితి రోజున బందరులో ఆయన పుట్టాడు. ఇటీవలి కాలంవరకు తెలుగు పత్రికల్లో వినాయక చవితి సంచికను ఒక ప్రత్యేక హాస్య సంచికగా తీర్చిదిద్దేవారు. వినాయకచవితి రోజున పుట్టినందునే విఘ్నేశ్వరరావులో హాస్యం అలా పుట్టుక వచ్చిందా! ఏమైతేనేం ఆయన సృష్టించిన సునిశిత హాస్యం మరచిపోలేనిది.
చాలాకాలం తర్వాత తెలుగు చలనచిత్రాలలో పూర్తి నిడివి హాస్య చిత్రంగా వచ్చి బ్రహ్మాండమైన విజయం సాధించిన సినిమా ‘అహనా పెళ్ళంట’. జంధ్యాల మార్క్ సినిమాగా ఆ తర్వాత మరెన్నో హాస్య సినిమాలకు స్పూర్తిగా నిలిచిన ఆ సినిమాలోని ప్రధాన పాత్ర పిసినారి.
అతని శిష్యుడు అరగుండు వెధవల మధ్య చెల రేగిన హాస్యంతో పొట్ట చెక్కలవ్వాల్సింది. అవి ఆదివిష్ణు సృష్టించినవే. పిసినారికి బట్టలు బదులు పాత వార్తాపత్రికలు చుట్టుకుంటే బోలెడంత ఆదా అవుతుందని కుర్ర హీరో చెప్పటం సరే… దానిని తాను చుట్టుకుని ‘అరేయ్ అరగుండు వెధవా నువ్వు కూడా చుట్టుకో మహాసౌకర్యంగా వుంటుంద’ని కేకవేయటం ‘వద్దం డయ్యా… అదెక్కడైనా చిరగరానిచోట చిరిగితే’ అన్న అరగుండు గుమస్తా అనటం ఎన్నిసార్లు చూసినా కడుపుబ్బ నవ్వి తీరాల్సిందే.
కాలేజీ విద్యార్థిగానే బందరులో ‘కథా’నాయకుడు అనిపించుకున్నాడు ఆదివిష్ణు. ప్రేమ కథలంటే రచయిత్రులు మాత్రమే రాయగలరనుకునే రోజుల్లో ‘బాయ్ మీట్స్ ది గళ్’ అనే కథను బాపు బొమ్మతో ఆంధ్రపత్రికలో పడేసరికి ఆదివిష్ణు బందరుకాలేజీలో హీరో అయ్యాడు. కాలేజీ వార్షికోత్సవాలలో నాటకాలు ఆడాడు. తనచుట్టూ ఎందరో అభిమానులను, ఔత్సాహిక రచయితలను చేర్చుకున్నాడు.
ఆదివిష్ణుకి బందరు అంటే ఎంతో అభిమానం. బందరు అభిమాని పాత్రను ఆ తర్వాత జంధ్యాల సినిమాలో ఎన్నడో సృష్టించాడు.
సినీరంగంలో ఆదివిష్ణు దాదాపు 40 సినిమాలకు కథారచన, సంభాషణల సహకారం కనపడీ, కనపడకుండా అందించాడు. సినీరంగంలోకన్నా ఆదివిష్ణుకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది కథా, నవల రచయితగానే. బందరులో మొదలై, ఎ.పి.ఎస్.ఆర్టీసీలో ఉద్యోగి. విజయవాడ, హైదరాబాద్లకు చేరిన ఆయన కథా జీవితంలో ఆణిముత్యాల్లాంటి రచనలు చేశారు.
సెంటిమెంట్ ప్రధానంగా హాస్య. వ్యంగ్య ధోర ణుల్లో నడిపించి పాఠకులకు గిలిగింతలు పెట్టేవి ఆదివిష్ణు రచనలు. నాటి ప్రముఖ పత్రికలు భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వంటి వాటన్నింటిలో ఆదివిష్ణు కథలు, నవలలు బహుమతులు అందుకున్నాయి. మనిషి-మిథ్య తొలి మజిలీ, ప్రాప్తం, సగటు మనిషి వంటి పదికిపైగా నవలలు ఎంతకాలమైనా మరువలేనివి. మంచుతెర నాటకంతో ఆదివిష్ణు మరింత గుర్తింపు పొందారు.
ఆ నాటకానుభవం నుండి రాసిన సుందరి-సుబ్బా రావు అనే సినిమా స్క్రీన్ ప్లేకి నంది అవార్డును గెలుచుకున్నారు. ఆదివిష్ణు. ఆ తర్వాతి కాలంలో ఆయన ఎందరో కొత్త రచయితలకు గురువయ్యారు. మరెందరో దర్శకులకు మార్గదర్శనం చేశాడు.
ఆదివిష్ణు శ్రీ వేంకటేశ్వరునికి భక్తులు. తన ముగ్గురు కొడుకులకు ఆ స్వామి పేరుతో వెంకట రమణ, శ్రీనివాస్, బాలాజీ అని పేరు పెట్టుకున్నారు. సరిగ్గా ఆయన నమ్ముకున్న స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ముక్కోటి ఏకాదశినాడే (2020 జనవరి 6న) ఆదివిష్ణు మరణించడం తెలుగునాట హాస్య ప్రియులకు ఒక విషాద సందర్భం.
అటు కథారంగం, ఇటు నాటకరంగం ఆయనకు రెండు కళ్ళులాంటివి. ఆయన లేకున్నా ఆ రెండు రంగాలలో ఆయన గుండెచప్పుడు వినపడుతూనే వుంటుంది.