నాకు గుర్తింపు తెచ్చింది రామారావు గారే – భాస్కరభట్ల

ఈరోజు ఉదయం (12-02-2020) మృతిచెందిన సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు గారి గురించి సినీ గీత రచయిత భాస్కరభట్ల జ్ఞాపకాలు…
నేను హైదరాబాద్ ‘సితార’ లో పనిచేస్తున్న రోజులనుంచీ పసుపులేటి రామారావు గారితో మంచి అనుబంధం ఉంది. ఆయన చెన్నై ‘జ్యోతిచిత్ర’ లో పనిచేసేవారు. తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. నన్ననే కాదు, యువతరం జర్నలిస్టు లందరినీ ఆయన పేరు పేరునా గుర్తు పట్టి ప్రేమగా పిలిచేవారు. నేను చాలా సార్లు ఆయన్ని నా కైనెటిక్ హోండా మీద ఆఫీసు దగ్గర డ్రాప్ చేసేవాణ్ణి. జర్నలిజం మానేసి నేను పాటల రచయితగా ప్రయత్నిస్తుంటే మీరు పెద్ద రచయిత అవ్వాలండీ అనేవారు. నాలుగైదు హిట్టు సినిమాలు రాశాక .. మాతో పాటు సినిమా కవరేజిల కోసం తిరిగిన జర్నలిస్ట్ ఇలా అందరూ మెచ్చే స్థాయికి ఎదగడం గర్వంగా ఉందని పొంగి పోయారు.

సినిమా వాళ్ళ సమగ్ర సమాచారంతో ఆయన ప్రతీ యేడాది ప్రచురించే డైరీ లో తమ గురించి చూసుకోవాలనే వర్ధమాన సినీ కళాకారులు ఎందరో.
నేనూ అందుకు మినహాయింపు కాదు. ఓ రోజు రామారావు గారే ఫోన్ చేసి మీ ఫోటో, అడ్రెస్ ఇవ్వండి, డైరీలో వేస్తాను అన్నారు. అప్పుడప్పుడే రచయితగా ఎదుగుతున్న నాకు అది ఒక గుర్తింపు అనిపించింది.
పుస్తకం రాగానే సినిమా వాళ్ళ ఇంటింటికీ తిరిగి స్వయంగా అందజేసేవారు. నాకు తెలిసి నా ఫోటో , అడ్రస్సు ప్రచురించినందుకు మొదటి సారి పదిహేను వందలు అడిగారు. అది advertisement లెక్కలోకి వస్తుంది కాబట్టి. దాదాపు అందరి దగ్గరా అంతే తీసుకునేవారు. యేళ్లు గడిచినా,పుస్తకం ప్రింటింగ్ రేట్లు పెరిగినా, న్యూస్ ప్రింట్ రేట్లు పెరిగినా ఆయన మాత్రం ఎప్పుడూ అంతకన్నా ఎక్కువ తీసుకునే వారు కాదు. మొదటి సారి అందులో కలర్ ఫోటో చూసుకొని ఎంత మురిసిపోయానో నాకే తెలీదు.
ఎందుకంటే, కాలేజీ రోజుల్లో రాజమండ్రి డీలక్స్ సెంటర్ లో మా బుజ్జి బాబు గాడి కిళ్ళీ కొట్లో ఆ పుస్తకం చూసేవాణ్ణి. ఇంత మంది సినిమా వాళ్ళ మధ్యలో మన ఫోటో, పేరు ఎప్పుడొస్తుందో అని కలలు కనేవాణ్ణి. ఆ డైరీలు కూడా అన్ని చోట్లా దొరికేవి కాదు. వాటికున్న డిమాండ్ అలాంటిది మరి.

ఆ పుస్తకం ఇవ్వడానికి ప్రతీ యేడాది మా ఇంటికొచ్చేవారు. ఆయన టీ తాగేవారు కాదు. మా ఆవిడ హార్లిక్స్ (పంచదార వెయ్యకుండా) ఇస్తే చాలా ఇష్టంగా తాగేవారు. ఎండన పడివస్తే జ్యూస్ ఇచ్చేది.
నేను కొత్తగా కొనుక్కున్న ఇల్లంతా కలియ తిరిగి ‘బాగుంది తమ్ముడూ ‘అని ఎంత వాత్సల్యం గా నాభుజం తట్టారో ఇప్పటికీ మరిచిపోలేను.

ఇండస్ట్రీ లో అన్ని విభాగాల మనుషులతో ఆయనకి అనుబంధం ఉండేది. నేను సీనియర్ ని, మీకేం తెలుసు అసలు? అని ఎప్పుడూ ఏ చిన్న జర్నలిస్టునీ తక్కువ చేసి మాట్లాడేవారు కాదు. ఆయన ద్వారా నిర్మాతలు అయినవాళ్లు, దర్శకులు అయిన వాళ్ళూ చాలా మందే ఉన్నారు. బతికినంత కాలం హుందాగానే బతికారు. హుందాగానే వెళ్లిపోయారు.

We miss you sir !
-భాస్కరభట్ల (సినీ గీత రచయిత)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap