ప్రగతిశీల ప్రకాశకుడు

‘నవోదయ’ రామమోహనరావుగారిని స్మరించుకుందాం రండి అంటూ … ఆయన కుటుంబ సభ్యులు, సాహితీ మిత్రులు విజయవాడ ఎం.బి. భవన్ లో ఆయన స్మృతి సంచికను ఆదివారం (16-02-20) వెలువరించనున్నారు. ఈ సందర్భంగా జంపాల చౌదరి గారి వ్యాసం….

పుస్తకాలను అందంగా ప్రచురించటమే కాక, పుస్తకాల ఎన్నికలో కూడా రామమోహనరావుగారు మంచి అభిరుచి చూపించేవారు. ముళ్ళపూడి వెంకటరమణ, నండూరి రామమోహనరావు, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్ వంటి ప్రసిద్ధ తెలుగు రచయితల పుస్తకాలను నవోదయ ప్రచురించేది. కొకు ఐశ్వర్యం, నండూరి రామమోహనరావు విశ్వరూపం, శ్రీరంగం నారాయణబాబు రుధిరజ్యోతి, నార్ల వెంకటేశ్వరరావు సీతజోస్యం, జరుక్శాస్త్రి పేరడీలు, శ్రీరమణ మిథునం, నామిని సినబ్బ కథలు నవోదయ ప్రచురణలే.

పన్నెండేళ్ళ క్రితం(2007) వాషింగ్టన్లో జరిగిన తానా సమావేశానికి ఒక తెలుగు ప్రచురణకర్తని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. కానీ ఆయనకు అమెరికన్ కాన్సలేట్ వారు విజిటర్ వీసా నిరాకరించారు. అప్పుడు ఆయనకు అమెరికా వీసా ఇచ్చితీరవలసిందేనని కాన్సల్ జనరల్కు ఆరుగురు అమెరికన్ సెనేటర్లు, ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు ఉత్తరాలు వ్రాశారు. అలా ఆ ప్రచురణకర్త తరపు ఉత్తరాలు వ్రాసినవారిలో అప్పుడు అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ కూడా ఉన్నారు.
విజిటర్ వీసా కోసం ఇంతమంది నుంచి ఈ రకమైన ఒత్తిడి రావటం ఏ కాన్సల్ జనరలూ ఎప్పుడూ చూసి ఉండడు. మళ్ళీ ఆ ప్రచురణకర్త అమెరికన్ కాన్సలేట్కు వెళ్ళేసరికి ఆయన కోసం వీసా సిద్ధంగా ఉంది. అంతటి గౌరవం దక్కించుకున్న ఆ తెలుగు ప్రచురణకర్త ‘నవోదయ’ రామమోహనరావు.

కొన్నేళ్ళ క్రితంవరకూ, దాదాపు ఒక అర్థ శతాబ్దంపాటు, విజయవాడ ఏలూరు రోడ్డు తెలుగు ప్రచురణకర్తల కేంద్రంగా ఉండేది. అక్కడ ఉన్న అనేక షాపుల మధ్య – తెల్లటి సైన్బోర్డు పై నవోదయ పబ్లిషర్స్ అంటూ ఎర్రటి బాపు అక్షరాలతో ఒక పుస్తకాల షాపు ఆకర్షణీయంగా ఉండేది. ఆ బోర్డు మధ్యలో ఒక వృత్తంలో నీలంరంగు పుస్తకాన్ని చదువుతున్న ఒక పెద్దకళ్ళ బాపు బొమ్మాయితో నవోదయ లోగో చాలా అందంగా ఉండేది. ఆ షాపులో కౌంటర్ దగ్గర అందంగా, హుందాగా, నవ్వుమొహంతో ఒకాయన కూర్చుని ఉండేవారు. పక్కన మోడాలమీద కూర్చున్న రచయితలు సాహితీప్రియులతో ఆయన కబుర్లు చెబుతూ ఉండేవారు.
ఆయన పేరు రామ మోహనరావు. కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన రామమోహనరావు, హైస్కూలు చదువు పూర్తయ్యాక విశాలాంధ్ర ప్రచురణలలో, యాభై రూపాయల జీతానికి పనిచేయటం మొదలుపెట్టారు. 1960లో ఆయన బావగారు ఆదిలాబాద్ వెళ్ళిపోతూ ఆయన స్థాపించిన నవోదయ పబ్లిషర్స్ రామమోహనరావుగారికి అప్పచెప్పారు. అప్పట్నుంచీ పుస్తక విక్రయం, ప్రచురణ ఆయన జీవికా, జీవితమూ అయ్యాయి. ఆ సంస్థ పేరు ఆయన ఇంటిపేరైంది.
తెలుగు పుస్తకప్రచురణ రంగంలో నవోదయ సంస్థకూ, రామమోహనరావుగారికీ ఒక విశిష్టస్థానం ఉంది. తాము ప్రచురించే పుస్తకాల ప్రమాణాలపై ఆయనకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవి. పుస్తకం ఆకర్షణీయంగా ఉండాలి: అందమైన ముఖచిత్రం, మంచి కాగితం, పెద్ద మార్జిన్లు, చక్కటి అక్షరాలు ఉండాలి. అచ్చుతప్పులు ఉండకుండా ఆయనే ప్రత్యేక శ్రద్ధతో చూసుకునేవారు. సత్యం శంకరమంచి అమరావతి కథలను నవోదయ ప్రచురించిన తీరు దీనికి ఉదాహరణ. ముళ్ళపూడి వెంకటరమణతో సుదీర్ఘమైన పీఠిక రాయించటమే కాకుండా, ప్రతి కథకూ బాపు బొమ్మలు కూర్చి ప్రచురించటంతో పుస్తకం విలువ ఎంత పెరిగిందో సాహితీప్రియులకు బాగా తెలుసు.

పుస్తకాలను అందంగా ప్రచురించటమే కాక, పుస్తకాల ఎన్నికలో కూడా రామమోహనరావుగారు మంచి అభిరుచి చూపించేవారు. ముళ్ళపూడి వెంకటరమణ, నండూరి రామమోహనరావు, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్ వంటి ప్రసిద్ధ తెలుగు రచయితల పుస్తకాలను నవోదయ ప్రచురించేది. కొకు ఐశ్వర్యం, నండూరి రామమోహనరావు విశ్వరూపం, శ్రీరంగం నారాయణబాబు రుధిరజ్యోతి, నార్ల వెంకటేశ్వరరావు సీతజోస్యం, జరుక్శాస్త్రి పేరడీలు, శ్రీరమణ మిథునం, నామిని సినబ్బ కథలు నవోదయ ప్రచురణలే. నవోదయ సంస్థలో తమ పుస్తకం ప్రచురింపబడటాన్ని కొత్త రచయితలు ప్రతిష్ఠాత్మకంగా భావించే వారు.

పుస్తక ప్రచురణలోనే కాదు, పుస్తక విక్రయ సంస్థగానూ, నవోదయకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది. అక్కడ కొనుక్కొన్న పుస్తకాలు పెట్టియిచ్చే పేపర్బ్యాగుల వెనక బాపు కార్టూన్లు ఉండేవి. షాపులో అమ్మే నోటుపుస్తకాలు కూడా అందంగా నాణ్యంగా ఉండేవి. నవోదయ నాణ్యతకు మారుపేరుగా ఉండేది. విజయవాడ షాపు విజయవంతమైన తర్వాత గుంటూరులో ఒక శాఖ ఏర్పాటు చేశారు. 1980లలో మద్రాసులోకూడా ఒక శాఖ ఏర్పాటు చేశారు కానీ అది ఎక్కువకాలం నడవలేదు. రామమోహనరావు గారికి బాపు రమణలు ఆప్తమిత్రులు. నవోదయ ప్రచురించిన మొదటి పుస్తకం, గొల్లపూడి మారుతీరావుగారి ‘చీకట్లో చీలికలు’కు బాపు ముఖచిత్రం గీసింది మొదలు, నవోదయ పుస్తకమంటే బాపు ముఖచిత్రం ఉండాల్సిందే. ఆ తరువాత విజయవాడలో మిగతా ప్రకాశకులందరూ తమ పుస్తకాలకు బాపు ముఖచిత్రాలు కావాలంటే రామమోహనరావుగారి దగ్గరకే వచ్చేవారు.
బాపుగారికి విజయవాడలో అనధికారిక ఏజెంటునయ్యానని ఆయన ఒకసారి అన్నారు. గిరీశం లెక్చర్లు పుస్తకాన్ని ప్రచురించిన దగ్గరనుంచి ముళ్ళపూడి వెంకటరమణగారి పుస్తకాలన్నీ కూడా నవోదయ ద్వారానే ప్రచురితమయ్యేవి. బాపు మొదటి కార్టూన్ల పుస్తకం, కొంటెబొమ్మల బాపు కూడా నవోదయే ప్రచురించింది. బాపు రమణలే కాకుండా వర్తమాన రచయితలు చాలామంది రామమోహనరావుగారికి మిత్రులే. విజయవాడలో చాలామంది రచయితలకు, సాహితీప్రియులకు నవోదయ కేంద్రస్థానంగా ఉండేది. సాయంకాలమయ్యేప్పటికి స్థానిక రచయితలు చాలామంది అక్కడ చేరేవారు. రామమోహనరావుగారికి విజయవాడలో మిగతా పుస్తక ప్రచురణకర్తలతో మంచి సంబంధాలుండేవి. విజయవాడ పుస్తకవిక్రేతల సంఘం ఒక బలమైన సంస్థగా తయారుకావడంలో ఆయనది చాలా నిర్మాణాత్మకమైన పాత్ర. విజయవాడ పుస్తక ప్రదర్శన దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక పుస్తకప్రదర్శనలలో ఒకటిగా ఎదగడంలో ఆయనది ప్రముఖ పాత్రే. నేషనల్ బుక్ ట్రస్ట్ వారి జాతీయ పుస్తక ప్రదర్శనలు స్ఫూర్తిగా విజయవాడ పుస్తక ప్రదర్శన ప్రారంభమయ్యిందని ఆయన చెప్పారు.

గుంటూరులో మెడిసిన్ చదువుతున్నప్పుడు, మూడో సంవత్సరంనుంచి అరండల్పేట ఐదో లేన్లో ఉన్న నవోదయ పుస్తకాల షాపు నా సాయంత్రపు అడ్డా. రామమోహనరావుగారితో నా వ్యక్తిగత పరిచయం మొదలయ్యింది మాత్రం 1995లో. చికాగోలో తానా మహాసభలు జరుపుతున్నప్పుడు, అప్పటివరకూ పుస్తకంగా రాని ముళ్ళపూడి వెంకట రమణ గారి రచనలన్నిటినీ తానా తరపున ముద్రించటానికి సహాయం అడుగుతూ నేను ఆయనకు ఉత్తరం రాశాను. తన ఆమోదాన్ని తెలియచేస్తూ, బాపు బొమ్మ, రమణ రచన మొట్టమొదటగా ప్రచురించబడి అప్పటికి 50 ఏళ్ళవుతుందని, తానా సభలలో ఆ విషయం గుర్తిస్తే బాగుంటుందని సూచించారు. అలా ఆ తానా సమావేశాల్లో బాపురమణల స్వర్ణోత్సవం ఒక ముఖ్యాంశమైంది. ఆ సందర్భంగా ‘బొమ్మ-బొరుసు’ అనే పుస్తకాన్ని తానా సహకారంతో నవోదయ ప్రచురించింది.
ఆ సభలలో బాపు చిత్రప్రదర్శన ఏర్పాటు చేయటానికి, సావనీర్ ప్రచురణకీ కూడా రామమోహనరావు గారు చాలా సహకరించారు. అప్పటినుంచీ, మా మధ్య రెండు దశాబ్దాల వయసు తేడా ఉన్నప్పటికీ, ఆయన నాకు సన్నిహిత మిత్రులయ్యారు. 2004లో నేను మిత్రులతో కలసి అమెరికాలో తెలుగునాడి పత్రికను ప్రారంభించినప్పుడు ఆయన మా సలహామండలిలో ఉండి చాలా సహాయం చేశారు. 2004 ఏప్రిల్ నుంచి ప్రతివారం ఆ వారంలో వచ్చిన తెలుగు పత్రికలన్నిటినీ నాకు ఎయిర్మెయిల్ ద్వారా పంపేవారు. పత్రికలతో పాటు సాహిత్య విషయాలకు చెందిన పేపర్కటింగ్స్ కూడా పంపేవారు. నవోదయ పుస్తకాల షాపు మూసేశాక కూడా, కొన్ని నెలలక్రితం ఆయన ఆరోగ్యం క్షీణించేవరకూ అలా పత్రికలు పంపుతూనే ఉన్నారు. తెలుగులో వచ్చిన కొత్త పుస్తకాలను నాకోసం దాచి ఉంచి, వీలు చూసుకుని అమెరికా పంపించేవారు. నేను దూరాన ఉన్నప్పటికీ పాతికేళ్ళుగా వర్తమాన తెలుగుసాహిత్యంతో పరిచయాన్ని కొనసాగించగలగటం సాధ్యం చేసిన రామమోహనరావుగారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలదు. మా తానా ప్రచురణల ఏర్పాటు వెనుక కూడా ఆయన ప్రోత్సాహం ఉంది.

పుస్తకాలను ప్రేమించేవారిని ఆయన ప్రేమించేవారు, ప్రోత్సహించేవారు. ఏ లాభాపేక్షా లేకుండా పుస్తకాభిమానులకు తన సహకారాన్ని అందించేవారు. జర్మనీలో ఉండే మిత్రుడు పరుచూరి శ్రీనివాస్కు అవసరమైన పుస్తకాలను సమీకరించటం, డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితికి అవసరమైన పుస్తకాలు ఏటేటా అందించడం, సియాటిల్ నుంచి కొడవళ్ళ హనుమంతరావు తమ స్వగ్రామంలో తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి సహకరించటం నాకు తెలిసిన విషయాలలో కొన్ని. తెలుగు పాఠకుల అభిరుచులలో వచ్చిన మార్పు, ఇంగ్లీషు మీడియం చదువులు, గ్రంథాలయాల నిర్వహణలో ప్రభుత్వం ఉదాసీనత తెలుగు పుస్తక రంగాన్ని బాగా దెబ్బతీశాయి. నాలుగేళ్ళ క్రితం నవోదయ సంస్థ పుస్తకవిక్రయాలనుంచి తప్పుకోవటంతో ఏలూరురోడ్డు బోసిపోయింది; విజయవాడ సాహితీ ప్రియులు రోజూ కలుసుకునే తావు పోయింది. పుస్తకవిక్రయాలు ఆపివేసినా, ప్రచురణలను ఆపకూడదని అనుకొన్నారు కానీ, కొన్ని వ్యక్తిగత విషాదాలు, అనారోగ్యం కారణంగా ప్రచురణలనూ ఆపివేయక తప్పలేదు.

చిన్నప్పటినుంచీ పెంచుకొన్న కమ్యూనిస్టు అభిమానం, హేతువాదమూ ఆయనను చివరిదాకా అంటిపెట్టుకునే ఉన్నాయి. 2007లో చికాగో వచ్చినప్పుడు ఆయనను మేడేకి స్ఫూర్తి అయిన హేమార్కెట్ అలజడుల స్మారకచిహ్నం వద్దకు తీసుకువెళ్ళినప్పుడు, డబ్భయేళ్ళ వయసులో కూడా ఆయన చిన్నపిల్లాడిలా ఆనందపడటం, పిడికిలి బిగించి చేయెత్తి రెడ్ శాల్యూట్ చేయటం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులాడుతూ ఉంటుంది. మరణానంతరం ఆయన శరీరాన్ని ఆయన కోరిక ప్రకారం స్థానిక వైద్య కళాశాలకు అందచేయటం ఆయన సన్నిహితులనెవరినీ ఆశ్చర్యపరచలేదు. 2019 రు 15న, ఆయన ఆప్తమిత్రుడు బాపు పుట్టినరోజు నాడు, రామమోహనరావుగారు మరణించటం యాదృచ్ఛికమే అయినా విశేషమే అనిపిస్తుంది. నవోదయ రామమోహనరావుగారి మరణంతో తెలుగు ప్రచురణా రంగంలో ఒక తరం ముగిసినట్లే. అభిరుచి, నాణ్యతలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, కొత్తతరం ప్రచురణకర్తలు కొనసాగిస్తారని కోరుకుందాం.

డా. జంపాల చౌదరి
మండలైన్, ఇల్లినాయిస్, యు.ఎస్.ఏ.

1 thought on “ప్రగతిశీల ప్రకాశకుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap